Thursday, June 11, 2015

ఉన్నత విద్యకు ఆర్థిక ప్రోత్సాహం





ప్రభుత్వఫీజురీయింబర్స్‌మెంట్ పథకం
 
ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు ఆర్థిక చేయూతనందించే క్రమంలో అత్యంత ప్రధానమైనది ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం. దీన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ వర్గాలకు అందజేస్తారు. ఇంటర్మీడియెట్ నుంచి పీహెచ్‌డీ వరకు అన్ని కోర్సులకు ఈ పథకం అందుబాటులో ఉంది. ఆయా కోర్సులు, కమ్యూనిటీ, కుటుంబ వార్షిక ఆదాయ పరిమితికి సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన మొత్తాల మేరకు ఫీజు రీయింబర్స్ చేస్తారు. విద్యార్థుల స్థానికత ఆధారంగా రీయింబర్స్‌మెంట్ పొందొచ్చు. బీటెక్, బీఫార్మసీ కోర్సులకు సంబంధించి దాదాపు గతేడాది మాదిరిగానే ఏపీ ఫీజు రీయింబర్స్‌మెంట్ విధి విధానాలు ఉంటాయని ఎంసెట్-2015 ఫలితాల వెల్లడి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. తెలంగాణలోనూ ఈ ఏడాది కూడా గత విధానాన్నే అమలు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గతేడాది నిర్దేశించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ అర్హతలు, విధి విధానాల వివరాలు..

 
ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తం:
 
ఆంధ్రప్రదేశ్ అడ్మిషన్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (ఏఎఫ్‌ఆర్‌సీ) 2013-14 నుంచి 2015-16 బ్లాక్ పిరియడ్‌కు ఇంజనీరింగ్ కళాశాలలకు వాటి ప్రమాణాల ఆధారంగా వేర్వేరు మొత్తాల్లో ఫీజులు వసూలు చేసుకోవచ్చని పేర్కొంది. ఈ క్రమంలో కనిష్టంగా రూ. 30 వేల నుంచి గరిష్టంగా 1.13 లక్షల వరకు ఫీజులు వసూలు చేసుకునే అవకాశం కళాశాలలకు లభించింది. అయితే ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో సీలింగ్ విధించింది. గరిష్టంగా సంవత్సరానికి రూ. 35 వేలు రీయింబర్స్‌మెంట్ చేస్తున్నట్లు అప్పట్లో ప్రకటించింది. అదే విధంగా బీఫార్మసీ కోర్సుకు రూ. 31 వేలు గరిష్ట పరిమితిగా పేర్కొంది.సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకు సంవత్సరానికి రూ. 20 వేలు. వీటితోపాటు మరికొన్ని నిబంధనలు విధించింది. అవి..

 
ఎస్సీ, ఎస్టీ వర్గాల విద్యార్థుల కుటుంబ వార్షికాదాయ పరిమితి రెండు లక్షల్లోపు ఉండాలి.బీసీ, ఓబీసీ, ఈబీసీ, మైనారిటీ వర్గాల కుటుంబ వార్షికాదాయం రూ. లక్షలోపు ఉండాలి.కమ్యూనిటితో సంబంధం లేకుండా పది వేల లోపు ర్యాంకు పొందిన విద్యార్థులందరూ ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందొచ్చు గతేడాది గరిష్ట వయోపరిమితి నిబంధన కూడా అమలు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు గరిష్ట వయోపరిమితి 29 సంవత్సరాలు; ఓసీ, మైనారిటీ వర్గాల విద్యార్థులకు 25 సంవత్సరాలుగా పేర్కొన్నారు.ఈ ఏడాది కూడా దాదాపు ఇవే నిబంధనలు అమలు కానున్నట్లు అధికార వర్గాల సమాచారం.

 
స్థానికత నిర్ధారణ ఇలా..
 
