Friday, March 03, 2017

తెలుగు వైభవం




భాస్కర శతకంలో చదువది యెంత గల్గిన రసజ్ఞత యించుక చాలకున్న యా చదువు నిరర్థకంబుఅంటాడు కవి. ‘...చదువొకటే కాదు. (ముత్యాల ముగ్గులో చెప్పినట్టు) కొంచెం కళాపోషణ కూడా ఉండాలిఅని దాని అర్థం.

కూర్చున్నప్పుడు, నిలబడినప్పుడు కదిలే స్తనాలలోని గగుర్పాటుని 'విలాసముఅంటారని భరతుడి నాట్యశాస్త్రంలో చెప్పబడింది. కృష్ణుణ్ణి చూడటంతోనే ఒక గోపికకి తమకం కలిగిందట. స్తనాలు బరువెక్కి తట్టుకోలేక అతడిని అదిమి కౌగిలించుకొంది. చందనo పూయబడిన కళేబరo (శరీరo) అది.చందన చర్చిత నీల కళేబర... హరి రిహ ముగ్ధ వధూ నికరే విలాసినివిలసతి కేళిపరే…’ అట. ఎంత చక్కగా ఆ విలాసముఅన్న పదాన్ని జయదేవ కవి ఇక్కడ వాడుకున్నాడో చూడండి.
స్త్రీ గురించి పురుషుడు వర్ణించడం గొప్ప కాదు కానీ, స్త్రీ అందాలకి పరస్పర విరుద్ధ లక్షణాల్ని ఆపాదిస్తూ కవయిత్రి మొల్ల ఒక అద్భుతమైన పద్యం వ్రాసింది. సీత ముక్కు సంపెంగ, ముంగురులు తుమ్మెదలు (సంపెంగకి తుమ్మెద శత్రువు). చేతులు పద్మాలు, ముఖం చంద్రుడు (శత్రువైన చంద్రుడు కనబడేసరికి పద్మాలు ముకుళించుకు పోతాయి). స్తనములు గజకుంభాలు. నడుము సింహ మధ్యమం (సింహానికీ ఏనుగుకూ ఉన్న వైరం అందరికీ తెలిసినదే). పెదవి దొండ పండు, మాట చిలక పలుకు (దొండపండు కనబడితే చిలకలు వదలవు). హంసగమన, చేతులు తామర తూళ్ళు (హంసలు తామరతూళ్ళని తింటాయి). చూపులు చకోరాలు, నవ్వు వెన్నెల (చకోరాలు వెన్నెలని తాగుతాయి). ఈ విధంగా పరస్పర విరుద్ధ వర్ణనలతో సీత అందాన్ని శూర్పణఖ రావణన్నయ్య ముందు వర్ణిస్తుంది.

