Friday, July 13, 2018

"చెప్పుల"కున్న విలువ మనిషికి లేదా?




ఉదయం ఎనిమిది అయ్యింది. టిఫిన్ చేసి, పేపరు చదువుతున్నాను. ఇంతలో ఫోను మోగింది. ఒక మిత్రుడు .అవసరమైతే తప్ప కాల్ చేయని వాడి నుంచి ఫోను వచ్చిందంటే వెంటనే ఏదో పని చేసి పెట్టాల్సిందే అనుకుంటూ ఫోన్ ఎత్తాను. నిన్న నా కారుకి యాక్సిడెంట్ అయింది. కారు బాగా పాడైంది. ఇరవై వేలు ఖర్చవుతుందన్నారు. పదివేలున్నాయి... మిగిలినవి సర్దితే ఒకటో తేదీ ఇచ్చేస్తానుఅన్నాడు. ‘సరే ఇస్తాలే’ అని ఊరుకోకుండా  ఇన్సూరెన్స్ ఉంటుంది కదా?’ అనగానే- ఏడాదికి మూడు వేలు వృథా ఎందుకని చేయించలేదన్నాడు.

ముందే చేయిస్తే ఇంత ఖర్చుండేది కాదుగా?’ అంటే ప్రతిసారీ జరుగుతుందా? అయినా, నాకు ఈ ఇన్సూరెన్స్‌లు వేస్టనిపిస్తాయిఅన్నాడు. నాకు కోపమొచ్చి బండి కాబట్టి ఇరవై వేలతో పోయింది. అదే నీకేదైనా అయ్యుంటేఅనగానే అటునుంచి సౌండ్ లేదు.
        అప్పుడు నేను మనీ పర్స్అనే పుస్తకంలో ‘వంగా రాజేంద్రప్రసాద్ ‘ రాసిన ఓ విషయం చెప్పాను. ‘‘గుడి బయట చెప్పులు వదిలితే అవి పోవచ్చు, పోకపోవచ్చు. అయినా రిస్కు తీసుకోకుండా వాటిని రూపాయిచ్చి  దాస్తాం.

ఓ పావుగంట కోసం, అరిగిపోయిన చెప్పుల్ని అంత జాగ్రత్తగా బీమా చేసుకున్న మనం, విలువైన జీవితాన్ని బీమా చేయించడం మరిచిపోవచ్చా? మన జీవితం చెప్పుల కంటే హీనమైనదా?’’ అని! వాడికి జ్ఞానోదయమైనట్లుంది, ‘సాయంత్రం వచ్చినప్పుడు డబ్బుతో పాటు ఆ పుస్తకం కూడా ఇవ్వరాఅంటూ ఫోను పెట్టేశాడు. పోన్లే ఇప్పటికైనా వీడు మారితే చాలనుకుని నా పన్లో నేను పడిపోయా!

------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

Thursday, July 12, 2018

మిర్చిబజ్జీలు


వాతావరణం చలిచలిగా, మబ్బుమబ్బుగా, స్తబ్దుగా ఉంది.

ఇట్లాటి సమయాల్లో కవులు కవితలు రాస్తారు, నాకు మాత్రం - వేడివేడిగా మిర్చిబజ్జీలు తినాలనిపించింది. ఈ
చల్లని సమయంలో 'మిరపకాయ బజ్జీలు తిననివాడు దున్నపోతైపుట్టున్!' అనే నాకు తెలిసిన న్యూనుడి నా ప్రక్కవారి కూడా నచ్చుటచే బజ్జీలకోసం  వేట ప్రారంభం అయ్యింది.


అసలు 'బజ్జీ' అన్న పేరే సెక్సీగా లేదూ! బజ్జీ లేని భోజనం కర్ణుడు లేని భారతంలాంటిదని నా నమ్మకం.
బజ్జీలు అనేక రకాలు - ఘాటైన మిర్చిబజ్జీలు, కమ్మటి వంకాయ బజ్జీలు, రుచికరమైన బంగాళదుంప బజ్జీలు,
మెత్తటి అరటికాయ బజ్జీలు, కరకరలాడే ఉల్లిపాయ బజ్జీలు.. ఇలా రాసుకుంటూ పోవచ్చు.

చదువుకొనే రోజుల్లో స్నేహితుల్తో సాయంకాలాలు మిరపకాయ బజ్జీలు తినడం, గోళీసోడా తాగుతూ కబుర్లు
చెప్పుకోవడం.. నిన్నమొన్నలా అనిపిస్తుంది. మిరపకాయ బజ్జీ నోట్లో కెళ్ళంగాన్లే రాముడులాంటివాడు
రావణుళ్లా వీరావేశంతో ఊగిపోయేవాడు.. మిర్చి ఘాటు ప్రభావం! కాంగ్రెస్ బిజెపి తెలుగుదేశం,అనుకూల, ప్రతికూల గ్రూపులు..అమెరికా ,రష్యా,అనుకూల, ప్రతికూల గ్రూపులు.. కపిలదేవ్, సిద్ధూ,గవాస్కర్, విశ్వనాథ్ క్యాంపులు.. సినిమాలు,….రోజూ చూసే  అమ్మాయిలు కాదేది వాదనకనర్హం?!   

ప్రక్కనున్న ఇద్దరు పిల్లలకి బజ్జీ విశిష్టతనీ, ప్రాచుర్యాన్నీ.. మరీ ముఖ్యంగా బజ్జీలకి నాయకుడైన మిర్చిబజ్జిగాడి రుచిని వివరించి.. ఓ రెండు మిర్చిబజ్జీలు ఆరగించితిని. కంట్లోంచీ, ముక్కులోంచి నీళ్ళు కారుతుండగా, నోరు
కారంతో మండిపోయింది. 'ఉఫ్ఫ్ ఉఫ్ఫ్' అనుకుంటూ, చల్లని నీళ్ళతో కడుపులో సంభవించిన అగ్నిప్రమాదాన్ని
నివారుస్తూ, కురుస్తున్న వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్నా.  

