Thursday, August 03, 2017

ఈ’సిస్టం’ ఉద్యోగానికి తప్ప- తెలివైనవాణ్ని ప్రోత్సాహించి- నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళే మోడల్ కాదు




 "మిత్రమా! కాఫీ, అర్జంట్!" అంటూ హడావుడిగా వచ్చాడు ఒక స్నేహితుడు. ఎదురుగా వున్న టేబుల్‌పై పుస్తకాల్ని ఆసక్తిగా చూడ్డం మొదలెట్టాడు. ఆవి సిగ్మండ్ ఫ్రాయిడ్, బెర్ట్రండ్ రస్సెల్ పుస్తకాలు.
"ఏంటీ! ఈ రోజుల్లో కూడా ఇవి చదివేవాళ్ళున్నారా!" ఆశ్చర్యపోయాడు.
"నేనున్నాను, నీకేమన్నా ఇబ్బందా?" అన్నాను.
"నాకేం ఇబ్బంది! కాకపోతే ప్రపంచం మారిపోతుంది. తెలుగునేలంతా జగన్, చంద్రబాబు,మోడీ అని కలవరిస్తుంది.నువ్వేమో జనజీవన స్రవంతికి దూరంగా ఏవో పురాతన పుస్తకాల్లో కొట్టుకుంటున్నావు." జాలిగా చూస్తూ
అన్నాడు.
"అంటే మనకి ఫ్రాయిడ్, రస్సెల్ ఇర్రిలెవెంట్ అంటావా?" అన్నాను.
"అవును. మన వూరు (పొన్నూరు) లేదా గుంటూరు, లేదా అమరావతి ఇక్కడ వుంటేగింటే చంద్రబాబు నాయుడుకి,జగన్ కి  పనుంటుంది గానీ ఫ్రాయిడ్ కేమి పని! అసలీ ఫిలాసఫర్స్ గుంటూర్లో పుట్టుంటే వీళ్ళకథ వేరుగా ఉండేది. అదృష్టవంతులు కాబట్టి ఇంకేదో దేశంలో పుట్టి బతికిపొయ్యారు." నవ్వుతూ అన్నాడు వాడు.
"రేయ్! డోంటాక్ రబ్బిష్." విసుక్కున్నాను.
వాడు మాట్లాడలేదు.మెల్లిగా నడుచుకుంటూ కాఫీ కి బయలుదేరాం.
కాఫీ సిప్ చేస్తూ చెప్పడం మొదలెట్టాడు. "కొద్దిసేపు ఫ్రాయిడ్, రస్సెల్ మనూళ్ళో(పొన్నూరు) లేదా గుంటూర్లో పుడితే ఏమయ్యేదో ఆలోచిద్దాం. ఇద్దర్నీ ఇంగ్లీషు మీడియం స్కూల్ అనే యేదోక దుకాణంలో చేర్పించేవాళ్ళు, పాఠాలు బట్టీ పట్టరు కాబట్టి మార్కులు తక్కువొచ్చేవి. ఇంక స్కూల్లో టీచర్లు, ఇంట్లో తలిదండ్రులు హింసించడం మొదలెట్టేవాళ్ళు."
"అంతేనంటావా?" సాలోచనగా అడిగాను.
"అంతే! టెన్త్ పాసయ్యాక ఇంటర్ చదువుకి ఇద్దరు మేదావుల్నీ కార్పొరేట్ కాలేజీలో పడేసేవాళ్ళు. అక్కడ ప్రతివారాంతం, ప్రతిదినాంతం, ప్రతి గంటాంతం, ప్రతి నిముషాంతం పెట్టే టెస్టులు రాయలేక చచ్చేవాళ్ళు.
అప్పుడు వాళ్లకి రెండే ఆప్షన్లు ఉండేవి." అంటూ ఆగాడు.
"ఏంటవి?" ఆసక్తిగా అడిగాను.
"ఒకటి మనవాళ్ళ ఇంటర్ రుద్దుడుకి తట్టుకుని నిలబడి, ఇంజనీరింగ్‌లో కుక్కలా చదివి, అమెరికాలో ఉద్యోగం సంపాదించి, డాలర్లు సంపాదించి హైదరాబాద్ చుట్టుపక్కల పొలాలు, స్థలాలు కొనడం. ఆస్తుల్నిప్పుడు
మనూళ్లోనే (అమరావతి) కొంటున్నార్లే - తెలంగాణా దెబ్బకి." అంటూ నవ్వాడు వాడు.
"రెండో ఆప్షన్?"
"ఏముంది. ఒత్తిడికి తట్టుకోలేక ఇద్దరూ రోడ్లెమ్మడ తిరుగుతుండేవాళ్ళు. అప్పుడు సైకియాట్రిస్టులు, విజయానికి వెయ్యిమెట్ల ‘వ్యక్తిత్వ వికాసం’గాళ్ళు పండగ చేసుకుంటారు." అంటూ కాఫీ తాగడం ముగించాడు వాడు.
"రేయ్! మనం పనికిరాని బడుద్దాయిల్ని తయారు చేస్తున్నామని నీ అభిప్రాయమా?" విసుక్కున్నాను.

