Thursday, April 20, 2017

ప్రజలపై జీఎస్టీ ప్రభావం ఎలా వుంటుంది?



                 
ప్రజలపై జీఎస్టీ ప్రభావం ఎలా వుంటుంది?


ఇది, సరుకుల వర్గీకరణపై ఆధారపడి వుంటుంది. జీఎస్టీ కోసం సకల సరుకులను వాటి ధర స్థాయిని బట్టి ఐదుజీరో, 5, 12, 18, 28 శాతంశ్రేణులుగా వర్గీకరించాలని నిర్ణయించారు. ఈ వర్గీకరణ ఇంతవరకు జరగలేదు. సరుకుల అంతిమ వర్గీకరణ జీఎస్టీ అమలు తేదీ(జూలై 1)కి కేవలం ఒక రోజు ముందు మాత్రమే తెలుస్తుంది.
              జీఎస్టీ రేట్లు, ఎక్సైజ్‌ డ్యూటీ, వ్యాట్‌ సంయుక్త రేట్ల కంటే ఎక్కువ లేదా తక్కువగా ఉంటాయా అన్నది చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రజలపై జీఎస్టీ ప్రభావాన్ని నిర్ణయించే అంశమిది. ఉదాహరణకు మనరాష్ట్రం లో ఎరువులు ప్రస్తుతం 5 శాతం పన్ను విధిస్తున్నారు. జీఎస్టీ వ్యవస్థలో ఎరువులు జీరో ట్యాక్స్ లో వుంచితే ఈ సరుకుపై పన్ను 5 శాతం కంటే తక్కువగా వుంటుంది. అలాకాకుండా 12 లేదా 18 శాతం పన్ను శ్రేణిలో వుంచితే ప్రజలు దానిపై చెల్లించవలసిన పన్ను 5శాతం కంటే అధికంగా వుంటుంది. ఈ వాస్తవం దృష్ట్యా, ప్రజలపై జీఎస్టీ ప్రభావం సరుకులవర్గీకరణపై ఆధారపడి వుంటుందనేది స్పష్టం.

              పేదలు, ధనికులు వినియోగించుకునే వస్తువులు విభిన్నంగా వుండడం కద్దు. ఉదాహరణకు ముతక వస్త్రాలు, సైకిళ్లను పేదలు, బ్రాండెండ్‌ గార్మెంట్స్‌, లగ్జరీకార్లను ధనికులు ఎక్కువగా వినియోగించుకుంటారు. ముతక వస్త్రాలు, సైకిళ్ళ విషయంలో జీఎస్టీ రేటు ఎలా ఉంటుందన్న దాన్ని బట్టి పేదలపై ఆ ఏకీకృత పన్ను ప్రభావం ఆధారపడి వుంటుంది. అలాగే బ్రాండెడ్‌ గార్మెంట్స్‌, లగ్జరీకార్ల విషయంలో జీఎస్టీ రేటు ఎలా వుంటుందన్న దాన్నిబట్టి సంపన్నులపై దాని ప్రభావం ఆధారపడి వుంటుంది.
             జీఎస్టీ ప్రభావం రాష్ట్రానికీ, రాష్ట్రానికీ భిన్నంగా వుంటుంది. ఎలాగంటే కొబ్బరినూనె పై ఎక్సైజ్‌ డ్యూటీ వ్యాట్‌ల సంయుక్త రేటు ఉత్తరప్రదేశ్‌లో 4 శాతం కాగా, మధ్యప్రదేశ్‌లో 6 శాతంగా వున్నది. జీఎస్టీ వ్యవస్థలో ఈ సరుకును 5 శాతం పన్ను శ్రేణిలో వర్గీకరించారనుకోండి. దీనివల్ల ఉత్తరప్రదేశ్‌లో కొబ్బరినూనె ధర మరింత వ్యయభరితమవుతుంది. ఎందుకంటే గతంలో 4 శాతం పన్నును చెల్లించిన వారు ఇప్పుడు 5 శాతం పన్నును చెల్లించవలసి వుంటుంది కదా. కాగా మధ్యప్రదేశ్‌లో కొబ్బరి నూనె చౌకగా లభిస్తుంది. గతంలో 6 శాతం పన్నును చెల్లించిన ఈ రాష్ట్ర ప్రజలు ఇప్పుడు 5 శాతం మాత్రమే చెల్లించవలసి వుంటుంది మరి. దీన్ని బట్టి జీఎస్టీ ప్రభావం, ప్రస్తుతం వివిధ రాష్ట్రాలలో అమల్లో వున్న పన్నురేట్లపై ఆధారపడి వుంటుంది.

