Saturday, July 07, 2018

రైతులే ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు (part-2)




యూపీఏ ప్రభుత్వం కానీ, ఎన్‌డీఏ ప్రభుత్వం కానీ వ్యవసాయ రంగానికి కేటాయింపులను క్రమంగా తగ్గించివేయడం మరో రైతు వ్యతిరేక చర్య. ''స్థూలజాతీయ ఉత్పత్తిలో వ్యవసాయ రంగానికి కేటాయింపులు వాజ్ పేయీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు 35శాతం ఉండేవి. దానిని ఎన్‌డీఏ ప్రభుత్వం 22శాతానికి తగ్గించింది. తర్వాత మన్మోహన్‌సింగ్‌ నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన యూపీఏ ప్రభుత్వం ఆ కేటాయింపుల్ని 18శాతానికి తగ్గించింది.'' ఏ రంగానికైనా ప్రభుత్వం కేటాయింపులు తగ్గించడం అంటే దాని గొంతు కోయడమేగా? (కానీ మోడీ 2018 బడ్జెట్లో 38% కేటాయింపు చేసారు దీనిలో ఉన్న మతలబ్ ఈ వ్యాసంలో  ఆఖరున మాట్లాడుకుందాం)
బాధాకరమైన మరో చర్య ఏమిటంటే, మన రైతుల దగ్గర కనీస ధరకు ధాన్యం కొనకుండా, విదేశీ రైతులకు అంతకంటే ఎక్కువ ధరలిచ్చి ధాన్యాన్ని దిగుమతి చేసుకోవడం. ఉదాహరణకు ''2006-07లో పంజాబ్‌, హర్యానాలలోని రైతుల దగ్గర ప్రభుత్వం గోధుమలను ఒక కేజీ రూ.7 చొప్పున కొన్నది. అంతకంటే ఎక్కువ చెల్లించనన్నది. కానీ అదే సంవత్సరం విదేశీ కంపెనీల దగ్గర కేజీ రూ.9.26పై చొప్పున 60 లక్షల టన్నుల గోధుమలను కొని, దిగుమతి చేసుకున్నది. మరుసటి సంవత్సరం దేశీయరైతుకు ఒక కేజీకి ప్రభుత్వం రూ.8.50పై మాత్రమే చెల్లించింది. కానీ విదేశీ కంపెనీలకు కేజీకి రూ.14.82పై చెల్లించించి. 10 లక్షల టన్నుల గోధుమలు దిగుమతి చేసుకున్నది.''
ఇక మోడీ ప్రభుత్వం, రైతు వ్యతిరేక చర్యలలో ఇంతక్రితం ఉన్న యూపీఏ, ఎన్‌డీఏ ప్రభుత్వాలను మించిపోయింది. ఒకటి రెండు ఉదాహరణలు పరిశీలిద్దాం. 2017లో గోధుమ పంట చేతికొచ్చే వేళ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గోధుమపై దిగుమతి సుంకాన్ని 25శాతం నుండి సున్నా శాతానికి తగ్గించివేసింది. ఈ చర్య పెద్ద ఎత్తున గోధుమల దిగుమతికి అంటే 60లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుమతికి కారణమైంది. దానితో రైతులు గోధుమలు అమ్ముకునే వేళకు వాటి ధరలు తీవ్రంగా పడిపోయి, వారు చితికిపోయారు. విదేశీ కంపెనీలపై దిగుమతి సుంకాన్ని పూర్తిగా ఎత్తివేయడం ఎంతటి భయంకరమైన రైతు వ్యతిరేకచర్య?
ఇంకో ఉదాహరణ పరిశీలిద్దాం. ''2017లోనే దేశంలో కాయధాన్యాల యొక్క ఉత్పత్తి 22.95 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు, ఇది మన దేశీయ ఉత్పత్తిలో అత్యున్నత రికార్డు. ఈ కాయధాన్యాలు మన దేశ అవసరాలకు సరిపోతాయి. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది 66 లక్షల మెట్రిక్‌ టన్నుల కాయధాన్యాలను దిగుమతి చేసుకుంది; అదీ దిగుమతి సుంకం లేకుండా. దానితో కాయధాన్యాల ధరలు పడిపోయి, రైతుల వెన్నెముక విరిగింది.''