"నేనా మాటన్లేదు. మనం విద్యార్ధుల్ని రొబోల్లాగా ఒకే షేప్‌లో వుండేట్లు ఒక సిస్టం తయారు చేసుకున్నాం. ఈ సిస్టం ఉద్యోగానికి తప్ప తెలివైనవాణ్ని ప్రోత్సాహించి నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళే మోడల్ కాదు. ఎందుకంటే మన
విద్యకి పరమార్ధం ఉద్యోగం. ఆ ఉద్యోగం అమెరికాలో అయితే మరీ మంచిది. అందుకే అమెరికాలో డిమాండ్ ఉన్న కోర్సులకే ఇక్కడా డిమాండ్. చైనావాడు అమెరికాకి చౌకరకం బొమ్మల్ని అమ్ముతాడు, మనం చౌకగా మేన్ పవర్ని ఎగుమతి చేస్తున్నాం.అంతే తేడా" అన్నాడు వాడు.
"ఒప్పుకుంటున్నాను, నేనిలా ఆలోచించలేదు." అన్నాను.
"ఆలోచించి మాత్రం నువ్వు చేసేదేముంది? మళ్ళీ ఇంకో ఇంగ్లీషు పుస్తకం చదువుకుని బుర్ర పాడుచేసుకోటం తప్ప. మేధావులకి తమచుట్టూ జరుగుతున్న పరిణామాల పట్ల ఆసక్తి ఉండదు. ఎప్పుడో ఎక్కడో ఎవరో రాసిన అంశాలని అధ్యయనం చేస్తారు, తీవ్రంగా మధనపడతారు. వాళ్ళు కన్ఫ్యూజయ్యి, అందర్నీ కన్ఫ్యూజ్ చేస్తారు. ఆరకంగా ఆలోచిస్తే నువ్వు నిఖార్సైన మేధావివి." అంటూ పెద్దగా నవ్వాడు వాడు.
నేనూ నవ్వాను.
టైమ్ చూసుకుని, "నీకో విషయం చెబ్తాను. మన  ‘రాజకీయ నాయకులు’ ట్రై చేస్తే ,‘ఫ్రాయిడ్’ అర్ధమవుతాడు. కానీ, ఫ్రాయిడ్‌కి మాత్రం చచ్చినా మన ‘రాజకీయ నాయకులు’ అర్ధం కారు!"
"మరిప్పుడు ఏం చెయ్యాలి?" ఆసక్తి గా అడిగాను.
"మనం చెయ్యడానికేముంది. అసలు ఏదన్నా చెయ్యాలని ప్రజలు గానీ వారిని ఏలే ప్రభుత్వాలూ గానీ అనుకోవటల్లేదు. అందుకని నువ్వు హాయిగా  లెక్కల్ని వాటి లోని బొక్కల్ని ఎంజాయ్ చేస్తూ మధ్యమధ్యలో నచ్చిన పుస్తకాలు చూసుకో. వస్తా, ఇప్పటికే లేటయింది." అంటూ నిష్క్రమించాడు వాడు.

