ఇదివరకే పడివున్న అక్షరాల అడుగుజాడలలో తడబడుతూ నడుస్తూండేవే నీవీ నావీ, ఇంకా మనలాంటి వాళ్ళవే అందరివీ, జ్ఞాపకాలు.
Wednesday, July 11, 2018
Tuesday, July 10, 2018
‘ఆకుపచ్చ’ విధ్వంస ప్రకంపన కేంద్రాలు
దేశంలో నేల మీదా
దాని నేల పొరల కింద వున్న ఖనిజాల మీదా మల్టీ నేషనల్స్ కన్ను పడ్డాకా వాటికి
దళారులుగా వున్న దేశీయ పాలకులకి భూమి
నుంచి భూమిపుత్రుని తొలగించే
కార్యక్రమంలో తొలి అడుగు అభివృద్ధి మంత్రం. పాత రోజుల్లో దశాబ్దాలుగా దోపిడీ
భూమిపుత్రుని అడవి లోతట్టుకి తరిమితే , ఆ తర్వాత సంక్షేమ పథకాలు అడవి అంచుకు తెచ్చాయి. ఇప్పుడు భూమిపుత్రులు
అభివృద్ధి వలలో విలవిలలాడుతున్నారు. బలవంతంగా నిర్వాసితులవుతున్నారు. ఒక చోట పవర్
ప్రాజెక్టు. మరో చోట యినుం కోసమో బాక్సైట్ కోసమో మైనింగ్. ఇంకోచోట భారీ ఆనకట్టలు.
అడుగడుగునా ప్రత్యేక ఆర్ధిక మండళ్ళు … భూమిపుత్రుని నిలబడ్డ సొంత నేలనుంచి తరిమి కొట్టడానికి వెయ్యినొక్క పద్ధతులు.
సామాజిక సంపదని ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టడానికి వంద యెత్తుగడలు. పెసా ,
1/70 వంటి చట్టాల్ని
నిర్వీర్యం చేసే కుట్రలు. ఖాకీ నీడలో తుపాకి మొనమీద బలవంతపు ప్రజాభిప్రాయ సేకరణలు.
భూ దురాక్రమణలు. అడుగడుగునా మానవ హక్కుల వుల్లంఘన. కొత్త శతాబ్దంలో యీ ప్రక్రియ
వేగవంతమైంది. వ్యవస్థీకృతమైంది. కాదంటే క్రూర హింస జడలు విప్పుకుంటుంది.
సాంస్కృతిక దాడి, దొంగ సంక్షేమ
పథకాలు, పోలీసు మిలటరీ
చర్యలు – వ్యూహం
త్రిముఖంగా అమలవుతోంది. అదేంటో యుగ యుగాలుగా యే దేశంలోనైనా అభివృద్ధి యజ్ఞంలో తొలి
బలి పశువు భూమిపుత్రులే. పురాణ కాలం నాటి ఖాండవ దహనం దగ్గరనుంచి యివాళ్టి
దండకారణ్యం వరకూ ‘ఆకుపచ్చ’ విధ్వంస ప్రకంపన కేంద్రాలు (epicenters)
యెప్పుడూ భూమిపుత్రుల
ఆవాసాలే.
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
Monday, July 09, 2018
భూమి బిడ్డ
’చీకటంతటినీ రెండు
మూటలుగా కట్టి
కావిడి చేసి
భుజానికెత్తుకున్నట్టు …పట్టి
కష్టాల కావిడితో, బక్కచిక్కిన ఒళ్లునీ
దోసిళ్ళు చేసి రెండు
కళ్ళనీ
షావుకారి జేబువైపు చూస్తూ …ఓరగా
చీకటీ దు:ఖం కలిసి కంట్లోచి... ధారగా …
ఊరు చీకటి ఊయలలో
వూగుతోంది … ,
గడపల్లో నిన్నాగిపోయిన సీరియల్ సాగుతోంది
పొద్దు కొండ మీద
అలుపు తీర్చుకుంటోంది ,
నిత్య పురాతన గీతంలా గెడ్డ
దైన్యం దాచుకున్న
భూమి బిడ్డ
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
Saturday, July 07, 2018
రైతులే ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు (part-2)
యూపీఏ ప్రభుత్వం
కానీ, ఎన్‌డీఏ
ప్రభుత్వం కానీ వ్యవసాయ రంగానికి కేటాయింపులను క్రమంగా తగ్గించివేయడం మరో రైతు
వ్యతిరేక చర్య. ''స్థూలజాతీయ
ఉత్పత్తిలో వ్యవసాయ రంగానికి కేటాయింపులు వాజ్ పేయీ నాయకత్వంలోని ఎన్‌డీఏ
ప్రభుత్వం అధికారంలోకి రాకముందు 35శాతం ఉండేవి.