ఇక రైతుల పంటలకు గిట్టుబాటు ధరల విషయంలో మోడీ ప్రభుత్వం మరింత మోసపూరితంగా వ్యవహరిస్తోంది. 2014 ఎన్నికల ప్రణాళికలో బీజేపీ తాము అధికారంలోకి వస్తే పంట పండించేందుకు రైతులకయ్యే మొత్తం ఖర్చుపై 50శాతం లాభం పొందే విధంగా గిట్టుబాటు ధర నిర్ణయిస్తామని ప్రకటించింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2015 ఏప్రిల్‌ 30న ప్రభుత్వం పార్లమెంటులో ఒక ప్రకటన చేసింది. దానిలో ''వ్యవసాయోత్పత్తులకయ్యే ఖర్చు కన్నా 50శాతం ఎక్కువగా కనీస మద్దతు ధర నిర్ణయిస్తే మార్కెట్‌ వ్యవస్థ వక్రీకరించబడే అవకాశం ఉంది. కాబట్టి అంతకనీస ధర నిర్ణయించలేము'' అని చెప్పింది. ఇలా ఎన్నికల ముందు ఓమాట, ఎన్నికల తర్వాత ఒక మాట చెప్పి ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోంది.
బీజేపీ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాలు కూడ రైతు వెన్నెముక విరవడంలో వెనకబడిలేవు. ఉదాహరణకు మహారాష్ట్రలో 2016లో బ్రహ్మగిరి హిల్స్‌ వద్ద డ్యామ్‌ నుండి, ద్రాక్షతోటలకు అత్యవసరంగా నీరు కావలసిన పరిస్థితుల్లో, ఆ పంటకు నీరు వదలకుండా 1.3 టీఎంసీల నీటిని కుంభమేళాకు మళ్ళించారు. దానివల్ల ద్రాక్షపంట పూర్తిగా నాశనమైంది. అక్కడి రైతులు సర్వనాశనమైనారు.
చివరిదైనా చిన్నదికాని విషయం.
అసలు వ్యవసాయానికి ఇస్తున్న నిర్వచనాన్నే ఆర్థిక సంస్కరణవాదులు మార్చేశారు. వేర్‌హౌస్‌లు, గోడౌన్లు, కోల్డ్‌ స్టోరేజీలు నిర్మించడం, ఫుడ్‌ ప్రొసెసింగ్‌ పరిశ్రమలు స్థాపించడం కూడా వ్యవసాయ పనుల క్రిందికే మార్చేశారు. వాటి నిర్మాణానికి ఇచ్చే రుణాలను వ్యవసాయ రుణాలుగా ప్రకటించారు. దాని కారణంగా ఒక్క సెంటు కూడా వ్యవసాయ భూమిలేని ముంబాయిలో వ్యవసాయ మంటే ఏమిటో తెలియని టాటా కంపెనీ కొన్ని కోట్ల రూపాయల వ్యవసాయ రుణాన్ని తీసుకోగలిగింది. ఆ డబ్బుతో అనేక కోల్డ్‌ స్టోరేజీలు కట్టింది. అలా ఆర్థిక సంస్కరణల పేరు మీద ప్రభుత్వాలు వ్యవసాయ రుణాలను పక్కదారి పట్టించి, అసలైన వ్యవసాయదారులకు రుణాలు అందకుండా చేశాయి. అందువలననే ''2000-2016 మధ్యలో పరిశ్రమల అధిపతులకు కోట్ల రూపాయలలో ఇచ్చిన వ్యవసాయ రుణాల సంఖ్య పెరుగుతూ పోయింది. అదే సమయంలో చిన్న వ్యవసాయ దారులకు రూ.25వేల కంటే తక్కువగా ఇచ్చిన రుణాలు అంతకు ముందు కంటే సగానికి పడిపోయాయి.''  
మోడీ 2018 బడ్జెట్లో 38% కేటాయింపు ఎటు వెళ్లిందో మీకు  అర్థం అయ్యి వుంటుంది.

