Tuesday, July 10, 2018

‘ఆకుపచ్చ’ విధ్వంస ప్రకంపన కేంద్రాలు




దేశంలో నేల మీదా దాని నేల పొరల కింద వున్న ఖనిజాల మీదా మల్టీ నేషనల్స్ కన్ను పడ్డాకా వాటికి దళారులుగా వున్న దేశీయ పాలకులకి భూమి  నుంచి భూమిపుత్రుని  తొలగించే కార్యక్రమంలో తొలి అడుగు అభివృద్ధి మంత్రం. పాత రోజుల్లో దశాబ్దాలుగా దోపిడీ భూమిపుత్రుని అడవి లోతట్టుకి తరిమితే , ఆ తర్వాత సంక్షేమ పథకాలు అడవి అంచుకు తెచ్చాయి. ఇప్పుడు భూమిపుత్రులు అభివృద్ధి వలలో విలవిలలాడుతున్నారు. బలవంతంగా నిర్వాసితులవుతున్నారు. ఒక చోట పవర్ ప్రాజెక్టు. మరో చోట యినుం కోసమో బాక్సైట్ కోసమో మైనింగ్. ఇంకోచోట భారీ ఆనకట్టలు. అడుగడుగునా ప్రత్యేక ఆర్ధిక మండళ్ళు భూమిపుత్రుని నిలబడ్డ సొంత నేలనుంచి తరిమి కొట్టడానికి వెయ్యినొక్క పద్ధతులు. సామాజిక సంపదని ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టడానికి వంద యెత్తుగడలు. పెసా , 1/70 వంటి చట్టాల్ని నిర్వీర్యం చేసే కుట్రలు. ఖాకీ నీడలో తుపాకి మొనమీద బలవంతపు ప్రజాభిప్రాయ సేకరణలు. భూ దురాక్రమణలు. అడుగడుగునా మానవ హక్కుల వుల్లంఘన. కొత్త శతాబ్దంలో యీ ప్రక్రియ వేగవంతమైంది. వ్యవస్థీకృతమైంది. కాదంటే క్రూర హింస జడలు విప్పుకుంటుంది. సాంస్కృతిక దాడి, దొంగ సంక్షేమ పథకాలు, పోలీసు మిలటరీ చర్యలు వ్యూహం త్రిముఖంగా అమలవుతోంది. అదేంటో యుగ యుగాలుగా యే దేశంలోనైనా అభివృద్ధి యజ్ఞంలో తొలి బలి పశువు భూమిపుత్రులే. పురాణ కాలం నాటి ఖాండవ దహనం దగ్గరనుంచి యివాళ్టి దండకారణ్యం వరకూ ఆకుపచ్చవిధ్వంస ప్రకంపన కేంద్రాలు (epicenters) యెప్పుడూ  భూమిపుత్రుల  ఆవాసాలే.

------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

No comments:

Post a Comment

Address for Communication

Address card