Saturday, December 09, 2017

రాజు గారి మంత్రి గారు




ఈమధ్య నాయకుల, నాయకులు కావాలనుకుంటున్న వారి, వారి వంది మాఘధనుల వ్యాఖ్యలు వింటుంటే ఒక చిన్న కధ గుర్తొస్తుంది


అనగనగా  ఓ రాజు గారికి వంకాయంటే మహా మక్కువట. తెగ తినేవారట ప్రతి రోజూ.
ఓ నాడు వంకాయ కూర తింటూ మంత్రి గారితో అన్నారుటా "ఆహా మంత్రీ!  ఏం కూరండీ ఇది!వంకాయా?  అమృతమా?" అని.
"
అవును మహా ప్రభూ.. తమలాగే వంకాయది కూడా రాచ పుటక. అది మహత్తరం. అందుకే దాని నెత్తిన దేముడు కిరీటం పెట్టాడు" అన్నాడట మంత్రి.

ఇలా రాజ్యంలో కాసిన వంకాయలన్నిటితో రకరకాల భక్ష్యాలు వండించుకుని రాజుగారు ఆరగిస్తూ ఉండగారోజులు గడుస్తూ ఉండగా, ఒక కొన్నిరోజులకి రాజు గారికి వంకాయంటే మొహం మొత్తిందట. తినగా తినగా గారెలు చేదెక్కినట్టే వంకాయాను. వంకాయ కూర వడ్డించగానే పళ్ళెం విసిరికొట్టి "ఛాత్.. ఇదేం కూర? చెత్త కూర. అసలు ఆ రంగేమిటిరుచీ పచీ లేని దాని వైనమేమిటి?" అన్నారుట.
పక్కనే ఉన్న మంత్రి గారు" అవునవును మహాప్రభో, అది చెత్త కూర.. చెత్తాతి చెత్త కూర. అందుకే దేముడు దాని నెత్తిన మేకు కొట్టాడు" అన్నాడుట.

ముక్కున వేలేసుకున్న రాజు గారడిగారుటా "అసలు నీది నాలుకా? తాటి పట్టా? మంత్రీ.. కిరీటం కాస్తా మేకైపోయిందా? హాత్తెరీ!" అని. దానికి నవ్వి మంత్రి ఏమన్నాడో తెలుసా....?
"
ఏలిన వారు చిత్తగించాలి.. నేను మహా ప్రభువులకి మంత్రిని కాని వంకాయకి కాదు కదండీ..!" అని. 

   అవును నేటి నాయకులు, నాయకులు కావాలనుకుంటున్న వారు, వారి వంది మాఘధనులు  వీరు పదివికి,అధికారానికి,అవకాశవాదానికి  అనుచరులు కానీ ప్రజలకి కాదుగా
     ------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681


No comments:

Post a Comment

Address for Communication

Address card