Thursday, October 30, 2014

కాంతిని ముడివేయడం వీలవుతుందా?

వండర్స్ ఆఫ్ సైన్స్
 కాంతిని ముడివేయడం వీలవుతుందా?  కాంతి వేగాన్ని మించి ప్రయాణించడం  కుదురుతుందా?  మెదడు నుంచి మెదడుకు సమాచార ప్రసారం జరిగే పనేనా?    నిన్నటి వరకూ ఇవన్నీ అసాధ్యాలు. కానీ నేడు సాధ్యం అయ్యాయి!  భవిష్యత్తులో ఇవి సుసాధ్యం అయితే గనక..  సైన్స్‌లో మరెన్నో అద్భుతాలు ఆవిష్కృతం కానున్నాయి!
 
విజ్ఞానశాస్త్రంలో ఎప్పుడు ఏ చిక్కుముడి వీడుతుందో ఎవరికీ తెలియదు. అసాధ్యం అనుకున్న పనులు అకస్మాత్తుగా జరిగిపోతాయి. ఊహకైనా అందని అద్భుతాలు కళ్ల ముందు చటుక్కున సాక్షాత్కరిస్తాయి. సైన్స్ చేసే మ్యాజిక్‌తో సాంకేతిక ప్రపంచం ఒక్కసారిగా కొత్త మలుపులు తిరుగుతుంది. ఎందుకంటే అసలు ఎప్పటికీ సాధ్యం కావని అనుకున్న అద్భుతాలు ఇటీవల జరిగిపోయాయి! వాటిలో కొన్ని అద్భుతాలు.. వాటివల్ల మనకు ఒనగూరే ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం...
 

కాంతి పుంజాలను ముడివేశారు!

మనకు తెలిసినంత వరకూ కాంతి కిరణాలు ఎల్లప్పుడూ నేరుగా సరళరేఖల్లోనే ప్రయాణిస్తాయి. వాటిని ముడివేయడం కాదు కదా కనీసం వంకరటింకరగా ప్రయాణించేలా కూడా చేయలేం. కానీ, బ్రిటన్‌లోని గ్లాస్గో, బ్రిస్టల్, సౌతాంప్టన్ యూనివర్సిటీల శాస్త్రవేత్తలు కాంతిని ముడి వేయగలిగారు! ఇంతవరకూ అసాధ్యం అయిన ఒక గణితశాస్త్ర ప్రతిపాదనగానే ఉన్న ఈ భావనను వారు నిజం చేశారు. ప్రత్యేకమైన 3డీ హోలోగ్రామ్ చిత్రాలను ఉపయోగించి వారు ఈ అద్భుతాన్ని సాధించారు. (ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో వాడిన టెక్నాలజీ ఇదే) ఇదే 3డీ హోలోగ్రామ్ టెక్నాలజీని కొద్దిగా మార్చిన బ్రిటన్ పరిశోధకులు కాంతి ప్రవాహాన్ని సైతం ప్రభావితం చేయగలిగారు. కాంతి అనేది నదిలాంటిదని, అది సుడులు కూడా తిరగగలదని వీరు అంటున్నారు. కాంతి పుంజపు హోలోగ్రామ్ రూపం తెలిస్తే.. మీరూ దానిని వంచేయగలరని  చెబుతున్నారు. దీనివల్ల ఉపయోగాలేంటంటే.. భవిష్యత్తులో కాంతితో ముడిపడిన అన్ని సాంకేతికతల్లోనూ విప్లవాత్మక మార్పులు వస్తాయట.
కాంతికన్నా 300 రెట్ల వేగం!

ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ సిద్ధాంతీకరించిన ప్రకారం విశ్వంలో కాంతిని మించిన వేగంతో ఏదీ ప్రయాణించలేదు. కానీ, అమెరికా, ప్రిన్స్‌టన్‌లోని ఎన్‌ఈసీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు ఈ నియమాన్ని ఉల్లంఘించి చూపారు. కాంతికిరణాలు సెకనుకు 1.86 లక్షల మైళ్లు ప్రయాణిస్తాయి. కానీ, ప్రత్యేక గ్యాస్ చాంబర్‌లో వీరు లేజర్ కిరణాలను ఏకంగా కాంతి కంటే 300 రెట్ల వేగంతో ప్రయాణించేలా చేయగలిగారు! అయితే, సైన్స్‌పరంగా కాంతివేగమే అత్యధికమని, కానీ కొన్ని పరిస్థితులు కల్పిస్తే ఆ నియమాన్ని ఉల్లంఘించవచ్చని వీరు వెల్లడించారు. ఉపయోగాలేంటంటే.. ఫైబర్ ఆప్టిక్ పద్ధతిలో కాంతిద్వారా ఇంటర్నెట్ ప్రసారాలు ఇదివరకే వాడకంలోకి వచ్చేశాయి. అదే కాంతి కన్నా వేగం పెరగడం అంటే.. కాంతి ద్వారా సమాచార ప్రసారాన్ని కూడా వేగవంతం చేయొచ్చన్నమాట. దీనితో పాటు కాంతితో సంబంధం ఉన్న అనేక పనులను ఇంకా వేగంగా చేసేందుకు భవిష్యత్తులో వీలవుతుంది.
 