ఈ కవుల ప్రేరణతో, "ప్రేమ" నవలలో నాయకిని వర్ణిస్తూ యండమూరి వీరెంద్రనాద్ నాద్ గారు ఈ  విధంగా వ్రాశారు. కథానాయకి తొలిసారి ఆ గ్రామంలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. గతుకుల దారి, ఎడ్లబండి కుదుపుల బారి పడిన ఆమె ‘స్తనములు పంజరం చెర వీడిన పక్షి రెక్కల్లా ‘కదుల్తూ ఉంటాయి. కాలువనుంచి కావిడితో ఇంటింటికీ నీళ్ళు సరఫరా చేసే కావిడివాడు ఆమెని చూసి, "ఈమె కుచములంత కడవలు నాకుంటే, ఇన్ని తడవలు కాలువకీ ఊరికీ మధ్య తిరిగే బాధ ఉండేది కాదు కదా" అనుకుంటాడు.
విరహ వర్ణన:
ప్రేమించినవారు దూరంగా ఉంటే కలిగే బాధని విరహo అంటారు. జీవితంలో ప్రతీవాళ్ళూ ఏదో ఒక వయసులో, ఏదో ఒక స్థాయిలో దీన్ని అనుభవించే ఉంటారు. విరహం మూడు రకాలు. 1. మానసికం 2. శారీరకం 3. మానసికం+శారీరకం.
శృంగారానుభవం లేనివారి బాధ ఉట్టి మానసిక విరహం. మానసిక విరహాన్ని బెంగఅని కూడా అనవచ్చు. హాస్టల్లో ఉండే పిల్లలు తల్లిదండ్రులు దూరం అవడం వల్ల పడే బాధ కూడా విరహమే. ప్రేమికుల విరహం, పిల్లల బెంగ... ఇవే కాదు. భగవంతుని పట్ల భక్తునిది కూడా విరహమే అని చెప్పే గిరిక పాత్ర‌ను వేయి ప‌డ‌గ‌లున‌వ‌ల‌లో అత్య‌ద్భుతంగా సృష్టించారు విశ్వ‌నాథ స‌త్య‌నారాయ‌ణ‌గారు. ఈ గిరిక దేవ‌దాసి. వేణుగోపాల‌ స్వామికి నాట్య నివేద‌నాలు చేసే న‌ర్త‌కి. హృద‌యాన్ని కూడా గోపాలునికి అంకితం చేసి, గీత గోవిందాన్ని గిరికా గోవిందంగా తారుమారు చేసి, ఆ స్వామికోసం విర‌హంతో త‌పించి తుద‌కు కైవ‌ల్య ప‌‌థానికి చేరుకుంది.
రెండోది బాధ శారీరకo. వ్యక్తితో అటాచ్మెంట్ లేకుండా వచ్చే విరహాన్ని కామంఅంటారు. మూడోది మానసికం + శారీరకం. శృంగారానుభవం ఉన్న ప్రేమికులూ, తప్పని సరి పరిస్థితుల్లో విడిగా ఉండవలసి వచ్చిన దంపతులూ పడే బాధ ఇది. అప్పటికే కొంత శృంగారం అనుభవించడం వల్ల, ఆషాఢమాసంలో కొత్త దంపతులు దూరంగా ఉండవలసి వచ్చినప్పుడు, శరీరమూ మనసూ ఏక కాలంలో బాధపడతాయి. పెళ్ళయిన కొత్తలో రెండు భిన్న వ్యక్తిత్వాల మధ్య విభేదాలు తప్పవు. ఇద్దరూ నెల రోజుల పాటూ విడిగా ఉండాల్సి వచ్చినప్పుడు, పాత విభేదాలు మర్చిపోయి, ఒకరికోసం ఒకరు అర్రులు సాచే అవసరాన్ని సృష్టించటం కోసమే ఆషాఢ మాసపు నియంత్రణ కల్పింపబడిందనీ, దాన్ని తరువాత 'అత్తా- కోడలూ ఒకే ఇంట్లో కలిసి ఉండరాదనే నిబంధన'గా కన్వీనియెంటుగా మార్చారనీ కొందరి ఉవాచ.
ప్రబంధ లక్షణమైన అష్టాదశ వర్ణనల్లో పుర వర్ణన, అరణ్య వర్ణన, పర్వత వర్ణనా ఉన్నట్లే విరహవర్ణన కంపల్సరీ కాదు కానీ, విరహన్ని వర్ణించే విషయంలో పురాతన కవులు ఎప్పుడు అవకాశం వచ్చినా వదులుకోలేదు. పరిధులు చెరిపి, తమ ఆలోచనా పటిమకి అవధులు లేవని నిరూపించుకున్నారు.