ఆఫీసు కి రాగానే,టేబుల్ మీద నుండి ఫ్రాయిడ్, రస్సెల్ నన్ను చూస్తూ నవ్వుతున్నట్లనిపించింది!   
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

Wednesday, August 02, 2017

నేను మేధావినే.. నా?





          టీవీలో ఏదో చర్చాకార్యక్రమం, తీవ్రమైన వాదన నడుస్తుంది. పాయింటు లేకుండా అరుచుకునే ప్రోగ్రాం చూసే ఓపిక లేదు నాకు. ఇవ్వాళ అనుకోకుండా కొద్దిసేపు ఒక చర్చ చూశాను. వారిలో ఒక వ్యక్తి నా దృష్టిని
ఆకర్షించాడు. అతగాడు - కొద్దిగా పెరిగిన గడ్డం, ఇంకొద్దిగా నెరిసిన తల, భుజం మీద ఉన్నిశాలువా.. ఒక
యాంగిల్లో అక్కినేని టైపు భగ్నప్రేమికుళ్ళా వున్నాడు. ఆయన ఆంధ్రా మేధావుల సంఘానికి అధ్యక్షుడట!

       'మేధావుల సంఘం' - పేరెంత సెక్సీగా ఉంది! ఆర్ధిక, రాజకీయ పరిస్థితులు రోజురోజుకీ మారిపోతున్న ఈరోజుల్లో మేధావిగా గుర్తింపు పొందటం చాలా కష్టం. దానికి ఎంతో మేధస్సూ, మరెంతో కృషి అవసరం. ఇవన్నీ లేకుండా కేవలం ఒక సంఘసభ్యుడిగా చేరి మేధావిగా మారిపోవటం ఎంత సులభం, ఎంత సుఖం! అర్జంటుగా నేనూ ఈ సంఘం సభ్యుడిగా చేర్తాను, మేధావిగా రెడీమేడ్ కీర్తి సంపాదిస్తాను.డాక్టర్ల సంఘం, ఆటోడ్రైవర్ల సంఘం అంటూ వృత్తి సంఘాలున్నాయ్. రకరకాల కులసంఘాలున్నాయ్. ఈ సంఘాల్లో చేరాలంటే అర్హత గూర్చి పేచీ లేదు. అయితే మేధావుల సంఘం అనంగాన్లే ఇబ్బందివస్తుంది. 'నువ్వు మేధావివి కాదు' అంటే ఎవరూరుకుంటారు?