 మెదడు నుంచి మెదడుకు సందేశం!


ఎదుటివారి మెదడులోని ఆలోచనలను చదవడం, ఒకరు ఆలోచిస్తే.. ఎక్కడో ఉన్న ఇంకొకరు ఆ ఆలోచనలను గ్రహించడం సాధ్యం అవుతుందా? కాదు. కానీ ప్రస్తుతానికి ఎలుకల్లో ఇది జరిగింది. బ్రెజిల్ శాస్త్రవేత్తల సాయంతో అమెరికాలోని డ్యూక్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దీనిని సాధించారు. వేలాది మైళ్ల దూరంలో ఉన్న రెండు ఎలుకల మధ్య టెలీపతీ(దూరసంవాదం) రూపంలో వీరు సమాచార ప్రసారం చేయగలిగారు. రెండు ఎలుకల మెదడుకు ఇంప్లాంట్లను అమర్చిన వీరు రెండింటి మధ్య ఇంటర్నెట్ ద్వారా మెదడు సంకేతాలను ప్రసారం చేశారు. దీంతో ఒక బోనులో మీటను నొక్కేలా శిక్షణ పొందిన ఎలుక ఆ మీటను నొక్కగానే, అవతల బోనులో ఉన్న ఎలుక ఎలాంటి శిక్షణ లేకుండానే నేరుగా ఆ మీటను నొక్కేసింది. మనిషి మెదడు సంకేతాలను కూడా సమర్థంగా అనువదిస్తే మనుషుల్లో కూడా టెలిపతీ అసాధ్యమేమీ కాదని వీరు అంటున్నారు.
 
ఒకే సమయంలో రెండు పనులు

 పరమాణువులో ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లే కాకుండా 12 ఉప పరమాణు కణాలు కూడా ఉంటాయి. అయితే ఈ ఉప పరమాణు కణాలను అత్యంత సూక్ష్మంగా క్వాంటమ్ స్థాయిలో ప్రభావితం చెందిస్తే పదార్థాలు చిత్రవిచిత్రాలు చేస్తాయట. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాంటా బార్బారా పరిశోధకులు ఇదే నిరూపించారు. ఓ చిన్న లోహపు ముక్కను ఒక డిగ్రీలో కోట్ల వంతు చల్లబర్చి, దానికి క్వాంటమ్ సర్క్యూట్‌ను తాకించి తిరిగి తీసివేయడం ద్వారా ఒకేసారి ఆ లోహపుముక్క సగం కదిలి, సగం కదలకుండా ఉండిపోయేలా చేశారు. వీరి ఆవిష్కరణ క్వాంటమ్ మెకానిక్స్‌లో విప్లవాత్మక మార్పులకు, మానవాళి వింత కోరికలను నెరవేర్చేందుకు ఉపయోగపడుతుందని ‘సైన్స్’ మేగజైన్ కితాబునిచ్చింది.
 
వ్యతిరేక పదార్థం   తయారీ!

విశ్వంలో కంటికి కనిపించే పదార్థంతో పాటు కనిపించని వ్యతిరేక పదార్థం(యాంటీ మ్యాటర్) కూడా ఉందని అంచనా. అయితే విశ్వంలోని యాంటీ మ్యాటర్ సంగతి పెద్దగా తేలకపోయినా, ప్రయోగశాలలో మాత్రం శాస్త్రవే త్తలు వ్యతిరేక పదార్థాన్ని సృష్టించి, అది నిలకడగా ఉండేలా చేయగలిగారు. వ్యతిరేక పదార్థాన్ని దశాబ్దం క్రితమే తయారు చేసినా, దానిని బలమైన అయస్కాంత క్షేత్రం లోపల నిల్వ చేయడంలో సెర్న్ శాస్త్రవేత్తల బృందం విజయం సాధించింది. ప్రస్తుతం అయస్కాంత క్షేత్రం వల్ల ఇందులోని యాంటీ మ్యాటర్‌పై పరిశోధనలకు అడ్డంకి ఏర్పడుతోంది. ఈ అడ్డంకి తొలగితే గనక.. భవిష్యత్తులో మ్యాటర్/యాంటీ మ్యాటర్ రియాక్టర్లను తయారు చేయవచ్చని, సహజ ఇంధన వనరులు తరిగిపోయినా ఈ రియాక్టర్లతో ప్రపంచానికంతటికీ ఇంధన అవసరాలు తీర్చవచ్చని అంటున్నారు.

No comments:

Post a Comment

Address for Communication

Address card