Thursday, July 27, 2017

అసలు భారతదేశం ఎప్పుడూ ఒక దేశం కాదు. ఇదంతా బ్రిటీషువాళ్ళ సృష్టి కాదా?





(కౌటిల్యుడు ఎందుకు అవసరం?నిన్నటి వ్యాసానికి ముగింపు)
                      వేర్పాటు వాదమే లక్ష్యంగా పెట్టుకున్న మన వామ పక్షాలు లేవనెత్తేటువంటి తప్పుడు ప్రశ్నలకు (కాశ్మీర్ ఇస్తే పాకిస్తాన్‌తో గొడవ తీరిపోతుంది కద. మనందరం ఒకటే. ఎవరి దగ్గర ఉంటే ఏమిటి?”, “వచ్చిన బంగ్లాదేశీ కాందిశీకులు ఎలాగూ వచ్చారు. పాపం, వాళ్ళకు శాశ్వత పౌరసత్వం ఇస్తే సరిపోతుంది కద?”, “అసలు భారతదేశం ఎప్పుడూ ఒక దేశం కాదు. ఇదంతా బ్రిటీషువాళ్ళ సృష్టి కాదా?”) సమాధానాలు తెలుసుకోవాలంటే కౌటిల్యుడిని అధ్యయనం చేయడం చాలా అవసరం.                  
                     ఎక్కువగా కౌటిల్యుడు అనే పేరు వినగానే అందరికి కుటిల రాజనీతి అన్న పదాలు స్ఫురిస్తాయి. అయన గురించి తెలుసుకున్న చాల మందికి ఆయన పేరు వినగానే western philosophers లో Machiavelli గుర్తుకు వస్తాడు. తద్వారా ‘కౌటిల్యుడు మనకు ఆదర్శం’ అంటే ఇబ్బంది పడతారు.
ఐతే కౌటిల్యుడు (ఈయన చాణక్యుడిగా అందరికి పరిచితం) ఇవేవీ కాడు. ఆయన ముఖ్యంగా ఒక మహోన్నత జాతీయవాది (nationalist).
                      దాదాపూ రెండువేల నాలుగు వందల ఏళ్ళకిందే, కౌటిల్యుడు ప్రజలలో జాతీయ భావం ఎంత అవసరమో గుర్తించాడు.
                       కౌటిల్యుడు ముఖ్యంగా ఒక శిక్షకుడు. ఒక గురువు. కాని ఎప్పుడు భారతావని ఆపదలో ఉన్నా ఆయన తన గురుకులాన్ని వదిలి వచ్చి భారతాన్ని చుట్టుముట్టిన సమస్యలను ఛేదించాడు. అది దుష్ట నందుల వల్ల ప్రజలు ఇబ్బందుల్లో పడినప్పుడు కానీ, లేదా అలెగ్జాండర్ మన్నల్ని ముట్టడించినప్పుడు కానీ.
                      కౌటిల్యుడికి ఏనాడూ పదవి మీద అధికారం మీద వ్యామోహం లేదు. తన కర్తవ్యం ముగియగానే ఆయన మళ్ళీ తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు.
                    ఈ రోజు మనకు కావల్సింది అలాంటి కౌటిల్యుడే. అధికారం కోసం కాకుండా, దేశ క్షేమం కోసం పోరాడేవాడు. గమ్యం హర్షణీయం అయినప్పుడు దారిలో వచ్చే ఆటంకాలను సామ దాన భేద దండోపాయలతో నిర్మూలించే వాడు.
                   భారత దేశం మళ్ళీ చాలా రోజుల తరువాత ఒక కూడలికి (crossroads) చేరుకుంది. ఈ కూడలి దాటి సుగమమైన మార్గాన పయనించేందుకు, మనందరికి కౌటిల్యుడి శక్తి యుక్తులు కావాలి.
                  కౌటిల్యుడి సిద్ధాంతాల గురించి తెలుసుకోవాలనుకునే వారు, ఇంటెర్నెట్‌లో ఎన్నో చోట్ల చూడవచ్చు.

------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
              

Wednesday, July 26, 2017

ఈ దేశం నెమ్మదిగా దారి తప్పింది ......................................



ఈ దేశం నెమ్మదిగా దారి తప్పింది ......................................