నాకు తెలిసినంతలో విరహం గురించి రామరాజ భూషణుడు వసు చరిత్రలో వ్రాసినంత 'ఇది'గా మరి ఏ కవీ వ్రాయలేదు. కథానాయకి గిరిక ఒక్కొక్క అవయవానికీ కలిగిన విరహ బాధా, ఆ బాధ తీర్చటానికి చెలికత్తెలు పడే బాధని అపురూపంగా అభివర్ణిస్తాడు.
విరహంతో కథానాయకి బాధ పడుతున్నప్పుడు, పరిచారికలు సలసలా కాగిపోతున్న ఆమె శరీరాన్ని నీటితో తడపటం, లేత తమలపాకుల మీద పడుకో బెట్టడం, విసనకర్రలతో వీయటం లాంటి ఉపచారాలు చేయడం అనాదిగా వస్తున్నదే. అయితే భట్టుమూర్తి కథానాయిక అపురూప సౌందర్యవతి. అందువల్ల చెలికత్తెలకి గొప్ప చిక్కు వచ్చి పడింది.
‘లలనకానంగ కీలికీలా కలాప సంతతాలీఢ’
మన్మథావస్థతో బాధపడుతున్నవారిని చిగురుటాకులపై పడుకోబెట్టవచ్చు. కానీ పుత్తడిరంగులో ఉన్న ఆమె శరీరం, లోపలి నుంచి వచ్చే అగ్నికి పుటంలో వేసిన బంగారoలా మరిగిపోతోంది. చిగురుటాకులు జ్వాలా వర్ణంలో ఎర్రగా ఉన్నాయి. వాటి మీద ఈమెను పడుకోబెడితే అది మరింత ప్రమాదం కాదా!
‘శీర్యదాశా వృంత శిథిలితాసు లతాంత మసియాడ వీపనల్విసర రాదు’
ప్రియుడి కోసం ఆమె శరీరం శుష్కించిపోయింది. కాస్త గాలి వేస్తే తొడిమ నుంచి జారిపోయే పుష్పంలా ఉంది ప్రాణo. ఇటువంటి పరిస్థితిలో ఆమెకు విసనకర్రలతో స్వాంతన చేకూరిస్తే, వేగంగా వచ్చే ఆ గాలికి మొత్తం ప్రాణాలకే ప్రమాదం వస్తుందేమోనని చెలికత్తెలు సంశయిస్తున్నారు.
‘శ్రమబిందు తారకాగమఖిన్న కుచకోకముల చంద్ర నామంబు దలపరాదు’
విరహతాపంతో మరుగుతున్న ‘కుచ ద్వయాని’కి కర్పూర లేపనం రాద్దామని అనుకున్నారు. కాని చక్రవాక పక్షుల్లా ఉన్న ఆమె స్తనాలపై మన్మథ తాపం వల్ల ఉద్భవించిన చెమట బిందువులు నక్షత్రాల్లా మెరుస్తున్నాయి. అటువంటి సమయంలో వాటికి కర్పూరం వ్రాయకూడదు. కారణం, కర్పూరానికి మరో పేరు 'చంద్ర'. చక్రవాక పక్షులకి చీకటంటే భయం. అసలే దిగులుగా ఉన్న స్తనాలనే చక్రవాకాలకి నక్షత్రాలతో పాటూ చంద్రుణ్ణి కూడా తోడిస్తే మరింత కష్టం కదా.
మోహోపదేశ తమో ముద్రితములైన - కనుదమ్ముల హిమాంబులునుప రాదు. హృదయ పాత్రాంతరాళపొంగి పొరల చల్లని పటీర సలిలంబు చల్లరాదు.
మోహం అనే చీకటి వల్ల ముడుచుకుపోయిన కమల నేత్రాలకి సూర్యరశ్మి కావాలి తప్ప నీళ్ళెందుకు? అయినా. ఆమె మనసే సలసలా కాగే నూనెలా ఉంది. వాటిమీద నీళ్ళు జల్లితే అంతకంటే ప్రమాదం మరొకటి ఉంటుందా?
ఈ విధంగా కవి ఊహలతో సోయగమైన ఆ విరహ వర్ణన అప్రతిహతంగా అపూర్వంగా సాగుతుంది.
ఇంత గొప్ప తెలుగుని మనం కోల్పోతున్నాం. పునరుక్తి అనుకోకపోతే, తెలుగును బ్రతికించండి. మన మాతృభాష అయినందుకు కాదు. ఇంతకన్నా గొప్ప భాష ప్రపంచంలో ఇంకెక్కడా లేదు. ప్రతి భాషవాడూ ఇలాగే అనుకుంటూ ఉండవచ్చు గాక. కానీ ఒక్కసారి పరిశీలించి చూడoడి. మీకే అర్థం అవుతుంది.
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

