యూపీఏ ప్రభుత్వం
కానీ, ఎన్‌డీఏ
ప్రభుత్వం కానీ వ్యవసాయ రంగానికి కేటాయింపులను క్రమంగా తగ్గించివేయడం మరో రైతు
వ్యతిరేక చర్య. ''స్థూలజాతీయ
ఉత్పత్తిలో వ్యవసాయ రంగానికి కేటాయింపులు వాజ్ పేయీ నాయకత్వంలోని ఎన్‌డీఏ
ప్రభుత్వం అధికారంలోకి రాకముందు 35శాతం ఉండేవి.
దానిని ఎన్‌డీఏ ప్రభుత్వం 22శాతానికి
తగ్గించింది. తర్వాత మన్మోహన్‌సింగ్ నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన యూపీఏ
ప్రభుత్వం ఆ కేటాయింపుల్ని 18శాతానికి
తగ్గించింది.'' ఏ రంగానికైనా
ప్రభుత్వం కేటాయింపులు తగ్గించడం అంటే దాని గొంతు కోయడమేగా? (కానీ మోడీ 2018 బడ్జెట్లో 38% కేటాయింపు చేసారు దీనిలో
ఉన్న మతలబ్ ఈ వ్యాసంలో ఆఖరున మాట్లాడుకుందాం)
బాధాకరమైన మరో
చర్య ఏమిటంటే, మన రైతుల దగ్గర
కనీస ధరకు ధాన్యం కొనకుండా, విదేశీ రైతులకు
అంతకంటే ఎక్కువ ధరలిచ్చి ధాన్యాన్ని దిగుమతి చేసుకోవడం. ఉదాహరణకు ''2006-07లో పంజాబ్, హర్యానాలలోని రైతుల దగ్గర ప్రభుత్వం గోధుమలను
ఒక కేజీ రూ.7 చొప్పున
కొన్నది. అంతకంటే ఎక్కువ చెల్లించనన్నది. కానీ అదే సంవత్సరం విదేశీ కంపెనీల దగ్గర
కేజీ రూ.9.26పై చొప్పున 60 లక్షల టన్నుల గోధుమలను కొని, దిగుమతి చేసుకున్నది. మరుసటి సంవత్సరం
దేశీయరైతుకు ఒక కేజీకి ప్రభుత్వం రూ.8.50పై మాత్రమే చెల్లించింది. కానీ విదేశీ కంపెనీలకు కేజీకి రూ.14.82పై చెల్లించించి. 10 లక్షల టన్నుల గోధుమలు దిగుమతి చేసుకున్నది.''
ఇక మోడీ
ప్రభుత్వం, రైతు వ్యతిరేక
చర్యలలో ఇంతక్రితం ఉన్న యూపీఏ, ఎన్‌డీఏ
ప్రభుత్వాలను మించిపోయింది. ఒకటి రెండు ఉదాహరణలు పరిశీలిద్దాం. 2017లో గోధుమ పంట చేతికొచ్చే వేళ కేంద్రంలోని
బీజేపీ ప్రభుత్వం గోధుమపై దిగుమతి సుంకాన్ని 25శాతం నుండి సున్నా శాతానికి తగ్గించివేసింది. ఈ
చర్య పెద్ద ఎత్తున గోధుమల దిగుమతికి అంటే 60లక్షల మెట్రిక్ టన్నుల దిగుమతికి కారణమైంది.
దానితో రైతులు గోధుమలు అమ్ముకునే వేళకు వాటి ధరలు తీవ్రంగా పడిపోయి, వారు చితికిపోయారు. విదేశీ కంపెనీలపై దిగుమతి
సుంకాన్ని పూర్తిగా ఎత్తివేయడం ఎంతటి భయంకరమైన రైతు వ్యతిరేకచర్య?
ఇంకో ఉదాహరణ
పరిశీలిద్దాం. ''2017లోనే దేశంలో
కాయధాన్యాల యొక్క ఉత్పత్తి 22.95 మిలియన్
మెట్రిక్ టన్నులు, ఇది మన దేశీయ
ఉత్పత్తిలో అత్యున్నత రికార్డు. ఈ కాయధాన్యాలు మన దేశ అవసరాలకు సరిపోతాయి. కానీ
కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది 66 లక్షల మెట్రిక్
టన్నుల కాయధాన్యాలను దిగుమతి చేసుకుంది; అదీ దిగుమతి సుంకం లేకుండా. దానితో కాయధాన్యాల ధరలు పడిపోయి, రైతుల వెన్నెముక విరిగింది.''