దానిని ఎన్‌డీఏ ప్రభుత్వం 22శాతానికి
తగ్గించింది. తర్వాత మన్మోహన్‌సింగ్ నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన యూపీఏ
ప్రభుత్వం ఆ కేటాయింపుల్ని 18శాతానికి
తగ్గించింది.'' ఏ రంగానికైనా
ప్రభుత్వం కేటాయింపులు తగ్గించడం అంటే దాని గొంతు కోయడమేగా? (కానీ మోడీ 2018 బడ్జెట్లో 38% కేటాయింపు చేసారు దీనిలో
ఉన్న మతలబ్ ఈ వ్యాసంలో ఆఖరున మాట్లాడుకుందాం)
బాధాకరమైన మరో
చర్య ఏమిటంటే, మన రైతుల దగ్గర
కనీస ధరకు ధాన్యం కొనకుండా, విదేశీ రైతులకు
అంతకంటే ఎక్కువ ధరలిచ్చి ధాన్యాన్ని దిగుమతి చేసుకోవడం. ఉదాహరణకు ''2006-07లో పంజాబ్, హర్యానాలలోని రైతుల దగ్గర ప్రభుత్వం గోధుమలను
ఒక కేజీ రూ.7 చొప్పున
కొన్నది. అంతకంటే ఎక్కువ చెల్లించనన్నది. కానీ అదే సంవత్సరం విదేశీ కంపెనీల దగ్గర
కేజీ రూ.9.26పై చొప్పున 60 లక్షల టన్నుల గోధుమలను కొని, దిగుమతి చేసుకున్నది. మరుసటి సంవత్సరం
దేశీయరైతుకు ఒక కేజీకి ప్రభుత్వం రూ.8.50పై మాత్రమే చెల్లించింది. కానీ విదేశీ కంపెనీలకు కేజీకి రూ.14.82పై చెల్లించించి. 10 లక్షల టన్నుల గోధుమలు దిగుమతి చేసుకున్నది.''
ఇక మోడీ
ప్రభుత్వం, రైతు వ్యతిరేక
చర్యలలో ఇంతక్రితం ఉన్న యూపీఏ, ఎన్‌డీఏ
ప్రభుత్వాలను మించిపోయింది. ఒకటి రెండు ఉదాహరణలు పరిశీలిద్దాం. 2017లో గోధుమ పంట చేతికొచ్చే వేళ కేంద్రంలోని
బీజేపీ ప్రభుత్వం గోధుమపై దిగుమతి సుంకాన్ని 25శాతం నుండి సున్నా శాతానికి తగ్గించివేసింది. ఈ
చర్య పెద్ద ఎత్తున గోధుమల దిగుమతికి అంటే 60లక్షల మెట్రిక్ టన్నుల దిగుమతికి కారణమైంది.
దానితో రైతులు గోధుమలు అమ్ముకునే వేళకు వాటి ధరలు తీవ్రంగా పడిపోయి, వారు చితికిపోయారు. విదేశీ కంపెనీలపై దిగుమతి
సుంకాన్ని పూర్తిగా ఎత్తివేయడం ఎంతటి భయంకరమైన రైతు వ్యతిరేకచర్య?
ఇంకో ఉదాహరణ
పరిశీలిద్దాం. ''2017లోనే దేశంలో
కాయధాన్యాల యొక్క ఉత్పత్తి 22.95 మిలియన్
మెట్రిక్ టన్నులు, ఇది మన దేశీయ
ఉత్పత్తిలో అత్యున్నత రికార్డు. ఈ కాయధాన్యాలు మన దేశ అవసరాలకు సరిపోతాయి. కానీ
కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది 66 లక్షల మెట్రిక్
టన్నుల కాయధాన్యాలను దిగుమతి చేసుకుంది; అదీ దిగుమతి సుంకం లేకుండా. దానితో కాయధాన్యాల ధరలు పడిపోయి, రైతుల వెన్నెముక విరిగింది.''
ఇక రైతుల పంటలకు
గిట్టుబాటు ధరల విషయంలో మోడీ ప్రభుత్వం మరింత మోసపూరితంగా వ్యవహరిస్తోంది. 2014 ఎన్నికల ప్రణాళికలో బీజేపీ తాము అధికారంలోకి
వస్తే పంట పండించేందుకు రైతులకయ్యే మొత్తం ఖర్చుపై 50శాతం లాభం పొందే విధంగా గిట్టుబాటు ధర
నిర్ణయిస్తామని ప్రకటించింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2015 ఏప్రిల్ 30న ప్రభుత్వం పార్లమెంటులో ఒక ప్రకటన చేసింది.
