Friday, March 03, 2017

తెలుగు వైభవం




భాస్కర శతకంలో చదువది యెంత గల్గిన రసజ్ఞత యించుక చాలకున్న యా చదువు నిరర్థకంబుఅంటాడు కవి. ‘...చదువొకటే కాదు. (ముత్యాల ముగ్గులో చెప్పినట్టు) కొంచెం కళాపోషణ కూడా ఉండాలిఅని దాని అర్థం.

కూర్చున్నప్పుడు, నిలబడినప్పుడు కదిలే స్తనాలలోని గగుర్పాటుని 'విలాసముఅంటారని భరతుడి నాట్యశాస్త్రంలో చెప్పబడింది. కృష్ణుణ్ణి చూడటంతోనే ఒక గోపికకి తమకం కలిగిందట. స్తనాలు బరువెక్కి తట్టుకోలేక అతడిని అదిమి కౌగిలించుకొంది. చందనo పూయబడిన కళేబరo (శరీరo) అది.చందన చర్చిత నీల కళేబర... హరి రిహ ముగ్ధ వధూ నికరే విలాసినివిలసతి కేళిపరే…’ అట. ఎంత చక్కగా ఆ విలాసముఅన్న పదాన్ని జయదేవ కవి ఇక్కడ వాడుకున్నాడో చూడండి.
స్త్రీ గురించి పురుషుడు వర్ణించడం గొప్ప కాదు కానీ, స్త్రీ అందాలకి పరస్పర విరుద్ధ లక్షణాల్ని ఆపాదిస్తూ కవయిత్రి మొల్ల ఒక అద్భుతమైన పద్యం వ్రాసింది. సీత ముక్కు సంపెంగ, ముంగురులు తుమ్మెదలు (సంపెంగకి తుమ్మెద శత్రువు). చేతులు పద్మాలు, ముఖం చంద్రుడు (శత్రువైన చంద్రుడు కనబడేసరికి పద్మాలు ముకుళించుకు పోతాయి). స్తనములు గజకుంభాలు. నడుము సింహ మధ్యమం (సింహానికీ ఏనుగుకూ ఉన్న వైరం అందరికీ తెలిసినదే). పెదవి దొండ పండు, మాట చిలక పలుకు (దొండపండు కనబడితే చిలకలు వదలవు). హంసగమన, చేతులు తామర తూళ్ళు (హంసలు తామరతూళ్ళని తింటాయి). చూపులు చకోరాలు, నవ్వు వెన్నెల (చకోరాలు వెన్నెలని తాగుతాయి). ఈ విధంగా పరస్పర విరుద్ధ వర్ణనలతో సీత అందాన్ని శూర్పణఖ రావణన్నయ్య ముందు వర్ణిస్తుంది.

