Saturday, October 13, 2018

“ఆనాపానసతి .. శ్వాస మీద ధ్యాస”

“ఆనాపానసతి .. శ్వాస మీద ధ్యాస”

“ఆనాపానసతి” అన్నది సుమారు 2500 సం|| క్రితం గౌతమబుద్ధుడు ఉపయోగించిన పాళీ భాష కు చెందిన పదం. పాలీ భాషలో..
‘ ఆన ’ అంటే ‘ ఉచ్ఛ్వాస ’
‘ అపాన ’ అంటే ‘ నిశ్వాస ’
‘ సతి ’ అంటే ‘ కూడుకుని వుండడం ’
“ఆనాపానసతి” అంటే మన శ్వాసతో మనం కూడుకుని వుండడం “; దీనినే మనం “శ్వాస మీద ధ్యాస” అని చెప్పుకుంటున్నాం. “ఆనాపానసతి” అన్నది ప్రపంచానికి సకల ఋషులు, సకల యోగులు అందరూ కలిసికట్టుగా ఇచ్చిన అద్భుతమైన వరం !
ఈ ప్రపంచంలో ఉన్న ఒకే ఒక్క సరి అయిన ధ్యాన పద్ధతి ఆనాపానసతి! సత్యాన్ని కనుక్కోవాలి అని ఆరాటం చెందేవారు చివరిగా చేరే స్థితే ఆనాపానసతి .. అక్కడి నుంచే వారి అసలైన “ఆధ్యాత్మిక అనుభవైక ప్రయాణం” మొదలవుతుంది!

కుంభకరహిత ప్రాణాయామం

గౌతమబుద్ధుడు .. ఆనాపానసతేతర హఠయోగ ప్రాణాయామాదులు సంవత్సరాల తరబడి చేసి వాటన్నింటి యొక్క నిస్సారాన్నీ, నిష్ఫలతనూ స్వయంగా అనుభవించి వాటిని పూర్తిగా విసర్జించాడు.
“కఠోరమైన కుంభకాదులను అభ్యాసం చేసి వాటి నిష్ఫలతను అనుభవించాను ; మొత్తంమీద నా శ్వాసలోనే ఎక్కడో రహస్యం వుంది ; సహజమైన శ్వాస రీతి మర్మం వున్నట్లు ఉంది ; చిన్నప్పటి నుండి ఎలాగైతే సహజసిద్ధంగా శ్వాసను గమనిస్తున్నానో అదే సరియైనది” అని తర్కించుకుని హాయిగా దానినే గమనించడం మొదలుపెట్టాడు. అంతే! ఒక్కొక్కటిగా ఆయనకు సర్వం అవగతమైంది.

సహజమైన శ్వాస

సృష్టిలో ఒకానొక మూల సిద్ధాంతం “ప్రకృతి ఎప్పుడూ సహజంగా సులభరీతిలో వుంటుంది” అని చెప్తోంది. “ఏదైతే ప్రకృతిసహజంగా, సులభరీతిగా వుందో అదే సత్య‌మైంది” అని మనం స్పిరిచ్యువల్ సైన్స్‌లో తెలుసుకుంటాం. మరి అలాగే కఠినంగా, అసహజంగా వుండేదే అసత్యం.
“శ్వాసను కుంభించడం” అన్నది కఠోరమైంది కనుక “హఠయోగ ప్రాణాయామం” అన్నది అసహజమైంది ; అది సత్యానికి సదూరమైంది.
కుంభక రహిత కేవల పూరక రేచకాత్మకం అయిన “సుఖమయ ప్రాణాయామం” అన్నది సహజమైంది ; అది సత్యంతో కూడుకుని వుంది.