సీట్ల కేటాయింపు, ఫీజుల రీయింబర్స్‌మెంట్ పరంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న లోకల్ (స్థానికత) నిర్ధారణకు ప్రస్తుతం అమల్లో ఉన్న విధానాలు.. ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరంతో కలిపి అంతకుముందు నాలుగేళ్లపాటు ఏ ప్రాంతంలో చదివితే ఆ ప్రాంతానికి స్థానిక అభ్యర్థిగా పరిగణిస్తారు. ఉదాహరణకు తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం వరకు ఎస్వీయూ రీజియన్‌లో చదివితే.. ఎస్వీయూ రీజియన్‌కు లోకల్ అభ్యర్థి అవుతారు. అదే విధంగా ఏయూ రీజియన్‌లో చదివితే.. ఏయూ రీజియన్‌కు లోకల్ అభ్యర్థి అవుతారు.

 
ఒక వేళ అభ్యర్థులు వేర్వేరు ప్రాంతాల్లో తమ విద్యాభ్యాసం సాగిస్తే (బ్రేక్ అప్ ఆఫ్ స్టడీ) ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం నుంచి గడిచిన ఏడేళ్ల కాలంలో చదివిన ప్రాంతాలను గుర్తించి ఎక్కువ కాలం చదివిన ప్రాంతానికి లోకల్ అభ్యర్థిగా పరిగణిస్తారు. అదే విధంగా మూడు రీజియన్లలోనూ చదివుండి అందులో రెండు రీజియనల్లలో సమాన కాలం చదినట్లయితే ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన ప్రాంతానికే లోకల్ అభ్యర్థిగా పరిగణిస్తారు. ఉదాహరణకు పదో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ రెండేళ్లు (మొత్తం మూడేళ్లు) ఏయూ రీజియన్‌లో, ఏడో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు(మొత్తం మూడేళ్లు) ఓయూ రీజియన్‌లో,ఆరో తరగతి (ఒక సంవత్సరం) ఎస్వీయూ రీజియన్‌లో చదివితే..

 
ఇంటర్మీడియెట్, పదో తరగతి పూర్తి చేసిన ప్రాంతమైన ఏయూ రీజియన్‌కు లోకల్‌గా పరిగణిస్తారు.అదే విధంగా బ్రేక్ అప్ ఆఫ్ స్టడీ ఇయర్స్‌కు సంబంధించి మొత్తం ఏడేళ్ల కాలంలో మొదటి మూడున్నరేళ్లు ఒక రీజియన్‌లో, మరో  మూడున్నరేళ్లు ఇంకో రీజియన్‌లో చదివితే ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన రీజియన్‌కు లోకల్ అభ్యర్థులవుతారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అవసరమైన పత్రాలు(ఏపీ)కుల ధ్రువీకరణ పత్రం  కుటుంబ ఆదాయ ధ్రువీకరణ పత్రం (జనవరి 1, 2015 తర్వాత జారీ చేసిన)

 
బ్యాంకు రుణాలు.. మరో మార్గం
 
బీటెక్ ఔత్సాహికులకు కోర్సు వ్యయాలు భరించేందుకు అందుబాటులో ఉన్న మరో అవకాశం.. బ్యాంకు రుణాలు. ఇప్పుడు ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ విద్యా రుణాలు అందజేస్తున్నాయి. ట్యూషన్ ఫీజు, బుక్స్, కంప్యూటర్ కొనుగోలు, స్టడీ టూర్స్ వంటి మొత్తాలకు సరిపడే విధంగా రుణాలు అందిస్తున్నాయి. వీటిని పొందేందుకు కొన్ని విధి విధానాలు అమలవుతున్నాయి. అవి..

 
భారతదేశంలో చదవడానికి గరిష్టంగా రూ. పది లక్షలు అందిస్తారు (కోర్సు మొత్తం)
 
