ఇదివరకే పడివున్న అక్షరాల అడుగుజాడలలో తడబడుతూ నడుస్తూండేవే నీవీ నావీ, ఇంకా మనలాంటి వాళ్ళవే అందరివీ, జ్ఞాపకాలు.
Wednesday, October 31, 2018
నాకో షుగర్ లెస్సూ...లె.....స్సూ.....స్సూ.....
చీకట్లను
చీల్చుకుంటూ..వెలుతురు దారి
చెమటలు
కక్కుకుంటూ..అలుపెరగని ఓ బాటసారి
యూజ్ అండ్ త్రోలు..
చిందర వందరగా వ్యర్ధాలు
మరికొన్ని
గురుతులు.. కొన్ని మరకలు
మార్నింగ్ వెరీ
ఫ్రెస్షూ..ఈవెనింగ్ వెరీ స్ట్రెస్షూ
ఉరుకు పరుగుల
జీవితం..ఆశే ఆసాంతం
పేరు మధురం..తీరు
దుర్భరం
ప్రతి మనిషికి
విరోధి..అంతులేని వ్యాధి
చక్కెర.. షుగర్
..డయాబెటిక్ ..
ఎలా పిలుచుకున్నా..తీయగా
పలుకుతుంది
ఆనక విషం
చిమ్ముతుంది
ఆకలికి తీర్చే
అన్నం విషమై
తనువెల్లా తూట్లు
పొడుస్తుంటే
ప్రాణం కంటే
ఎక్కువగా ప్రేమించిన
వారు గొంతు నులిమేస్తున్నట్లుంది
నిరంతరం చావు
భయంతో
తింటూ .. బతుకుతూ
తీయనైన రోగాన్ని
హాయిగా జయించాలనే
తెలతెలవారుతుండగా
వాకింగులు-జాగింగు ల నే
ఈ వేకువ పోరాటం-బ్రతకటానికి
ఆరాటం
నీడ కూడా జాడ
చూపని వేళలో
జీవితాన్ని కాచి
వడపోసిన వాడిలా
పొద్దూన్నే టీ
స్టాల్స్ వద్ద తప్పనిసరి సరిగా వినే వాయిస్సు
బాబూ ఒక కాఫీ....నాకో
షుగర్లెస్సూ...
నాకో టీ.... నాక్కూడా.....
షుగర్లెస్సూ
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
Tuesday, October 23, 2018
నేను సైతం(మీ టూ)...
పురాణకాలం నుంచి ఆధునిక యుగం వరకు ఈ సమస్య అలా జ్వలిస్తూనే ఉంది. తల వంచి సహించడమా, పిడికిలి బిగించడమా అని స్త్రీజాతి నిత్యం అంతర్మథనానికి గురవుతూనే వచ్చింది. సీత, ద్రౌపది తమవైన ప్రత్యామ్నాయ పరిష్కారాలు వెతుక్కున్నారు. రంభ అత్యాచారానికి బలైపోయింది. చరిత్ర ఒక గాయంనుంచి మరో గాయం దిశగా నడుస్తూనే ఉంది. ‘రెండు కళ్లనుంచి చూపులు సూదుల్లా వచ్చి మాంసపు ముద్దలపై విచ్చలవిడిగా తిరుగుతూనే ఉంటాయి’ అన్న జయప్రభ ఆవేదన స్త్రీజాతి మనోవేదనగా ప్రతిధ్వనిస్తూనే ఉంది. ‘వికృతమైన భల్లూకపు పట్టులాంటిదేదో విడువక కలల్లో సైతం వెంటాడుతుంది’ అన్నది ఆ జాతికి పీడకలగా పరిణమించింది. కవయిత్రి ఓల్గా చెప్పినట్లు ‘మీ వికృత వాంఛాగ్నుల్ని మా ఒడిలో చల్లార్చుకుని ఎన్నిసార్లు తృప్తిగా తేన్చారు!’ అంటూ రోదిస్తూనే ఉంది. ‘వేయి రాక్షస బల్లులు మీద పాకినట్లు’ అని మందరపు హైమవతి వర్ణించినట్లు జుగుప్సతో స్త్రీ ఉలిక్కిపడుతూనే ఉంది. దుర్భరమైన అనుభవాల్ని తన గుండెల్లో దాచిపెట్టింది. ‘కడుపులోనే కాదు, గుండెలోతుల్లోను నిప్పు కణికల్ని దాచుకొంటున్నవాళ్లం’ అని శీలా సుభద్రాదేవి ‘కాలసముద్రంలో బిందువు’ కవితలో చెప్పిందదే! స్త్రీది జన్మజన్మల దుఃఖం, యుగయుగాల అవమానం. కొండేపూడి నిర్మల ‘బాధాశప్తనది’ ‘సముద్ర జ్వరం’ వంటివి వాటికి ప్రబల నిదర్శనలు. ‘కలల్ని కన్నీటి చాటున జారవిడిచాం, కళ్లను రెప్పల వెనుక చిదిమి ఉంచాం’. అంతేనా, మౌనంగా మృగాళ్లను సహించాం, ఇన్నేళ్లూ భరించాం, ఎన్నాళ్లీ సహనం? అని స్త్రీ గుండె కుతకుత ఉడికిపోతూ వచ్చింది. అవమానాలకు, అణచివేతలకు తిరుగుబాటే పర్యవసానం. ఇది చరిత్ర చెప్పిన సత్యం. ‘దిక్కుమొక్కులేని జనం ఒక్కొక్కరు అగ్నికణం సింహకంఠనాదంతో వస్తారిక కాచుకోండి’ అని విప్లవకవి సుబ్బారావు పాణిగ్రాహి చేసిన ‘హెచ్చరిక’ అన్ని కాలాలకు, వర్గాలకు వర్తించే వాస్తవం.
మానాన్నే కాదు, మనసును చెరచినా అది అత్యాచారమే. ఈ సత్యాన్ని మహిళా లోకం ఎన్నోసార్లు వివరిస్తూనే ఉంది. అయినా ‘వీధి వీధికో గాంధారి కొడుకు, గాంధీగారి దేశంలో’ అన్న ఆరుద్ర మాటను పురుషజాతి రుజువు చేస్తూనే ఉంది. స్త్రీ ఎన్నాళ్లని ఓపికపడుతుంది? మౌనం బద్దలయింది. నేను సైతం(మీ టూ)... అంటూ పిడికిలి బిగించింది. పురుషుడి పూసాలు పెకలించడానికి సిద్ధమైంది. ‘నేను సైతం పురుషలోకం అణచివేతను ధిక్కరిస్తాను... నేను సైతం నేను సైతం పెద్దమనుషుల పరమ నీచపు బుద్ధులెన్నో బయటపెడతాను’ అంటూ గొంతు విప్పింది. ఇది ఎనభైల్లో తలెత్తిన స్త్రీవాద ఉద్యమం లాంటిది కాదు. అసలు ఉద్యమమే కాదది- ఉప్పెన! ఈ నిరసన ధ్వనులు మాటల తూటాలతో ఊదరగొట్టేవో, తాటాకు మంటల చిటపటలో కానే కావు- గుండెను బద్దలు కొట్టే ఫెళఫెళా రావాలు, సింహనాదాలు. ‘ఘోషించాను- మంచిగా ఉండండర్రా అంటూ గోలపెట్టాను, అమాయకుల జోలికి పోకండర్రా అంటూ’ అని మహాకవి శ్రీశ్రీ ఝంఝ కవితలో మొరపెట్టుకున్నాడు. జనం వినలేదు. ‘నెత్తురు కార్చిన కళ్లే నిప్పులు ఎగచిమ్ముతాయి’ అని మరో ప్రస్థానంలో ఆయన చేసిన హెచ్చరికను మహిళాలోకం ఇప్పుడు అక్షరాలా అమలు చేస్తోంది. దసరా రోజుల్లో దుర్గామాత ప్రచండ శౌర్యాన్ని తలచుకున్నవారు ఇప్పుడు ఆమె శక్తి చైతన్య విశ్వరూపాన్ని ప్రత్యక్షంగా గమనిస్తున్నారు. ‘జటలు జళిపించి గర్జించి సంభ్రమించి, దృష్టి సారించి బొమలు బంధించి కెరలి, జిహ్వ ఆడించి లంఘించి చేతనొడిసిపట్టి’ అని పోతన భాగవతంలో వర్ణించిన హిరణ్యకశిపుడి వధను సరిగ్గా అర్థం చేసుకొంటే- మగాళ్లలోని రావణాంశను ఈ ఉద్యమం ఏ రకంగా గుప్పెట పడుతున్నదో బోధపడుతుంది. ఉద్యమ స్వరూపం బొమ్మ కడుతుంది.
