Sunday, May 27, 2018

‘లింకన్’ అంతర్యుద్ధాన్ని ఆపలేకపోయాడు. ‘గాంధీజీ’ దేశవిభజనని నివారించలేకపోయాడు. కాని ‘మండేలా’ అవిభక్త దక్షిణాఫ్రికాని సాధించగలిగాడు







‘ఎమోషనల్ ఇంటెలిజెన్స్’ అనే అంశం మీద వెతుకుతూ   Invictus అనే సినిమానుంచి కొన్ని క్లిప్పులు చూశా. కొన్ని నెలల కిందట. ఇన్విక్టస్ పూర్తి సినిమా వెంటనే చూడాలన్న కుతూహలం కలిగింది. కానీ అనుకోకుండా  నిన్న రాత్రి  యుట్యూబ్ లో మొత్తం సినిమా చూసాను. అది మీరంతా కూడా చూస్తే బావుంటుందనిపించింది.

Invictus (2009)క్లింట్ ఈస్ట్ వుడ్ నిర్మించి దర్శకత్వం వహించిన సినిమా. నెల్సన్ మండేలా (1918-2013)జీవితంలోని కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా తీసిన సినిమా. మేధావులు ఆ సినిమాని well scripted movie అన్నారు. నాకు ఆ స్క్రిప్టు  ఎంతగా నచ్చిందంటే,  leadership మీద పాఠాలు చెప్పడం కోసమే క్లింట్ ఈస్ట్ వుడ్ ఆ సినిమా తీసాడా అన్నంతగా.

సినిమాలో ఇతివృత్తం చాలా సరళం. మండేలా దక్షిణాఫ్రికాకి ప్రజాస్వామికంగా తొలి అధ్యక్షుడిగా ఎన్నికయ్యేటప్పటికి, దక్షిణాఫ్రికా చరిత్ర ఆ కొత్త జాతీయరాజ్యాన్ని భయపెడుతూ ఉంది. గత అనుభవాల వల్ల, కొన్ని శతాబ్దాలుగా శ్వేతజాతీయులు పాటించిన వర్ణవివక్షవల్ల నల్లజాతివాళ్ళు ప్రతీకారేచ్ఛతో రగిలిపోతూ ఉన్నారు. పొరుగు ఆఫ్రికా దేశాల్లో, మొజాంబిక్, జింబాబ్వేల్లో సంభవించినట్టుగా తమమీద కూడా ఊచకోత మొదలవుతుందని తెల్లవాళ్ళు భయభ్రాంతులై ఉన్నారు. విమోచన పొందిన వెంటనే తక్కిన ఆఫ్రికా దేశాల్లో జరిగినట్టే దక్షిణాఫ్రికా లో కూడా అంతర్యుద్ధం సంభవించకతప్పదనే ప్రపంచమంతా భావిస్తూ ఉన్న సమయం.

శ్వేతజాతి ఒక నల్లవాడిమీద చెయ్యగల అత్యాచారానికి మండేలా ఒక పూర్తి ఉదాహరణ. 27 సంవత్సరాల తరుణజీవితాన్ని చిన్న జైలుగదిలో గడపవలసివచ్చిన అనుభవం అతడిది. అందుకతడు ఎటువంటి ప్రతీకారం తీర్చుకున్నా ఎవరూ అతడిని తప్పుపట్టలేరు. కాని సరిగ్గా ఆ క్షణంలోనే, ఆ కీలక ఘట్టంలోనే తన దేశమొక ఇంద్రచాపదేశం కావాలనీ, నల్లవాళ్ళూ,తెల్లవాళ్ళూ అన్న భేదం లేకుండా, దక్షిణాఫ్రికా అనే ఒక నవజాతీయరాజ్యం అవతరించాలనీ మండేలా కోరుకున్నాడు. అందుకు గతాన్ని మర్చిపోవడమొక్కటే మార్గమని నమ్మాడు. నిన్నటిదాక తన శత్రువుగా ఉన్న మనిషిని క్షమిస్తే తప్ప నేడతడు తన సోదరుడిగా మారడనీ, క్రీస్తు చెప్పిన reconciliation నిజంగా ఆచరణలో పెట్టవలసిన సమయమొచ్చిందనీ ఆయన విశ్వసించాడు.