రూ. నాలుగు లక్షల రుణం వరకు ఎలాంటి మార్జిన్ ఉండదు. రుణ మొత్తం రూ. నాలుగు లక్షలు దాటితే 5 శాతం (భారతదేశంలో) మార్జిన్ చెల్లించాలి.రూ. నాలుగు లక్షల రుణం వరకు ఎలాంటి సెక్యూరిటీ అవసరం లేదు. తల్లిదండ్రుల హామీ సరిపోతుంది.రూ. నాలుగు లక్షల నుంచి రూ. ఏడున్నర లక్షల వరకు తల్లిదండ్రుల హామీతోపాటు థర్డ్‌పార్టీ కొల్లేటరల్ సెక్యూరిటీ చూపించాలి. రూ. ఏడున్నర లక్షల కంటే ఎక్కువ మొత్తం రుణం కావాలంటే తల్లిదండ్రుల హామీతోపాటు స్థిరాస్థిని కొల్లేటరల్ సెక్యూరిటీగా చూపించాలి.ఈ నిబంధనలు పాటిస్తే నామమాత్రపు వడ్డీతో రుణం మంజూరవుతుంది. తిరిగి చెల్లింపు విషయంలోనూ వెసులుబాటు లభిస్తుంది. కోర్సు పూర్తయిన సంవత్సరం తర్వాత నుంచి లేదా కోర్సు పూర్తి చేసి ఉద్యోగంలో చేరాక ఆరు నెలల తర్వాత నుంచి (ఈ రెండిటిలో ఏది ముందు సాధ్యమైతే అప్పటి నుంచి) రుణం నెల వాయిదాల్లో తిరిగి చెల్లించాలి.
 
వెబ్‌సైట్:www.iba.org.in

 
స్కాలర్‌షిప్ సదుపాయాలు
 
ఇంజనీరింగ్ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, బ్యాం కు రుణాలతోపాటు పలు స్కాలర్‌షిప్ పధకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి ఫీజు మొత్తాన్ని అందించకపోయినా నెలవారీగా నిర్దేశిత మొత్తాలు లభిస్తాయి.

 
ఎన్‌టీపీసీ స్కాలర్‌షిప్స్ ఫర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్:
 
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ సంస్థ ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్, కంప్యూటర్‌సైన్స్, ఎలక్ట్రానిక్స్/కమ్యూనికేషన్ బ్రాంచ్‌లలో ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదివే ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ విద్యార్థుల కోసం అందిస్తున్న స్కాలర్‌షిప్ స్కీం ఇది. వెబ్‌సైట్:

 
సెంట్రల్ సెక్టార్ స్కీం ఆఫ్ స్కాలర్‌షిప్స్:
 
కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఉన్నత విద్య ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు ప్రవేశపెట్టిన పథకం సెంట్రల్ సెక్టార్ స్కీం ఆఫ్ స్కాలర్‌షిప్స్. జాతీయ స్థాయిలో అమలు చేసే ఈ పథకం ద్వారా మొత్తం 82 వేల గ్రాడ్యుయేట్/పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ అందిస్తారు. వీటిలో సగం మహిళా విద్యార్థులకు అందిస్తారు. ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.వెయ్యి చొప్పున సంవత్సరంలో పది నెలలపాటు స్కాలర్‌షిప్ లభిస్తుంది.
 
వెబ్‌సైట్:www.cbse.nic.in

 
ఎల్‌ఐసీ గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ స్కీమ్:
 
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అందిస్తున్న స్కాలర్‌షిప్ పథకం ఇది. కుటుంబ వార్షికాదాయం రూ.లక్షలోపు ఉండి ఇంటర్మీడియెట్ వరకు 60 శాతం మార్కులతో అకడమిక్ రికార్డ్‌తోపాటు ఏఐసీటీఈ, యూజీసీ వంటి సంస్థల గుర్తింపు ఉన్న ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశం పొందిన విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌కు అర్హులు. అకడమిక్ మెరిట్, తల్లిదండ్రుల ఆదాయ పరిమితి ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.వెయ్యి చొప్పున సంవత్సరానికి పది నెలలు స్కాలర్‌షిప్ లభిస్తుంది.
 
వెబ్‌సైట్:www.licindia.in

 
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ స్కాలర్‌షిప్స్
 
గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్‌లో ఇంజనీరింగ్ కోర్సు అడ్మిషన్ ఖరారు చేసుకున్న విద్యార్థులకు అందుబాటులో ఉన్న స్కీం ఇది. కుటుంబ వార్షికాదాయం రూ.లక్షలోపు ఉండాలి. స్కాలర్‌షిప్‌నకు ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ. మూడు వేలు వరకు ఆర్థిక చేయూత లభిస్తుంది.

