Wednesday, April 25, 2018

జీఎస్‌టీ దారిలో ఎటుపోతోంది దేశం!




             జీఎస్‌టీ' అంటే గూడ్సు అండ్‌ సర్వీసెస్‌ టాక్స్‌' అన్నారు. అంతా వలస భాష. ఏ ప్రజలకూ అర్థంకాని భాష. ఆచరణకు.. పదాలకు ఏమాత్రం సంబంధం లేని భాష. ఎవరిష్టమొచ్చినట్టు వారు వాడుకోవటానికి అనువైన పదాల టాక్స్‌ అది. మామూలు ప్రజలు పోయి ఒక షాపులో ఏదైనా వస్తువు ఖరీదు చేసి ''గతం కంటే ధర ఎందుకు పెరిగింది?'' అంటే జీఎస్‌టీ అంటున్నారు. ఎవరిష్టం వారిది. ఎవరి దోపిడీ వారిది. ''ఒకే పన్ను ఒకే ప్రజ.. ఒకే దేశం'' ఎలా సాధ్యమవుతుందో అర్థం కాదు. వ్యవసాయక దేశంలో, కోట్ల సంఖ్యలో నిరుద్యోగులున్న దేశంలో, లక్షల సంఖ్యలో చిన్న వ్యాపారులున్న దేశంలో, ఒక వస్తువు పది చేతులు మారి పది వస్తువు వంద అయ్యే దేశంలో జీఎస్‌టీ ఎలా అమలు పర్చాలో ఎలా అమలు అవుతుందో ఘనమైన ఏలుతున్న ప్రభువులకు తెలుసా? అసలు ఈ ప్రభువులకు భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాల ఉత్పత్తులు, వనరులు ఆధారాలు తెలుసా?
                     ఇవ్వాళ్ల భయంకరంగా దేశాన్ని ఊపిరి ఆడకుండా చేసిన జీఎస్‌టీ ఎవరికోసం? ఈ విధాన రూపకల్పనలో నియంతృత్వ భావజాలం ఉంది. తన మాట వేదం... రాష్ట్రాలు తన కాళ్ల కిందపడి ఉండాలి. దేశ ఆదాయమంతా తన గుప్పిట్లోకి రావాలి. ప్రతి రాష్ట్రం తమ ముందు జోలె పట్టుకొని నిలబడాలి. ఇప్పటికే రాష్ట్రాల అధికా రాలన్నీ కుదించేసారు. జీయస్టీతో రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి పూర్తిగా గంగలో కలిసింది.
                జీఎస్‌టీ ప్రారంభించి ఎన్ని నెలలయ్యింది? ఈ కొద్ది కాలానికే జీఎస్‌టీలో ఎన్నో మార్పులు. ఇది తగ్గించామంటారు. దీనికి పెంచామంటారు. నిలకడలేని మాటలు. నిండుతనం లేని విధానాలు.. మన దేశ ఆర్థిక మంత్రిగా ఉన్న అరుణ్‌జైట్లీకి పల్లెలు తెలుసా? వ్యవసాయం తెలుసా? వ్యవసాయ దేశమని తెలుసా? మనదేశ ప్రధాన ఉత్పత్తి ఏమిటో తెలుసా? వనరులు ఏమిటో తెలుసా? ప్రజల యిబ్బందులు తెలుసా? వాళ్లకు ఏమి అవసరమో తెలుసా? ఈ మూడు నాలుగు నెలల్లో జీఎస్‌టీలో ఎన్ని మార్పులు... చేర్పులు... ఇలా ఉంటుందా పన్నుల విధానం...
                జీఎస్‌టీ వలన వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ప్రజల కొనుగోలుశక్తి నశించింది. ఏ ధర ఎందుకు పెంచుతున్నారో ఎందుకు తగ్గిస్తున్నారో తెలియదు. చిన్న చిన్న వ్యాపారాలు మూసుకొంటున్నారు. డబ్బు లావాదేవీల వ్యాపార సంస్థలు దివాలా తీస్తున్నాయి. చిన్న పరిశ్రమలు మూసివేస్తున్నారు. జీఎస్‌టీ దారిలో ఎటుపోతోంది దేశం!
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

No comments:

Post a Comment

Address for Communication

Address card