             సర్లే! ఏదోకటి. నేను మేధావినా కాదా అన్న మీమాంస నాకేలా? అదేదో సభ్యత్వం ఇచ్చేవాళ్ళు నిర్ణయించుకుంటారు. నా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కాపీ జేబులో కుక్కాను. నాకు బుర్ర తక్కువ అని డౌటొచ్చినప్పుడల్లా ఈ సర్టిఫికేట్ నన్నుకాపాడుతుంది (పేరు పక్కన క్వాలిఫికేషన్ ఉన్నంత మాత్రాన బుర్ర ఎమ్టీ కాకూడదని లేదులేండి). ఎందుకైనా మంచిదని నా మిగిలిన సర్టిఫికేట్ కాపీ లు కూడా తీసుకున్నాను. సమాజంలో కొందరికి ‘ఎమ్డీ’ కన్నా ‘ఎంబీబియ్యెస్’ ఎక్కువన్నఅభిప్రాయం ఉంది. ఎంతైనా రెండక్షరాల కన్నా నాలుగక్షరాలు ఎక్కువ కదా!
            తీరా బయల్దేరే ముందు డౌటొచ్చింది. ఆంధ్రా మేధావుల సంఘం వాళ్ళు 'మాక్కావాల్సింది నీ మేధావిత్వం, సర్టిఫికెట్లు కాదు.' - అంటే! మేధావిత్వానికి వాళ్ళదగ్గర వున్న కొలబద్ద యేంటి? జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు అడుగుతారా?
         మొదటి పానిపట్ యుద్ధం ఎప్పుడు జరిగింది? తెలీదు. మెక్సికో రాజధాని చెప్పు? అస్సలు తెలీదు! పేపర్ లీకైతే బాగుణ్ణు. తలకి మిషన్లూ గట్రా తగిలించి మీటర్ రీడింగ్ తీస్తారా? వాళ్ళ తిప్పలేవో వాళ్ళు పడతారు, అవన్నీనాకెందుకు? నేను మాత్రం ఇవ్వాళ ఖచ్చితంగా మేధావుల సంఘంలో చేరబోతున్నాను, దట్సాల్!

          ఇంతలో మస్తిష్కంలో మెరుపు మెరిసింది (అంటే గొప్ప ఐడియా వచ్చిందని అర్ధం). మనగూర్చి మనం
చెప్పుకునేకన్నా ఎదుటివారితో చెప్పిస్తేనే గదా వేల్యూ! పైగా ఇది నాకు చాలా సులువైన పని కూడా. నేను మేధావినని వెయ్యిమందితో చెప్పించగలను.