 
వెబ్‌సైట్:www.iocl.com
 
ఏఐసీటీఈ - PRAGATI స్కాలర్‌షిప్స్
 
టెక్నికల్ ఎడ్యుకేషన్ రంగంలో మహిళలను ప్రోత్సహించేందుకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న స్కాలర్‌షిప్ పథకం PRAGATI (Providing Assistance for Advancement of Girl Participation in Technical Education) సింగిల్ గర్ల్ చైల్డ్‌గా ఉన్న విద్యార్థినులు ఈ స్కాలర్‌షిప్‌కు అర్హులు. కుటుంబ వార్షికాదాయం రూ. ఆరు లక్షల్లోపు ఉండాలి. జాతీయ స్థాయిలో ఏటా నాలుగు వేల మంది విద్యార్థినులకు ఈ స్కాలర్‌షిప్ అందిస్తున్నారు. అకడమిక్ రికార్డ్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన విద్యార్థినులకు గరిష్టంగా రూ. 30 వేల ట్యూషన్ ఫీజుతోపాటు సంవత్సరంలో పది నెలలపాటు నెలకు రూ. రెండు వేలు స్కాలర్‌షిప్ లభిస్తుంది.
 
వెబ్‌సైట్:www.aicte-india.org

 
పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ ఫర్ మైనారిటీస్
 
కేంద్ర మైనారిటీ సంక్షేమ శాఖ.. మైనారిటీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా అమలు చేస్తున్న స్కాలర్‌షిప్ పథకమిది. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ. మూడు లక్షల్లోపున్న మైనారిటీ వర్గాలకు చెంది న విద్యార్థులు అర్హులు. ఎంపికైన విద్యార్థులకు అడ్మిషన్ ఫీజు, ట్యూషన్ ఫీజు, మెయింటనెన్స్ అలవెన్స్ చెల్లిస్తారు.
 
వెబ్‌సైట్: www.minorityaffairs.gov.in

Tuesday, June 09, 2015

మొబైల్ బ్యాంకింగ్



మొబైల్ బ్యాంకింగ్ అంటే ఏ సమయంలోనైనా సురక్షితంగా బ్యాంక్ ఖాతాను నిర్వహించుకునే వెసులుబాటు. రెండేళ్ల క్రితమే మొబైల్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చినా, ఈ సదుపాయం వినియోగిస్తున్న వారు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నారు. 81 కోట్ల మొబైల్‌ కనెక్షన్లు ఉన్న దేశంలో, భవిష్యత్తులో మొబైల్‌ బ్యాంకింగ్‌ వినియోగదార్ల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుందని బ్యాంకర్లు భావిస్తున్నారు. మొబైల్‌ బ్యాంకింగ్‌ వినియోగానికి ఏ విధమైన రుసుమును బ్యాంకులు వసూలు చేయడం లేదు.

సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో ప్రతి ఒక్కటీ మన ముంగిటకే వస్తున్నాయి. అలాగే ఇప్పుడు బ్యాంక్ లావాదేవీల్లో కూడా విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అందుకే ఉదాహారణే ఈ మొబైల్ బ్యాంకింగ్. మనం ఎక్కడ ఉంటే అక్కడినుంచే మొబైల్ ఫోన్ ద్వారా కేవలం ఒక్క ఎస్‌ఎంఎస్ పంపిస్తే మనకు కావాల్సిన సేవలపై బ్యాంకు ఆదేశాలు ఇవ్వడమే మొబైల్ బ్యాంకింగ్. ఈ మొబైల్ బ్యాంకింగ్ వల్ల కొన్ని ప్రయోజనాలుంటే మరికొన్ని నష్టాలు కూడా ఉన్నాయి.

మొబైల్ బ్యాంకింగ్ వల్ల ప్రయోజనాలు:
* ఎప్పుడైనా బ్యాంకింగ్: మొబైల్ బ్యాంకింగ్ సహాయంతో ఎప్పుడైనా, ఎక్కడనుంచైనా బ్యాంకు లావాదేవీలను నిర్వహించవచ్చు. ముఖ్యంగా నాన్ బ్యాంకింగ్ అవర్స్‌లో ఇది ఎంతగానో ఉపయోగం. మీరు ఇంట్లో నుంచే మీ డెస్కటాప్, ల్యాప్ టాప్‌ల సాయంతో బ్యాంకింగ్ లావాదేవీలు చేయవచ్చు.

