Tuesday, October 23, 2018

నేను సైతం(మీ టూ)...



పురాణకాలం నుంచి ఆధునిక యుగం వరకు ఈ సమస్య అలా జ్వలిస్తూనే ఉంది. తల వంచి సహించడమా, పిడికిలి బిగించడమా అని స్త్రీజాతి నిత్యం అంతర్మథనానికి గురవుతూనే వచ్చింది. సీత, ద్రౌపది తమవైన ప్రత్యామ్నాయ పరిష్కారాలు వెతుక్కున్నారు. రంభ అత్యాచారానికి బలైపోయింది. చరిత్ర ఒక గాయంనుంచి మరో గాయం దిశగా నడుస్తూనే ఉంది. రెండు కళ్లనుంచి చూపులు సూదుల్లా వచ్చి మాంసపు ముద్దలపై విచ్చలవిడిగా తిరుగుతూనే ఉంటాయిఅన్న జయప్రభ ఆవేదన స్త్రీజాతి మనోవేదనగా ప్రతిధ్వనిస్తూనే ఉంది. వికృతమైన భల్లూకపు పట్టులాంటిదేదో విడువక కలల్లో సైతం వెంటాడుతుందిఅన్నది ఆ జాతికి పీడకలగా పరిణమించింది. కవయిత్రి ఓల్గా చెప్పినట్లు మీ వికృత వాంఛాగ్నుల్ని మా ఒడిలో చల్లార్చుకుని ఎన్నిసార్లు తృప్తిగా తేన్చారు!అంటూ రోదిస్తూనే ఉంది.వేయి రాక్షస బల్లులు మీద పాకినట్లుఅని మందరపు హైమవతి వర్ణించినట్లు జుగుప్సతో స్త్రీ ఉలిక్కిపడుతూనే ఉంది. దుర్భరమైన అనుభవాల్ని తన గుండెల్లో దాచిపెట్టింది. కడుపులోనే కాదు, గుండెలోతుల్లోను నిప్పు కణికల్ని దాచుకొంటున్నవాళ్లంఅని శీలా సుభద్రాదేవి కాలసముద్రంలో బిందువుకవితలో చెప్పిందదే! స్త్రీది జన్మజన్మల దుఃఖం, యుగయుగాల అవమానం. కొండేపూడి నిర్మలబాధాశప్తనది’ ‘సముద్ర జ్వరంవంటివి వాటికి ప్రబల నిదర్శనలు. కలల్ని కన్నీటి చాటున జారవిడిచాం, కళ్లను రెప్పల వెనుక చిదిమి ఉంచాం’. అంతేనా, మౌనంగా మృగాళ్లను సహించాం, ఇన్నేళ్లూ భరించాం, ఎన్నాళ్లీ సహనం? అని స్త్రీ గుండె కుతకుత ఉడికిపోతూ వచ్చింది. అవమానాలకు, అణచివేతలకు తిరుగుబాటే పర్యవసానం. ఇది చరిత్ర చెప్పిన సత్యం. దిక్కుమొక్కులేని జనం ఒక్కొక్కరు అగ్నికణం సింహకంఠనాదంతో వస్తారిక కాచుకోండిఅని విప్లవకవి సుబ్బారావు పాణిగ్రాహి చేసిన హెచ్చరికఅన్ని కాలాలకు, వర్గాలకు వర్తించే వాస్తవం.
       మానాన్నే కాదు, మనసును చెరచినా అది అత్యాచారమే. ఈ సత్యాన్ని మహిళా లోకం ఎన్నోసార్లు వివరిస్తూనే ఉంది. అయినా వీధి వీధికో గాంధారి కొడుకు, గాంధీగారి దేశంలోఅన్న ఆరుద్ర మాటను పురుషజాతి రుజువు చేస్తూనే ఉంది. స్త్రీ ఎన్నాళ్లని ఓపికపడుతుంది? మౌనం బద్దలయింది. నేను సైతం(మీ టూ)... అంటూ పిడికిలి బిగించింది. పురుషుడి పూసాలు పెకలించడానికి సిద్ధమైంది.నేను సైతం పురుషలోకం అణచివేతను ధిక్కరిస్తాను... నేను సైతం నేను సైతం పెద్దమనుషుల పరమ నీచపు బుద్ధులెన్నో బయటపెడతానుఅంటూ గొంతు విప్పింది. ఇది ఎనభైల్లో తలెత్తిన స్త్రీవాద ఉద్యమం లాంటిది కాదు. అసలు ఉద్యమమే కాదది- ఉప్పెన! ఈ నిరసన ధ్వనులు మాటల తూటాలతో ఊదరగొట్టేవో, తాటాకు మంటల చిటపటలో కానే కావు- గుండెను బద్దలు కొట్టే ఫెళఫెళా రావాలు, సింహనాదాలు. ఘోషించాను- మంచిగా ఉండండర్రా అంటూ గోలపెట్టాను, అమాయకుల జోలికి పోకండర్రా అంటూఅని మహాకవి శ్రీశ్రీ ఝంఝ కవితలో మొరపెట్టుకున్నాడు. జనం వినలేదు. నెత్తురు కార్చిన కళ్లే నిప్పులు ఎగచిమ్ముతాయిఅని మరో ప్రస్థానంలో ఆయన చేసిన హెచ్చరికను మహిళాలోకం ఇప్పుడు అక్షరాలా అమలు చేస్తోంది. దసరా రోజుల్లో దుర్గామాత ప్రచండ శౌర్యాన్ని తలచుకున్నవారు ఇప్పుడు ఆమె శక్తి చైతన్య విశ్వరూపాన్ని ప్రత్యక్షంగా గమనిస్తున్నారు. జటలు జళిపించి గర్జించి సంభ్రమించి, దృష్టి సారించి బొమలు బంధించి కెరలి, జిహ్వ ఆడించి లంఘించి చేతనొడిసిపట్టిఅని పోతన భాగవతంలో వర్ణించిన హిరణ్యకశిపుడి వధను సరిగ్గా అర్థం చేసుకొంటే- మగాళ్లలోని రావణాంశను ఈ ఉద్యమం ఏ రకంగా గుప్పెట పడుతున్నదో బోధపడుతుంది. ఉద్యమ స్వరూపం బొమ్మ కడుతుంది.
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681


No comments:

Post a Comment

Address for Communication

Address card