అటువంటి సమయంలో తనకి ఏ అవకాశం దొరికితే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. అట్లాంటి ఒక అవకాశాల్లో 1995 లో జరిగిన ప్రపంచ కప్ రగ్బీ మాచ్ కూడ ఒకటి. రగ్బీ ఆట ద్వారా ఆయన కేవలం ఒక రాజకీయ పరిష్కారమే కాదు, సినిమాలో తన కార్యదర్శి బ్రెందా తో చెప్పినట్టుగా 'ఒక మానవీయ పరిష్కారాన్ని 'కూడా రాబట్టాడాయన.

సినిమా చూస్తున్నంతసేపూ మనకి గాంధీ, అబ్రహాం లింకన్ వంటి నాయకులు గుర్తొస్తూ ఉంటారు.కాని మరో విషయం కూడా స్ఫురిస్తూ ఉంటుంది. లింకన్ అంతర్యుద్ధాన్ని ఆపలేకపోయాడు. గాంధీజీ దేశవిభజనని నివారించలేకపోయాడు. కాని మండేలా అవిభక్త దక్షిణాఫ్రికాని సాధించగలిగాడు, నిలబెట్టగలిగాడు. ఈ సాఫల్యం బహుశా కాలగతిలో మానవజాతి సాధించుకోగలిగిన మానసిక పరిణతి అనుకోవలసి ఉంటుంది.

 ఎదో పుస్తకంలో ఒక రచయత( పేరు గుర్తులేదు)  నాయకత్వంలో అయిదు స్థాయిలుంటాయని చెప్తూ, మండేలాని level 5 నాయకత్వానికి ఒక పాఠ్యగ్రంథంలాంటి ఉదాహరణగా పేర్కొన్నాడు. మొదటిస్థాయి నాయకుడు తనవరకూ తన పనితాను బాగాచేసుకుపోతాడనీ, రెండవస్థాయి నాయకుడు నలుగురితోనూ బాగా పనిచేయించగలడనీ, మూడవస్థాయినాయకుడు వనరుల కోసం చింతిస్తూ కూర్చోడనీ, అతడు తనకు తనే ఒక పెద్ద వనరుగా మారతాడనీ చెప్తూ, ప్రధానంగా నాలుగువ స్థాయి, అయిదవస్థాయి నాయకుల్ని పోల్చి చెప్పాడు. నాలుగవస్థాయి నాయకులు సాధారణంగా నాయకులుగా ప్రపంచమంతా కీర్తించే నాయకులనీ, పత్రికల ముఖచిత్రాలుగా, ఇంటర్వ్యూలకోసం ప్రపంచం ఎగబడే నాయకులనీ, కాని వాళ్ళతో సమస్య, వాళ్ళు పక్కకు తప్పుకోగానే వాళ్ళు అంతదాకా నిర్మించిన వ్యవస్థలు కుప్పకూలిపోతాయనీ, కాని అయిదవ స్థాయి నాయకులు పక్కకు తప్పుకున్నా కూడా వాళ్ళు నిర్మించిన వ్యవస్థలు చెక్కుచెదరవనీ అన్నాడు.

Invictus చూడండి.( యుట్యూబ్ లో దొరుకుతుంది)మీ పిల్లలతో, లేదా మీ మిత్రులతో. చూసాక చర్చించండి, మండేలా లోని నాయకత్వలక్షణాలు, వివేకం, దూరదృష్టి, దేశప్రేమ, మానవీయత - ఆ సినిమా జరుగుతున్నంతసేపు దర్శకుడు ఆ పాత్రని ఎట్లా ఆవిష్కరించాడో గుర్తుపట్టండి, నాతో కూడా పంచుకోవాలనుకుంటే, మీ అభిప్రాయాలు పోస్ట్ చెయ్యండి.

------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

No comments:

Post a Comment

Address for Communication

Address card