------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681


Friday, July 06, 2018

రైతులే ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు? ( PART-1)




ప్రభుత్వ లెక్కల ప్రకారం 1991 నుండి, అంటే నూతన ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టిన నాటి నుండీ ఇప్పటి వరకు 3,50,000మంది రైతులు దేశం మొత్తం మీద ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పటికీ ప్రతిరోజూ పత్రికల్లో ఏదో ఒక మూల, ఒకరిద్దరు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు వార్తలు చదువుతున్నాం. కానీ ఈ 27ఏండ్లలో ఏ పారిశ్రామిక వేత్తా ఆత్మహత్య చేసుకున్నట్టు వార్తమనం వినలేదు. అంతవరకూ సంతోషమే. కానీ రైతులే ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? ఈ ఆత్మహత్యలు ఇంకా ఎందుకు కొనసాగుతున్నాయి? తెలుసుకుందాం.
నూతన ఆర్థిక విధానాలు, లేక ఆర్థిక సంస్కరణలంటే అన్నీ రైతు వ్యతిరేక చర్యలే. వాటన్నిటినీ సంక్షిప్తంగా పరిశీలిద్దాం. మొదటి చర్యగా 1991లో ఆర్థిక మంత్రిగా ఉన్న మన్మోహన్‌ సింగ్‌ ఎరువులపై సబ్సిడీని క్రమంగా, కొద్దికొద్దిగా తగ్గించసాగారు. దానితో ఎరువుల ధరలు క్రమంగా పెరిగసాగాయి అందువలన రైతులకు వాటి వినియోగాన్ని తగ్గించక తప్పలేదు. ఎరువుల వినియోగం తగ్గిస్తే ఏమవుతుంది? పంట దిగుబడి పడిపోతుంది. సబ్సిడీల తగ్గింపులో భాగంగా మరొక ప్రమాదకరమైన చర్యను ప్రభుత్వం చేపట్టింది. అదేమిటంటే, ఎన్‌పీకె ఎరువుల వంటి పోషక ఎరువులపై సబ్సిడీని బాగా తగ్గించి, యూరియాపై సబ్సిడీని కొద్దిగా తగ్గించింది. దానితో పోషక ఎరువుల ధరలు బాగా పెరిగి, యూరియా ధరలు కొద్దిగా పెరిగాయి. రైతులు తమకు అందుబాటు ధరల్లో ఉన్న యూరియాను ఎక్కువగా వాడి పోషక ఎరువుల వినియోగాన్ని తగ్గించారు. దానివలన ఏమైంది? ''దానివలన భూమిలో నైట్రోజన్‌ బాగా పెరిగి, పంట దిగుబడి విపరీతంగా పడిపోయింది'' ఈ విషయాన్నే ఒక వ్యవసాయ శాస్త్రజ్ఞుడు ఇలా వివరించారు. ''భారతదేశంలో సంస్కరణలకు ముందు ఆహార ధాన్యాల ఉత్పత్తి రేటు 2.8శాతం. గత ఎనిమిదేండ్లలో ఇది ఒక శాతానికి పడిపోయింది.''
మరో ముఖ్యమైన విషయం. స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో అప్పటి ప్రధాన మంత్రి నెహ్రూ ఏరంగంలోనైనా ఉత్పత్తి తగ్గినా పరవాలేదు గానీ, ఆహారధాన్యాల ఉత్పత్తి మాత్రం తగ్గకూడదని అనేవారు. దానికోసం ఆయన అనేక చర్యలు తీసుకున్నారు. వాటిలో దేశమంతటా ఎరువుల పరిశ్రమల స్థాపన ఒకటి. కానీ సంస్కరణల పేరు మీద ఏం జరిగింది? గోరక్‌పూర్‌, హాల్దియా, రామగుండంలలోని ఎరువుల పరిశ్రమలు మూసివేయబడ్డాయి. అంతకంటే దారుణమైన విషయం ఏమిటంటే, ఒకప్రక్క మన ఎరువుల పరిశ్రమను మూసివే, రెండో ప్రక్క విదేశాల నుండి లక్షలాది టన్నుల యూరియాను దిగుమతి చేసుకుంటున్నాం. ఉదాహరణకు 2018 JUNE నాటికి మనం 7.86 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను దిగుమతి చేసుకున్నాం. యూరియా, రసాయనిక పోషక ఎరువులు సమృద్ధిగా కావలసిన పరిస్థితుల్లో దేశీయ ఎరువుల పరిశ్రమను మూసివేసి లక్షల కోట్ల విదేశీ మారకద్రవ్యాన్ని వృధా చేసి, రసాయనిక ఎరువును దిగుమతి చేసుకోవడం ఎంత దేశద్రోహం?
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

Thursday, July 05, 2018

‘యు వాంట్‌ టు డర్టీ విత్‌’


‘యు వాంట్‌ టు డర్టీ విత్‌’




ఒకానొకప్పుడు ‘సన్నీ లియోన్‌’ అనబడే పోర్న్‌ స్టార్‌ బిగ్‌బాస్‌ షోలోకి పెద్ద శబ్దముతోనూ మిరుమిట్లు గొలుపు కాంతులతోనూ ప్రవేశించుచున్న సమయంలోనే కింగ్‌ ఫిషర్‌ షోలో ఉండీ లేనట్టున్న బట్టల్లో పురుషుడిని ఎలా సెడ్యూస్‌ చేయాలి అని ఎపిసోడ్‌ ప్రదర్శించారు. ఇవేవీ విడివిడి విషయాలు కావు. 