దానిలో ''వ్యవసాయోత్పత్తులకయ్యే
ఖర్చు కన్నా 50శాతం ఎక్కువగా
కనీస మద్దతు ధర నిర్ణయిస్తే మార్కెట్ వ్యవస్థ వక్రీకరించబడే అవకాశం ఉంది. కాబట్టి
అంతకనీస ధర నిర్ణయించలేము'' అని చెప్పింది.
ఇలా ఎన్నికల ముందు ఓమాట, ఎన్నికల తర్వాత
ఒక మాట చెప్పి ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోంది.
బీజేపీ
నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాలు కూడ రైతు వెన్నెముక విరవడంలో వెనకబడిలేవు.
ఉదాహరణకు మహారాష్ట్రలో 2016లో బ్రహ్మగిరి
హిల్స్ వద్ద డ్యామ్ నుండి, ద్రాక్షతోటలకు
అత్యవసరంగా నీరు కావలసిన పరిస్థితుల్లో, ఆ పంటకు నీరు వదలకుండా 1.3 టీఎంసీల నీటిని
కుంభమేళాకు మళ్ళించారు. దానివల్ల ద్రాక్షపంట పూర్తిగా నాశనమైంది. అక్కడి రైతులు
సర్వనాశనమైనారు.
చివరిదైనా
చిన్నదికాని విషయం.
అసలు
వ్యవసాయానికి ఇస్తున్న నిర్వచనాన్నే ఆర్థిక సంస్కరణవాదులు మార్చేశారు. వేర్‌హౌస్‌లు,
గోడౌన్లు, కోల్డ్ స్టోరేజీలు నిర్మించడం, ఫుడ్ ప్రొసెసింగ్ పరిశ్రమలు స్థాపించడం కూడా
వ్యవసాయ పనుల క్రిందికే మార్చేశారు. వాటి నిర్మాణానికి ఇచ్చే రుణాలను వ్యవసాయ
రుణాలుగా ప్రకటించారు. దాని కారణంగా ఒక్క సెంటు కూడా వ్యవసాయ భూమిలేని ముంబాయిలో
వ్యవసాయ మంటే ఏమిటో తెలియని టాటా కంపెనీ కొన్ని కోట్ల రూపాయల వ్యవసాయ రుణాన్ని
తీసుకోగలిగింది. ఆ డబ్బుతో అనేక కోల్డ్ స్టోరేజీలు కట్టింది. అలా ఆర్థిక సంస్కరణల
పేరు మీద ప్రభుత్వాలు వ్యవసాయ రుణాలను పక్కదారి పట్టించి, అసలైన వ్యవసాయదారులకు రుణాలు అందకుండా చేశాయి.
అందువలననే ''2000-2016 మధ్యలో పరిశ్రమల అధిపతులకు కోట్ల రూపాయలలో
ఇచ్చిన వ్యవసాయ రుణాల సంఖ్య పెరుగుతూ పోయింది. అదే సమయంలో చిన్న వ్యవసాయ దారులకు
రూ.25వేల కంటే తక్కువగా ఇచ్చిన
రుణాలు అంతకు ముందు కంటే సగానికి పడిపోయాయి.''
మోడీ 2018 బడ్జెట్లో 38%
కేటాయింపు ఎటు వెళ్లిందో మీకు అర్థం అయ్యి
వుంటుంది.
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
Friday, July 06, 2018
రైతులే ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు? ( PART-1)
ప్రభుత్వ లెక్కల
ప్రకారం 1991 నుండి, అంటే నూతన ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టిన నాటి
నుండీ ఇప్పటి వరకు 3,50,000మంది రైతులు దేశం
మొత్తం మీద ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పటికీ ప్రతిరోజూ పత్రికల్లో ఏదో ఒక మూల,
ఒకరిద్దరు రైతులు
ఆత్మహత్యలు చేసుకున్నట్టు వార్తలు చదువుతున్నాం. కానీ ఈ 27ఏండ్లలో ఏ పారిశ్రామిక వేత్తా ఆత్మహత్య
చేసుకున్నట్టు వార్తమనం వినలేదు. అంతవరకూ సంతోషమే. కానీ రైతులే ఎందుకు ఆత్మహత్యలు
చేసుకుంటున్నారు? ఈ ఆత్మహత్యలు
ఇంకా ఎందుకు కొనసాగుతున్నాయి? తెలుసుకుందాం.