                            అనగనగా జంబూ ద్వీపమనే ఒక దేశం ఉండేది.
                            మిగతా దేశాలలో జనాలు అనాగరికంగా చెట్లూ పుట్టలూ పట్టుకుని తిరుగుతున్నప్పుడే ఈ దేశానికి ఒక గొప్ప చరిత్రా, సంస్కృతీ ఉండేవి. ఎవరి శక్తికి తగ్గ వృత్తిని వారు ఎన్నుకొనే వ్యవస్థ ఉండేది. లెక్కకు మించిన సంపద ఉండేది. అన్నిటికీ మించి వెర్రి భక్తి, మూఢ నమ్మకాలు కాకుండా అధ్యాత్మికత ఈ దేశాన్ని ప్రపంచ దేశాలన్నిటికీ ఆదర్శంగా నడిపించేది.
                            ఐతే ఈ దేశాన్ని అలసత్వం ఆవహించింది.దాని వల్ల ఈ దేశం నెమ్మదిగా దారి తప్పింది. కాని పునాదులు బాగా గట్టిగా ఉన్న భవంతి ఎలా ఐతే రక రకాల తాకిడులు తట్టుకుని చాలా కాలం కూలిపోకుండా నిలబడుతుందో, అలాగే ఈ దేశం కూడా వెంటనే భ్రష్టు పట్టలేదు. దానికి కొన్ని వందల ఏళ్ళు పట్టింది.
                          మెల్లగా ఎవరి శక్తికి తగ్గ పని వారు చేయాలి అనే సిద్ధాంతం, ఏ పని చేసేవాడి పిల్లలు అదే పని చేయాలి అనే వర్గీకరణ కింద మారిపోయింది. సమాజం నానా వర్గాలుగా విడిపోయింది.
                        అధ్యాత్మిక జ్ఞానంతో జాతికి దారి చూపాల్సిన వారు అది మర్చిపోయి సంప్రదాయాలలో కూరుకుపోయారు. ప్రతి పాపాన్ని ఒక పూజతోనో యాగంతోనో కడిగేసుకోవచ్చు అన్న నమ్మకం పెరిగింది. డబ్బు ఉంటే ఏదైనా సాధ్యమే అన్న ధోరణి ఎక్కువయ్యింది. తద్వారా విద్వత్తు కంటే డబ్బుకి పెద్ద పీట వేసే తప్పుడు సంస్కారం జనాలకు అలవడింది.
                        ఆఖరికి పరాయి దేశస్తులు దండెత్తి వచ్చినా, జంబూ ద్వీపంలో ఒక వర్గం మాత్రమే యుద్ధం చేసే పరిస్థితి ఏర్పడింది. దీని వల్ల కలిగిన భయంకర పరిణామం ఏమిటంటే, మిగతా వర్గాలు దేశ రక్షణ అందరి కర్తవ్యం అనే మాములు నిజాన్ని మర్చిపోవడం. అలా జాతి నిర్వీర్యమయ్యింది.
                       ఐతే ఎప్పటికప్పుడు కొందరు మహానుభావులు దీన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేశారు. ఇలాంటి  ప్రాత:స్మరణీయుల వల్ల పతనం ఆలస్యం అయినప్పటికీ పూర్తిగా ఎప్పుడూ ఆగి పోలేదు. పాకుడు మెట్ల చందానా జాతి ఒక్కొక్క మెట్టు దిగజారుతూనే వచ్చింది.
                      జంబూ ద్వీపం అనేకమార్లు బానిస దేశంగా మారింది. గత అరవయి ఏళ్ళనుండి మాత్రమే స్వతంత్ర్యంగా ఉంది. కానీ ఏన్నో ఏళ్ళ బానిసత్వం దారిద్ర్యం ప్రజలను క్రుంగ దీశాయి. ఆత్మ గౌరవం అడుగంటి పోయింది.
                      ఐతే గత పదేళ్ళుగా జంబూ ద్వీపంలో నవోత్సాహం నిండుకుంది. కొన్ని భౌగోళిక పరిణామల వల్ల ఆ దేశం మళ్ళీ సంపన్నంగా మారసాగింది. ఇది జనాల్లో కొత్త ఉత్సాహానికి దారి తీసింది. మళ్ళీ పూర్వ వైభవం వస్తుందని ప్రజల్లో నమ్మకం పెరిగింది.
                             ఐతే అందరూ మరిచిపోయిన విషయం ఒక్కటి ఉంది. జంబూ ద్వీపం పతనం బానిసత్వం వల్లో, దారిద్ర్యం వల్లో జరుగలేదు. అవి కేవలం ఫలితాలు మాత్రమే. కారణాలు కావు.
                            అసలు కారణం జంబూ ద్వీపం తన ఆత్మ ఉనికి మర్చిపోవడం. ఆధ్యాత్మిక వైఫల్యం.
                             ఈ సత్యం జంబూ ద్వీప వాసులకు అర్థం కాకపోయినా, దాన్ని బానిసలుగా చేసిన వారికి బాగా అర్థమయ్యింది. అందుకనే వాళ్ళు జంబూ ద్వీపాన్ని అధ్యాత్మికంగా మళ్ళీ తలెత్తకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. జంబూ ద్వీప చరిత్రని మార్చారు. మహా వీరులను కొండ ఎలుకల్లా చిత్రీకరించారు. నియంతలను ధర్మ ప్రభువులుగా కొనియాడారు. జంబూ ద్వీప వాసుల ఆత్మ న్యూనతను వేయింతలు చేశారు.
                           ఆ లోటు ఇంకా భర్తీ కాలేదు. అధ్యాత్మికంగా ఇంకా జంబూ ద్వీప ప్రజలు వెనుకపడే ఉన్నారు. ఎప్పటిదాకా ఆ లోటు పూరించబడదో అప్పటి దాక జంబూ ద్వీపం తన పూర్వ వైభవాన్ని పొందదు.
                                ధనం తెచ్చే భద్రత తాత్కాలికమే. విలువలు లేని సంపద చివరికి వ్యర్థమవుతుంది లేదా మళ్ళీ పరుల పాలవుతుంది.