ఇక రైతుల పంటలకు
గిట్టుబాటు ధరల విషయంలో మోడీ ప్రభుత్వం మరింత మోసపూరితంగా వ్యవహరిస్తోంది. 2014 ఎన్నికల ప్రణాళికలో బీజేపీ తాము అధికారంలోకి
వస్తే పంట పండించేందుకు రైతులకయ్యే మొత్తం ఖర్చుపై 50శాతం లాభం పొందే విధంగా గిట్టుబాటు ధర
నిర్ణయిస్తామని ప్రకటించింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2015 ఏప్రిల్ 30న ప్రభుత్వం పార్లమెంటులో ఒక ప్రకటన చేసింది.
దానిలో ''వ్యవసాయోత్పత్తులకయ్యే
ఖర్చు కన్నా 50శాతం ఎక్కువగా
కనీస మద్దతు ధర నిర్ణయిస్తే మార్కెట్ వ్యవస్థ వక్రీకరించబడే అవకాశం ఉంది. కాబట్టి
అంతకనీస ధర నిర్ణయించలేము'' అని చెప్పింది.
ఇలా ఎన్నికల ముందు ఓమాట, ఎన్నికల తర్వాత
ఒక మాట చెప్పి ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోంది.
బీజేపీ
నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాలు కూడ రైతు వెన్నెముక విరవడంలో వెనకబడిలేవు.
ఉదాహరణకు మహారాష్ట్రలో 2016లో బ్రహ్మగిరి
హిల్స్ వద్ద డ్యామ్ నుండి, ద్రాక్షతోటలకు
అత్యవసరంగా నీరు కావలసిన పరిస్థితుల్లో, ఆ పంటకు నీరు వదలకుండా 1.3 టీఎంసీల నీటిని
కుంభమేళాకు మళ్ళించారు. దానివల్ల ద్రాక్షపంట పూర్తిగా నాశనమైంది. అక్కడి రైతులు
సర్వనాశనమైనారు.
చివరిదైనా
చిన్నదికాని విషయం.
అసలు
వ్యవసాయానికి ఇస్తున్న నిర్వచనాన్నే ఆర్థిక సంస్కరణవాదులు మార్చేశారు. వేర్‌హౌస్‌లు,
గోడౌన్లు, కోల్డ్ స్టోరేజీలు నిర్మించడం, ఫుడ్ ప్రొసెసింగ్ పరిశ్రమలు స్థాపించడం కూడా
వ్యవసాయ పనుల క్రిందికే మార్చేశారు. వాటి నిర్మాణానికి ఇచ్చే రుణాలను వ్యవసాయ
రుణాలుగా ప్రకటించారు. దాని కారణంగా ఒక్క సెంటు కూడా వ్యవసాయ భూమిలేని ముంబాయిలో
వ్యవసాయ మంటే ఏమిటో తెలియని టాటా కంపెనీ కొన్ని కోట్ల రూపాయల వ్యవసాయ రుణాన్ని
తీసుకోగలిగింది. ఆ డబ్బుతో అనేక కోల్డ్ స్టోరేజీలు కట్టింది. అలా ఆర్థిక సంస్కరణల
పేరు మీద ప్రభుత్వాలు వ్యవసాయ రుణాలను పక్కదారి పట్టించి, అసలైన వ్యవసాయదారులకు రుణాలు అందకుండా చేశాయి.
అందువలననే ''2000-2016 మధ్యలో పరిశ్రమల అధిపతులకు కోట్ల రూపాయలలో
ఇచ్చిన వ్యవసాయ రుణాల సంఖ్య పెరుగుతూ పోయింది. అదే సమయంలో చిన్న వ్యవసాయ దారులకు
రూ.25వేల కంటే తక్కువగా ఇచ్చిన
రుణాలు అంతకు ముందు కంటే సగానికి పడిపోయాయి.''
మోడీ 2018 బడ్జెట్లో 38%
కేటాయింపు ఎటు వెళ్లిందో మీకు అర్థం అయ్యి
వుంటుంది.
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
No comments:
Post a Comment