Tuesday, April 02, 2019

భారత ఆర్ధిక వ్యవస్ధ వృద్ధికి నాలుగు ప్రధాన గండాలు(ఇది మొదటిది)


                గ్లోబలైజేషన్ కు వ్యతిరేకంగా ఎదురు దెబ్బలు ఎక్కడి నుండి వస్తున్నాయి? ఆంగ్లంలో దీనిని బ్యాక్ లాష్ అని సర్వే చెప్పింది. అంటే నిజానికి ‘గ్లోబలైజేషన్ బెడిసికొట్టడం’ గా చెప్పాలి. ఈ గ్లోబలైజేషన్ బెడిసికొట్టడం అనేది సదరు గ్లోబలైజేషన్ కు ఇన్నాళ్లూ నాయకత్వం వహించిన అమెరికా వల్లనే జరగడం చెప్పుకోవలసిన సంగతి. ఎన్నికల ప్రచారంలోనూ, ఆ తర్వాత అధికారం లోకి వచ్చిన తర్వాత కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్లోబలిస్టు-వ్యతిరేక నినాదాలు ఇచ్చాడు, ఇస్తున్నాడు.
               గ్లోబలైజేషన్ వల్ల అమెరికా చాలా నష్టపోయిందని ఆయన చెబుతున్నాడు. గ్లోబలైజేషన్ ను ఉపయోగించుకుని అమెరికా నుండి లబ్ది పొందిన దేశాలు తిరిగి అమెరికాకు ఏమీ ఇవ్వడం లేదని దానితో అమెరికా నుండి పెట్టుబడులు, కంపెనీలు, ఉద్యోగాలు, వనరులు తరలిపోతున్నాయని ట్రంప్ గగ్గోలు పెడుతున్నాడు.
              ‘అమెరికా ఫస్ట్’ నినాదం ఇచ్చాడు. తద్వారా అమెరికా ప్రయోజనాల తర్వాతే ఇతర ప్రపంచం గురించి ఆలోచిస్తానన్నాడు. ఆ మేరకు ఇమ్మిగ్రేషన్, వీసా విధానాల్లో మార్పులు తెస్తున్నాడు. అనగా ప్రొటెక్షనిస్టు విధానాలు అమలు చేస్తున్నాడు.
              అమెరికాను తిరిగి అగ్ర స్ధానంలో నిలపడం కోసం ట్రంప్ తీసుకుంటున్న చర్యలను ఇటీవల భారత ప్రధాని మోడి వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశాలను దావోస్ లో ప్రారంభిస్తూ పేరు చెప్పకుండా విమర్శించడం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవచ్చు.
Modi for Globalization
               “ప్రొటెక్షనిజం శక్తులు ప్రపంచీకరణకు వ్యతిరేకంగా తల ఎత్తుతున్నాయి. ప్రపంచీకరణ జరగడానికి బదులు దానికి వ్యతిరేకంగా జరుగుతున్న భావన కలుగుతోంది… ఈ తరహా ఆలోచనా విధానం యొక్క వ్యతిరేక ప్రభావం వాతావరణ మార్పుల ప్రభావం కంటే లేదా ఉగ్రవాదం ప్రభావం కంటే తక్కువగా ఉంటుందని భావించలేము”
                      ట్రంప్ ప్రొటెక్షనిజం వల్ల భారత ప్రధాని కూడా ఆగ్రహంగా ఉన్నాడన్న మాట! ట్రంప్ ప్రొటెక్షనిజం వల్ల ఇండియాకు నష్టం ఏమిటన్నదీ మొదటి గండంలో ఆర్ధిక సర్వే చెప్పింది. ప్రపంచ వాణిజ్యంలో అమెరికా అనుసరిస్తున్న ప్రొటెక్షనిస్టు విధానాల వల్ల భారత కంపెనీల ఎగుమతులు పడిపోతున్నాయి. అంటే భారత దళారీ కంపెనీలకు, దళారీ ప్రభుత్వానికి ఎగుమతి ఆదాయం తగ్గిపోతోంది. టి‌సి‌ఎస్, ఇన్ఫోసిస్, సత్యం లాంటి ఎలక్ట్రానిక్, కంప్యూటర్ సేవల కంపెనీలకు ప్రధాన ఎగుమతి మార్కెట్టు అమెరికాయే. అలాంటి అమెరికా, ఇండియా లాంటి దేశాల నుండి వచ్చే దిగుమతులపై పన్నులు వేస్తే భారత కంపెనీలు లాభాలు అటుంచి భారీ నష్టాలు మోయాల్సి ఉంటుంది. వీసా విధానాల వల్ల సాఫ్ట్ వేర్ ఉపాధి పడిపోతుంది. ఫలితంగా విదేశాల్లోని భారతీయుల నుండి దేశంలోకి వచ్చె చెల్లింపులు నష్టపోవాలి. భారత జి‌డి‌పి లో ఇవి ముఖ్యమైన భాగం. కాబట్టి ఇండియా జి‌డి‌పి అధోదిశలో ప్రయాణం కడుతుంది.
                 ట్రంప్ నేతృత్వం లోని అమెరికా మరిన్ని రక్షణ చర్యలు తీసుకుంటే భారత ఎగుమతులకు కష్టకాలం దాపురిస్తుంది. ఫలితంగా ఎగుమతుల కోసం ఉత్పత్తి చేసే కంపెనీలు, ప్రధానంగా సాఫ్ట్ వేర్ కంపెనీలు, తమ ఉత్పత్తిని తగ్గించేస్తాయి. దానితో ఉపాధి కూడా పడిపోతుంది. నిరుద్యోగం పెరుగుతుంది. ఉద్యోగులు నిరుద్యోగులుగా మారిన మేరకు ఇతర రంగాల కొనుగోళ్ళు (ఆటో, వస్త్రాలు, వెచ్చాలు, లగ్జరీ సరుకులు మొ.వి) తగ్గిపోతాయి. చివరికి మోడి అట్టహాసంగా ప్రకటించిన ‘మేక్ ఇన్ ఇండియా’ కే ఎసరు వస్తుంది. మోడీకి కోపం రాదా మరి?
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్,పొన్నూరు@9441503681

No comments:

Post a Comment

Address for Communication

Address card