ఉపాసన విపస్సన

“ఉపాసన” అంటే అది “నోట్లోంచి బహిర్గతమయ్యే మంత్రాలతో కూడిన ప్రక్రియ”. “విపస్సన” అంటే శ్వాస నుంచి మొదలై మూడవ కన్ను వరకు పోయే ప్రక్రియ”.
మంత్రోపాసకులు మంత్రోచ్ఛారణ ద్వారా అభ్యాసం చేస్తూ వుంటారు. ఆ మంత్రం చెప్పి చెప్పి చివరికి ఒకానొక నిశ్శబ్ద స్థితికి, మంత్ర-రహిత-స్థితికి చేరుకున్నప్పుడు కొన్ని దివ్యరూపాలు కనబడతాయి. అయితే, అదంతా అంతవరకే ఆగిపోతుంది. ఆ దివ్యదృష్టి యొక్క ప్రాథమికాలలో, ప్రాథమిక దశలలో సంచరించడమే ఉపాసకులు సాధించగలిగిన అంతకన్నా పైన వున్న .. “దివ్యదృష్టి” అన్నది .. “మంత్ర ఉచ్ఛారణ” లో “మంత్రోపాసన” లో ఎంత మాత్రం సాధ్యం కాదు !
మంత్రోపాసకులు కేవలం ఐదవ చక్రం వరకే చేరుకుంటారు. మహా అయితే “ఆజ్ఞాచక్రం” అంటే “సుదర్శన చక్రం” ఛాయలు మాత్రమే కనబడతాయి కానీ అందులో పరపక్వత సాధించలేరు.
మంత్రజపం అన్నది అధోస్థానమైన నోట్లో వుంది ; ఆనాపానసతి అన్నది ఊర్థ్వస్థానమైన నాసికలో వుంటుంది. “నోటితో చేసే క్రియ” ను .. వదిలి ” శ్వాస ద్వారా చేపట్టే క్రియ ” అనే “ఆనాపానసతి” ని మొదలుపెడితే .. దివ్యదృష్టి అనతికాలంలోనే సంప్రాప్తించి అద్భుతమైన దివ్యజ్ఞాన సంపన్నులమై మన జన్మలన్నీ చూసుకుంటాం ; అదే ఏడవదైన సహస్రారస్థితి.

“ఉపాసన” = ” ‘ఉప’ + ‘ఆసన’ ” = “ప్రక్కనున్న ఆసనం”

“మంత్రజపం” అన్నది చిన్న ఆసనం ; “విపస్సన” అన్నది ప్రధాన సింహాసనం ఆసనం .. అక్కడే మనిషి ” రారాజు ” అవుతాడు ‘ సింహం ’ అవుతాడు.
“ఆనాపానసతి” అన్నది నేరుగా విశుద్ధ చక్రం నుంచి ప్రారంభమై ఆజ్ఞా చక్రం ద్వారా అందరినీ ఏడవ సహస్రార స్థితికి వెంటనే తీసుకుని వెళ్తుంది.
“మంత్రోపాసన” ద్వారా శిష్యుడుగా అవ్వొచ్చు కానీ .. గురువుగా మాత్రం కాలేము ! ముఖ్యశిష్యుడిగా వుంటాం కానీ జీవన్ముక్త గురువుగా కాలేము !
ఆరవదైన ఆజ్ఞా చక్రానికి చేరుకున్నవారు గురువులు : ఏడవ స్థితికి అంటే సహస్రారస్థితికి చేరుకున్నవారే జీవన్ముక్త స్థితిలో ఉన్న పరమ గురువులు !

దివ్యదృష్టి

ఈ విధంగా ఏకదీక్షతో ఆనాపానసతి అభ్యాసం చేయడం ద్వారా మన “నాడీమండలం” అంతా శుద్ధి అవుతుంది ; నాడీమండలం శుద్ధం అవుతూన్నప్పుడు ఆ స్థితులను గమనిస్తూ వుండడమే కాయానుపస్సన. “కాయానుపస్సన” అనే రెండవ దశను దాటి “విపస్సన” అనే మూడవ దశ అంటే “దివ్యదృష్టి” లోకి ప్రవేశిస్తాం.
” దివ్యదృష్టి “లో వచ్చే అనుభవాలన్నీ ఒకరితో ఒకరు పంచుకోవాలి, చెప్పుకోవాలి ; ఇదే ” సజ్జనసాంగత్యం ” .. ఇతర ధ్యానులతో సాంగత్యం.
” విపస్సన ” ను ఇంగ్లీషులో ” SEEING .. సీయింగ్” అన్నారు. అంటే ” చూడడం ” అన్నమాట. ఆనాపానసతి ద్వారా మనం ” ఋషులం ” అంటే ” SEERS .. సీయర్స్ “, ” ద్రష్టలం ” అవుతాం.