                                    ప్రస్తుతం జంబూ ద్వీపానికి కావలసింది ఒక కౌటిల్యుడు. అవును కౌటిల్యుడే. అప్రాచ్యులు దండెత్తి వచ్చినప్పుడు, రాజుల నుంచి సామాన్యుల వరకు వర్గ విభేదాలు మరచిపోయేలా చేసి, జంబూ ద్వీపాన్ని ఒక తాటి మీదకు తెచ్చిన కౌటిల్యుడు. అన్యాయాన్ని సహిస్తూ బతకడం కన్నా ఎదిరిస్తూ మరణించడం గొప్పదన్న కౌటిల్యుడు. కుటుంబం కోసం సభ్యుడిని, గ్రామం కోసం కుటుంబాన్ని, దేశాని కోసం గ్రామాన్ని ఫణం పెడితే తప్పు లేదని నిర్మొహమాటంగా చెప్పిన కౌటిల్యుడు
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681


Tuesday, July 25, 2017

‘డైనమిక్‌ ప్రిస్కిప్షన్‌ ఫర్‌ లైఫ్‌’




భగవద్గీత అంటే ఏమిటి?
జీవితమంతా అయిపోయిన తర్వాత చదువుకోవాల్సిన పుస్తకమా?
రిటైర్‌మెంట్‌ రోజు సహోద్యోగులు ఇచ్చే బహుమతా?
ఎవరైనా మరణించినప్పుడు ప్లే చేసే సీడీనా?
అది కేవలం హిందువులదా?
పనీపాటా వదిలేసి సన్యసించమని చెబుతుందా అది?

కాదు. అవన్నీ అపోహలు. ఒక్కముక్కలో చెప్పాలంటే భగవద్గీత డైనమిక్‌ ప్రిస్కిప్షన్‌ ఫర్‌ లైఫ్‌’. ఒక సమస్యని అధిగమించటం,ఒక లక్ష్యాన్ని గుర్తించటం,ఒక ఆదర్శంగా జీవచటం అన్నిటికిమించి ,సంతృప్తిసంతోషాలు నిండిన జీవితం గడపాలంటే, చేస్తున్న పనిలో విజయం సాధించాలంటే గీతను అర్థం చేసుకోవాలి

భగవద్గీత హిందువులది, కనుక నేను దాన్ని చదవను, నాకు దాని అవసరం లేదుఅని చెప్పేవాళ్లు
ఎలాంటి వాళ్లంటే భూమ్యాకర్షణ సిద్ధాంతం న్యూటన్‌ కనిపెట్టాడు, అది బ్రిటిష్‌వాళ్లది మనం దాని జోలికి
పోవద్దుఅనేవాళ్లతో సమానం. గీత భారతీయులు అందరిదీ.

సంతోషంగా ఉండాలి అని ఏవేవో చేస్తుంటాం. వాస్తవానికి కోరిక లను అధిగమించినప్పుడు మీరు సంతోషంగా
ఉంటారు. ఉదాహరణకు ప్రమోషన్‌ కావాలి, కావాలిఅనుకుని నిరంతరం దాని గురించే ఆలోచించే వ్యక్తికి చింత
తప్ప మరేం మిగలదు. అదే తన పని తాను నిజాయితీగా సమర్థంగా చేసుకుపోయే వ్యక్తికి ఆలోచించనవసరం లేకుండా ప్రమోషన్‌ లభిస్తుంది. గీత చెప్పేదీ అదే. నీ పని నువ్వు చెయ్యి, ఫలితం గురించి ఆలోచించకు అని.

