Monday, April 02, 2018

ఆనంద భైరవి

ఆనంద భైరవి


ఓ కవిగారు రైలులో ఒంటరిగా ప్రయాణిస్తున్నాడు. మనసంతా దిగులుగా ఉంది. మనిషి దుఃఖపడుతున్నాడు. ‘సంతోషంలో ఉన్నప్పుడు పాటలు వినాలి, బాధలో ఉన్నప్పుడు వాటిని అర్థం చేసుకోవాలి’ అన్న సుభాషితం గుర్తొచ్చింది. ‘ఔను నిజం ఔను నిజం చేదు విషం జీవఫలం... జీవఫలం చేదు విషం’ అన్న శ్రీశ్రీ కవితను గురించి మనసులో విశ్లేషణ మొదలుపెట్టాడు. ఇంతలో ఒక పసిపాపడు ఆయన దృష్టిని ఆకర్షించాడు. ‘బొటవ్రేల ముల్లోకములు చూచి లోలోన ఆనందపడు నోరులేని యోగి’ అన్న జాషువా పద్యం ఆలోచనల్లోకి వచ్చింది. బోసి నవ్వులు చిందిస్తూ తనవైపు చిట్టిచేతులు ఊపుతూ కేరింతలు కొడుతున్న ఆ పసివాడు అంత హాయిగా నిశ్చింతగా ఎలా ఉండగలుగుతున్నాడన్న దిశగా ఆలోచన సాగింది. చాలాసేపు మథనపడ్డాక ‘ఆనంద మానంద మానందమే గాని అన్యభావము లేవి ఆత్మ చొరని యట్టి నిరంతర ఆనంద స్వరూపుడగుట చేసి’ అని కవి తీర్మానించుకున్నాడు. ‘అందరూ ఆనంద స్వరూపులే’ అంటుంది వేదాంతం. ‘కాదు పొమ్మంటుంది నిజ జీవితం’ అని నిట్టూర్చాడు. చటుక్కున గొప్ప సత్యం ఎరుకకు వచ్చింది. పిల్లవాడి ఆనందానికి మూలాలు వెతికే క్రమంలో- అప్పటివరకు దట్టంగా ఆవరించిన దిగులు, విచారం తన నుంచి దూరం అయ్యాయని ఆయన గమనించాడు. మనసు తేలిక పడినట్లు ఒంటరితనం తొలగిపోయినట్లు ఆయనకు అర్థమైంది. లోకానికి తనకు మధ్య తాను కట్టిన అడ్డుగోడలు కూల్చేసి, వంతెనలు నిర్మించగలిగితే పసివాడినుంచే కాదు- లోకంనుంచీ వసివాడని ఆనందం ప్రసారం అవుతుందని తెలిసింది. ‘కలత వొద్దు కొలత వొద్దు అలసట అలజడి వద్దు... కలసి కదిలే బతుకే లలిత లలిత లతాంతమాల’ అన్న తిలక్‌ కవిత తన గుండెల్లో ఏదో రహస్యం చెప్పినట్లనిపించింది.
లోకంలో ప్రతి మనిషీ ఆనందంగా ఉండాలనే కోరుకుంటాడు. కొందరు నిజంగానే ఉంటారు. చాలామంది ఉన్నామనుకుంటారు. భక్తిలో రక్తిలో రతిలో విరక్తిలో ఆనందాన్ని అన్వేషించడం మనిషి సహజ స్వభావం. ‘ఎందే డెందము కందళించునో... ఎక్కడ మనసు రమిస్తుందో అదే ఆనంద స్థావరం’ అని వాదించింది మనుచరిత్రలో వరూధిని. సుఖసంతోషాలకు, ఆనందానుభూతికి మధ్య తేడా లేదంది. సుఖం- శారీరకం. సంతోషం- మానసికం. వీటికన్నా ఆనందం చాలా ఉన్నతమైనది. అది ఆత్మకు చెందిన విశిష్ట అనుభూతి. కాబట్టే ‘చెప్పకుము ఇట్టి తుచ్ఛ సుఖముల్‌ మీసాలపై తేనియల్‌’ అంటూ వరూధిని ప్రతిపాదనను ప్రవరాఖ్యుడు తిరస్కరించాడు. శారీరక సుఖాలు ఆత్మానంద ప్రాప్తికి కారణాలు కావన్నాడు. ‘సంతోషించితి చాలు చాలు రతిరాజ ద్వార సౌఖ్యంబులున్‌’ అంటూ ధూర్జటి నిరసించింది దాన్నే. ‘అంభోజాక్షీ చతురంతయాన తురగీ భూషాదులు ఆత్మవ్యధా బీజంబుల్‌... క్షోభకు కారణమవుతాయి’ అని తేల్చి చెప్పాడు. ఆత్మకు చెందిన ‘జ్ఞానలక్ష్మీ జాగ్రత్‌ పరిణామమిమ్ము దయతో’ అంటూ పరమశివుణ్ని ప్రాధేయపడ్డాడు. మనిషికి గొప్పదనాన్ని, మనసుకు సంతృప్తిని, ఆత్మకు ఆనందాన్నీ ఆపాదించేవి ఏవో భర్తృహరి చెప్పాడు. ‘కరమున నిత్యదానము, ముఖంబున సూనృతవాణి, వర హృదయంబునన్‌ విశిద వర్తనము అంచిత విద్య వీనులన్‌...’ చేతికి దానం, నోటికి సత్యం, దోషంలేని నడవడి, చక్కని విద్యల వినికిడి- మనిషి వ్యక్తిత్వానికి శోభనిస్తాయన్నాడు. ఆ సమయాల్లో శరీరంలో వెలువడే ‘ఇంటర్‌ ఫెరాన్‌ గామా’ అందుకు కారణమని ఆధునిక వైద్యశాస్త్రాలు తేల్చాయి. దాన్ని ‘ఆనంద జన్యువు’గా చెప్పాయి. దాన్నే కవులు ‘అంతరంగమందు ఆనంద వార్నిధి’గా వర్ణిస్తారు. ‘ఆనందాన్ని ఇవ్వడం ద్వారా ఆనందాన్ని పొందడం’ ఒకానొక అద్భుతమైన అనుభూతి.
‘ప్రతిది సులభమ్ముగా సాధ్యపడదు లెమ్ము. నరుడు నరుడౌట ఎంతొ దుష్కరమ్ము సుమ్ము’ అన్నాడు గాలిబ్‌ మహాకవి. మరణించేలోగా మనిషి సాధించవలసింది దాన్నే! ‘చక్రవర్తిగా న్యాయమూర్తిగా బలవంతుడిగా... ఎలాగైనా జీవించవచ్చు, కానీ చివరకు మనిషిగా మారితేనే- అది పరిపూర్ణ జీవితం’ అన్నాడు ఒక తత్వవేత్త. ఇదే భారతీయ తత్వచింతన సారాంశం! ఆ పరిపూర్ణత సాధించడంలోనే అసలైన ఆనందం దాగి ఉంది. నిజానికి ఆ ప్రయాణమే ఒక కాంతియానం! మన కుటుంబ వ్యవస్థను ఆ లక్ష్యంతోనే పెద్దలు తీర్చిదిద్దారు. ‘పసితనమందె రామకథ భారతగాథ నవీన సత్కథల్‌ రసమయరీతి నేర్పి అనురాగముతో, క్రమశిక్షణమ్మునన్‌’ పిల్లలను తీర్చిదిద్ది ఈ దేశం గర్వించదగిన పౌరులుగా రూపొందించడం పెంపకంలో భాగం. ఆ తరహా ఎదుగుదలలో సంతోషం ఇమిడి ఉంది. కుటుంబ వ్యవస్థలోని ఆత్మీయులతో అనురాగాలతో మనిషి ఆనందం ముడివడి ఉంటుంది. నిర్మల హృదయం నిస్వార్థ జీవనం సేవాతత్పరతలు- మనిషి పరిపూర్ణతకు, సంతోషమయ జీవనానికి పునాదిరాళ్లు. ఆనందం మనిషికి అత్యవసర దినుసు. ఐరాస లెక్కల ప్రకారం సంతోషం వెల్లివిరిసే జనాభాలో ఇండియా 133వ స్థానానికి దిగజారింది. సామాజిక సామరస్యం, స్వేచ్ఛ, ఔదార్యం వంటి సామూహిక సహజీవనానికి సంబంధించిన అంశాల్లో భారత్‌ ప్రాభవం క్రమేపీ మసకబారుతోంది. ప్రజల జీవితాల్లోంచి ఆనందం ఆవిరవుతోంది. ‘వేదాంతము నిత్య జీవితమునందు అనుభూతికి తెచ్చుకొమ్మికన్‌’ అన్న హితోక్తులను ఒంటపట్టించుకొంటే గాని సంతోషం చిరునామా అంతు చిక్కదు. ‘చెట్టునైనా కాకపోయాను, ఏడాదికోసారైనా వసంతం వచ్చి పలకరించేది’ అని శేషేంద్రశర్మ వాపోయినట్లు, మనిషిగా మారితే తప్ప సంతోషం దక్కదు. ‘నీదైన చిత్తశుద్ధికి పాదాక్రాంతంబగును ప్రపంచంబెల్లన్‌’ అన్న సూక్తి తలకెక్కితేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది.

No comments:

Post a Comment

Address for Communication

Address card