Saturday, November 16, 2019

తెలుగు కి పట్టిన తెగులు ముందుగా మన ఇంట్లో నిర్ములిస్తే చాలు



తెలుగు భాషని మన ఇళ్లలోనే వాడటం మానేసాం. ఇప్పుడు బళ్ళలో కూడా... ఎప్పుడో కొన్నేళ్ళక్రితం నాయని జయశ్రీ” గారు రాసిన వ్యాసం..మీ కొసం.
  "డోర్ లాక్ చెయ్యకండి"నేను వెళ్తున్నా, డోర్ లాక్ చేస్కో’, ‘నా కార్ కీస్ ఎక్కడ?’ ఇందులో కార్తప్ప అన్నింటికీ అచ్చ తెలుగు పదాలు వాడొచ్చు. కానీ మనం వాడం. ఎందుకు? ఇది ఈరోజు నాకు హఠాత్తుగా వచ్చిన ఆలోచన కాదు. చాలా రోజుల నుంచీ మనసులో నలుగుతున్న ప్రశ్నే.
       ఓ ఇరవై యేళ్ళు వెనక్కి వెళితే, తలుపు తాళం వేసుకో, గడిపెట్టుకో అనే వాళ్ళం. ఇవేకాదు, చిన్నతనంలో వినిన, వాడిన తెలుగు మాటలు మనమే మర్చిపోతున్నాం. నిన్నమొన్నటి వరకు మనం మాట్లాడిన మాటలు. మన పిల్లలకి నేర్పించాల్సింది పోయి, మనమిలా ఎందుకు మారిపోయాం? మన తెలుగులో మాటలు లేవా? ఎందుకు లేవు, భేషుగ్గా ఉన్నాయి. కానీ మనం పలకం.
         వంటింటిని కిచెన్ చేసాం. వసారా వరండాగా మారింది. ఇలా చావడి, పంౘ, ముంగిలి, నట్టిల్లు, తలవాకిలి, నడవ, పెరడు, ఇవన్నీ మరచిపోయాం. మన ఇళ్ళకి చుట్టాలు, బంధువులు రావడం మానేసారు. గెస్ట్‌లే వస్తారు. ఆ వచ్చిన వాళ్ళు మనింట్లో అన్నం తినరు. ఏ లంచో, డిన్నరో చేస్తారు. భోజనానికి కూర్చొన్నాక కంచాలు పెట్టటం మానేసి ప్లేట్లు పెడుతున్నాం. అందులో వడ్డించేవన్నీ రైస్, కర్రీ, గ్రేవీ, ఫ్రై, చికెన్, మటన్ వగైరాలే. అన్నం, కూర, ఇగురు, పులుసు, వేపుడు, కోడికూర, మాంసం తినండి అంటే ఇంకేమన్నా ఉందా, వాళ్ళేమనుకుంటారో అని భయం. అంగడి (కొట్టు) కి వెళ్ళేటప్పుడు సంచి తీసికెళ్ళం. బ్యాగ్ పట్టుకుని షాప్‍కి వెళ్తున్నాము. అందులో వెజిటబుల్స్, ఫ్రూట్స్ వేసుకుంటాము. కూరగాయలు, పళ్ళు కుళ్ళిపోయున్నాయి గదా మరి.
          ఏమండీ మీ మనవరాలికి కానుపు అయ్యిందా అని ఆ మధ్య ఓ పెద్దావిడని అడిగా. ఏంటమ్మా డెలివరీ అయిందా అనకుండా నువ్వింకా కానుపు అంటావేంటి? అని ఎదురు ప్రశ్న వేసింది. బిత్తరపోవడం నావంతయింది.     