సన్యాసం అనేది కాషాయదుస్తులతో రాదు. అదొక మానసిక స్థితి. వందమంది మధ్యన ఉన్నా, వంద పనులున్నా కూడా తామరాకు మీద నీటిబొట్టు మాదిరిగా ఉండటమే సన్యాసమంటే.

ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి అంటే దానర్థం అన్నిటినీ వదిలేసి మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోవడం
కానేకాదు. ప్రపంచ ం అందిస్తున్న అన్నిటినీ ఇంద్రియాల సాయంతో, తెలివిగా వాడుకోమని. అలా వాడుకుంటే
ప్రశాంతత, తద్వారా విజయం లభిస్తాయి.

ఒక క్రీడాకారుడు ఉన్నాడనుకోండి. అతని సామర్థ్యం, ఫిట్‌నెస్‌ అన్నీ ఒకేలా ఉన్నప్పటికీ, ఒకరోజు విజయం
సాధిస్తాడు, మరుసటి రోజు చిత్తుగా ఓడిపోతాడు, ఆ మర్నాడు మామూలైన ఆటతీరును ప్రదర్శిస్తాడు. ఎందుకలా?
అదే మైండ్‌ చేసే మేజిక్‌. మైండ్‌ ప్రశాంతంగా ఉంటే, ఉత్సాహంగా ఉంటే దేన్నైనా సాధించవచ్చు. ప్రశాంతతను
సాధించడమెలాగో భగవద్గీత చెబుతుంది. కేవలం మీకోసమే అనుకుని మీరు చేసే పనుల్లో రాణించలేకపోవచ్చు.
నేనుఅన్నదాన్ని అధిగమిస్తే మీకు కొత్త శక్తి వస్తుంది. ఉదాహరణకు కేవలం నా ఆనందం కోసమే
ఆడుతున్నానుఅనుకునే క్రీడాకారుడి భవిష్యత్తు అక్కడితో ఆగిపోతుంది. అదే దేశం కోసం ఆడాలి అనుకుంటే
వెంటనే అతడిలో కొత్త ఉత్సాహం వస్తుంది, ఏకాగ్రతతో ఆడతాడు, అతణ్ని విజయం వరిస్తుంది. నాకోసం కాదు
అనుకుని చూడండి ఏ పనిలోనైనా మీకు బాధ్యత పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. భగవద్గీత చెప్పేది అదే.

అసలు భగవద్గీత ఏం చెబుతుంది?

-ధర్మాధర్మాల గురించి చెబుతుంది.
-కర్తవ్యం గురించి చెబుతుంది.
-నాగరికత అంటే కోరికలను తీర్చుకోవడం కాదుఅదుపులో పెట్టుకోవడమని చెబుతుంది.
ఆనందంగా జీవించడం ఎలాగో చెబుతుంది.
-సుఖంశాంతిత్యాగంయోగంఅంటే ఏమిటో చెబుతుంది.
-ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో చెబుతుంది.
పాప పుణ్యాల వివరణ ఇస్తుంది.
-ఆత్మ తత్త్వ నిరూపణ చేస్తుంది.
స్వకల్యాణం కోసం కాక లోక కల్యాణం కోసం జీవించమని చెబుతుంది.
-జ్ఞానంమోక్షంబ్రహ్మంఆధ్యాత్మం అంటే ఏమిటో చెబుతుంది.
-ఎవడు పండితుడో ఎవడు స్థితప్రజ్ఞుడో చెబుతుంది.
-ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేయడంలో ఉండే ఆనందం ఎంతో చెబుతుంది.
-మంచి పనులు చేసేవాడికి లభించే శాశ్వత కీర్తి ఎంతో చెబుతుంది.
-పరమాత్ముడికి ఎవడు ఇష్టుడో చెబుతుంది.
-ఆయన్ను చేరే మార్గాన్ని చూపిస్తుంది.
-కర్మ, భక్తి, జ్ఞాన మార్గాల ద్వారా వేలు పట్టుకుని నడిపించి, మనిషిని దైవాన్ని చేస్తుంది.
-నీలానే ఇతర ప్రాణికోటినీ ప్రేమించమని చెబుతుంది. అనారోగ్యకరమైన భావోద్వేగాలను నియంత్రిస్తుంది.

అందుకే భగవద్గీత సర్వమానవాళి కోసం. అర్థం చేసుకున్నవారు ధన్యులు.
నిన్ను నన్ను మన అందరి గురించి
మాట్లాడుతుంది. మానవుడు ఎలా అభ్యున్నతి సాధించాలో చెబుతుంది.

గీత చదువుకో
రాత మార్చుకో*
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

Address for Communication

Address card