అప్పుడు నా కంటపడిందో దారుణ దృశ్యం. ఇద్దరు పిల్లలు మిరపకాయ బజ్జీలని తోళ్ళూడగొట్టి, మిరపకాయల్ని వేరే
పేపర్లో  పడేసి, బజ్జీ పిండిభాగాన్ని చట్నీ తో నంజుకుంటూ -

" బజ్జీలు భలే బాగున్నయ్!" అన్నారు.

నా మనసు చివుక్కుమంది, గుండె బరువెక్కింది. మిరపకాయల్లేని ఆ శనగపిండి తోళ్ళని బజ్జీలంటారేమిటి!  పైగా
వాటి పక్కన రక్త పిశాచిలా భీతి గొలుపుతూ బోడి చట్నీ ఒకటీ ! ప్లేట్లో - తోళ్ళు కోల్పోయిన మిరపకాయలు, రైలు యాక్సిడెంటయ్యాక వరుసగా పడుకోబెట్టిన నగ్నశవాల్లా దయనీయంగా పడున్నాయ్.

ఏమిటీ దుస్థితి? బజ్జీలని ఇలా హత్య చెయ్యొచ్చునా? తెలుగుభాష  కోసం ఉద్యమాలు చేస్తున్నారు,
తెలుగువంటకాల కోసం ఉద్యమం చేపట్టాలేమో! బజ్జీలు తిన్డం కూడా చేతకాని ఈ కొత్తతరం అజ్ఞానుల కోసం
కోచింగ్ సెంటర్లు అవసరమేమో!

------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

Tuesday, July 10, 2018

‘ఆకుపచ్చ’ విధ్వంస ప్రకంపన కేంద్రాలు




దేశంలో నేల మీదా దాని నేల పొరల కింద వున్న ఖనిజాల మీదా మల్టీ నేషనల్స్ కన్ను పడ్డాకా వాటికి దళారులుగా వున్న దేశీయ పాలకులకి భూమి  నుంచి భూమిపుత్రుని  తొలగించే కార్యక్రమంలో తొలి అడుగు అభివృద్ధి మంత్రం. పాత రోజుల్లో దశాబ్దాలుగా దోపిడీ భూమిపుత్రుని అడవి లోతట్టుకి తరిమితే , ఆ తర్వాత సంక్షేమ పథకాలు అడవి అంచుకు తెచ్చాయి. ఇప్పుడు భూమిపుత్రులు అభివృద్ధి వలలో విలవిలలాడుతున్నారు. బలవంతంగా నిర్వాసితులవుతున్నారు. ఒక చోట పవర్ ప్రాజెక్టు. మరో చోట యినుం కోసమో బాక్సైట్ కోసమో మైనింగ్. ఇంకోచోట భారీ ఆనకట్టలు. అడుగడుగునా ప్రత్యేక ఆర్ధిక మండళ్ళు భూమిపుత్రుని నిలబడ్డ సొంత నేలనుంచి తరిమి కొట్టడానికి వెయ్యినొక్క పద్ధతులు. సామాజిక సంపదని ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టడానికి వంద యెత్తుగడలు. పెసా , 1/70 వంటి చట్టాల్ని నిర్వీర్యం చేసే కుట్రలు. ఖాకీ నీడలో తుపాకి మొనమీద బలవంతపు ప్రజాభిప్రాయ సేకరణలు. భూ దురాక్రమణలు. అడుగడుగునా మానవ హక్కుల వుల్లంఘన. కొత్త శతాబ్దంలో యీ ప్రక్రియ వేగవంతమైంది. వ్యవస్థీకృతమైంది. కాదంటే క్రూర హింస జడలు విప్పుకుంటుంది. సాంస్కృతిక దాడి, దొంగ సంక్షేమ పథకాలు, పోలీసు మిలటరీ చర్యలు వ్యూహం త్రిముఖంగా అమలవుతోంది. అదేంటో యుగ యుగాలుగా యే దేశంలోనైనా అభివృద్ధి యజ్ఞంలో తొలి బలి పశువు భూమిపుత్రులే. పురాణ కాలం నాటి ఖాండవ దహనం దగ్గరనుంచి యివాళ్టి దండకారణ్యం వరకూ ఆకుపచ్చవిధ్వంస ప్రకంపన కేంద్రాలు (epicenters) యెప్పుడూ  భూమిపుత్రుల  ఆవాసాలే.

------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

Monday, July 09, 2018

భూమి బిడ్డ


చీకటంతటినీ రెండు మూటలుగా కట్టి
కావిడి చేసి భుజానికెత్తుకున్నట్టు పట్టి
కష్టాల కావిడితో, బక్కచిక్కిన ఒళ్లునీ
దోసిళ్ళు చేసి రెండు కళ్ళనీ
 షావుకారి జేబువైపు చూస్తూ ఓరగా
 చీకటీ దు:ఖం కలిసి కంట్లోచి... ధారగా
  ఊరు చీకటి ఊయలలో వూగుతోంది … ,
 గడపల్లో నిన్నాగిపోయిన సీరియల్  సాగుతోంది
పొద్దు కొండ మీద అలుపు తీర్చుకుంటోంది ,
 నిత్య పురాతన గీతంలా గెడ్డ
దైన్యం దాచుకున్న భూమి బిడ్డ

------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

Address for Communication

Address card