Tuesday, October 28, 2014

డబ్బు ఎలా ఏర్పడింది? -ఈనాడు

డబ్బు విషయంలో కొద్దిమంది సంతృప్తిగా ఉన్నప్పటికీ అనేకమంది అసంతృప్తి ప్రకటిస్తుంటారు. జీవితంలో ఏదో ఒక క్షణంలో డబ్బుని కనిపెట్టినవాడిని పట్టుకుని తన్నాలనిపించే ఆలోచన కలిగే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి డబ్బు గురించి ఈ రోజు ఈనాడు పత్రికలో చర్చించబడింది.
డబ్బు అంటే మనకు తెలిసింది నోట్ల కట్టలు, నాణేలు మాత్రమే. డి.డిలు, చెక్కులు, ప్రామిసరీ నోట్లు, ట్రెజరీ బిల్లులు లేదా బాండ్లు (వీటిని సావరిన్ బాండ్లు లేదా సార్వభౌమ ఋణ పత్రాలు అంటారు), బ్యాంకులు పోస్టాఫీసులు జారీ చేసే వివిధ బాండ్లు, ఫిక్సుడ్ డిపాజిట్ బాండ్లు, సెక్యూరిటీలు… మొదలైనవన్నీ కూడా డబ్బుకు వివిధ రూపాలే. వీటన్నిటినీ కలిపి విస్తృత అర్ధంలో ద్రవ్యం అని అంటారు. ద్రవ్యం అన్న పదాన్ని విస్తృతార్ధంలో వాడితే డబ్బు అన్న పదాన్ని కరెన్సీని సూచించే narrow అర్ధంలో వాడుతారు.
కరెన్సీ నోట్లను ఆర్.బి.ఐ ముద్రిస్తుంది. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే కరెన్సీ అంటే వాస్తవానికి రూపాయి నోటు మాత్రమే. మిగిలిన నోట్లన్నీ ప్రామిసరీ నోట్లు. రూపాయి నోటు వరకు కేంద్ర ప్రభుత్వం ముద్రిస్తుంది. రూపాయి కరెన్సీ నోటు తప్ప మిగిలిన నోట్లకు ఆర్.బి.ఐ గవర్నర్ బాధ్యత వహిస్తారు. అందువలన ఈ నోట్లపై ‘ఐ ప్రామిస్ టు పే’ అన్న ప్రామిస్ తో గవర్నర్ సంతకం ఉంటుంది. రూపాయి నోటుపైన మాత్రం గవర్నర్ సంతకం ఉండదు.
ఈ తేడా ఎందుకంటే కాయినేజి చట్టం – 1906 కింద రూపాయి నోటుని ముద్రించే హక్కు కేంద్ర ప్రభుత్వానికి సంక్రమించింది. రూపాయి అనేది భారత దేశం యొక్క ప్రాధమిక కరెన్సీ. అందువలన అది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. మిగిలిన డినామినేషన్ తో కూడిన నోట్లన్నీ కేంద్ర ప్రభుత్వం యొక్క కరెన్సీ అధికారం తరపున ఆర్.బి.ఐ బాధ్యత వహిస్తూ ప్రామిసరీ నోట్లుగా జారీ చేస్తుంది. రూపాయి కరెన్సీ అయితే మిగిలిన నోట్లు దానికి ప్రతిబింబాలు అన్నమాట. ప్రామిసరీ నోటు ద్వారా దానిపై ఎంత అంకె ఉంటే అన్ని (రూపాయి) కరెన్సీ నోట్ల విలువ చెల్లిస్తున్నట్లుగా బేరర్ కు ఆర్.బి.ఐ హామీ ఇస్తుంది.
నాణేలు కూడా కరెన్సీయే. అవి ఆ విలువకు సమానమైన లోహంతో తయారు చేస్తారు. కనుక వాటి విలువ నిజమైనది. రూపాయికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించే కరెన్సీ కనుక అది లోహం కాకపోయినా తన విలువను వ్యక్తం చేస్తుంది. అది కేంద్ర ప్రభుత్వం మోసే లయబిలిటీ. అలాగే నాణేలన్నింటిని ముద్రించే అధికారం కేవలం కేంద్ర ప్రభుత్వానికే ఉంటుంది. ముద్రించడం కేంద్ర ప్రభుత్వమే ముద్రించినా చెలామణిలోకి రావడం మాత్రం ఆర్.బి.ఐ ద్వారానే వస్తుంది. కాయినేజి చట్టం ప్రకారం 1000 రూపాయల వరకు నాణేలను ముద్రించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది.
కేంద్ర ప్రభుత్వ నాణేల ముద్రణా కేంద్రాలు నాలుగు చోట్ల ఉన్నాయి. అవి: ముంబై, అలిపూర్ (కోల్ కతా), సైఫాబాద్ (హైద్రాబాద్, చెర్లపల్లి (హైద్రాబాద్). అనగా మన రాష్ట్రంలో, సారీ, తెలంగాణ రాష్ట్రంలోనే రెండు నాణేల ముద్రణా కేంద్రాలు ఉన్నాయి. 50 పై.లు అంతకు లోపు నాణేలను స్మాల్ కాయిన్స్ అంటారు. రూపాయి అంతకు ఎక్కువ విలువ నాణేలను రుపీ కాయిన్ లు అంటారు. 
డబ్బుకు సంబంధించి ఇతర అంశాలను ఈనాడు ఆర్టికల్ లో చూడగలరు. ఆర్టికల్ ను నేరుగా ఈనాడు వెబ్ సైట్ లో చూడాలనుకుంటే కింది లింక్ ను క్లిక్ చేయండి. ఈ లింకు వచ్చే ఆదివారం వరకు మాత్రమే పని చేస్తుందని మరవొద్దు.
ఆర్టికల్ ను పి.డి.ఎఫ్ రూపంలో చూడడం కోసం కింది బొమ్మపైన క్లిక్ చేయండి. డౌన్ లోడింగ్ కోసం రైట్ క్లిక్ చేయండి.
Eenadu - 27.10.2014

No comments:

Post a Comment

Address for Communication

Address card