Tuesday, January 14, 2020

ఏనిమల్ ఫార్మ్ (Animal Farm),

పరిచయం:
ఏనిమల్ ఫార్మ్ (Animal Farm), 1945లో ప్రచురింపబడిన ఒక ఆంగ్ల నవల. దీని రచయిత జార్జ్ ఆర్వెల్.

అనేక అనువాదాలలో తెలుగు అనువాదంలో మాత్రమే ఒరిజినల్ పేరు ఉంచారు. 1923-2005 మధ్యకాలంలో వెలువడిన పుస్తకాలలో మొదటి 100 నవలలో ఇది ఒకటి అని టైమ్ మాగజైన్ అభివర్ణించింది. ఇంకా ఈ నవలకు అనేక ప్రశంసలు , పురస్కారాలు లభించాయి.
రచయిత:
ఎరిక్ ఆర్థర్ బ్లెయిర్ అన్నాయన ఇండియాలోనే (బెంగాల్లో) పుట్టాడు. కొన్నాళ్లిక్కడే పెరిగి తర్వాత పై చదువులకోసం ఇంగ్లండ్ వెళ్లాడు.జార్జి ఆర్వెల్ పేరుతోనే చాలా నవలలు, వ్యాసాలు రాశాడుగానీ అతడి వ్యంగ్య వైభవంతో చిరస్థాయిగా నిలిచిపోయిన నవల “ఏనిమల్ ఫామ్” 1945 మేలో వెలువడింది
కథా సారాంశం:
“ఏనిమల్ ఫార్మ్” నవల మన పంచతంత్రంలా జంతువుల ప్రతీకలతో నడుస్తున్న సమాజాన్ని రికార్డ్ చేసిన కథ. ఈ నవలలో మిస్టర్ జోన్స్ కు మేనర్ ఫార్మ్ పేరుతో పెద్ద వ్యవసాయ క్షేత్రం వుంటుంది. అందులో ఒక పశువుల శాలను కూడా నిర్వహిస్తుంటాడు. అక్కడ అన్ని రకల జంతువులూ వుంటాయి. వాటిచేతనే అన్ని రకాల పనులు చేయిస్తుంటాడు. వాటి శ్రమతో పంటలు పండించుకోవడమే కాకుండా అవి పెట్టే గుడ్లు, ఇచ్చే పాలు, మాంసం కూడా ఉత్పత్తిలో భాగంగా తేరగా మిస్టర్ జోన్స్ తీసుకుంటుంటాడు. ఈ శ్రమదోపిడీని ఆ జంతువులలో మేజర్ అనే పంది గుర్తిస్తుంది. తన తోటి జంతుజాలాన్ని సమావేశపరిచి ఈ దోపిడీ స్వరూపాన్ని వెల్లడించి, విప్లవం ఆవశ్యకతను వివరించి, వాటిని చైతన్యపరుస్తుంది. మనుషులంతా కలిసి జంతువుల శ్రమను ఎన్ని విధాలుగా దోపిడీ చేస్తున్నారో వివరిస్తుంది. కార్మిక జంతువర్గమంతా ఐక్యమై పోరాడాలని కోరుతుంది. వృద్ధ్యాప్యంవల్ల ఆ తరువాత కొద్ది రోజులకే మేజర్ చనిపోతుంది. ఆ వ్యవసాయ క్షేత్రం యజమాని మిస్టర్ జోన్స్ తాగుడు వ్యసనానికి బానిసై జంతువులను పూర్తిగా పట్టించుకోడు. రోజుల తరబడి పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు విప్లవ కార్యాచరణను స్నోబాల్ అనే పంది తన చేతుల్లోకి తీసుకుంటుంది. జంతువులన్నింటిని ఏకం చేసి తిరుగుబాటుకు మార్గం సన్నద్ధం చేస్తుంది. ఒకరోజు మిస్టర్ జోన్స్ ను, జోన్స్ పరివారాన్ని తరిమికొట్టి జంతువులన్నీ స్వతంత్రం పొందుతాయి. నెపోలియన్ అనే మరోపంది, బాక్సర్, క్లోవర్ లనే గుర్రాలు, తెల్లమేక మురీల్, బెంజామిన్ గాడిద, ఇంకా కుక్కలు, బాతులు, పావురాలు, ఎలుకలు, గొర్రెలు, ఆవులు, గేదెలు, ఒకటేమిటి… అన్నీ కష్టపడి పనిచేస్తూ మేనర్ ఫార్మ్ ను ఏనిమల్ ఫామ్ గా మార్చుకుని స్వేచ్ఛాసౌఖ్యం పొందుతూ బతకడానికి ‘ఏడు నిబంధనలు’ తయారుచేసుకుంటాయి. అవి:
రెండు కాళ్లతో నడిచే ప్రతిదీ మన శత్రువే.
నాలుగు కాళ్లతో నడిచేది లేదా రెక్కలున్నది ప్రతిదీ మన మిత్రువే.
జంతువులు బట్టలు కట్టాకూడదు.
జంతువులేవీ మంచాలపై పడుకోకూడదు.
జంతువులేవీ మద్యపానం సేవించరాదు.
ఒక జంతువు మరో జంతువును వధించకూడదు.
జంతువులన్నీ సమానమే.