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
Tuesday, October 16, 2018
మతానికి డబ్బుకి ముడి పెట్టిన వాళ్ళెవరు?
గుడి కెళితే ,గుడికి
వచ్చే భక్తులను, sponsors గాను నాన్ sponsors గాను
విడగొట్టి, వాళ్ళని వేరు వేరు వరసల్లో నిలిపేది ఎవరు?
మన చేత ధ్యానం చేయి౦చకుండ , పట్టుమని పది
నిముషాలైన ప్రాణాయామం చేయి౦చకుండ, నోటితో ఒక్క
మంత్రం పలికించకుండా, ప్రార్ధన కానీ కనీసం గట్టిగ
నమ్హ శివాయ అనిగాని, గోవిందా.. గోవింద అని గాని
అనిపించకుండా, దృష్టంతా మన అర్చన , అభిషేకం, ప్రసాదాలపాకెట్లు,కళ్యాణం
టికెట్ల మీద పెట్టెదేవరు? మనం సేవల టికెట్స్ కొసం ఎదురు
చూసి, ఒకరిద్దరు టికెట్స్ తెచ్చి
ఇవ్వగానే పూజ మొదలు పెట్టేదెవరు? మనకు గుడిలో ఒక్క మంత్రం ఏ పూజారైన నేర్పాడ? కనీసం
ఏనాడైనా దేవుడికి నైవేద్యం పెట్టడం ఎలాగో నేర్పార? ప్రతి చోట
తొందర, పూజ తొందరగా ముగిసి పోవాలి, త్వరగా ఇంటికి
వెళ్లి పోవాలి లేక సినిమాకు వెళ్ళాలి అని ఆలోచించే భక్తులు కూడా
ఉన్నారు. గట్టిగ అరగంట ధ్యానం లో
కూర్చొనే ఓపిక ఉండే భక్తులు ఎంతమంది ఉన్నారు? వీళ్ళకి
తగ్గట్టే, గుడిని కూడా బిజినెస్ గా మార్చి, భక్తులను ఆకట్టుకోవడానికి ఎన్ని ట్రిక్కులు! ఇక గుడికి వెళితే
ప్రశాంతత ఎలా వస్తుంది?
నా మటకు నేను, ఒక అజ్ఞానిలా
గుడికి వెళ్ళాలి, ఒక్క భక్తి తో మాత్రమే వెళ్ళాలి, ఎటువంటి
రొక్కం లేకుండా దేవుడిని దర్శించుకోవాలి, తిరిగి గుడినుండి వచ్చేటప్పుడు, ప్రశాంతమైన
మనసుతో రావాలి, నా ముఖంలో కొత్త విషయం నేర్చుకొన్నాను అన్న ఆనందం కలగాలి, నేను
నేర్చుకొన్న విద్య మరోకరితో పంచుకోనేదిగా
ఉండాలి, నాకు అవసరానికి అక్కరకు రావాలి. ఇవన్ని జరిగే
గుడి ఏమిటో మీకు తెలుసా? లేక మనమే
సులువైన మార్గాలు ఎన్నుకొని, టికెట్ కొంటె చాలు, పుణ్యం
వస్తుందని, మన మంచి చెడ్డలు పూజారి
చూసుకొంటాడని ఇలా అలవాటు పడ్డామ? లోపం వుందా? వుంటే వ్యవస్థ
లోనా మనలోనా? ఎలా సరిచేసుకోవాలి.
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
Subscribe to:
Posts (Atom)
Address for Communication
-
దీపావళి అంటే దీపాల పంక్తి అని అర్థం – అందరికీ తెలిసినదే. కానీ , చిన్నారులు దీపావళి అంటే టపాసుల పండుగ అని అనుకున్నట్టే మధుపర్కం అ...
-
ఒకసారి పల్నాడు వెళ్లిన శ్రీనాధునికి మంచి నీళ్లు కావలసి వచ్చి తన ఇష్ట దైవం శివుణ్ణి ఇలా దబాయించాడట. సిరిగలవానికి చెల్లును తరుణులు పదియారు...
-
వాతావరణం చలిచలిగా , మబ్బుమబ్బుగా , స్తబ్దుగా ఉంది. ఇట్లాటి సమయాల్లో కవులు కవితలు రాస్తారు , నాకు మాత్రం - వేడివేడిగా మిర్చిబజ్జీలు ...