Friday, July 06, 2018

రైతులే ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు? ( PART-1)




ప్రభుత్వ లెక్కల ప్రకారం 1991 నుండి, అంటే నూతన ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టిన నాటి నుండీ ఇప్పటి వరకు 3,50,000మంది రైతులు దేశం మొత్తం మీద ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పటికీ ప్రతిరోజూ పత్రికల్లో ఏదో ఒక మూల, ఒకరిద్దరు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు వార్తలు చదువుతున్నాం. కానీ ఈ 27ఏండ్లలో ఏ పారిశ్రామిక వేత్తా ఆత్మహత్య చేసుకున్నట్టు వార్తమనం వినలేదు. అంతవరకూ సంతోషమే. కానీ రైతులే ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? ఈ ఆత్మహత్యలు ఇంకా ఎందుకు కొనసాగుతున్నాయి? తెలుసుకుందాం.
నూతన ఆర్థిక విధానాలు, లేక ఆర్థిక సంస్కరణలంటే అన్నీ రైతు వ్యతిరేక చర్యలే. వాటన్నిటినీ సంక్షిప్తంగా పరిశీలిద్దాం. మొదటి చర్యగా 1991లో ఆర్థిక మంత్రిగా ఉన్న మన్మోహన్‌ సింగ్‌ ఎరువులపై సబ్సిడీని క్రమంగా, కొద్దికొద్దిగా తగ్గించసాగారు. దానితో ఎరువుల ధరలు క్రమంగా పెరిగసాగాయి అందువలన రైతులకు వాటి వినియోగాన్ని తగ్గించక తప్పలేదు. ఎరువుల వినియోగం తగ్గిస్తే ఏమవుతుంది? పంట దిగుబడి పడిపోతుంది. సబ్సిడీల తగ్గింపులో భాగంగా మరొక ప్రమాదకరమైన చర్యను ప్రభుత్వం చేపట్టింది. అదేమిటంటే, ఎన్‌పీకె ఎరువుల వంటి పోషక ఎరువులపై సబ్సిడీని బాగా తగ్గించి, యూరియాపై సబ్సిడీని కొద్దిగా తగ్గించింది. దానితో పోషక ఎరువుల ధరలు బాగా పెరిగి, యూరియా ధరలు కొద్దిగా పెరిగాయి. రైతులు తమకు అందుబాటు ధరల్లో ఉన్న యూరియాను ఎక్కువగా వాడి పోషక ఎరువుల వినియోగాన్ని తగ్గించారు. దానివలన ఏమైంది? ''దానివలన భూమిలో నైట్రోజన్‌ బాగా పెరిగి, పంట దిగుబడి విపరీతంగా పడిపోయింది'' ఈ విషయాన్నే ఒక వ్యవసాయ శాస్త్రజ్ఞుడు ఇలా వివరించారు. ''భారతదేశంలో సంస్కరణలకు ముందు ఆహార ధాన్యాల ఉత్పత్తి రేటు 2.8శాతం. గత ఎనిమిదేండ్లలో ఇది ఒక శాతానికి పడిపోయింది.''
మరో ముఖ్యమైన విషయం. స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో అప్పటి ప్రధాన మంత్రి నెహ్రూ ఏరంగంలోనైనా ఉత్పత్తి తగ్గినా పరవాలేదు గానీ, ఆహారధాన్యాల ఉత్పత్తి మాత్రం తగ్గకూడదని అనేవారు. దానికోసం ఆయన అనేక చర్యలు తీసుకున్నారు. వాటిలో దేశమంతటా ఎరువుల పరిశ్రమల స్థాపన ఒకటి. కానీ సంస్కరణల పేరు మీద ఏం జరిగింది? గోరక్‌పూర్‌, హాల్దియా, రామగుండంలలోని ఎరువుల పరిశ్రమలు మూసివేయబడ్డాయి. అంతకంటే దారుణమైన విషయం ఏమిటంటే, ఒకప్రక్క మన ఎరువుల పరిశ్రమను మూసివే, రెండో ప్రక్క విదేశాల నుండి లక్షలాది టన్నుల యూరియాను దిగుమతి చేసుకుంటున్నాం. ఉదాహరణకు 2018 JUNE నాటికి మనం 7.86 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను దిగుమతి చేసుకున్నాం. యూరియా, రసాయనిక పోషక ఎరువులు సమృద్ధిగా కావలసిన పరిస్థితుల్లో దేశీయ ఎరువుల పరిశ్రమను మూసివేసి లక్షల కోట్ల విదేశీ మారకద్రవ్యాన్ని వృధా చేసి, రసాయనిక ఎరువును దిగుమతి చేసుకోవడం ఎంత దేశద్రోహం?
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

No comments:

Post a Comment

Address for Communication

Address card