ధ్యానం .. సర్వ రోగనివారిణి

ఆనాపానసతి అన్నది ” పశువు “ను “పశుపతి” గా చేస్తుంది. అంటే తన జంతుత్వానికి తాను ఆధీనుడు కాకుండా తన జంతుతత్వానికి తాను ” పతి ” అంటే ” యజమాని ” కావడం.
ఒకానొక ” పశువు ” ను “పశుపతి”గా చేసే పాశుపతాస్త్రమే ఆనాపానసతి. పాశుపతాస్త్రంతో సాధించలేనిదంటూ ఏదీ లేదు .. అలాగే ఆనాపానసతితో సాధించలేనిదంటూ ఏదీ లేదు !
ఆనాపానసతి .. అన్నది సర్వరోగనివారిణి-సకలశక్తి ప్రదాయిని ! ఆనాపానసతి అన్నది సర్వభోగకారిణి – సకల సమస్యల పరిష్కారిణి ! ఆనాపానసతి అన్నది సత్య జ్ఞాన ప్రసాదిని – సకల సంశయాల హారిణి! పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌‌మెంట్ యొక్కమూల ఆధ్యాత్మిక సాధనా సిద్ధాంతం ” ఆనాపానసతి “.

“నాసికాగ్రం .. భ్రూమధ్యం”

ఆనాపానసతి అభ్యాసం ఎలా చేయాలంటే .. హాయిగా కూర్చుని, కాళ్ళు రెండూ కట్టేసుకుని, చేతులు రెండూ కట్టేసుకుని, కళ్ళు రెండూ కట్టేసుకుని, మన మస్తిష్కాన్ని కట్టేసుకుని శ్వాస మీద ధ్యాస వుంచాలి.
నాసిక ఎక్కడ మొదలవుతుందో దాని పేరే ” భ్రూమధ్యం ” .. అదే ” నాసికాగ్రం “.
“నాసికాగ్రం” అంటే “ముక్కుకొన” కాదు !
అలా చేసినప్పుడు .. శ్వాస తనంతట తాను చిన్నదిగా అయిపోతూ చివరికి ‘నాసికాగ్రం’ లో అంటే ‘భ్రూమధ్యం’ లో, అంటే ఆజ్ఞాచక్రస్థానం లో, అంటే సుదర్శనచక్రస్థానంలో తనంతట తాను సుఖంగా స్థితం అయిపోతుంది. అప్పుడు ఆ స్థితిలో మనం తదేకమై, తన్మయమై వుంటే .. “మూడవ కన్ను” యొక్క విస్పోటనం మొదలవుతుంది.
మూడవ కన్ను యొక్క విస్ఫోటనాన్ని గమనించడాన్నే “విపస్సన” అంటాం. “పశ్యతి” అంటే సంస్కృతంలో “చూడడం”. “పస్సన” అంటే పాళీ భాషలో “చూడడం” .. “విపస్సన” అంటే విశేషంగా చూడడం ! ‘వి’ అంటే ‘విశేషమైన’ .. అదే మూడవ కంటిచూపు -ముక్కంటి చూపు .. థర్డ్ ఐ విజన్ !
ఆనాపానసతి – కాయానుపస్సన – విపస్సన ను మనం ప్రతిరోజు అభ్యాసం చేసి దానిద్వారా మెల్లిమెల్లిగా ఇతర లోకాలన్నీ తెలుసుకుని ఇతర లోకాలలో సంచరిస్తూ ఆత్మవిజ్ఞానాన్ని సంపాదించాలి ; పూర్ణమైన సవ్యఅవగాహన కలిగించుకోవాలి.

“ధ్యానం చేయడానికి ఎక్కడైనా కూర్చోవచ్చు”