ఈ కవుల ప్రేరణతో, "ప్రేమ" నవలలో నాయకిని వర్ణిస్తూ యండమూరి వీరెంద్రనాద్ నాద్ గారు ఈ  విధంగా వ్రాశారు. కథానాయకి తొలిసారి ఆ గ్రామంలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. గతుకుల దారి, ఎడ్లబండి కుదుపుల బారి పడిన ఆమె ‘స్తనములు పంజరం చెర వీడిన పక్షి రెక్కల్లా ‘కదుల్తూ ఉంటాయి. కాలువనుంచి కావిడితో ఇంటింటికీ నీళ్ళు సరఫరా చేసే కావిడివాడు ఆమెని చూసి, "ఈమె కుచములంత కడవలు నాకుంటే, ఇన్ని తడవలు కాలువకీ ఊరికీ మధ్య తిరిగే బాధ ఉండేది కాదు కదా" అనుకుంటాడు.
విరహ వర్ణన:
ప్రేమించినవారు దూరంగా ఉంటే కలిగే బాధని విరహo అంటారు. జీవితంలో ప్రతీవాళ్ళూ ఏదో ఒక వయసులో, ఏదో ఒక స్థాయిలో దీన్ని అనుభవించే ఉంటారు. విరహం మూడు రకాలు. 1. మానసికం 2. శారీరకం 3. మానసికం+శారీరకం.
శృంగారానుభవం లేనివారి బాధ ఉట్టి మానసిక విరహం. మానసిక విరహాన్ని బెంగఅని కూడా అనవచ్చు. హాస్టల్లో ఉండే పిల్లలు తల్లిదండ్రులు దూరం అవడం వల్ల పడే బాధ కూడా విరహమే. ప్రేమికుల విరహం, పిల్లల బెంగ... ఇవే కాదు. భగవంతుని పట్ల భక్తునిది కూడా విరహమే అని చెప్పే గిరిక పాత్ర‌ను వేయి ప‌డ‌గ‌లున‌వ‌ల‌లో అత్య‌ద్భుతంగా సృష్టించారు విశ్వ‌నాథ స‌త్య‌నారాయ‌ణ‌గారు. ఈ గిరిక దేవ‌దాసి. వేణుగోపాల‌ స్వామికి నాట్య నివేద‌నాలు చేసే న‌ర్త‌కి. హృద‌యాన్ని కూడా గోపాలునికి అంకితం చేసి, గీత గోవిందాన్ని గిరికా గోవిందంగా తారుమారు చేసి, ఆ స్వామికోసం విర‌హంతో త‌పించి తుద‌కు కైవ‌ల్య ప‌‌థానికి చేరుకుంది.
రెండోది బాధ శారీరకo. వ్యక్తితో అటాచ్మెంట్ లేకుండా వచ్చే విరహాన్ని కామంఅంటారు. మూడోది మానసికం + శారీరకం. శృంగారానుభవం ఉన్న ప్రేమికులూ, తప్పని సరి పరిస్థితుల్లో విడిగా ఉండవలసి వచ్చిన దంపతులూ పడే బాధ ఇది. అప్పటికే కొంత శృంగారం అనుభవించడం వల్ల, ఆషాఢమాసంలో కొత్త దంపతులు దూరంగా ఉండవలసి వచ్చినప్పుడు, శరీరమూ మనసూ ఏక కాలంలో బాధపడతాయి. పెళ్ళయిన కొత్తలో రెండు భిన్న వ్యక్తిత్వాల మధ్య విభేదాలు తప్పవు. ఇద్దరూ నెల రోజుల పాటూ విడిగా ఉండాల్సి వచ్చినప్పుడు, పాత విభేదాలు మర్చిపోయి, ఒకరికోసం ఒకరు అర్రులు సాచే అవసరాన్ని సృష్టించటం కోసమే ఆషాఢ మాసపు నియంత్రణ కల్పింపబడిందనీ, దాన్ని తరువాత 'అత్తా- కోడలూ ఒకే ఇంట్లో కలిసి ఉండరాదనే నిబంధన'గా కన్వీనియెంటుగా మార్చారనీ కొందరి ఉవాచ.
ప్రబంధ లక్షణమైన అష్టాదశ వర్ణనల్లో పుర వర్ణన, అరణ్య వర్ణన, పర్వత వర్ణనా ఉన్నట్లే విరహవర్ణన కంపల్సరీ కాదు కానీ, విరహన్ని వర్ణించే విషయంలో పురాతన కవులు ఎప్పుడు అవకాశం వచ్చినా వదులుకోలేదు. పరిధులు చెరిపి, తమ ఆలోచనా పటిమకి అవధులు లేవని నిరూపించుకున్నారు.