          టీవీలో వచ్చే ఆరోగ్య కార్యక్రమాలు, వంటా-వార్పు కార్యక్రమాలు రోజూ చూసే వాళ్ళకి అలవోకగా ఆంగ్లపదాలు. పట్టుబడతాయి మరి. అందుకే ఆవిడ అలా అని ఉండొచ్చు.
          టీవీ వంటల కార్యక్రమంలో ఒకావిడ మనకి వంటకం ఎలా చెయ్యాలో చెబుతుంది. అది ఏ భాషో మీరే చెప్పండి.కొంచెం సాల్ట్, మిర్చీపౌడర్, ధనియాపౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్‍చేసి, ఫైవ్ మినిట్స్ కుక్ చెయ్యలి, స్టౌవ్ ఆఫ్‍చేసి మసాలాపౌడర్ యాడ్ చేసి బాగా మిక్స్ చెయ్యాలి.ఇలా సాగుతుంది. మరి మన కూరలకి అల్లం, వెల్లుల్లి, ఉప్పూ, కారాల రుచులు ఎలా తగుల్తాయి?
          నిన్న మా పక్కింటాయన వచ్చిమా సిస్టర్స్ సన్ ది మేరేజ్ ఉందండి, ఊరికి వెళ్తున్నాం, ఇల్లు కాస్త చూస్తుండండిఅని చెప్పి వెళ్ళాడు. మేనల్లుడి పెళ్ళి అనడంలో ఎంత దగ్గరితనం ఉంటుంది? ఎందుకిలా ముచ్చటైన పదాల్ని వాడటానికి కూడ మనం వెనుకాడుతున్నాం?
          అమ్మ, నాన్న అని పిలవడం ఎప్పుడో మానేసాం. అత్త, మామ, బాబాయ్, పిన్ని, పెద్దమ్మ, పెదనాన్న అందరూ పోయి ఆంటీ అంకుల్ మిగిలారు. ఇప్పుడు అక్క, అన్నా, బావ, మరిది, వదిన, మరదలు వగైరాలంతా దూరమై కజిన్స్ అయిపోయారు
           పిల్లల్ని బడికి పంపడం కూడ మానేసాం. స్కూల్‍కే పంపిస్తాం. సరే బడికి వెళ్ళాక వాళ్ళకి ఎలాగూ ఇంగ్లీషులో మాట్లాడక తప్పదు. ఇంటి దగ్గరన్నా తెలుగు మాటలు మాట్లాడాలని అనుకోము.
          మనం ఎందుకు నిన్నటి వరకు వాడిన తెలుగు మాటలని వదిలేస్తున్నాం? ఎక్కువ ఇంగ్లీషు పదాలు వాడితే మనకి సమాజంలో గౌరవం లభిస్తుంది అనుకుంటున్నామా?
            తెలుగు మాటలు మనకి మొరటుగా ఎందుకనిపిస్తున్నాయి? ఇది పరభాషా వ్యామోహం మాత్రమే కాదు. నాకూ ఇంగ్లీషు ముక్కలు వచ్చు, నేనేం తక్కువ కాదు అని మనకి మనం చెప్పుకోవడం, ఇతరులు అనుకోవాలన్న భావన. ఇలా ఆలోచిస్తాం కాబట్టే మన తెలుగు భాషకు దిక్కులు లేకుండా పోయాయి.
            ఒకప్పుడు సంస్కృతం పట్ల ఇదే దృక్పథం అలవరచుకున్న తెలుగు వాళ్ళు తూర్పు పడమర మిగిల్చారు కానీ ఉత్తరం దక్షిణం మరచిపోయారు. ఈ కాలంలో వడ’, ‘తెన్నుఅంటే ఎవరికి తెలుస్తుంది? ‘జనని సంస్కృతంబె ఎల్ల భాషలకునుఅని భావించిన గొప్పగొప్ప పండితులు వారి పాండిత్య ప్రకర్ష కోసం తెలుగు మాటలు వదిలేసి సంస్కృతం వాడటం మొదలుపెట్టారు.
             వారి దగ్గర పాఠం వల్లెవేసిన వాళ్ళకి అదే గీర్వాణం వంటబట్టింది. అదే వరవడిలో మనకి పగలు మిగిలింది, ‘మావు చీకట్లో కలిసిపోయింది. ‘’ఉసురుకి ప్రాణం పోయింది. ఎడం దూరం అయింది. అన్నం తినడం మొదలు పెట్టాక కూడు చద్దిపట్టింది.
        ప్రస్తుతం మనం సంతోష పడాలన్నా, బాధ పడాలన్నా, ఆఖరికి భయపడాలన్నా సంస్కృతంలోనే పడుతున్నాం. ఇలా చెబుతూ పోతే వీటికి అంతే లేదు. వివిధ జానపద కళారూపాలలో ఉన్న ఆనాటి తెలుగు సాహిత్యం, శాసనాలు దేశీయ ఛందస్సు లోనే ఉండేవి. తెలుగు కవులు దేశి కవిత్వాన్ని వదిలి మార్గ కవిత బాట పట్టడంతో చాప కింద నీరులా భాషలో మార్పు వచ్చింది.
        ఇంత జరిగినా మన పల్లె పట్టుల్లో మాత్రం జానపద కళలు నిన్న మొన్నటి వరకు బతికే ఉన్నాయి. వారి నోట అచ్చ తెనుగు మాటలే వినిపించేవి. ఇప్పుడు మాత్రం పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా అందరికీ ఇంగ్లీష్ మాటలు బాగా వంటపట్టాయి.
           ఈ మధ్య ఓ సారి ప్రయాణం మధ్యలో ఒక చిన్న పల్లెటూర్లో కారు ఆపి ఇక్కడ మంచినీళ్ళ సీసాలు ఎక్కడ అమ్ముతారు బాబూ అని ఒకతన్ని అడిగా. అతడు కొంచెం వింతగా నావైపు చూసి, మినరల్ వాటర్ బాటిల్సా మేడం? అన్నాడు. అవునయ్యా అన్నా. అలా చెప్పండి మేడం అర్థం అవుతుంది, అని అవి అమ్మే చోటు చూపించాడు.    