ధ్యానం కోసం భూమి మీద చాప వేసుకుని కూర్చోవచ్చు, గోడకు ఆనుకుని కూర్చోవచ్చు, కుర్చీలో కూర్చోవచ్చు. అయితే పాదాలు రెండూ ఒకదానికి ఒకటి క్రాస్ చేసుకోవాలి, వ్రేళ్ళలో వ్రేళ్ళు పెట్టుకోవాలి ; పడుకుని మాత్రం ధ్యాన అభ్యాసం చేయకూడదు. ముసలివాళ్ళు, కూర్చోలేనివాళ్ళు అయితే మాత్రమే పడుకుని చేసుకోవచ్చు. కూర్చోగలిగినవాళ్ళు, ఆరోగ్యవంతులైన వాళ్ళు మాత్రం విధిగా కూర్చునే ధ్యానం చేసుకోవాలి. ప్రారంభంలో గదిని వీలైనంత చీకటి చేసుకోవాలి.
ఆనాపానసతి కి ఉపక్రమించే ముందు అర్థగ్లాసు నీళ్ళు త్రాగి ఇంకొక అర్థగ్లాసు నీళ్ళు ప్రక్కన పెట్టుకోవాలి. అభ్యాసం పుర్తి అయిన తర్వాత, మెల్లిగా కళ్ళు తెరిచి మిగిలిన అర్థగ్లాసు నీళ్ళు త్రాగాలి. ఆనాపానసతి అభ్యాసం మనం చేస్తున్నప్పుడు గదిని వీలయినంత చీకటి మనం చేస్తున్నప్పుడు గదిని వీలయినంత చీకటి చేసుకోవాలి.
మనం ఎంతమందితో కలిసి ధ్యానం చేస్తే అంత బాగుంటుంది. సామూహిక ధ్యానం అన్నది మూడింతలు మరింత శక్తిదాయకం!

ధ్యానం ఎంతసేపు చెయ్యాలి ?”

ప్రతిరోజూ విధిగా ఎవరి వయస్సు ఎంతో అన్ని నిమిషాలు కూర్చోవాలి. అంటే పది సంవత్సరాల వయస్సు వాళ్ళు పదినిమిషాలు, ఇరవై సంవత్సరాల వయస్సువాళ్ళు ఇరవైనిమిషాలు, ముప్పై సంవత్సరాల వయస్సువాళ్ళు ముప్పై నిమిషాలు .. ఈ విధంగా ప్రతి ఒక్కరూ ధ్యానంలో తప్పనిసరిగా కూర్చోవాలి.
ప్రతిరోజు ధ్యానాభ్యాసం అలవాటు చేసుకోవాలి. అన్నం ఉడకడానికి సమయం పడ్తుంది. ఊరికే ‘అలా’ పొయ్యి మీద బియ్యం పెట్టి ‘ఇలా’ తీసేస్తే అన్నం ఎంతమాత్రం వుడకదు గదా! అలాగే ” ఆత్మ కూడా ‘ఉడకాలి ’” అంటే ఈ ఆనాపానసతి అనే పొయ్యిమీద కాస్సేపు వుండాలి! ” ఎంతసేపు ఉడకబడాలి? ” అంటే వయస్సు ఎక్కువ ఉన్నప్పుడు ఆనాపానసతి అనే పొయ్యి మీద ఎక్కువసేపు వుండాలి. తక్కువ వయస్సు వున్నప్పుడు తక్కువ సమయం సరిపోతుంది. సరియైన సమయం కేటాయించినప్పుడే, పూర్తిగా ఉడకుతాం ! అప్పుడే “విపస్సన” అనేది మనకు సంభవిస్తుంది.
ఈ ఆనాపానసతి అన్నది రోజుకు ఒక్కసారి అయినా నిశ్చలంగా కూర్చుని ఎవరి వయస్సు ఎంత వుందో అన్ని నిమిషాలు కూర్చోవాలి.
ఇంకా అదనంగా .. ఇతర సమయాల్లో ఓ అయిదు నిమిషాలు సమయం దొరకితే అయిదు నిమిషాలు .. పది నిమిషాలు దొరికితే పది నిమిషాలు .. ఎంత సమయం దొరికితే అంతగా అభ్యాసం చేయాలి. ఒక్క నిమిషం కూడా సమయం వృధా చేసుకోకుండా .. వేరే పని ఏమీ లేనప్పుడు .. చక్కగా కళ్ళు రెండూ మూసుకుని ఎక్కడంటే అక్కడ కూర్చుని శ్వాస మీద ధ్యాస పెట్టడం అలవాటు చేసుకోవాలి.
రాత్రిపూట పడుకునేటప్పుడు, ఆ పడుకునే ముందు శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా మనం నిద్రపోతే .. ఆ నిద్ర అంతా కూడా “యోగ నిద్ర” అయిపోతుంది కనుక రాత్రి పడుకునే ముందు ప్రతిఒక్కరూ తప్పనిసరిగా “శ్వాస మిద ధ్యాస” ద్వారా ఆనాపానసతి చేస్తూ నిద్రలోకి వెళ్ళాలి.