Thursday, March 02, 2017

చదువు కున్న అందరికి సరిపడా వుద్యోగాలున్నాయా? ప్రభుత్వం చూపగలదా ?



             

              నాలుగు సంవత్సరాల విరామం తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసే కార్యక్రమం నిరుద్యోగులలో కొత్త ఆశలు చిగురింపజేసింది. నోట్స్ చదివి బట్టీయం పెట్టి పరీక్షలు రాయడం మనం యువతీ యువకులకు నేర్పించాం. జరుగుతున్న చరిత్రను కూడా గైడ్ రూపంలోనో, నోట్స్ రూపంలోనో చదివితే కానీ వారికి అర్థం కాదు. దేశంలో ప్రతి నెలా పది లక్షల మంది నిరుద్యోగుల జాబితాలో చేరుతున్నారు. తెలుగు రాష్ట్రాలలో ప్రైవేటు పరిశ్రమలు విస్తరించలేదు. సాఫ్టవేర్ రంగంలోనే ఉద్యోగాలు ఉన్నాయి. ఐటీ సంస్థల విస్తరణ కూడా ఒక దశకు వచ్చి నిలిచి పోయింది. జనాభాలో సగం మంది వ్యవసాయరంగంపైన ఆధారపడి జీవి స్తున్నారు. వ్యవసాయం గిట్టుబాటు కాక 1998 నుంచి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోవడానికి వీలు లేదం టూ సుప్రీంకోర్టు మొన్న ఆదేశాలు జారీ చేసింది. రైతు సంక్షేమ కార్యక్రమాలను పునస్సమీక్షించుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని పురమాయించింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఏమి చేయగలదు? సుప్రీం ఆదేశం నిష్ఫలం వ్యవసాయాన్ని ఎట్లా గిట్టుబాటు వ్యాసంగంగా మార్చాలో, పట్టణ ప్రాంతా లలో ఉద్యోగాలను ఎట్లా సృష్టించాలో ప్రభుత్వాలకు స్పష్టంగా తెలియదు.
          సబ్సిడీలు తగ్గించి ఆర్థిక సంస్కరణలను ముమ్మరం చేసి ప్రైవేటు రంగానికి పెద్ద పీట వేయాలన్న ధ్యాసే కానీ వ్యవసాయరంగం గురించి ఆలోచించినవారు లేరు. నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంపైకి వదిలిన నినాదా లలో 'మేక్ ఇన్ ఇండియా' ఒకటి. విదేశాలు పెట్టుబడులు పెట్టి ఇండియాలో పరిశ్రమలు నెలకొల్పాలనీ, ఉత్పాదక రంగాన్ని విస్తరించాలనీ ఎన్డీఏ సర్కార్ ఆకాంక్ష. పెట్టుబడులు పెట్టడానికీ, పరిశ్రమలు నెల కొల్పడానికీ అనువైన వాతా వరణం కల్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలది. ఎకనామిక్ జోన్ ఏర్పాటు చేసి భూమి, నీరు, విద్యుత్తు తక్కువ రేటుకు అందజేసినట్లయితే విదేశీ పెట్టుబడులు వస్తాయన్న విశ్వాసం.
             పరిశ్రమలకూ, ప్రాథమిక సదుపాయాల కల్పనకూ భూమి అవసరం. ఆర్థిక ప్రగతి సైతం ఆశించినంత వేగాన్ని పుంజు కోవడం లేదు. పరిశ్రమలూ, వ్యాపారాలూ విస్తరించడం లేదు. ఉద్యోగాల సృష్టి జరగడం లేదు. జాతీయ స్థాయిలో నిరుద్యోగులకు ఆశావహమైన పరిస్థితులు కనిపిం చడం లేదు. తెలుగు రాష్ట్రాలలో పరిస్థితులు మరీ గందరగోళం. ఆంధ్రప్రదేశ్లో అంతా ప్రైవేటు రంగం చేతుల్లోకి పోతోంది. గోదావరి పుష్కరాలలో సమాచార శాఖ చేయ వలసిన పనులు ప్రైవేటు సంస్థ నిర్వహించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రైవేటు మోజు. సింగపూర్, జపాన్ తప్ప మరే మాటా మాట్లాడే పరిస్థితి లేదు. రాజధాని నిర్మాణం కోసం భూములు సేకరిం చడం, పట్టిసీమ ప్రాజెక్టు నిర్మించడం అనే రెండే రెండు కార్యక్రమాలపైన ఆంధ్ర ప్రదేశ ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. సింగపూరు ప్రభుత్వం, కంపెనీలు అమరావతి నిర్మాణంలో కొంత మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వవచ్చు. చంద్రబాబునాయుడు విదేశీ యాత్రలు సత్ఫలితాలు ఇచ్చి కొత్త పరిశ్రమలు వచ్చి ఉద్యోగావకాశాలు విస్తరించే వరకూ నిరుద్యోగలు వేచి ఉండవలసిందే. ప్రభుత్వం ఉద్యోగావకాశాలు కల్పించడానికి ఒక వ్యూహం ప్రకారం పనిచేస్తున్న దాఖలా లేదు. పల్లెల్లో వృత్తులు దెబ్బతిన్నాయి. మూతబడిన పరిశ్రమలు అట్లాగే ఉన్నాయి. కొత్త పరిశ్రమలు రాలేదు. ప్రకటనలే మినహా ప్రగతి క్షేత్రంలో కనిపించడం లేదు. రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ఎవరి లోకంలో వారు విహరిస్తున్నారు. నిరుద్యోగ సమస్య తీవ్రతని అర్థం చేసుకు న్నట్టు కనిపించడం లేదు.
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

దీన్ని ప్రభత్వ దాదా గిరి అనకూడదా?