             మూలమూలలకి విస్తరించిన టివి ప్రసారాలు, ఇంటర్నెట్ల ప్రభావం వలన ఈ మార్పు చాల త్వరగా జరుగుతూ ఉంది.
         భాషలో లేని పదాలను పరభాషల నుంచి తెచ్చుకొని వాడుకోవడం వల్ల ఆ భాష పరిపుష్టమౌతుంది. అలాగని వాడుకలో ఉన్నమాటలని వదిలేసి పరభాషా పదాలు వాడటం వల్ల భాష క్షీణించిపోతుంది.
               ఇంకా సమయం మించిపోలేదు. ప్రస్తుతం వాడుకలో ఉన్న తెలుగు మాటలు అంతరించి పోకుండా ఉండాలంటే మనం వీలైనంత వరకు తెలుగు మాటలే వాడాలి. బయటకెళితే ఎలాగు తప్పదు అనుకున్నా,కనీసం ఇంటి గోడల నడుమైనా ఆపని చేద్దాం. అవసరం లేని ఆంగ్ల పదాలకు డోర్ లాక్ చేసి, అచ్చ తెలుగు మాటలకు తలుపులు తెరుద్దాం. -జయశ్రీ నాయని
మొత్తం చదివాకా, నా తెలుగు కి పట్టిన తెగులు ముందుగా మన ఇంట్లో నిర్ములిస్తే చాలు అనిపిస్తోంది.

దేవుడికి తెలుగు రాదు


“తెలుగు” ను ఎందుకు “పరిపాలన భాష” గా అమలు చేయలేరు!?.