            సామాన్య ప్రజలు వినియోగించే సరుకులను తక్కువ పన్ను రేట్ల శ్రేణుల్లో వర్గీకరించిన పక్షంలో దేశ జనాభాలో అత్యధికులకు జీఎస్టీ ఎంతైనా ప్రయోజనకరమవుతుంది. ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయం  మనకు మేలు కలుగుతుందా లేదా అనేది వేచి చూడాల్సిన అంశం
                         ------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

Wednesday, April 19, 2017

శృంగార శాఖా చంక్రమణం

శృంగార శాఖా చంక్రమణం
‘శృంగారం’ అంటే ఏమిటి?
‘శృంగారం’ ఎలా పుట్టింది?
‘శృంగారం’ సారాంశం ఏమిటి?’
వీటన్నిటి గురించి తనదైన శైలిలో ముళ్లపూడి వెంకట రమణ ‘శృంగార శాఖా చంక్రమణం’ అంటూ రాసుకొచ్చారు. బాపు చేతిరాతతో వచ్చిన ఈ పుస్తకంలోని కొన్ని భాగాలతో కాసేపు మన రొమాన్స్…
గ్రూచో మార్క్సు రాసిన హిస్టరీ ఆఫ్ మేన్‌కైండ్ గుర్తొచ్చింది -వినండి.
ఆదిమానవుడూ మానవీ ఒకరోజు గుహలోంచి బయటకొచ్చారు. దుంపలూ పళ్లూ చేపలు తెచ్చుకోడానికి బయలు దేరారు.
ఆహార నిద్ర భయ మైధునాలలో వాళ్లకి మొదటి మూడే తెలుసు. ఆడా మొగా తేడాలు కూడా అంతగా తెలీవు. కళ్లూ చెవులూ కాళ్లూ చేతులూ వగైరా ఎక్విప్‌మెంట్ ఇద్దరికీ సమానంగానే ఉంది -బొడ్డు కింద ఒక చోట తప్ప -కొంచెం అటూ ఇటూగా సమానంగానే ఉన్నారు.
ఆ ఒక్క తేడా గురించి చెప్పబోతూ ఒక సభలో వక్త -” దేరీజ్ ఎ ఫండమెంటల్ డిఫరెన్స్ బిట్వీన్ మేన్ అండ్ ఉమన్” అని ఆరంభించాడు. ‘వైవా లా ద డిఫరెన్స్'(ఆ తేడాకి జిందాబాద్) అని అరిచాట్ట సభలోని ఒక ఫ్రెంచి శ్రోత-
సరే -ఆదిమానవులిద్దరూ గుహబైట నిలచి అటూ ఇటూ చూస్తుండగా కారు మబ్బులు మీద కురికాయి. చీకటి. చీకటిలో మెరుపులూ ఉరుములూ -దగ్గర్లోనే పెద్ద శబ్దంతో గుండెలదిరేలా అరడజను పిడుగులు పడ్డాయి. కుంభవృష్టిగా వర్షం.
ఇద్దరూ గుహలోకి పరుగెత్తి భయం కొద్దీ ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకున్నారు..కున్నారు..కున్నారు.. అలాగే ఉన్నారు… కొన్ని విఘడియల తరవాత చలి తగ్గింది.
అంతేకాదు. అంత చలిలోనూ చిరు చెమటలు పట్టాయి. కళ్లు తేలిపోతున్నాయి. ఒళ్లు తూలిపోతోంది. ఈ భయం -తిండి కన్న నిద్ర కన్న బాగుందే అనుకున్నారు. వాన వెలిసింది.
మళ్లీ పిడుగులూ వర్షం ఎప్పుడొస్తాయీ అని ఎదురుచూడసాగారు. అవి వస్తే గుహలోకి వెళ్లి భయంతో వాటేసుకోవచ్చు.
చివరికి విసుగేసి బయట నిలబడి -‘వానా..రా! పిడుగూ..రా!’ అంటూ చప్పట్లు కొట్టారు. అదే ఆది తాళం.
చిందులు తొక్కారు. అదే ఆది నాట్యం.
అరిచారు. హోహో అన్నారు. ఢాం ఢాం తప తప అన్నారు.
ఆది శబ్దం ఆది సాహిత్యం.
కొన్నాళ్లకి వర్షం పడింది. వాళ్లు భయం నటించి గుహలో దూరి వాటేసుకున్నారు.
ఈ సారి వర్షం ఎడతెరిపి లేకుండా నాలుగు మాసాలు కురిసింది. భయపడి పడి వాళ్లకి విసుగేసింది.
ఇంక చాలు అని చప్పట్లు కొట్టారు.
ఇద్దరు పిల్లలు పుట్టారు.
సంభోగం మీద విరక్తిలోంచి సరికొత్త రక్తిలోకి సంతోషంలోకి మేలు కొన్నారు. అర్థవంతంగా సృష్టి సాగింది.