నాడీమండలశుద్ధి

ధ్యాన విజ్ఞానశాస్త్రంలో మూడు విషయాలు ఉన్నాయి ;
* ఆనాపానసతి
* కాయానుపస్సన
* విపస్సన
ఆనాపానసతి అభ్యాసంలో భౌతికాయం వుడుకుతుంది. అంటే నాడీమండలశుద్ధి జరుగుతుంది. అనేకానేక ప్రాణశక్తి సంచారాలు మన ప్రాణమయశరీరంలో జరగడం మనం గమనిస్తాం. ఎక్కెడెక్కడో నొప్పులు వస్తూంటాయి. ఎక్కడెక్కడో శక్తి ప్రవాహం అవుతున్నట్లు మనం గమనిస్తూ వుంటాం. దీనిని ” కాయనుపస్సన ” అని గౌతమబుద్ధుడు అన్నాడు. అంటే అంతర్‌శరీరంలో, నాడీమండలంలో జరిగే మార్పులను గమనిస్తూ వుండడం
” కాయానుపస్సన ” లో విశేషంగా నాడీమండల శుద్ధి జరుగుతుంది. నాడీమండలకాయంలో సుమారు రెండు లక్షల 72 వేల నాడులు వున్నాయి. ‘నాడీ’ అంటే ఓ ఎనర్జీ ఛానెల్. నాడులన్నీ శుద్ధం కావడాన్నే .. ఆ విధంగా శుద్ధం అవుతున్నప్పుడు వచ్చే నొప్పులనూ, బాధలనూ, అనుభవాలనూ గమనించడాన్నే .. ” కాయానుపస్సన ” అంటాం.

ప్రాణశక్తి ఆవాహనం

ఆనాపానసతి అన్నదానిని చేస్తూంటే, చేస్తూంటే అపారమైన ప్రాణశక్తి మన లోపలికి ప్రవహించి, ఆ ప్రాణశక్తి అనేకానేక మలిన నాడులను ప్రక్షాళన గావిస్తూ వుంటే ఆ యొక్క కదిలికలనూ, ఆ యొక్క కడిగే రీతులనూ, కడగడం ద్వారా వచ్చే నొప్పులనూ గమనించడమే ” కాయనుపస్సన “.
ఆనాపానసతి అభ్యాసంలో ప్రాథమికంగా ఎన్నో రోజులు రకరకాలైన శారీరక నొప్పులను అనుభవిస్తూ వుంటాం. ఈ శారీరక నొప్పులు, బాధలు అన్నవి .. కాయానుపస్సనలో వచ్చే తప్పనిసరి బాధలు .. ధ్యానాభ్యాసంలో మరింత లోతుకు వెళ్తేనే వాటిని మనం అధిగమించగలం. చాలామందికి ఇది తెలియక “ధ్యానంలో నొప్పులు వస్తున్నాయి” అని ధ్యానం మానేస్తూ వుంటారు ; ఇది చాలా తెలివితక్కువ పని !