  
              ప్రభుత్వం లో అధికారభాష ఆంగ్లం . ఫైల్స్ అన్నీ ఆంగ్లం లోనే నడుస్తాయి.న్యాయ స్థానాలు లో మరీదారుణం ..కక్షిదారులు కి తెలుగు తప్ప ఏ భాషా రాదు.అయినా సరే వాదాలు అన్నీ ఆంగ్లం లో రాస్తారు.ఎందుకో అలా... బ్యాంక్ లావాదేవీలు గూడా తెలుగులోనే జరగాలి.  ఆదాయ,నివాస,జనన, మొదలైన ద్రువీకరణ లే కాదు  రకారకాల  ప్రభుత్వ  విభాగాల ఉత్తర ప్రత్యుత్తరాలనన్నీ ఆంగ్లం  లొనే వుంటున్నాయి. సామాన్య జనానికి వ్యవహారాలలో ఏమి జరుగుతోందో తెలియటంలేదు. వారి నిబ్బరాలు దెబ్బతింటున్నాయి
               ప్రభుత్వం తెలుగును స్కూల్స్ లో ఒక సబ్జెక్టుగా పెట్టిప్రోత్సహిస్తామని చెబుతున్నది కానీ ఆఫీసులలో మటుకు ఆంగ్లం ఫైల్స్ చక్కర్లు కొడుతున్నాయి.
               తెలుగుభాషను క్షీణ దశ నుంచి బయటకు తీసురావాలంటే ..శుభోదయం, శుభ మధ్యాహ్నం, శుభ సాయంత్రం, శుభరాత్రి అని తెలుగులో చెప్పుకుంటే  సరిపోదు. ప్రజలు కూడా ప్రభుత్వం తో ఉత్తర  ప్రత్యుత్తరాలను ,ఫిర్యాదులను తెలుగులోనే చెయ్యాలి, ప్రభుత్వమూ తెలుగు లోనే జవాబివ్వాలని ఒత్తిడిచెయ్యాలి. ప్రభుత్వం పూనుకుంటేనే సామాన్యులు అనుసరిస్తారు.
               వెంకయ్యగారన్నట్లు రెండురాష్ట్రాల్లో ఉద్యోగాలకు తెలుగు వచ్చిఉండటం ఒక అర్హత కావాలి,’ కోర్టుల్లో కూడా వాదోపవాదాలు,తీర్పులు తెలుగులోనే అమలయ్యేలా చూడాలి. ప్రభుత్వం లోని మంత్రులంతా వాళ్ళకు పంపబడే ఫైళ్ళు అన్నీ ఖచ్చితంగా తెలుగులోనేఉండాలనే నిబంధన పాటించాలి!. అదే విధంగానే సెక్రటేరియట్ మాన్యువల్, బిజినెస్ రూల్స్లో గూడా ఆ నిబంధనను చేర్చాల్సిన ఆవశ్యకతను ముఖ్యమంత్రి గారు గుర్తించాలి, చక్కగా తెలుగులో రాయడం వలన ఆంగ్లం రానివారు తేలికగా. అర్థం చేసుకునే వీలుంది.
                      ఇప్పుడు ప్రభుత్వ ప్రయివేటు కార్యక్రమాలకు ఆధునిక ,సాంకేతిక పరికరాల వాడుక తప్పనిసరి. వాటిలో ఇప్పుడు తెలుగు వాడకం అనుకూలం కనుక, తెలుగును ప్రభుత్వం కాని, న్యాయవిభాగం కాని, ప్రజలు కాని వ్యవహారికి భాషగా వాడటానికి ఏ ఇబ్బంది లేదు.తగిన వనరులు. పరికరాలు, పారిభాషికా పదాలు... గట్రా... లేవన్నకుంటి సాకులు చూపకుండా, ప్రస్తుత సోషల్ మీడియాలో ఎంత చక్కని తెలుగు లోసామాన్యులూ కూడా తమ భావాలు వ్యక్తపరుస్తున్నది చూస్తూనే ఉన్నాము          
                మన ఉద్యోగులు, తెలుగు వాళ్ళుగా పుట్టి   “ప్రజల భాష అయిన తెలుగు”  ను ఎందుకు పరిపాలన భాషగా అమలు చేయలేరు!?.     
             తెలుగు లో పాలనా, విద్య అన్నీ జరిగితేనే జాతి మొత్తంఅభివృద్ధి సాధిస్తుంది . యూరోపు , చైనా, జపాన్ , కొరియాల మాతృభాషలో భోధనలు పాలనల వల్ల ప్రజలలో పెక్కుమందికి పాలుపంచుకుని పురోగతికి తోడ్పడే అవకాశంలభించడం వల్ల ఆ సమాజాలు దూసుకెళ్ళాయి అనేది మన పాలకులు, విద్యావేత్తలు , అధికారులు గ్రహించాలి
            మొదట మన భాషా మన రాష్ట్రం అనేది ప్రతి వారి నరనరానా రుధిరాన విప్లవ ఘోషలా ప్రసరించాలి, తెలుగుభాషకి  గౌరవం  ఇచ్చి, తన స్థాయిని పెంచాలి అని మనస్పూర్తిగా కృషి చేసేవారిలో నా దృష్టిలో ప్రధమ స్థానం నూర్ భాషా రహంతుల్లా గారిదే, నాకు తెలిసినంత వరకూ రహంతుల్లా గారు తెలుగు కోసం తపించేంతగాఎవ్వరూ అంతగా కృషి చేయడం నేను చూడలేదు.
                    పక్క రాష్ట్రం తమిళనాడులో వాళ్ళమాతృభాషకి ఇచ్చుకున్న ప్రాధాన్యం మనం మన భాషకి ఇవ్వడం లేదు, వాళ్ళ రాష్ట్రంవెళ్తే ఒక్క బోర్డ్ కూడా పరాయి భాషలో కనపడదు, అన్నీ తమిళంలోనే వుంటాయి, ఒకవేళ ఆంగ్లం లో రాసినా కూడా మొదటగా వాళ్ళ మాతృభాషలో రాసి ఆ తర్వాత ఆంగ్లము వాడరు, అది వాళ్ళు వాళ్ళ భాషకి ఇచ్చే గౌరవ స్థానం, మర్యాద!!
                రహంతుల్లా గారి మాటల్లోఅమ్మఒడి, బడి, ఏలుబడి'......ఈ మూడింటిలోతెలుగును సంపూర్ణంగా అమలుచేసినపుడే మాతృభాష మనగలుగుతుంది.....లేదంటే మృతభాషగా మారిపోతుంది”
                పేదలు - ఆంగ్లం చదువులు విషయానికి వస్తే .. ఎంతమంది పేదల పిల్లలు ఆ ఉచిత బళ్ళలో చేరి, చదువు పూర్తిగా కొనసాగిస్తున్నారు   . ఆంగ్లలో భొదిస్తే చాలా మంది ప్రైవేటు బళ్ళలో చేరటం మానేస్తారా? తెలీదు.
            ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల విద్యలేక చాలా మంది ప్రైవేటు వాటికి వలస పోతున్నారన్న నేపధ్యంలో, ఈ నిర్ణయం జరిగినా, సెంట్రల్ సిలబస్ చేర్చటం వెనుక ఉన్నది ఆర్థిక కారణమే అని గ్రహించాలి. ఈ CBSC సిలబస్ పెడితే కేంద్రప్రభుత్వం 12వ తరగతి వరకూ కొన్ని రాయితీలూ,ఫండ్స్ ఇచ్చి ప్రోత్సహిస్తుంది. అవి ప్రస్తుతం ఉన్న రాష్ట్రపరిస్థితుల్లో చాలా అవసరం.


Address for Communication

Address card