*** ఒక కవి రుషి స్వర్గానికి వెళ్లాడు. చాలా ఆత్రంగా ఉన్నాడు – “ఏం కావాలయ్యా” అని అడిగాడు ఇంద్రుడు. “రంభోగం” అన్నాడు రుషి.
“అంటే?”
“అదే స్వామీ -రంభతో” ….అంటూ సిగ్గుపడిపోయాడు.
“రంభా సంభోగం కుదించి రంభోగం అన్నావా! సెబాష్ కవీ.
ఆ తోటలోకి వెళ్లు రంభ వస్తుంది” -అన్నాడు ఇంద్రుడు.
తోటలోకి రంభ వచ్చి నిలుచుంది -మెకానికల్‌గా బట్టలు వూడదీస్తూ. కవి కవితావేశంతో పేట్రేగిపోయాడు.
ధన్యుడిని రంభాదేవి అన్నాడు దండం పెట్టి.
“అప్పుడే? ఇంకా”…
“అంటే నిన్ను చూసి ధన్యుడినయాను. నీ కళ్లు కలువ రేకులు. పెదిమలు దొండపళ్లు. కుచములు కుంభ స్థలములు. తొడలు అరటి బోదెలు. ఘనజఘనాలు ఇసుక తిన్నెలు” అంటుండగా రంభ బెదిరి చూసి దుప్పటి కప్పేసుకుంది. వాటితో పోలుస్తున్నావు కవీ -నా అంగాల కన్నా అవే అంత బాగుంటే వెళ్లి వాటినే వాటేసుకుని పండుకో అంటూ రంభ జంభారి యింటికి వెళ్లిపోయింది. స్వర్గానికి వచ్చిన అతిథుల కోసం పెట్టిన భేటీ కుదరకపోతే ఆనాటి రంభా సంభోగం ఇంద్రుడి కోటాలో పడుతుందిట.(దాన్ని మాత్రం శచీ దేవి అభ్యంతర పెట్టకూడదు -అది డ్యూటీ – బహ్వృ -చూడు)
“అయ్యో! శృంగారం కోసం నాలుగు పంక్తులంటే పొమ్మంటివా! ఈ ఉపమాన భంగం భరించలేను” అంటూ కాలుజారి పడ్డాడు కవి. సంభోగం అనేది కేవలం విధి నిర్వహణ అయినందువల్ల -రంభకి శృంగారం బొత్తిగా తెలీదు. అందుకని కవిగారు లొట్టలు వేస్తే అలా అపార్థం చేసుకుంది. కానీ స్వర్గంలో సంసారాలు చేసుకుంటున్న ఇతర దేవగణాలకూ – వారే యేమిటి -సాక్షాన్మహావిష్ణువుకూ శృంగారం అంటే ఎంతో సరదా కాని స్వర్గానికి అది అందుబాటులో లేదు.
అందుకే –
ఎల్లవేళలా భయభక్తులతో కాళ్లుపట్టే లక్ష్మీ దేవితో శృంగారం కొరవడి తనను కాళ్లతో తన్నే సత్యభామ శృంగారం కోరి, శ్రీ వైకుంఠ విరక్తుడై భూలోకానికి దిగివచ్చాడు. ఆయనే కాదు -ఎందరో దేవతలు, స్వర్గం చేరిన రుషులూ, ఊర్వశిలాటి అప్సరసలూ శాపాలు ఇప్పించుకుని మరీ భూ లోకానికి దిగి వచ్చారు ఉబలాటంతో.
*** శృంగారం అనగానే కామక్రీడల గొడవ అని రూఢర్థం ఏర్పడిపోయింది కాని చూడగలిగే వారికి అనేక విషయాల్లో శృంగారం భాసిస్తుంది.
వంటకోసం కూరలు తరగడం, తాళింపు సామాను అమర్చుకోడం…
వేయబోయే బొమ్మకోసం వచ్చే ఊహలు, వాటి ప్రకారం పెన్సిలుతో స్కెచెస్ వేసుకోడం…
పాటకు రాగాలు వెతుక్కోవడం… స్వరాలు అమర్చుకోవడం… మార్చుకోవడం కథకు వస్తువు, దానికోసం పాత్రలూ, వాటి వేష భాషలూ ఊహించుకోవడం…
ఇలా నిత్య జీవన వ్యాపారాలన్నిటా శృంగార దృష్టితో ఆలోచిస్తే జీవితం చాలా సరదాగా ఉత్సాహభరితంగా శోభిస్తుంది.
దేవుడిని ఆరాధించిన భక్తులు కూడా స్తోత్రాల్లాగా -నీకు నాలుగు చేతులున్నాయి మంచి మంచి నగలున్నాయి అని పొగడకుండా ఆయనకు భక్తి సంగతుల ద్వారా అనురాగంతో అర్చించి శోభించారు.
శృంగారం పరమార్థం సంతోషం; మోక్షం కాదు పుట్టినప్పటి నుంచి వేళయేదాకా సరదాగా బతకడం.ఇంకా కావాలంటే చదవండి 'శృంగార శాఖా చంక్రమణం'- ముళ్లపూడి వెంకటరమణ
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ విజయవంతం అవుతుందా?



డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ విజయవంతం అవుతుందా?


డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ విజయవంతమవ్వడమనేది పన్నుల చెల్లింపుదారులతో పన్నుల నిర్వహణ యంత్రాంగం ఎంత నిజాయితీగా వ్యవహరిస్తుందనేదానిపై ఆధారపడివున్నది. ఇటీవల డిమానిటైజేషన్‌ ( పెద్ద నోట్ల రద్దు) లక్ష్య సాధనలో ప్రభుత్వం సఫలం కాలేదు. నల్లధనం కలవారికి బ్యాంకు అధికారులు సహకరించడమే ఇందుకు కారణమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమ బ్యాంకు ఖాతాలలో భారీ మొత్తాలను జమ చేసిన వారి నుంచి సామూహిక జరిమానా వసూలు చేసే ప్రయత్నాలలో కూడా ప్రభుత్వానికి అదే అనుభవం ఎదురయ్యే అవకాశం ఎంతైనావున్నది. తాము జమచేసిన సొమ్ముకు ఆధారాలేమిటో చెప్పాలని లక్షలాది బ్యాంకు ఖాతాదారులకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. పన్నుల నిర్వహణ అధికారులు నిజాయితీపరులైన ఖాతాదారుల నుంచి లంచాలు తీసుకోకుండా వుండడంతోపాటు నిజాయితీపరులు కాని ఖాతాదారుల నుంచి పన్నులను పూర్తిగా వసూలు చేసిన పక్షంలో ప్రభుత్వ నోటీసులకు సత్ఫలితాలు సమకూరుతాయి. నిజాయితీపరులైన వ్యాపారులు, అధికారులకు ముడుపులు చెల్లించేందుకు అవసరమైన డబ్బును సమకూర్చుకోవడంపైనే  తమ శక్తియుక్తులను వినియోగించవలసిన పరిస్థితిలో వ్యాపారాలు ఎలా అభివృద్ధి చెందుతాయి?
  
                  ద్రవ్యలోటును యంత్రించగలిగితే విదేశీ మదుపుదారులను పెద్ద ఎత్తున ఆకర్షించడం సుసాధ్యమవుతుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది. బహుళజాతి కార్పొరేట్ సంస్థలు మన దేశంలో పెద్ద ఎత్తున మదుపు చేయడానికి ఆసక్తితోవున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. ప్రపంచ మార్కెట్‌లో సరుకులకు గిరాకీ అపరిమితంగావున్నదని, వినియోగదారులను సంతృప్తిపరచడానికై కొత్త ఫ్యాక్టరీలను నెలకొల్పాలని బహుళజాతి సంస్థలు ఆరాటపడుతున్నాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