ఇలాంటి పనులు చేస్తున్న స్నోబాల్ వైఖరి నెపోలియన్ కు నచ్చదు. అన్ని పనులకు కమిటీలు వేసుకుని ముందుకు సాగాలనుకోవడం, ప్రతీ విషయాన్ని బహిరంగ చర్చకు పెట్టడం, పందులతో సహా జంతువులన్నీ చదువుకోవాలనుకోవడం, శ్ర మ విభజన చేసుకోవడమే కాకుండా ఉత్పత్తిని సమాన వాటాలుగా పంపిణీ చేయమనడం, కొంత మిగులు ఉత్పత్తిని నిల్వ చేయాలనుకోవడం వంటి పద్ధతులేవీ క్రమక్రమంగా నెపోలియన్ కు నచ్చడం లేదు. ఇంతలో స్నోబాల్ ఒక కీలకమైన ప్రకటన చేస్తుంది. విండ్ మిల్లు ఏర్పాటుచేయడం ద్వారా జంతువులు పడే భౌతిక శ్రమ స్థానంలో యాంత్రికతను ప్రవేశపెట్టి మరింత ఉత్పత్తిని రాబట్టడమే కాకుండా, పని గంటలు కూడా పొదుపు చెయ్యవచ్చనే ఆలోచన అందరికీ పంచుతుంది. ఇక లాభం లేదనుకునిఒక క్రమ పద్ధతి ప్రకారం స్నోబాల్ ను ఏనిమల్ ఫామ్ నుంచి తన్నితరిమేస్తుంది. అక్కడనుంచి కథ మరో మలుపు తిరుగుతుంది.
నెపోలియన్ క్రమంగా ఏడు నిబంధనల స్ఫూర్తికి తూట్లు పొడుస్తుంది. తన వాదనలను మిగతా జంతువుల దగ్గర బలంగా వినిపించడానికి, ప్రచారం చేయడానికీ స్క్వీలర్ పందిని నియమిస్తుంది. ఈ పంది తన అసమానమైన భాషతో, వాదన పటిమతో నెపోలియన్ ఆలోచనలన్నింటిని ఇతర జంతువులన్నింటి చేత అంగీకరింపజేస్తుంది. ఒకవేళ అప్పటికీ ఎవరైనా వినకపోతే వారిని లొంగదీసుకోవడానికి ఎనిమిది బలిష్టమైన కుక్కలతో ప్రైవేట్ ఆర్మీ నడుపుతుంది. ఇరుగుపొరుగు ఫామ్ హౌస్ ల యజమానులు – మనుషులతో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తుంది. జంతువులన్నీ ఎంతో శ్రమతో, త్యాగంతో అష్టకష్టాలు పడి విండ్ మిల్లునుకూడా నిర్మిస్తారు. (ఈ విండ్ మిల్లు నెపంతోనే స్నోబాల్ ను ఆ క్షేత్రంనుంచి తన్ని తరిమేయడం మనం మర్చిపోకూడదు.)
తన వర్గమైన పందులన్నింటికి ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తుంది. తన శరణుజొచ్చిన వారికి ప్రత్యేక పదవులు లభిస్తాయి. ఎదిరించిన వారికి మరణ శాసనం ఖాయంచేస్తుంది. ఏడు నిబంధనలు మారి మారి క్రమంగా మాయమై ఒకే నిబంధన మిగులుతుంది. ఆ నిబంధన వాక్యం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది: “అన్ని జంతువులూ సమానమే. కాని కొన్ని జంతువులు మాత్రం కొంచెం ఎక్కువ సమానం”. ఆ దశకల్లా మిష్టర్ జోన్స్ హయాంకంటే హీనమైన గడ్డురోజులు జంతువులు అనుభవిస్తుంటాయి. కొన్ని జంతువులు నెపోలియన్ కుట్రను పసిగడతాయి. అక్కడితో ఈ నవలిక ఆగిపోతుంది. ఇదీ బయటకు కనిపించే నవల. ఉపరితల నిర్మితి (సర్ఫేస్ టెక్చర్) లో పంచతంత్రం కథలా జంతువుల కథ కనిపిస్తుంది కాని, ప్రపంచ చరిత్రతో పరిచయమున్న వారి మనసుల్లోకి మరేవేవో కథలు జ్ఞప్తికి వస్తుంటాయి.

No comments:

Post a Comment

Address for Communication

Address card