తితీక్ష .. పీడను భరించే శక్తి

ఇలా ఆనాపానసతి మొదలుపెట్టిన తర్వాత వచ్చే నొప్పులను సంతోషంగా సహనంగా, ఓపిగ్గా భరించాలి ! ఈ ” భరించే శక్తి ” నే శంకరాచార్యులవారు ” తితీక్ష ” అన్నారు.
” సమం ” – ” దమం ” – ” తితీక్ష ” – ” ఉపరతి ” – ” శ్రద్ధ ” – ” సమాధానం ” .. వీటినే ఆయన “షట్‌సంపత్తి” అన్నారు.
షట్‌సంపత్తులలో మూడవదే “తితీక్ష” అంటే నాడీ మండలశుద్ధి జరిగేటప్పుడు మనం పడే బాధలను సహనంతో భరించటం! మరి ధ్యానంలో కూర్చున్నప్పుడు రకరకాల బాధలు వచ్చి తీరుతాయి.
ఎందుకంటే, మనం మన గతజన్మలలో .. ప్రాథమిక అహంకారపూరిత జన్మల్లో.. అనేకానేక హింసాత్మక కర్మల ద్వారా మన నాడీమండలాన్ని ఎంతగా అశుద్ధం చేసుకున్నామో ! అంతటి అశుద్ధాన్ని మన ఆఖరి జన్మల్లో, తప్పనిసరిగా శుద్ధం చేసుకోవలసిందే ! నాడీమండలం ఎంత అశుద్ధంగా వుంటే అది “శుద్ధం” అయ్యేటప్పుడు అంత ఎక్కువగా నొప్పులు వస్తూ వుంటాయి. గతజన్మల్లో మ్నం ధ్యానయోగ అభ్యాసం చేయకపోతే .. గతజన్మల్లో ఎక్కువగా మరి పాపచరితులం అయితే .. ఈ జన్మలో మనం ఆనాపానసతి అభ్యాసం మొదలుపెట్టినప్పుడు ఎన్నో రోజులు ఆ నాడీమండలశుద్ధి లోనే యోగ సమయాన్ని గడపాల్సి వస్తుంది. ఎన్నో గంటలు ఆ కాయానుపస్సనలోనే .. ఆ రెండో దశలోనే వుంటూ ఎన్నో బాధలను తప్పనిసరిగా అనుభవించాలి.
ఈ కాయానుపస్సన, రెండవ దశ, అంటే నాడీమండలశుద్ధి అన్నది “ఎన్ని రోజుల్లో, ఎన్ని వారాల్లో, ఎన్ని నెలల్లో, ఎన్ని సంవత్సరాల్లో పూర్తి అవుతుంది?” అన్నది ఆయా సాధకుల గతజన్మల చరిత్రను బట్టి వుంటుంది.
కనుక, “గతజన్మల్లో ఏం చేశాం? ఏం చెయ్యలేదు?” అన్న దానిని బట్టి ఈ జన్మలో ఈ యొక్క కాయానుపస్సన దశ “ఎంత వరకు వుంటుంది? ఎంత వరకు వుండదు” అని మనకు తెలుస్తుంది.
అయితే, గతజన్మల్లోనే గొప్ప యోగాభ్యాసి అయితే కాయానుపస్సన అన్న రెండవదశ అసలే వుండకపోవచ్చు ! లేదా బహుకొద్దిగా వుండవచ్చు ! ఆనాపానసతి మొదలుపెడ్తూనే మూడోకన్ను తెరుచుకోవచ్చు ..

మండల ధ్యాన దీక్ష

అయితే, గతజన్మల్లో ఏది ఎలా వున్నా, ఈ వర్తమాన జన్మలో ఎంత దీక్షాయుతంగా ఈ ధ్యాన అభ్యాసం చేస్తామో దాని మీదే ఫలితాలు అధికంగా ఆధారపడి వుంటాయి. ధ్యానాభ్యాసం అకుంఠిత దీక్షగా చేస్తే నలభై రోజుల్లో ఎవరికైనా సరే ఈ కాయానుపస్సన, నాడీమండలశుద్ధి అన్న దశ పూర్తిగా అయిపోయి విపస్సన దశలోకి సత్వరంగా, ఖచ్చితంగా వచ్చేస్తారు. నలభై రోజుల దీక్షనే “మండల దీక్ష” అన్నాం.
ఏసుక్రీస్తు .. “ఐ ఫాస్టెడ్ ఫర్ ఫార్టీ డేస్” అన్నారు. అంటే, జీసస్ నలభై రోజులు ఏకధాటిగా ధ్యానం చేసారన్నమాట! నలభై రోజుల మండల దీక్షలో ఆనాపానసతి అభ్యాసం చేస్తే ప్రతి మనషి కూడా తప్పకుండా ఓ మాస్టర్ అవుతాడు.