రాబోయే కాలానికి సూచికలు. ఆఫ్టర్‌ దట్‌ సన్నీ మార్నింగ్‌ పోర్నో వ్యూయర్‌ షిప్‌ ఎంత పెరిగిందో లెక్కేయాల్సి ఉంది. కనీసం సన్నీ లియోన్‌ పేరు టైప్‌ చేసి ఆమె వెబ్‌సైట్లోకి ఎన్ని లక్షల మంది వెళ్లారో చూడాలి. ఆమె సైట్లో అడుగుపెడితే యోగి వేమనకు ఆయన వదిన ‘మహాదర్శనం’ చేసిన రీతిలో జ్ఞానోదయమవుతుందన్నమాట. పోర్నో అనేది ఇంతవరకూ ఎవరూ చూడకుండా ఇంటర్‌నెట్‌ కేఫుల్లోనో, ఇంట్లో పెద్దవాళ్లు లేనపుడో చూసే వ్యవహారంలాగా ఉండేది. ఒక పోర్నో స్టార్‌ను కార్యక్రమంలో భాగం చేయడం ద్వారా ఒక్క దెబ్బకు రెండు పిట్టలను కొట్టింది ఇండియన్‌ టీవీ ఇండస్ర్టీ.. పోర్నో అనే పదం చుట్టూ ఉన్న గిల్ట్‌ భావన పోగొట్టి దానికి లెజ్టిమసీ సాధించే పనిలో ఒకింత ముందంజ వేయగలిగింది. దేశంలో పోర్నో అధికారిక ప్రవేశానికి తొలి అడుగు వేయగలిగింది. పనిలో పనిగా పోర్నో మార్కెట్‌ను పెంచడం ఎలాగూ ఉంది.
  ఇప్పుడు కొత్తగా తెలుగులో మొదలైన ‘బిగ్ బాస్ 2’  కానీ అంతకుముందు  సిరీస్ కానీ వీటికి అతీతంగా ఏమీలేదు

     ఏదీ నేరుగా రాకపోవడమే ఆధునిక మార్కెట్‌ వైచిత్రి. పదాలకు కొత్త అర్థాలు కల్పించడం కవిత్వపు లక్షణంగా చెపుతారు. అభాస(అసభ్య భావ సంఘం)ని  కూడా కవుల జాబితాలో వేస్తారు. ఊరికే కవులను ఆడిపోసుకుంటారు కానీ అందులో మార్కెట్‌ వారి తాత. యు వాంట్‌ టు డర్టీ విత్‌ అని టీవీ విలేఖరి వన్‌ బాలీవుడ్ యాక్టర్‌  విద్యాబాలన్‌ను అడగాలి. ఎస్, సర్టెన్‌ ఎస్‌ ఆర్‌ కె అని ఆమె చెప్పాలి. ‘డర్టీ’ అనే ఇదక్షరాల పదం మరో నాలుగక్షరాల పదానికి కొత్త రూపం అని వీక్షకుడు అర్థం చేసుకోవాలి. తనను తాను ఎస్‌ఆర్కె ప్లేసులో ఊహించుకుని తన తృప్తేదో తాను పొందాలి. ఇదొక ఎత్తుగడ. ఇదొక బోల్డ్‌ మూవీ అనాలి. ఫలానా ఆమె ఫలానా ఆయన బోల్డ్‌గా నటించారు అనాలి. బోల్డ్‌ అనగా బట్టలు విప్పిన సీన్లు అని మార్కెట్‌ హృదయం. బోల్డ్‌ యాక్ట్‌, బోల్డ్‌ సీన్స్‌, బోల్డ్‌ టాక్‌, వగైరా దీని అనుబంధ పదాలు మార్కెట్‌ డిక్షనరీలో కనిపిస్తాయి.  బట్టలు విప్పడం బోల్డ్‌ అయితే విప్పకపోవడం ఏమవ్వాలి? తెరపై విప్పలేని వారు ఏమవ్వాలి? సాధారణంగా చాలామంది అశ్లీలమని, బూతు అని  చెప్పుకునే విషయాలకు బోల్డ్‌ను పర్యాయపదంగా మార్చి కొత్త అర్థాన్ని కల్పించడం కవులకు సాధ్యమా చెప్పండి? అభాస కవులకే సొంతమని ఇంకా చెప్పాలా?!
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

Address for Communication

Address card