Tuesday, October 28, 2014

హిట్లర్ ఎలా చనిపోయాడు?

హిట్లర్ ఎలా చనిపోయాడన్న విషయంపై చాలా కాలం వరకు చర్చోపచర్చలు నడిచాయి. అసలు ఆయన అందరూ చెబుతున్నట్లు ఆత్మహత్య చేసుకున్నాడా లేదా అన్నది ఒక అనుమానం. ఆత్మహత్య చేసుకుంటే విషం మింగి చనిపోయాడా లేక తుపాకితో కాల్చుకుని చనిపోయాడా అన్నది మరో అనుమానం.
బెర్లిన్ నగరాన్ని చుట్టుముట్టి స్వాధీనం చేసుకున్నది సోవియట్ సేనలే. హిట్లర్ సామ్రాజ్య పతనం గ్యారంటీ అని అర్ధం అయ్యాక పశ్చిమ రాజ్యాలు, సోవియట్ యూనియన్ మధ్య హిట్లర్ సామ్రాజ్యంలో సాధ్యమైనంత ఎక్కువ భాగాన్ని వశం చేసుకోవాలన్న పోటీ అంతర్గతంగా నడిచింది. సోవియట్ ఆధీనంలోకి ఎంత ఎక్కువ ప్రాంతం/దేశాలు వెళ్తే ఎర్ర ప్రమాదాన్ని అంత ఎక్కువ ఎదుర్కోవలసి వస్తుందని పశ్చిమ రాజ్యాలు భయపడ్డాయి. వారి భయం నిజం కూడా.
ఈ నేపధ్యంలో ఒకవైపు పశ్చిమ దిశ నుండి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ లు జర్మనీని ఆక్రమించుకోగా, తూర్పు దిశ నుండి సోవియట్ యూనియన్ ఆక్రమించుకుంది. ఆ విధంగా తూర్పు జర్మనీ సోవియట్ యూనియన్ ఆధీనంలోకి వెళ్ళగా మిగిలిన భాగాన్ని అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ లు తలా ముక్కా పంచుకున్నాయి. అనంతరం ఓ పదిహేనేళ్ళ తర్వాత అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ లు ఒక ఒప్పందానికి వచ్చి తమ మూడు భాగాలను ఐక్యం చేసి పశ్చిమ జర్మనీని ఏర్పాటు చేశాయి.
జర్మనీ పతనానికి ముందు ఇటలీ నియంత ముసోలిని ని స్ధానిక (మిలన్) ప్రజలు దాడి చేసి పట్టుకున్నారు. జర్మనీ సైన్యంతో కలిసి జర్మనీ సైనికుల యూనిఫారం ముసుగులో పారిపోతుండగా ముసోలినిని పట్టుకున్నారు. ఇటలీ కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం ఆదేశాల మేరకు ముసోలిని, అతని భార్యలను కాల్చి చంపగా జనం వారి శవాలను మిలన్ నగరంలో ఓ బహిరంగ ప్రదేశంలో తాళ్ళకు కట్టి తలకిందులుగా వేలాడదీశారు. వేలాడదీసిన శవాలను కూడా వదలకుండా జనం ఇష్టం వచ్చినట్లు కొట్టి, తన్ని, లాగి, పీకి దాదాపు ఆనవాళ్ళు లేకుండా చేశారు. చివరికి అధికారులు, సైనికులే వారిని నియంత్రించవలసి వచ్చింది.
ఏప్రిల్ 28, 1945 తేదీన ముసోలిని దంపతులను కాల్చి చంపగా ఏప్రిల్ 29 తేదీన వారి శవాలను వేలాడదీసి ఇష్టం వచ్చినట్లు కొట్టిన సంఘటన జరిగింది. ఈ సమాచారం హిట్లర్ కు చేరింది. తన పరిస్ధితి కూడా అదే అవుతుందని హిట్లర్ భావించాడు. శత్రువుకు పట్టుబడడం జరగనే కూడదని శపధం చేశాడు.