నాకు తెలిసినంతలో విరహం గురించి రామరాజ భూషణుడు వసు చరిత్రలో వ్రాసినంత 'ఇది'గా మరి ఏ కవీ వ్రాయలేదు. కథానాయకి గిరిక ఒక్కొక్క అవయవానికీ కలిగిన విరహ బాధా, ఆ బాధ తీర్చటానికి చెలికత్తెలు పడే బాధని అపురూపంగా అభివర్ణిస్తాడు.
విరహంతో కథానాయకి బాధ పడుతున్నప్పుడు, పరిచారికలు సలసలా కాగిపోతున్న ఆమె శరీరాన్ని నీటితో తడపటం, లేత తమలపాకుల మీద పడుకో బెట్టడం, విసనకర్రలతో వీయటం లాంటి ఉపచారాలు చేయడం అనాదిగా వస్తున్నదే. అయితే భట్టుమూర్తి కథానాయిక అపురూప సౌందర్యవతి. అందువల్ల చెలికత్తెలకి గొప్ప చిక్కు వచ్చి పడింది.
‘లలనకానంగ కీలికీలా కలాప సంతతాలీఢ’
మన్మథావస్థతో బాధపడుతున్నవారిని చిగురుటాకులపై పడుకోబెట్టవచ్చు. కానీ పుత్తడిరంగులో ఉన్న ఆమె శరీరం, లోపలి నుంచి వచ్చే అగ్నికి పుటంలో వేసిన బంగారoలా మరిగిపోతోంది. చిగురుటాకులు జ్వాలా వర్ణంలో ఎర్రగా ఉన్నాయి. వాటి మీద ఈమెను పడుకోబెడితే అది మరింత ప్రమాదం కాదా!
‘శీర్యదాశా వృంత శిథిలితాసు లతాంత మసియాడ వీపనల్విసర రాదు’
ప్రియుడి కోసం ఆమె శరీరం శుష్కించిపోయింది. కాస్త గాలి వేస్తే తొడిమ నుంచి జారిపోయే పుష్పంలా ఉంది ప్రాణo. ఇటువంటి పరిస్థితిలో ఆమెకు విసనకర్రలతో స్వాంతన చేకూరిస్తే, వేగంగా వచ్చే ఆ గాలికి మొత్తం ప్రాణాలకే ప్రమాదం వస్తుందేమోనని చెలికత్తెలు సంశయిస్తున్నారు.
‘శ్రమబిందు తారకాగమఖిన్న కుచకోకముల చంద్ర నామంబు దలపరాదు’
విరహతాపంతో మరుగుతున్న ‘కుచ ద్వయాని’కి కర్పూర లేపనం రాద్దామని అనుకున్నారు. కాని చక్రవాక పక్షుల్లా ఉన్న ఆమె స్తనాలపై మన్మథ తాపం వల్ల ఉద్భవించిన చెమట బిందువులు నక్షత్రాల్లా మెరుస్తున్నాయి. అటువంటి సమయంలో వాటికి కర్పూరం వ్రాయకూడదు. కారణం, కర్పూరానికి మరో పేరు 'చంద్ర'. చక్రవాక పక్షులకి చీకటంటే భయం. అసలే దిగులుగా ఉన్న స్తనాలనే చక్రవాకాలకి నక్షత్రాలతో పాటూ చంద్రుణ్ణి కూడా తోడిస్తే మరింత కష్టం కదా.
మోహోపదేశ తమో ముద్రితములైన - కనుదమ్ముల హిమాంబులునుప రాదు. హృదయ పాత్రాంతరాళపొంగి పొరల చల్లని పటీర సలిలంబు చల్లరాదు.
మోహం అనే చీకటి వల్ల ముడుచుకుపోయిన కమల నేత్రాలకి సూర్యరశ్మి కావాలి తప్ప నీళ్ళెందుకు? అయినా. ఆమె మనసే సలసలా కాగే నూనెలా ఉంది. వాటిమీద నీళ్ళు జల్లితే అంతకంటే ప్రమాదం మరొకటి ఉంటుందా?
ఈ విధంగా కవి ఊహలతో సోయగమైన ఆ విరహ వర్ణన అప్రతిహతంగా అపూర్వంగా సాగుతుంది.
ఇంత గొప్ప తెలుగుని మనం కోల్పోతున్నాం. పునరుక్తి అనుకోకపోతే, తెలుగును బ్రతికించండి. మన మాతృభాష అయినందుకు కాదు. ఇంతకన్నా గొప్ప భాష ప్రపంచంలో ఇంకెక్కడా లేదు. ప్రతి భాషవాడూ ఇలాగే అనుకుంటూ ఉండవచ్చు గాక. కానీ ఒక్కసారి పరిశీలించి చూడoడి. మీకే అర్థం అవుతుంది.
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

No comments:

Post a Comment

Address for Communication

Address card