             అప్పటికే లేటయ్యిందని హడావుడిగా స్కూల్ కి వెళ్తున్న నా భార్యని(ఛ.ఛ..తను చదువు కోటానికి కాదు,చెప్పటానికి) ఆపి అడిగాను - "ఈ లెటర్ తీసుకొచ్చినవాడు మేధావి అని ఒక సర్టిఫికేటివ్వు."సందేహం లేదు, గవర్నమెంట్ సర్వంట్ కావున నా భార్య సర్టిఫికేట్ బ్రాండెడ్ సిమెంటంత స్ట్రాంగ్‌గా వుంటుంది.అనుకున్నా నా భార్య నాకేసి ఎగాదిగా చూసింది, ఒక్కక్షణం ఆలోచించింది - "సారీ! నేను దొంగ సర్టిఫికెట్లివ్వను." అంటూ వెళ్ళిపోయింది.హతాశుడనయ్యాను. ఎంత అవమానం! కొంచెం కళ్ళు తిరిగినట్లనిపించింది. చరిత్రలో ఏ భర్తకీ భార్య చేతిలో ఇంత అవమానం జరక్కూడదు. ఈ అవమాన భారం భరింపలేను. 'ఎవరక్కడ? చితి పేర్పించండి'.
"సార్! స్విచ్చిలన్నీ మార్చేశాను. ఇంక మీకు ఇబ్బందుండదు."
నిదానంగా తల పైకెత్తి చూశాను. ఎదురుగా ఎలెక్ట్రీషియన్ నిలబడున్నాడు. మస్తిష్కంలో మళ్ళీ మెరుపు (మళ్ళీ
ఇంకో గొప్ప ఐడియా)! సొంతభార్య సర్టిఫికేట్‌కి విలువేముంది? ఈ శ్రామికవర్గ ప్రతినిధితో సర్టిఫికేట్ తీసుకుంటే
తిరుగేముంది?
"సర్లే! ఈ కాయితం మీద నేను తెలివైనవాణ్ణని రాసి సంతకం పెట్టు."
ఎలెక్ట్రీషియన్ సిగ్గుతో మెలికలు తిరిగిపోయాడు - "ఆ విషయం నాకు తెలుసు సార్!"
"అవును కదా! ఆ సంగతే రాసివ్వు." విసుగ్గా అన్నాను.
"నేను తెలివైనోణ్ణని నేనే రాసుకుంటే ఏం బాగుంటుంది సార్!" మళ్ళీ సిగ్గు, మెలికలు.
"నేనన్నది నీగూర్చి కాదు, నాగూర్చి! ఈ ఆడిటర్ గొప్పమేధావి అని రాసి సంతకం పెట్టివ్వు."
సిగ్గు మాయమైంది - "అదేంటి సార్! అట్లెట్లా రాసిస్తా. నేను రాయలేను."
"అంటే నాకు నీఅంత తెలివి లేదంటావా?" కోపంగా అడిగాను.
"సార్! మీరు పెద్దవారు, ఏమనుకోకండి. మిమ్మల్ని రెండేళ్ళనించి చూస్తున్నాను. మీకు చోక్ అంటే తెలీదు,
స్టార్టర్ అంటే అర్ధం కాదు. కనీసం యే స్విచ్చి దేనికో కూడా గుర్తుండదు." అంటూ జారుకున్నాడు.
ఆరి దుర్మార్గుడా! ఇన్నాళ్ళు నువ్వు నన్నో బుర్ర తక్కువ్వాడిగా అనుకుంటున్నావా! నాకు కళ్ళు
తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. తల దిమ్ముగా వుంది, నీరసంగా సోఫాలో కూలబడ్డాను.
"సార్! కూరగాయలు." అంటూ గేటు తీసింది కూరలమ్మే మనిషి. అమ్మయ్య! నా బాధ వెళ్ళబోసుకొటానికో మనిషి దొరికింది. ఆవిడ నాకు నా పగిలిన గుండె అతికించుకునేందుకు దొరికిన ఫెవికాల్ గమ్ములా కనబడింది.
"చూడమ్మా! నేను మేధావినేనా? కాదా?"
ఆవిడ ఇబ్బందిగా మొహం పెట్టింది - "మేధావి అంటే ఏంటో నాకు తెలీదు."
ఈ కూరలమ్మి నాపై గల అపార గౌరవంతో మాట్లాడ్డానికి మొహమాట పడుతున్నట్లుంది. అవును మరి! ఆమె భర్తకి నచ్చచెప్పి తాగుడు మాన్పించాను, మొన్నామధ్యనే ఆమెకి అప్పు కూడా ఇచ్చాను.
అంచేత కృతజ్ఞతా భారంతో ఒంగిపోతూ - 'మీరు దేవుళ్ళాంటోరు సార్! ఈ ప్రపంచంలో మీకన్నా గొప్ప మేధావి
ఎవ్వరూ లేరు.' అని పొగడొచ్చు. కానీ నాకు పొగడ్తలు గిట్టవు. అందుకే -
"చూడమ్మా! నన్ను పొగడకు. నీ మనసులో మాట ఉన్నదున్నట్లు నిర్మొహమాటంగా చెప్పెయ్!" అన్నాను.
ఆవిడ బెరుకుగా - "తప్పుగా మాట్లాడితే మన్నించండి! ఎన్నోఏళ్ళుగా మీ ఇంటి కొస్తున్నాను. మీరు చాలా
మంచివారు, అమాయకులు. కానీ మీకు బెండకాయకీ, దొండకాయకీ తేడా తెలీదు. పూరీ కూరకీ, చపాతి కుర్మాకీ తేడా తెలీదు. పొద్దస్తమానం యేదో ఆలోచిస్తూ పరధ్యానంగా వుంటారు. మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది. మేడంగారు లేకపోతే మీకు చాలా కష్టం సార్!" అని అంటుండగా -నాకు స్పృహ త... ప్పిం.... ది.
ఉపసంహారం :
గౌరవనీయులైన పాఠకులకి నమస్కారం!
ఎవరూ మనస్పూర్తిగా పక్కోడు మేధావి అంటే ఒప్పుకోడు అందునా ‘తెలుగోడు’ అస్సలోప్పుకోడు.ఇదే చెప్పదలుచుకున్నది.ఈ రాతలు రాస్తున్నవాడికి ‘ఐసీయూ’లో ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం. వున్నట్లుండి 'నేను మేధావిని, నేను మేధావిని.'అంటూ ఎగిరెగిరి పడుతున్నాడు. వైద్యశాస్త్రంలో ఇదో అరుదైన కేసుగా డాక్టర్లు భావిస్తున్నారు. ఆస్పత్రి నుండి డిశ్చార్జంటూ అయితే మళ్ళీ తన రాతలతో మిమ్మల్ని హింసిస్తాడని హామీ ఇస్తున్నాం, సెలవు.
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