జీవుడే దేవుడు

దేహమే దేవాలయం ; జీవుడే దేవుడు ; అయితే ఇదంతా మనకు ” అనుభవం ” లోకి రావాలి. పుస్తక పరంగా, గురువు యొక్క వాణి పరంగా, మరి పండితుల ప్రవచనాల ప్రకారంగా మనం ఆధ్యాత్మిక సత్యాలను తెలుసుకుని ఉండవచ్చు. కానీ స్వానుభవం లేకపోతే అది “జ్ఞానం” కాజాలదు.
” ఆత్మే పరబ్రహ్మం ” – ప్రథమ సత్యం
” జీవుడే దేవుడు ” – ద్వితీయ సత్యం
” దేహమే దేవాలయం ” – తృతీయ సత్యం
ఈ మూడు ఆధ్యాత్మిక సత్యాలు .. ఈ మూడు సూత్రాలే జ్ఞానం. ” నేనే అంతా ” అన్నది మొట్టమొదటి సత్యం. ” ఇక్కడున్నవాడే ఆ యొక్క దివ్యమైనవాడు ” అన్నది రెండవ సత్యం. “ఈ దేహమే దేవాలయం ; ఈ కణ విభాగమే దేవాలయం ; అందులో విరాజిల్లుతున్నవాడే దేవుడు ” అన్నదే మూడవ సత్యం.

” సాధన “

ఈ జ్ఞానం రావాలంటే ఏం చేయాలి ? ” సాధనా ప్రకరణం ” లో ప్రవేశించాలి ; ఈ సాధనా ప్రకరణంలో ఉన్న నాలుగు సత్యాలు ఏమిటంటే ..
ప్రప్రధమంగా – ” శ్వాసే గురువు “
రెండవది – ” సమయమే సాధన “
మూడవది – ” సహనమే ప్రగతి “
నాల్గవది – ” అనుభవమే జ్ఞానం “
‘ సాధన ’ అన్నది గురువు దగ్గరి నుంచే మొదలువుతుంది; ఎక్కడ సద్గురువు లేడో .. ఎక్కడ సత్యాన్ని చెప్పేవాడు లేడో .. ఏం చేయాలో, ఎలా చేయాలో, ఎప్పుడు చేయాలో ఎక్కడ చేయాలో .. ఏది ఎలా చేయకూడదో, ఏది ఎప్పుడు చేయకూడదో, ఏది ఎక్కడ చేయకూడదో .. మరి ఇవన్నీచెప్పేవాడే గురువు.

శ్వాసే గురువు

సంగీతం నేర్చుకోవాలంటే గురువు ఉండాలి .. సంస్కృతం నేర్చుకోవాలంటే సంస్కృతం గురువు కావాలి. అలాగే ఆధ్యాత్మికంలో కూడా “నేనే అంతా”.. “ఈ దేహమే దేవాలయం” అన్నవి స్వంతానికీ, అనుభవానికీ రావాలంటే గురువు దగ్గరకు చేరాలి. గురువుకి సాష్టాంగ నమస్కారం చేయాలి. గురువుకు సేవ చేయాలి. అపుడు ఆ గురువు .. జ్ఞానాన్ని బోధిస్తాడు .. సర్వమూ బోధిస్తాడు !
అయితే ఈ ఆధ్యాత్మిక సాధన ప్రకరణంలో మాత్రం ” ఎవరు గురువు? “, ” ఏమిటి గురువు? ” అంటే ” శ్వాసయే గురువు. ” అసలు ఒక ముముక్షువు ఇంకొక ” వ్యక్తి – గురువు ” దగ్గరకు వెళ్ళనే అక్కర్లేదు .. ఆధ్యాత్మిక సాధన అన్నది మనలోకి మనం చేసే ప్రయాణమే !

ధ్యానం .. ఆత్మప్రయాణం

రెండు రకాల ప్రయాణాలు ఉన్నాయి. మొదటి ప్రాపంచిక ప్రయాణంలో బయటివాళ్ళను వివరాలు అడగాలి. రెండవ ఆధ్యాత్మిక ప్రయాణంలో లోపలున్న వాళ్ళను అడగాలి.
ఒకవేళ బయట చేసే ప్రయాణం అయితే మరి బయటివాళ్ళని అడిగి మార్గం తెలుసుకోవాలి. లోపల చేసే ప్రయాణం కనుక లోపలున్న వాడినే అడగాలి! కానీ లోపల చేసే ప్రయాణం గురించి బయటివాళ్ళను ఎలా అడుగుతాం?? బయట చేసే ప్రయాణాలకు లోపల ఎక్కడ అడుగుతాం??
అయితే లోపల మన శ్వాస ఉందని మనకు తెలుసు! మనకు ఖచ్చితంగా శ్వాస అన్నది బయటి నుంచి లోపలికి పోతోందనీ, లోపల నుంచి బయటకు వస్తోందనీ తెలుసు !
కనుక ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో శ్వాసే గురువు” అని ఆధ్యాత్మిక శాస్త్రం ప్రభోధిస్తోంది !