* మొబైల్ బ్యాంకింగ్ ఉచితం: మొబైల్ బ్యాంకింగ్ అనేది ఉచితం. దీనికి బ్యాంకులు ఎలాంటి రుసుము వసూలు చేయవు. దీనికల్లా మీరు చేయాల్సింది మీ మొబైల్ నెంబర్‌ను రిజిస్టర్ చేసుకోవడమే.

* సెక్యూర్ బ్యాంకింగ్: బ్యాంకులు మొబైల్ అప్లికేషన్‌ని ప్రారంభిస్తాయి. వాటిని మనం గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకుంటాం. బ్యాంకు లావాదేవీలు అన్నీ కూడా బ్యాంకు సర్వర్‌లోనే నిక్షిప్తం అవుతాయి. మీ ఫోన్ లేదా సిమ్ కార్డులో స్టోర్ అవ్వవు.

మొబైల్ బ్యాంకింగ్ వల్ల నష్టాలు:
* స్మార్ట్ ఫోన్ లేని వారు మొబైల్ బ్యాంకింగ్ లావా దేవీలను నిర్వహించ లేరు.

* మీ స్మార్ట్ ఫోన్‌లో వైరస్ ఉన్నట్లైతే మొబైల్ బ్యాంకింగ్ కన్నా, ఇంటర్నెట్ బ్యాంకింగే అత్యంత ఉత్తమం అని నమ్మేవాళ్లు చాలా మంది ఉన్నారు.

* మార్కెట్లో స్మార్ట్ ఫోన్‌లకు తక్కువ యాంటీ వైరస్ సాప్ట్ వేర్లు ఉండటం మరో కారణం. మొబైల్ బ్యాంకింగ్ సేఫ్‌గా నిర్వహించాలంటే స్మార్ట్ ఫోన్‌లో యాంటీ వైరస్ తప్పనిసరి.

మొబైల్ బ్యాంకింగ్‌లో పేరు ఎలా నమోదు చేసుకోవాలి:
* మొబైల్ బ్యాంకింగ్ సదుపాయం పొందాలనుకునే వారు ఆ సదుపాయం అందిస్తున్న ఏదైనా ఒక బ్యాంకులో ఖాతాదారులైవుండాలి.

* దేశంలోని మొబైల్ సర్వీసులు అందిస్తున్న సంస్థల్లో ఏదో ఒక సంస్థ చందాదారులై ఉండాలి. ఆ మొబైల్ సంస్థకు, బ్యాంకుకు మధ్య మొబైల్ బ్యాంకింగ్ సేవలందించే విషయంలో భాగస్వామ్య ఒప్పందం కలిగివుండాలి. మీ మొబైల్ నెంబరును బ్యాంక్‌కు తెలియజేయాలి.

* మొబైల్ బ్యాంకింగ్ సేవలు పొందాలనుకునే వారు సంబంధిత బ్యాంకులో నిర్దిష్ట దరఖాస్తు ఫారం పూర్తి చేయడం ద్వారా ఆ సేవలను తమకు విస్తరింపజేయాలంటూ బ్యాంకును అభ్కర్ధించాలి. ఏ ఖాతా ద్వారా మొబైల్ బ్యాంకింగ్ సేవలు అందుకోవాలనుకుంటున్నారో ఆ ఖాతాను మీ ఖాతా ఐడీని అనుసంధానం చేయాలి. ఒక ఖాతాదారుడు ఒకే ఐడీతో గరిష్టంగా అయిదు ఖాతాలతో అనుసంధానం కావచ్చు.

* సంబంధిత బ్యాంకు మీకు మొబైల్ బ్యాంకింగ్ పిన్ ఇస్తుంది. ఆ పిన్ ఆధారంగా లావాదేవీలు నిర్వహించుకోవాలి. మీకు ఇచ్చిన పిన్ నెంబరు చాలా జాగ్రత్తగా టైప్ చేయాలి. పొరపాటున తప్పుడు నెంబరు టైప్ చేయకూడదు. ఒకవేళ పొరపాటున టైప్ చేసినా మూడుసార్లు వరుసగా తప్పుడు నెంబరు టైప్ చేస్తే ఖాతా స్తంభించిపోతుంది.

మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ఎలాంటి సేవలు పొందవచ్చు:
1. ఖాతాలోని బ్యాలెన్స్ వివరాలు
2.
గతంలో చేసిన మూడు లావాదావీల వివరాలు
3.
చెక్ బుక్
4.
చెక్ పేమెంట్ నిలిపివేతకు ఆదేశం జారీచేసే అవకాశంవుంది
5.
ఫిక్స్‌డ్ డిపాజిట్ వివరాలు
6.
విద్యుత్, మొబైల్ ఫోన్, బేసిక్ ఫోన్ బిల్లుల చెల్లింపులు తదితర సేవలను వినియోగించుకోవచ్చు.

తక్కువ సమయంలో పెద్ద మొత్తంలో నగదుని ఎలా తీసుకురావాలో ఇప్పుడు చూద్దాం



మనలో చాలా మంది వారు సంపాదించిన డబ్బుని షేర్లు, మ్యూచువల్ ఫండ్ల రూపంలో పెట్టుబడి పెడుతుంటారు. ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు అత్యవసరంగా నగదు అవసరమవుతుంది. ఇలాంటి ఎమర్జెన్సీ సమయంలో ఎక్కువ వడ్డీకి డబ్బుని అప్పుగా తీసుకు రావడం మనం చూస్తుంటాం. మెడికల్ ఎమర్జెన్సీలో మన దగ్గర నగదు లేనప్పుడు, తక్కువ సమయంలో పెద్ద మొత్తంలో నగదుని ఎలా తీసుకురావాలో ఇప్పుడు చూద్దాం.

గోల్డ్ లోన్: మీ వద్ద ఉన్న బంగారాన్ని బ్యాంకులో కుదవ పెట్టి లోన్ రూపంలో నగదుని పొందవచ్చు. బంగారానికి వ్యతిరేకంగా మీరు 85 శాతం నగదు పొందేందుకు వీలుంది. బంగారంపై బ్యాంకులు విధించే వడ్డీ శాతం కూడా తక్కువగా ఉంటుంది. మీకు తక్కువ క్రెడిట్ రేటింగ్ ఉన్నా కూడా బంగారం లోన్ పోందే అవకాశం ఉంది. 

క్రెడిట్ కార్డు ద్వారా నగదు: నగదు వేగంగా పొందేందుకు ఇదొక చక్కని మార్గం. మీరు గనుక క్రెడిట్ కార్డు వినియోగదారులైతే బ్యాంకులు మీకు కొంత మొత్తంలో నగదు ఆఫర్ చేస్తాయి. క్రెడిట్ కార్డు ద్వారా పొందే నగదుకి కూడా వడ్డీ శాతం తక్కువగానే ఉంటుంది. అయితే క్రెడిట్ కార్డు ద్వారా రూ. 50 వేలు వరకు మాత్రమే పొందగలుగుతారు. 

పర్సనల్ లోన్: పర్సనల్ లోన్ పొందేందుకు కాస్త టైం పడుతుంది. అయితే ఇది కూడా ఒక మార్గం అని సూచిస్తున్నాం. పైవాటితో పోలిస్తే పర్సనల్ లోన్ తీసుకున్న వారు ఎక్కువ మొత్తంలో వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. లోన్ తీసుకున్న తర్వాత ముందుగానే చెల్లించే అవకాశాన్ని బ్యాంకులు కల్పిస్తున్నాయి. 

సెక్యూరిటీస్ ద్వారా లోన్: మీరు గనుక షేర్లలో పెట్టుబడులు పెట్టినట్లైతే షేర్ల ఆధారంగా కూడా బ్యాంకులు లోన్ పొందే వెసులుబాటుని కల్పిస్తున్నాయి. ఇక పోస్టా ఫీస్ స్కీంలైన కేవీపీ, ఎన్ఎస్సీ లాంటి వాటి ద్వారా కూడా లోన్ పొందవచ్చు. వీటి ద్వారా మీరు తీసుకునే రుణాలకు రెండు సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది.

Address for Communication

Address card