ఇంతకీ తిరుమల శ్రీవారికి ఎన్ని ఆభరణాలు ఉన్నాయి? వాటి విలువ ఎంత? శ్రీవారి నగలకు విలువ కట్టే షరాబు ఎవరైనా ఉన్నారా? అది సాధ్యమేనా?
బెజవాడ గోవిందరెడ్డి అనే వ్యక్తి ప్రజాప్రయోజన
వ్యాజ్యాన్ని హైకోర్టులో దాఖలు చేశారు. అసలు శ్రీవారికి ఉన్న ఆస్తులు.. ఆయనకు బంగారం, వెండి ఇతర రూపాల్లో ఉన్న ఆభరణ, వస్తువుల విలువెంత అన్నది ఆయన ప్రశ్న... ఆభరణాలు అసలు ఎన్ని ఉన్నాయంటూ హై కోర్టు ఆదేశించిందే కానీ, అది ఎంతవరకు సాధ్యమన్నది ప్రశ్న...
కోనేటి రాయడిని చూసేందుకు రెండు కళ్ళూ చాలవు. ఆ విగ్రహ సౌందర్యం అద్భుతం. అలాంటి స్వామివారు సర్వాలంకార భూషితుడైతే... ఇక చెప్పేదేముంది. నూనె దీపాల వెలుతురులోనే స్వామివారి వైభవాన్ని రోజూ మనం దర్శించుకుంటున్నామంటే ఆ అలంకారాల గురించి ఏమని చెప్పేది. ఇప్పుడున్న లెక్కల ప్రకారం దాదాపు 11 టన్నుల ఆభరణాలు శ్రీవారి సొంతం.. ఒక్కో సేవకు ఒక్కో రకమైన ఆభరణం.. 15వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల వారి తొలి కిరీటాన్ని సమర్పించటంతో మొదలైన ఆభరణాల వెల్లువ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.
.. ఇప్పటి వరకు బహిరంగంగా తెలిసిన
లెక్క ప్రకారం శ్రీవారికి ఏడు కిరీటాలు ఉన్నాయి. వీటిలో వజ్రాల కిరీటంతో పాటు,
గద్వాల మహారాణి కిరీటం లాంటివి ముఖ్యమయినవి.
తరువాత సువర్ణ పద్మపీఠం, సువర్ణ పాదాలు, నూపురాలు, పగడాలు, కాంచీగునము, ఉదర బంధము, దశావతార హారము, వడ్డాణము, చిన్న కంఠాభరణము, బంగారు పులిగోరు, సూర్య కఠారి, నాగాభరణాలు, స్వర్ణ పద్మాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో....
లెక్కకు అందనన్ని ఉన్నాయి. ఇలాంటి వాటిని లెక్కించటానికి ఎంత సమయం
పట్టాలి?
ఏ కిరీటంలో ఎన్ని వజ్రాలు పొదిగి ఉన్నాయి.
ప్రస్తుత కాలంలో వాటి ఖరీదు ఎంత? అని లెక్కలు కట్టే వ్యవస్థ టిటిడికి ఇప్పటిదాకా లేదు. ఇంతకు ముందు
తమిళనాడులోని ఓ సంస్థ శ్రీవారి నగల విలువ కట్టేదట.
తిమింగళాలు బొక్కసాన్ని మెక్కేస్తున్నాయి. ప్రాచీన
ఆభరణాల్లో పొదిగిన వజ్రాలు మార్పిడికి గూడా గురైనట్లు వస్తున్న
ఆరోపణలకు సమాధానం లేదు. ఇందుకు తార్కాణం టిటిడి దగ్గరే ఉంది. ఇవాళ ఓ
చానల్లో ప్రసారమైన కథనంలో డాక్యుమెంట్ ఎవిడెన్స్ ను కూడా
ప్రదర్శించారు.. మీడియా ముందుకు వచ్చి దుఃఖపడ్డారు.. కానీ, నగల గురించి జరిగిన విచారణలో టిటిడి సమర్పించిన ఓ
అఫిడవిట్‌లో కొన్ని ముత్యాలు, పచ్చలు, ఇతర విలువైన రాళ్ళు కనిపించకుండా పోయినట్లు ఒప్పుకుంది.
వింతల్లోకెల్లా వింతేమిటంటే.. పోయిన రాళ్ళు, పచ్చలు, ముత్యాల విలువ ఒక్కోటి పది రూపాయలు..
ఇరవై రూపాయలకు మించి లేదట.. రాయల వారి కాలంలోనూ వాటికి ఇంత చీప్ రేట్లు ఉండవేమో... ఇంత
చౌకైన రత్నాలు.. రత్నాలేనా? లేక రాళ్లా? అన్న అనుమానం కూడా కలుగుతుంది. ఈ విధంగా లెక్కలు గట్టడం, వాటిని స్వామివారికి
సమర్పించిన భక్తులను అవమానించటం.. ఆ ఆభరణాలను విలువైనవిగా భావించి
ధరిస్తున్న స్వామి వారిని దారుణంగా మోసం చేయటం...
20 కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలూ గల్లంతయ్యాయి. వీటికి జవాబు ఇప్పటి వరకు ఎవరి నుంచీ రాలేదు.. టిటిడి చైర్మన్‌కు తిరుగే లేదు.. రెండువేల విఐపి దర్శనాలను పదహారు వేలు చేస్తారు.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.. ప్రభుత్వమూ వేచి చూసే ధోరణిలో ఉంది. ఇంత జరిగాక కూడా అవకతవకలను అరికట్టడానికి పూనుకోకపోతే... భక్తుల ‘భక్తి సమర్పణ’ భోక్తల పాలు కావటం దానిని ఆపటం ఎవరితరం కాదు...పాపం పండితే కానీ, దాన్ని రాల్చలేమంటారు.. మరి భగవంతుని సొమ్మును మింగుతున్న వారి పాపం పండేదెప్పుడో?
------------
ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
No comments:
Post a Comment