” గౌతమబుద్ధుడు “

గౌతమబుద్ధుడు ఎంతోమంది గురువుల దగ్గరకు వెళ్ళాడు. అలారకలముడు, ఉద్ధకరామభద్రుడు, ఇంకా ఎంతోమంది! ” మంత్రమే గురువు ” అనీ, మరొకరు ” ఆహారం లేకుండా ఉండు .. అదే నీ గురువు అవుతుంది ” అనీ, ” ఉపనిషతులు చెప్పిందే మననం చేస్తూండు ” అనీ, ” ముక్కు బిగపట్టుకుని ఉండు .. చక్రాల మీద మనస్సును ఏకాగ్రం చెయ్యి .. భృకుటి మధ్యలో మనస్సును లగ్నం చెయ్యి” అనీ రకరకాల గురువులు రకరకాలుగా బుద్ధుడికి బోధించారు.
ఆయన అన్నింటినీ త్రికరణశుద్ధిగా అభ్యసించి తాను నేర్చుకున్నవన్నీ ఒక్కొక్కటిగా .. ” అది తప్పు “, ” ఇది తప్పు ” అని తేల్చుకోవడానికి ఐదున్నర సంవత్సరాలు పట్టింది!
చివరికి సహజంగా, సరళంగా, సున్నితంగా ఉన్న తన శ్వాస మీదే .. ఏ కుంభకమూ లేని .. కేవల సహజ పూరక రేచకాత్మకమైన .. తన యొక్క శ్వాస ధార మీదే తన ధ్యాస ధారను లగ్నం చేసి ” ఆనాపానసతి ” చేశాడు.
ఒకటవ జాములో ” మూడోకన్ను ” తెరుచుకుంది. అదే జాములో .. ” జన్మపరంపర ” ను తెలుసుకున్నాడు. రెండవ జాములో ఆ మూడోకన్ను ద్వారా ” కర్మపరంపర ” సత్యాలను తెలుసుకున్నాడు ; మూడో జాములో ” ఈ ప్రపంచంలోని దుఃఖం, తృష్ణ వలన” అనీ, “తృష్ణ, అవిద్య వలన ఏర్పడుతోంది” అనీ .. ” అవిద్య, చిత్తవృత్తినిరోధంతో అంతమవుతుంది ” అనీ .. తెలుసుకున్నాడు. వెరసి ధ్యాన జ్ఞాన సాధన కోసం అష్టాంగ మార్గాన్ని కనుక్కున్నాడు ; దుఃఖ నివారణకు ఉపాయం తెలుసుకున్నాడు.
ఇక ఆ తరువాత .. తన జీవితాంతం .. అందరికీ ” ఆనాపానసతి ధ్యానం ” బోధించాడు ; ” నేను ఈ విధంగా సరళమైన, సున్నితమైన, స్వాభావికమైన ‘ శ్వాస మీద ధ్యాస ’ ఉంచాను ; ఇంకేది చెయ్యకూడదు ; మంత్రం చెప్పుకోకూడదు .. ఫలానా గురువు ముఖారవిందం మీద ధ్యాస వద్దు .. కళ్ళు చిట్లించి, ఊపిరి బిగపట్టి కుంభకం లాంటివి చెయ్యకూడదు ..” అంటూ అన్నీ క్షుణ్ణంగా విశదీకరించి, విపులీకరించి చెప్పాడు !
” నేను ఎవ్వరికీ గురువును కాజాలను కనుక ‘ అప్పో దీపో భవ ’ అంటే ఎవరి దీపం వారే వెలిగించుకోవాలి ” అన్నారు. ” నేను నీ దీపం ఎన్నటికీ కాజాలను ” అని తన ప్రియశిష్యుడు ఆనందుడికి సందేశం ఇచ్చిన గౌతమబుద్ధుడు .. ” నీ శ్వాసే నీ దీపం .. నీ శ్వాసే నీ గురువు ” అంటూ తమ చివరి శ్వాసను వదిలారు! గౌతమబుద్ధుడు చూపిన ముక్తి మర్గాన్నే మనం అందరం అనుసరిద్దాం!!

No comments:

Post a Comment

Address for Communication

Address card