Thursday, June 14, 2018

కవిత్వ శిఖరం అటల్ బిహారీ


కవిత్వ శిఖరం అటల్ బిహారీ


     

కవిత్వం నిరంతరాయంగా రాసే రాజకీయ నాయకులు అతి కొద్దిమందే. రాజకీయంలో తలమునకలై కొద్దిపాటి సమయం కూడా దొరకని ప్రధానమంత్రి పదవి నిర్వర్తిస్తూ కూడా కవిత్వం రాయగలగడం దాదాపు అసాధ్యం. అటల్ బిహారీ వాజ్ పేయి లాంటి వారికే అది సాధ్యమైంది.
రాజకీయ జీవితంలో తలమునకలైనా కవిత్వసాధనను విడిచి పెట్టని  గొప్ప కవి అటల్ జీ. ఆయన రచించిన మొదటి కవిత తాజ్ మహల్లో అభ్యుదయ వాదం కనబడుతుంది. వాజ్ పేయి అత్యున్నత శిఖరం అయినా సామాన్యుడి నుండి దూరం కావద్దని కోరుకున్నారు.
హే ప్రభూ!
నాకు ఇంతటి ఎత్తు ఎప్పుడూ ఇవ్వకు
ఇతరులను గుండెలకు హత్తుకోనంతగా
అంతటి హృదయ కాఠీన్యాన్ని
ఎప్పుడూ నాకు ఇవ్వకు...
ఇంతగా సామాన్యుడితో కలిసిపోవాలని కోరుకునే నాయకుడు ఎవరుంటారు? తనకు శిఖరాలు లభించకపోయినా పర్వాలేదు గానీ ఇతరుల నుండి దూరం చేయొద్దని మనసారా వాంఛ కనబరిచేవారు ఎవరన్నా ఉంటారా? శిఖర స్థాయి వద్దని కోరుకోడానికి కారణం కూడా తనే చెప్పారు వాజ్ పేయి.
ఎత్తయిన పర్వతాలపై
చెట్లు ఎదగవు
మొక్కలు మొలకెత్తవు
గడ్డి పరక కూడా పరచుకోదు
వాజ్ పేయి భావన వెనుక ఉన్న సునిశిత పరిశీలనకి ఉదాహరణ ఇది.  
గాలి గోపురంలా ఒంటరిగా
తనవాళ్లకు దూరంగా
శూన్యంలో ఏకాకిగా మిగిలిపోవడం
పర్వతాల గొప్పదనం కానేకాదు
అది కేవలం నిస్సహాయత
అందుకే ఆ నిస్సహాయత తనకు వద్దని ఆయన కోరుకుంటారు.
రుతువులు ఏవైనా
వసంతం కానీ హేమంతం కానీ
కేవలం ఎత్తుగా ఎదగడమే అయితే
నిశ్శబ్దంగా ఒంటరిగా మిగిలిపోవడమే!
అలా ఒంటరిగా మిగిలిపోయేవాడు సమూహానికి దూరమవుతాడు. అందుకే శిఖరం కావద్దని కోరుకుంటారు వాజ్ పేయి.
ఎమర్జెన్సీలో జైలు పాలైన సందర్భంలో వాజ్ పేయి రాసిన కవితలో
చీకటి రాత్రి
విసిరిన సవాలు ఇది
కిరణమే చివరి అస్త్రమవుతుంది
అంటూ అప్పటి ప్రభుత్వానికి సవాలు విసిరారు.
తలవంచడం
మాకు సమ్మతం కాదు
పందెంలో అన్నీ ఒడ్డి నిలబడ్డాం
నేలకొరుగుతాం కానీ తలవంచం
అంటూ లక్ష్య సాధన పట్ల తనకుండే నిబద్ధతను కవిత్వీకరించారు వాజ్ పేయి.
అదే సందర్భంలో రాసిన మరో కవితలో
జైలులో ఉన్న కవి మనస్సులో ఒక ఆలోచన మెరిసింది
ఏ వ్యక్తి కూడా జీవితంలో నిరాశ చెందరాదని
నిషా వక్ష స్థలాన్ని చీల్చుకొని
మళ్ళీ సూర్యుడు ప్రకాశిస్తాడు!
ఎంతో ఆశావహ దృక్పథాన్ని కనబరిచిన కవిత్వ పాదాలివి. నాటి ఎమర్జెన్సీ రోజుల్లో నిర్బంధంలో ఉంటూ పరిస్థితులు మారతాయని ఆశాభావాన్ని కనబర్చారు వాజ్ పేయి.
ధర్మరాజును కూడా పాప పంకిలం వదిలిపెట్టలేదన్న సూక్ష్మ పరిశీలన వాజ్ పేయిది. అందుకే
ధర్మరాజు కూడా
జూద మోహ క్రీడలని వదులు కోలేదు
అందుకే జూద పంకిలం అంటుకున్నది
ప్రతి న్యాయ పంచాయితీలో
పాంచాలియైనా
నిరుపేద స్త్రీయైనా
అవమానితయే
ఇప్పుడు
కృష్ణుడు లేని
మహాభారతం కావాలి
అంటారు వాజ్ పేయి.
తన కవిత్వం ఓడిపోయిన సైనికుడి నిరాశావాద గుండె చప్పుడు కాదని, విజయం సాధించి తీరతాననే పోరాట యోధుని అచంచల ఆత్మవిశ్వాస దృక్కోణమని పేర్కొంటారు అటల్ జీ. ప్రజల పక్షాన వకాల్తా పుచ్చుకునే న్యాయవాదిగా, మానవతావాదిగా, దేశ సంస్కృతీ సంప్రదాయాల ప్రేమికుడిగా, ప్రజా శ్రేయస్సు కోరుకునే నాయకుడిగా తన కవిత్వంలో కనబడతారు వాజ్ పేయి.  సూక్ష్మ పరిశీలన, భారతీయ దార్శనికతను ఆధునిక భావనలతో విశ్లేషించడం వాజ్ పేయి కవిత్వంలో కనబడతాయి. వాజ్ పేయి శిఖర స్థాయిని నిరాకరించిన శిఖర సమానుడు.


------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

No comments:

Post a Comment

Address for Communication

Address card