నూతన ఆర్థిక
విధానాలు, లేక ఆర్థిక
సంస్కరణలంటే అన్నీ రైతు వ్యతిరేక చర్యలే. వాటన్నిటినీ సంక్షిప్తంగా పరిశీలిద్దాం.
మొదటి చర్యగా 1991లో ఆర్థిక
మంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ ఎరువులపై సబ్సిడీని క్రమంగా, కొద్దికొద్దిగా తగ్గించసాగారు. దానితో ఎరువుల
ధరలు క్రమంగా పెరిగసాగాయి అందువలన రైతులకు వాటి వినియోగాన్ని తగ్గించక తప్పలేదు.
ఎరువుల వినియోగం తగ్గిస్తే ఏమవుతుంది? పంట దిగుబడి పడిపోతుంది. సబ్సిడీల తగ్గింపులో భాగంగా మరొక ప్రమాదకరమైన చర్యను
ప్రభుత్వం చేపట్టింది. అదేమిటంటే, ఎన్‌పీకె ఎరువుల
వంటి పోషక ఎరువులపై సబ్సిడీని బాగా తగ్గించి, యూరియాపై సబ్సిడీని కొద్దిగా తగ్గించింది.
దానితో పోషక ఎరువుల ధరలు బాగా పెరిగి, యూరియా ధరలు కొద్దిగా పెరిగాయి. రైతులు తమకు అందుబాటు ధరల్లో ఉన్న యూరియాను
ఎక్కువగా వాడి పోషక ఎరువుల వినియోగాన్ని తగ్గించారు. దానివలన ఏమైంది? ''దానివలన భూమిలో నైట్రోజన్ బాగా పెరిగి,
పంట దిగుబడి విపరీతంగా
పడిపోయింది'' ఈ విషయాన్నే ఒక
వ్యవసాయ శాస్త్రజ్ఞుడు ఇలా వివరించారు. ''భారతదేశంలో సంస్కరణలకు ముందు ఆహార ధాన్యాల ఉత్పత్తి రేటు 2.8శాతం. గత ఎనిమిదేండ్లలో ఇది ఒక శాతానికి
పడిపోయింది.''
మరో ముఖ్యమైన
విషయం. స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో అప్పటి ప్రధాన మంత్రి నెహ్రూ ఏరంగంలోనైనా
ఉత్పత్తి తగ్గినా పరవాలేదు గానీ, ఆహారధాన్యాల
ఉత్పత్తి మాత్రం తగ్గకూడదని అనేవారు. దానికోసం ఆయన అనేక చర్యలు తీసుకున్నారు.
వాటిలో దేశమంతటా ఎరువుల పరిశ్రమల స్థాపన ఒకటి. కానీ సంస్కరణల పేరు మీద ఏం జరిగింది?
గోరక్‌పూర్, హాల్దియా, రామగుండంలలోని ఎరువుల పరిశ్రమలు
మూసివేయబడ్డాయి. అంతకంటే దారుణమైన విషయం ఏమిటంటే, ఒకప్రక్క మన ఎరువుల పరిశ్రమను మూసివే, రెండో ప్రక్క విదేశాల నుండి లక్షలాది టన్నుల
యూరియాను దిగుమతి చేసుకుంటున్నాం. ఉదాహరణకు 2018 JUNE నాటికి మనం 7.86 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను దిగుమతి చేసుకున్నాం. యూరియా,
రసాయనిక పోషక ఎరువులు
సమృద్ధిగా కావలసిన పరిస్థితుల్లో దేశీయ ఎరువుల పరిశ్రమను మూసివేసి లక్షల కోట్ల విదేశీ
మారకద్రవ్యాన్ని వృధా చేసి, రసాయనిక ఎరువును
దిగుమతి చేసుకోవడం ఎంత దేశద్రోహం?
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
Subscribe to:
Posts (Atom)
Address for Communication
-
దీపావళి అంటే దీపాల పంక్తి అని అర్థం – అందరికీ తెలిసినదే. కానీ , చిన్నారులు దీపావళి అంటే టపాసుల పండుగ అని అనుకున్నట్టే మధుపర్కం అ...
-
ఒకసారి పల్నాడు వెళ్లిన శ్రీనాధునికి మంచి నీళ్లు కావలసి వచ్చి తన ఇష్ట దైవం శివుణ్ణి ఇలా దబాయించాడట. సిరిగలవానికి చెల్లును తరుణులు పదియారు...
-
‘పనిలేని మంగలి పిల్లి తల గొరిగాడని’ సామెత, దీనివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఏ పనీ లేనివారు ప్రజల మెప్పుకోసం ఎవరికీ ...