                అయితే ప్రస్తుత పరిస్థితి ఇంత ఆశాజనకంగా లేదు. ఎందుకంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పురోగతి స్తంభించిపోయింది. పైగా అభివృద్ధిచెందిన దేశాలు తమ కంపెనీలు తిరిగి స్వదేశానికి రావాలని కోరుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మనం ద్రవ్యలోటును నియంత్రించినప్పటికీ, దాని వల్ల విదేశీ పెట్టుబడులు దేశంలోకి పెద్ద ఎత్తున ప్రవహించే అవకాశం లేదు. ప్రస్తుతం వస్తున్న విదేశీ పెట్టుబడులు కూడా వచ్చే మార్చి నెల అనంతరం తిరిగి వెళ్ళిపోయే అవకాశం ఎంతైనావున్నది. మరో ముఖ్యమైన విషయమేమిటంటే ద్రవ్యలోటు నియంత్రణ వల్ల ప్రభుత్వ వ్యయాలు తగ్గిపోయి ఆర్థిక వ్యవస్థ పురోగతి పూర్తిగా మందగిస్తుంది. సరిగ్గా ఇటువంటి కారణాలతోనే 1930లో అమెరికా ఆర్థిక వ్యవస్థను మహా మాంద్యం ఆవహించింది. ------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681


జీయస్టీ లో ప్రతికూలమైన అంశాలు-మరి కొన్ని(గతంలో కొన్ని వ్రాశాను)



జీయస్టీ లో ప్రతికూలమైన అంశాలు-మరి కొన్ని(గతంలో కొన్ని వ్రాశాను)


              * జీయస్టీ లో కొన్ని (అధికభాగం సామాన్యులు వాడే ) వస్తువుల టాక్సు రేటు వ్యాట్ లో కంటే ఎక్కువగా వుండటం
             *Textile, Dairy Products, Media, Pharma, IT/ITeS, and Telecom లాంటి రంగాలు ఇప్పటివరకు ఎక్సయిజు టాక్సు లాంటివి లేకపోవటం వలన  టాక్సులు పెరిగి ధరలు పెరగటం జరగవచ్చు
             *దేశంలో జిఎస్టి రావటంతో రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్రభావితం అవుతుంది. కొత్త ఇంటి/స్తలం కొనుగోలు ధర సుమారుగా 8% నుండి 12% పెరగవచ్చు (లేదా కొనుగోలుదారులు లేక 'మార్కెట్ తగ్గించవచ్చు.)

            *జీయస్టీ చట్టం ప్రకారం కేంద్ర కోసం CGST గా, రాష్ట్ర ప్రభుత్వానికి SGST కానీ.కన్ఫూషన్ తప్ప  పాత సేవా పన్ను, CST, మరియు VAT ఒక కొత్త మార్గంలో వసూలు తప్ప కొత్తేమీ లేదు.

            *జీఎస్టీ ఒకే పన్ను వ్యవస్థ పేరిట వసూలు చేసే డబుల్ పన్ను . ఒక గందరగోళం
            *తయారీ సమయంలో మాత్రమే విధించే  చాలా పరోక్ష పన్నులు ఇప్పుడు జిఎస్టి రావడంవల్ల ఆఖరి అమ్మకం దశ వరకు విధించబడుతుంది.
             *ద్వంద నియంత్రణలో వుండటం వలన రాష్ర్తాలు స్వంత నిర్ణయం తీసుకోలేకపోవటం. అందవలన కొన్నిటిపై సంక్షేమ రాయతీలు ఇవ్వలేక పోవటం
             *ప్రధానంగా జీయస్టీలో తయారీ దారులు ఎక్కువగా వున్న రాష్రాలకి ఆదాయం బాగా తగ్గవచ్చు.( కానీ 5 సంవత్సరాలు ఆ నష్టాన్ని కేంద్రమే భరిస్తుంది కాబట్టి కొంత వూరట)
            *కేంద్ర ఎక్సైజ్ పన్ను చెల్లించకుండా  కేవలం వేట్ మాత్రమే చెల్లించి ప్రభుత్వాన్ని  ఇదివరకిటి మాదిరిగా మోసం  చేయలేరు ,అలాంటి డీలర్స్ తప్పనిసరిగా మొత్తం జిఎస్టి రూపంలో చెల్లించాల్సి రావచ్చు
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

Address for Communication

Address card