Tuesday, August 01, 2017

అనగనగా ఒక ఊరుండేది. ఆ ఊళ్ళో అన్నింటి పైనా నిషేధం ఉండేది.





(ఆంగ్ల మూలం: ‘Making Do, 1943: రచయిత: ఇటాలో కాల్వీనో...  కి నా స్వేచ్చానువాదం...)

అలా నిషేధం లేకుండా ఉన్నది పిచ్చుంగుంటలు ఆట ఒక్కటే. మరి, నిషేధం లేనిది ఆ ఒక్క ఆటపైనే కాబట్టి ఊళ్ళో వాళ్ళంతా కూడళ్ళలోనూ, చావిళ్ళలోనూ, చెరువు గట్ల మీదా, చింత తోపులో చెట్ల కిందా గుమిగూడిపోయి పిచ్చుంగుంటలు ఆడుకుంటూ రోజులని గడిపేస్తూ వుండేవాళ్ళు.
నిజానికి అన్నింటి మీదా నిషేధం అదాటున ఒకేసారిగా అలా ఏమీ రాలేదు. కాలక్రమేణా ఒక్కొక్క దానిపైనా నిషేధం అమలవుతూ వచ్చింది. ఆ ఊరి ప్రభుత్వపు పెద్దలు, సైన్యాధ్యక్షులు ఒకసారికి కేవలం ఒకే ఒకదాన్ని నిషేధించడం, అలా నిషేధించడానికి ఒక మంచి కారణం ఉందని చూపించడంతో ఫిర్యాదులంటూ ఎవరూ చేయలేదు. చేయడానికి కారణం కూడా ఏమీ అంతగా కనిపించలేదు. పెద్దగా ఇబ్బంది పడకుండానే ఒక్కో నిషేధానికి క్రమంగా అలవాటు పడిపోతూ వచ్చారలా ఆ ఊరివాళ్ళు.
కొన్నేండ్లు అలా గడిచినై. ఆ ఊరి ప్రభుత్వపు పెద్దలకు ఉన్నట్టుండి ఒక రోజు, ఇలా అన్నింటి మీదా నిషేధం ఉండాల్సిన అవసరమేమీ ఇక అనిపించలేదు. వెంటనే సైనికులని పిలిచి ఊరు ఊరంతా చాటింపు వేయించమని ఆజ్ఞాపించారు. సైనికులు అలానే దండోరాగాళ్ళని వెంటేసుకొని కూడళ్ళకీ, చావిళ్ళకీ, చెరువు గట్లపైకీ, ఊరి దాపుల్లో ఉన్న చెట్ల తోపుల్లోకీ వెళ్ళి మరీ చాటించారు – “ప్రజలారా! బహు పరాక్! బహు పరాక్! మన ఊళ్ళో ఇప్పుడు దేని మీద కూడా నిషేధం లేదు. అందువల్ల, మీరు మీకిష్టమొచ్చిన దేదైనా సరే స్వేచ్ఛగా చేయచ్చు!అనేసి.
ఊళ్ళోవాళ్ళు వాళ్ళ మానాన వాళ్ళు పిచ్చుంగుంటలు ఆడుకుంటూనే వున్నారు.
మీకు అర్థం కావటం లేదా? నిషేధాలన్నీ పెద్దలు ఎత్తేశారు. ఇప్పుడు మీ మీద ఏ ఆంక్షలూ లేవు. మీకిష్ఠమొచ్చింది, అది ఏదైనా సరే స్వేచ్ఛగా మీరు చేయచ్చు,” అని సైనికులు అందరికీ మళ్ళీ మళ్ళీ చెప్పారు. మరింత గట్టిగా టముకు కొట్టించారు, మరిన్ని సార్లు చాటింపేయించారు.
