Thursday, July 12, 2018

మిర్చిబజ్జీలు


వాతావరణం చలిచలిగా, మబ్బుమబ్బుగా, స్తబ్దుగా ఉంది.

ఇట్లాటి సమయాల్లో కవులు కవితలు రాస్తారు, నాకు మాత్రం - వేడివేడిగా మిర్చిబజ్జీలు తినాలనిపించింది. ఈ
చల్లని సమయంలో 'మిరపకాయ బజ్జీలు తిననివాడు దున్నపోతైపుట్టున్!' అనే నాకు తెలిసిన న్యూనుడి నా ప్రక్కవారి కూడా నచ్చుటచే బజ్జీలకోసం  వేట ప్రారంభం అయ్యింది.


అసలు 'బజ్జీ' అన్న పేరే సెక్సీగా లేదూ! బజ్జీ లేని భోజనం కర్ణుడు లేని భారతంలాంటిదని నా నమ్మకం.
బజ్జీలు అనేక రకాలు - ఘాటైన మిర్చిబజ్జీలు, కమ్మటి వంకాయ బజ్జీలు, రుచికరమైన బంగాళదుంప బజ్జీలు,
మెత్తటి అరటికాయ బజ్జీలు, కరకరలాడే ఉల్లిపాయ బజ్జీలు.. ఇలా రాసుకుంటూ పోవచ్చు.

చదువుకొనే రోజుల్లో స్నేహితుల్తో సాయంకాలాలు మిరపకాయ బజ్జీలు తినడం, గోళీసోడా తాగుతూ కబుర్లు
చెప్పుకోవడం.. నిన్నమొన్నలా అనిపిస్తుంది. మిరపకాయ బజ్జీ నోట్లో కెళ్ళంగాన్లే రాముడులాంటివాడు
రావణుళ్లా వీరావేశంతో ఊగిపోయేవాడు.. మిర్చి ఘాటు ప్రభావం! కాంగ్రెస్ బిజెపి తెలుగుదేశం,అనుకూల, ప్రతికూల గ్రూపులు..అమెరికా ,రష్యా,అనుకూల, ప్రతికూల గ్రూపులు.. కపిలదేవ్, సిద్ధూ,గవాస్కర్, విశ్వనాథ్ క్యాంపులు.. సినిమాలు,….రోజూ చూసే  అమ్మాయిలు కాదేది వాదనకనర్హం?!   

ప్రక్కనున్న ఇద్దరు పిల్లలకి బజ్జీ విశిష్టతనీ, ప్రాచుర్యాన్నీ.. మరీ ముఖ్యంగా బజ్జీలకి నాయకుడైన మిర్చిబజ్జిగాడి రుచిని వివరించి.. ఓ రెండు మిర్చిబజ్జీలు ఆరగించితిని. కంట్లోంచీ, ముక్కులోంచి నీళ్ళు కారుతుండగా, నోరు
కారంతో మండిపోయింది. 'ఉఫ్ఫ్ ఉఫ్ఫ్' అనుకుంటూ, చల్లని నీళ్ళతో కడుపులో సంభవించిన అగ్నిప్రమాదాన్ని
నివారుస్తూ, కురుస్తున్న వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్నా.  

అప్పుడు నా కంటపడిందో దారుణ దృశ్యం. ఇద్దరు పిల్లలు మిరపకాయ బజ్జీలని తోళ్ళూడగొట్టి, మిరపకాయల్ని వేరే
పేపర్లో  పడేసి, బజ్జీ పిండిభాగాన్ని చట్నీ తో నంజుకుంటూ -

" బజ్జీలు భలే బాగున్నయ్!" అన్నారు.

నా మనసు చివుక్కుమంది, గుండె బరువెక్కింది. మిరపకాయల్లేని ఆ శనగపిండి తోళ్ళని బజ్జీలంటారేమిటి!  పైగా
వాటి పక్కన రక్త పిశాచిలా భీతి గొలుపుతూ బోడి చట్నీ ఒకటీ ! ప్లేట్లో - తోళ్ళు కోల్పోయిన మిరపకాయలు, రైలు యాక్సిడెంటయ్యాక వరుసగా పడుకోబెట్టిన నగ్నశవాల్లా దయనీయంగా పడున్నాయ్.

ఏమిటీ దుస్థితి? బజ్జీలని ఇలా హత్య చెయ్యొచ్చునా? తెలుగుభాష  కోసం ఉద్యమాలు చేస్తున్నారు,
తెలుగువంటకాల కోసం ఉద్యమం చేపట్టాలేమో! బజ్జీలు తిన్డం కూడా చేతకాని ఈ కొత్తతరం అజ్ఞానుల కోసం
కోచింగ్ సెంటర్లు అవసరమేమో!

------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

No comments:

Post a Comment

Address for Communication

Address card