        ఒక ట్రైను టైముకి మనమే హాజరుగా వుండాలి కానీ దాన్ని ఆపమని అనలేము కదా అని మీరు ఉపయోగించిన లాజిక్ మంచిదే కానీ మరో కోణంలో అదే ట్రైన్ గంటలు గంటలు లేటుగా వచ్చి మనవిలువైన కాలాన్ని ప్లాట్ఫారాలతో గడపాల్సివచ్చినప్పుడు ఎవరైనా ఎందుకని ప్రశ్నించటం లేదు? ఏమ్ ?  మనది విలువైన సమయంకాదా ?,మనకి పనులు లేవా?
     ఇక ఎక్సామ్స్ దగ్గరకువద్దాం
             ఒక నిముషమో లేదో గంటో ఆలస్యంగానైనా వస్తే ఏమవుతుంది?. ఇచ్చిన టైము సరిపోదు దాంతో మొత్తం పరీక్ష వ్రాయలేక పోవచ్చు.పోనీ! అతనే గదా లాస్ అయ్యేది.ఇందులో ప్రభుత్వానికేంటి నష్టం. అతన్ని అనుమతించలేదు అంటే అతనను కట్టిన ఫీజు రాకపోకలకి అయిన ఖర్చులతో సహా తిరిగిచ్చేయాలికదా కానీ ఎందుకివ్వటంలేదు. సినిమా టిక్కె ట్  కొనేసినాక మన ఇష్టమైనపుడు వెళ్తాం లేదా మనతాం ,మన ఇష్టం. వారినేమే అడగం ,కానీ ..వారే రానివ్వకపొతే ప్రశ్నిస్తాం కదా?.?.ఒకసారి ఫీజు కట్టించుకున్నాక ఆఖరి నిముషంవరకూ వారికి హక్కుంది. వీటికోసం ఎన్నో నిద్రలేని రాత్రులు ప్రిపేరయ్యి,ఆర్ధికంగా మానసికంగా క్రుంగి పోయిన నిరుద్యోగులకి   రకరకాల కారణాలతో కాస్త లేటయిందని నిరాకరించటం ఏంటి ? దీన్ని ప్రభత్వ దాదా గిరి అనకూడదా?
              ఈ పరీక్షా విధానాలన్ని మొదటినుంచి బాగా పరిశీలించండి .దీని వెనుకున్న లక్ష్యం ఒక్కటే.  ఉద్యోగాలు కల్పిస్తున్నామని సమాజాన్ని బ్రమింప చేయాలి.  డబ్బులు దండిగా రావాలి- రక రకాల కారణాలతో వీలైనంత మందిని అనర్హులుగా ప్రకటించాలి. (రేపటి నోటిఫికేషన్ కి మళ్ళీ ఎక్కువ ఫీజులు రావాలిగా -) ఇదీ అన్ని  ప్రభుత్వాల అంతిమ లక్ష్యం- మన చిన్నప్పుడు విన్న భేతాళుడు తిరిగి చేట్టిక్కిన కధలు మాదిరిగా దీనికి అంతం లేదు
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

