Monday, May 28, 2018

టీవీలో ........




ఇక ఎలాగూ నిద్ర పట్టేలా లేదు అని వార్తలు విశేషాలు తెలుసుకుందామని టీవీ ఆన్ చేశాను.
మీ టీవీ చానెల్‌లో మాలో ఎవరు లూటీశ్వరుడు?” కార్యక్రమం వస్తూంది. కండక్ట్ చేస్తూంది సినీ నటుడు రాగార్జున.
ఇప్పుడు 1000 రూపాయల ప్రశ్న. మగాళ్ళు ఈ కింది దుస్తుల్లో ఏం వేసుకోరు?
1) పంచ 2) ప్యాంట్ 3) లుంగీ 4) చీర
మీ దగ్గర కేవలం ముప్పై సెకండ్ల టైం మాత్రమే ఉంది.అంటున్నాడు రాగార్జున కంటెస్టెంట్‌తో.
చీర,” టక్కున చెప్పింది కంటెస్టెంట్.
అ హ హ! భలే చెప్పారు! అంత వేగంగా ఎలా చెప్పారు? మీకు జెనరల్ నాలెడ్జ్ బాగా ఎక్కువనుకుంటాను. అ హ హ!
నా మొహం. చిన్నప్పటి నుంచి చూస్తున్నా కద! మా ఇంట్లో మగాళ్ళు ఎవరూ చీర కట్టుకోరు.
అ హ హ. పైగా మీకు బోలెడు సెన్స్ అఫ్ హ్యూమర్ కూడా ఉంది. అ హ హ.
నేను చానెల్ మార్చాను.
వీ.సీ.ఆర్ ఆవేశంగా జర్నలిస్టులతో మాట్లాడుతున్నాడు. ఎంత భయం లేకుంటె మా ఎం.ఎల్.ఏ.లవి పాచి కల్లు తాగిన మొహాలంటరు? ఎం.ఎల్.ఏ.లే కాదు మా పార్టీల సన్నాసులు కూడా నిఖార్సైన కల్లే తాగుతరు. సాయంత్రం మా పార్టీ ఆఫీస్‌కి వస్తే వాళ్ళకే తెలుస్తుంది.
ఐనా మా ఎం.ఎల్.ఏ.లు సార్వభౌమాధికారంఅనే పదాన్ని సక్కగా పలకలేదు. గంతే కద. ఈ పెద్ద పెద్ద పనికిమాలిన పదాలు మాకు అవసరం లేదు. ఇప్పటి సందిసార్వభౌమాధికారంబదులు పెద్ద పెత్తనంఅని చెప్తం. ఖేల్ ఖతం. దుకునం బంద్!
మళ్ళీ చానెల్ మార్చాను.
డ్యాన్స్ వాజా డ్యాన్స్ప్రోగ్రాం వస్తుంది. ఒక జంట అప్పుడే తమ పెర్‌ఫార్మెన్స్ ముగించినట్టున్నారు. ముగ్గురు జడ్జెస్ ముందు నిలబడ్డారు. ఒక జడ్జ్ వాళ్ళని కూకలేస్తున్నాడు.
సారీ మీకు 5 కంటే ఎక్కువ పాయింట్లు ఇవ్వలేను. విజయమాలిని పాటకు అంత మర్యాదగా డ్యాన్స్ చేస్తారా? ఆ ఊపు ఏదీ? ఆ కులుకులు ఏవీ? ఇదేమన్న ఫ్యామిలీ అంతా చూసే ప్రోగ్రాం అనుకున్నారా?”
ఆ జంట సారీ మాస్టార్!అని ఘొల్లుమన్నారు.
చానెల్ చేంజ్ చేశాను.
గంగమ్మ గారి గౌడి గేదెసీరియల్ వస్తూంది. ఒక మోతుబరి ఆడ లేడీ పశువుల కొట్టంలో కూర్చుని తన గేదెలను శుభ్రంగా తోముతూంది.
అదేంటి గంగమ్మ గారూ, ఇంత మంది ఉండగా మీరు చేయి చేసుకుంటున్నారు? కోట్లకు అధిపతి అయిన మీరు ఇలా బర్రెలని బరా బరా తోమేస్తూ ఉంటే చూడలేకపోతున్నానమ్మా,” మొర పెట్టుకుంటున్నాడు ఒక పాలేరు.
మనం ఎప్పుడు మన మూలాల్ని మరిచిపోకూడదురా. ఈ గేదెల వల్లే, నేను ఈ రోజు ఈ స్థాయికి చేరుకున్నాను. కనీసం ఇవి కంపు కొట్టకుండా చూసుకోవడం నా ధర్మం రా, నా ధర్మం!ఆవేశంగా అంటూంది గంగమ్మ.
మెల్లగా తల నొప్పి స్టార్ట్ అయ్యింది నాకు. అసలు ఒక్క మంచి ప్రోగ్రాం కూడా రాదా ఈ టీవీలో?
భయపడుతూనే ఒక న్యూస్ చానెల్ పెట్టాను.
ప్రధాన మంత్రి సురేంద్ర మోడీ ప్రస్తుతం భీటాన్ పర్యటనలో ఉన్నారు.
ఎంత మంచి వార్త! నైచా, డిబెట్‌ని అక్రమంగా స్వాధీనం చేసుకున్నాక, పర్వత సానువులను అంటపెట్టుకుని ఉన్న ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అయ్యింది. దాని ఫలితంగా రవాణా వంటి వ్యవస్థలు కూడా వెనకపడ్డాయి. చాలా చోట్ల బార్డర్ చేరుకోవాలంటే రోజుల తరబడి కాలి నడకన వెళ్ళాల్సిన పరిస్థితి. ఒక వైపు నైచా తమ దేశంలో, బార్డర్ పొడుగునా రైలు పట్టాలు, రోడ్లూ నిర్మిస్తూ తమ సరిహద్దులని మరింత పటిష్టం చేసుకుంటూంది. వీటన్నిటినీ ఎదుర్కోవాలంటే జంబూ ద్వీపం, భీటాన్ కలిసి పని చేయడం ఎంతైన అవసరం.
నా ఆలోచనలకు బ్రేక్ వేస్తూ మా ఆవిడ గొంతు వినిపించింది, “ఈ సురేంద్ర మోడీకి పని పాటా లేదనుకుంటాను. ఆ దిక్కు మాలిన భీటాన్‌కి ఎందుకు వెళ్ళడం? సోది ఆపి, గంగమ్మ గారి గౌడి గేదె సీరియల్ పెట్టండి,” అంటూ.
నేనూ అప్రయత్నంగా నిట్టూర్చాను.

------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681


No comments:

Post a Comment

Address for Communication

Address card