అనుకున్నట్లే హిట్లర్ తన నిర్ణయాన్ని తన సహచరులకు తెలిపాడు. చనిపోవడానికి 40 గంటల ముందు తన ఫియాన్సే ఇవా బ్రౌన్ ను పెళ్లి చేసుకున్నాడు. ఏ విధంగా ఆత్మహత్య చేసుకుంటే చావు గ్యారంటీగా సంభవిస్తుందో తన వ్యక్తిగత వైద్యుడిని అడిగి తెలుసుకున్నాడు. సైనైడ్ మింగడం మంచిదన్న ఇతరుల సలహాపై అనుమానం వ్యక్తం చేశాడు. (సైనైడ్ మింగి అనుకున్నట్లు చనిపోకపోతే తనను శత్రువుకు అప్పగించాలని చూస్తున్నట్లుగా హిట్లర్ అనుమానించాడు). సైనైడ్ మింగి ఆ తర్వాత తుపాకితో కాల్చుకొమ్మని డాక్టర్ సలహా ఇచ్చాడు.
ఏప్రిల్ 30 తేదీన సాయంత్రం 3 గంటలకు బెర్లిన్ లో ఛాన్సలర్ భవనం కింద బంకర్ లోని తన స్టడీ రూం లోకి భార్యతో సహా వెళ్ళి తలుపు వేసుకున్నాడు. కొద్ది సేపటికి తుపాకి పేలిన శబ్దం వినిపించింది. సహచర సైనికాధికారులు తలుపు తెరిచి చూడగా ఇవా బ్రౌన్ పక్కకు వాలిపోయి చనిపోయి ఉండగా, హిట్లర్ తల ముందుకు వాలి ఉందని అతని తలకు ఒక పక్క నుండి రక్తం కారుతోందని చూసినవారు చెప్పినట్లుగా సమాచారం. గదిలోకి వెళ్ళినవెంటనే సైనైడ్ వాసన ఘాటుగా తగిలిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పిన సమాచారం వ్యాప్తిలో ఉంది.
హిట్లర్ చనిపోయాక ఆయన ముందు ఇచ్చిన ఆదేశాల ప్రకారం బంకర్ నుండి పైకి తెచ్చి భవనంలో ఒక చోట బాంబు దాడి వల్ల కలిగిన గోతిలో వేసి కాల్చారు. హిట్లర్, ఇవా బ్రౌన్ ల ఇద్దరి శవాలను పెట్రోలుతో తడిపి కాగితాలను కాల్చి ముట్టించారు. ఆ విధంగా హిట్లర్, ఇవాలు మరణించారు. అయితే వారిద్దరికి పోస్ట్ మార్టం చేయడానికి శవాలు మిగల్లేదు.
మొదటిసారి అక్కడికి చేరుకున్న సోవియట్ సేనలకు వారి దంతాలు మాత్రమే దొరికాయి. దానితో హిట్లర్ అసలు చనిపోలేదని, పశ్చిమ రాజ్యాల వైపుకి పారిపోయి వారి దగ్గర రక్షణ పొంది ఉండవచ్చని సోవియట్ నేతలు అనుమానించారు. వారి అనుమానమే హిట్లర్ మరణం చుట్టూ గోప్యత అల్లుకోవడానికి కారణం అయింది.
ఇంతకీ హిట్లర్, ఇవాలు నిజంగా చనిపోయారా లేక పారిపోయారా అన్నది ఇప్పటికీ నిర్ధారణగా తెలియదు. పశ్చిమ రాజ్యాలు, సోవియట్ యూనియన్ లు హిట్లర్ చనిపోయాడన్న ఏకాభిప్రాయానికి వచ్చినప్పటికీ భౌతిక రుజువులు మాత్రం ఇప్పటివరకు లేవు.
కింది ఫోటోలు ముసోలిని మరణంకు సంబంధించినవి. కుక్క చావు అంటే ఏమిటో తెలియని వారు ఈ ఫోటోలు చూస్తే తెలుసుకోవచ్చు. హిట్లర్ ఈ తరహా చావును తప్పించుకోగలిగాడు.
Photos: custermen.com
Mussolini death 03Mussolini death 04Hitler and Eva Braun
Mussolini death 02Mussolini death 07
Mussolini death 06Mussolini death 01Mussolini death 05
Mussolini death 08Mussolini death 10Mussolini death 09Mussolini death 11

No comments:

Post a Comment

Address for Communication

Address card