Wednesday, March 01, 2017

ఆశ్చర్యకరమైన, ఆవేదనాభరితమైన విషయం




ఉపాధి హామీలో పనిచేసిన కూలి ఆడుతూ పాడుతూ పనిచేసి గరిష్టంగా రూ.300 వరకు సంపాదిస్తున్నారు. మేస్త్రీ పని చేస్తే రోజుకు రూ.800 నుండి రూ.1200 సంపాదిస్తున్నారు. కానీ ఓ ఇంజనీర్ కు నెలకు రూ.6000 జీతం ఇచ్చే ఉద్యోగం దొరకడం లేదు. ఇంజనీరింగ్ చదివి రూ.3000 నుండి రూ.5000 కు ప్రైవేట్ పాఠశాలలలో పనిచేసే వారు వేల మంది కనిపిస్తారు. ఇక ఎంసీఏ, ఎంబీఎ చేసిన వారి పరిస్థితి అత్యంత దయనీయం. దీనికి కారణం విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేయడం .. ఈ దేశానికి చేయూత నిచ్చే యువత భవిష్యత్ ను కేవలం ఎన్నికల నినాదంగా, నిరుద్యోగులను రాజకీయ పార్టీలు క్యాష్ లెస్ కూలీలుగా భావించడమే ఈ పరిస్థితికి కారణం. ఇక ఈ యువతకు దిశానిర్దేశం చేసే నాయకుడు గానీ .. వీరి భవిష్యత్ గురించి ఆలోచించే ప్రభుత్వం గానీ ఇప్పటి వరకు లేకపోవడం. జూని యర్ కాలేజీలు లేని చోట్ల సైతం ఇంజనీరింగ్ కాలేజీలు నెలకొల్పి వేలాది మంది ఇంజనీరింగ్ పట్టభద్రులను తయారు చేసిన ఫలితం. నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీసు నిర్వహించిన సర్వే ప్రకారం చదువురానివారిలో కంటే చదువు కున్నవారిలోనే నిరుద్యోగం ఎక్కువ. చదువులేనివారు ఏ పని చేయడానికైనా సిద్ధం. చదువుకున్నవారు వీలైతే ప్రభుత్వ ఉద్యోగం లేకపోతే ప్రైవేటు ఉద్యోగం చేయడానికి ఇష్టపడతారు. లే దా నిరుద్యోగిగానే మిగిలిపోతారు. ఏదో ఒక పని చేసి కడుపు నింపుకోవాలని అనుకోరు. వ్యవసాయదారుల కుటుంబాలలోనూ చదువుకున్నవారికి కూడా పొలం పని చేయడం నామోషీ. తల్లిదండులు పని చేస్తుంటే నిరుద్యోగులు ఉద్యోగం కోసం నిరీక్షిస్తూ కూర్చుంటారు
                          నిరుద్యోగుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొన్న ప్రభుత్వం ఒకసారి సర్వీస్ కమీషన్ లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థికి అతని అర్హతలకు సరిపోయె ఉద్యోగ వివరాలు అతడి సెల్ కి తెలిసేలా ఏర్పాటు చేయాలి. ఇక కోచింగ్ సెంటర్ ల శిక్షణ కోసం వేలు ఖర్చు చేసి ఆర్థికంగా లేక ఇబ్బందులు పడుతున్న వారిని దృష్టిలో పెట్టుకుని ,ఉచితంగా క్లాసులో లేదా టీవీ ద్వారా నిపుణులతో పాఠాలు కూడ చెప్పిస్తే బావుంటుంది(ఆల్రెడీ ఇది తెలంగాణా లో ‘మన టీవీ’ ద్వారా జరుగుతుంది). అయితే ఆశ్చర్యకరమైన, ఆవేదనాభరితమైన విషయం ఏంటంటే రెండున్నరేళ్లలో ఎన్నో సంచలనాత్మక నిర్ణయాలతో ప్రపంచం దృష్టిని, దేశం దృష్టిని ఆకర్షించిన ప్రభుత్వం, ముఖ్యమంత్రి  మేధావులను గానీ, విపక్షాలను మాత్రం ఆకట్టుకోలేకపోవడం.
                       సరే మేధావులు కాబట్టి కొన్ని నిర్ణయాలు నచ్చలేదు అనుకుందాం .. ప్రభుత్వ ప్రాజెక్టులు, పథకాలు, విద్యా విధానంలో మార్పులకు చేస్తున్న కృషి, పారిశ్రామిక, ఐటీ విధానాలు, ఉపాధి కల్పన కోసం చేస్తున్న ఏ ప్రయత్నమూ నచ్చకపోవడం ఏం మేధావితనమో అర్థం కాదు. ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చూపి .. మంచిని ప్రశంసించినప్పుడే మేధావులు అనేవారికి విలువ ఉంటుంది. కేంద్రం చేస్తున్న అన్యాయం గురించి ఏ మేధావి ప్రశ్నించడు. కేంద్రం నుండి రావాల్సిన వాటి గురించి నోరు తెరవడు. తెల్లారి లేస్తే ప్రభుత్వం మీద బురద చల్లడంలో మాత్రం ముందుంటాడు
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

Address for Communication

Address card