సరే!అన్నారు ఊళ్ళోవాళ్ళు, “మేము స్వేచ్ఛగా పిచ్చుంగుంటలు ఆడుకుంటున్నాం.
వాళ్ళకి అర్థమయేట్టుగా చెప్పాల్సిన బాధ్యత సైనికులకే అప్పగించారు పెద్దలు. సైనికులు ఊళ్ళోవాళ్ళకి రకరకాలుగా నచ్చచెప్పారు. నిషేధాలు లేకముందు ఊళ్ళోవాళ్ళు ఎన్ని రకరకాలైన పనులు చేసేవాళ్ళో, ఎన్ని రకరకాలైన వ్యాపకాల్లో ఉండేవాళ్ళో, ఎన్ని ఆటలు ఆడేవాళ్ళో, పాటలు పాడేవాళ్ళో ఊరిస్తూ గుర్తు చేశారు. మళ్ళీ ఆ వ్యాపకాలన్నీ మొదలెడితే ఎంత బాగుంటుందో మరీ మరీ వర్ణించారు. ఊళ్ళోవాళ్ళు కనీసం అటు కాలు ఇటు ముడవకుండా, అటు చూపు ఇటు తిప్పకుండా, ఊపిరి సలపనీకుండా పిచ్చుంగుంటలు ఆడుతూనే ఉన్నారు.
తమ ప్రయత్నాలన్నీ అలా వమ్ముకావడంతో సైనికులు ఊరి పెద్దలు, సైన్యాధ్యక్షుల దగ్గరికెళ్ళి మొర పెట్టుకున్నారు, “అయ్యల్లారా! మేమెంత చెప్పినా ఊళ్ళోవాళ్ళంతా పిచ్చుంగుంటలు ఆడుతునే వున్నారుఅని.
ఓస్, అంతేనా!అన్నారు పెద్దలంతా. ఇదేమంత కష్టమైంది కాదు. పిచ్చుంగుంటలు నిషేధిస్తే సరి!
అది జరిగిన మరుక్షణం ఆ ఊళ్ళోవాళ్ళంతా ఒక పెద్ద విప్లవం లేవదీసి ఆ పెద్దలనందరినీ చంపేశారు. ఆ తర్వాత, కాలయాపన కాకుండా వెంటనే తిరిగి పిచ్చుంగుంటలు ఆడుకోడం మొదలు పెట్టారు.
(మూలం: Making Do, 1943: ఇటాలో కాల్వీనో.  స్వేచ్చానువాదం...)
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

ఎవరా ప్రభువు?




ఆ.వె.
తండ్రికొడుకు లొక్క తరుణిని రమియింప
పుత్రు లిద్ద రొంది పోరు గలుగ
నొకని జంపి రాజ్య మొకని కిచ్చిన ప్రభు
వాతఁ డిచ్చు మనకు నఖిల సిరులు.

(‘
నానార్థ గాంభీర్య చమత్కారికగ్రంధం నుండి.)

సమాధానం
ఆ.వె.
తండ్రి కొడుకులైన తరణి యముల చేత
కర్ణ ధర్మజులను గనెను కుంతి
సమరమందు కర్ణుఁ జంపించి ధర్మజు
నవనిపతిగఁ జేసె హరియె గాదె.
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

Address for Communication

Address card