ఆర్జించే కుటుంబ పెద్దకు అనుకోకుండా ఏమైనా జరిగితే? అతనిపై ఆధారపడిన వారికి ఆర్థికంగా ఎంత ఇబ్బందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాము అత్యంత ప్రేమించే తమ కుటుంబ సభ్యులకు ఇలాంటి పరిస్థితులు తలెత్తకూడదనే ప్రతివారూ కోరుకుంటారు. కేవలం అనుకోవడంతోనే సరిపోదు కదా! దాన్ని ఆచరణలో పెట్టాలి. అందుకోసం ప్రతి వ్యక్తీ కచ్చితంగా ఓ బీమా పాలసీ తీసుకోవాలి. గతంలోలాగా రూ.రెండు లక్షలకో.. రూ.మూడు లక్షలకో పాలసీ తీసుకుంటే ఏ మాత్రం సరిపోదు. మరి ఏం చేయాలి? తక్కువ ప్రీమియంతో ఎక్కువ రక్షణ కల్పించే ఆన్‌లైన్‌ టర్మ్‌ పాలసీలు ఎంపిక చేసుకోవడమే. మరి వీటి గురించి తెలుసుకుందామా!

పేరులో ఉన్నట్లే.. నిర్ణీత కాలంపాటు బీమా రక్షణ అందించేవే టర్మ్‌ బీమా పాలసీలు. సంప్రదాయ పాలసీలకు ఇవి పూర్తిగా భిన్నం. అర్థం చేసుకోవడమూ సులభం. ఈ పాలసీలను రెండు రకాలుగా తీసుకునే వీలుంది. బీమా సలహాదార్లు/ఏజెంట్ల నుంచి పాలసీ తీసుకోవడం మొదటి పద్ధతి. ఇక రెండో విధానం ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతున్న ఆన్‌లైన్‌ టర్మ్‌ పాలసీలు. ప్రతీదీ అంతర్జాలంలోనే కొంటున్న ప్రస్తుత రోజుల్లో ‘ఈ టర్మ్‌’ పాలసీల జోరూ బాగానే సాగుతోంది.

ఏమిటి ప్రత్యేకత?

టర్మ్‌ పాలసీల్లో తక్కువ ప్రీమియానికి ఎక్కువ రక్షణ లభిస్తుంది. బీమా సంస్థ, పాలసీని బట్టి గరిష్ఠంగా 40 ఏళ్ల వ్యవధికి ఎంపిక చేసుకోవచ్చు. ఒకసారి పాలసీ తీసుకున్న తర్వాత ప్రీమియం స్థిరంగా ఉంటుంది (సేవా రుసుములు మారినప్పుడు తప్ప). ఒకవేళ పాలసీదారుడికి అనుకోకుండా ఏదైనా జరిగితే.. పాలసీ మొత్తాన్ని నామినీకి చెల్లిస్తారు. పాలసీ పూర్తికాలం కొనసాగి.. వ్యవధి ముగిసిన తర్వాత చెల్లించిన ప్రీమియం వెనక్కి రాదు. ప్రాథమిక పాలసీకి తోడుగా ప్రమాదవశాత్తూ మరణం, ప్రీమియం రద్దు తదితర రైడర్లను ఎంచుకునే వీలూ ఉంది. ఇక ప్రత్యేకంగా ఆన్‌లైన్‌ టర్మ్‌ పాలసీల విషయానికి వస్తే…

* సంప్రదాయ మనీ బ్యాక్‌, ఎండోమెంట్‌ పాలసీలతో పోలిస్తే ఆన్‌లైన్‌ టర్మ్‌ పాలసీల ప్రీమియం తక్కువగా ఉంటుంది.

* నేరుగా బీమా కంపెనీ సలహాదారుల దగ్గర్నుంచి తీసుకున్న టర్మ్‌ పాలసీలకన్నా 30 నుంచి 40శాతం వరకూ ప్రీమియం తక్కువ.

* ఈ పాలసీ పూర్తిగా ఆన్‌లైన్‌లోనే లభిస్తుంది. దరఖాస్తు నింపడం, ప్రీమియం చెల్లింపు అన్నీ అంతర్జాలంలోనే. కాబట్టి, మీపై బీమా కంపెనీ సలహాదార్ల, ఏజెంట్ల ప్రభావం ఉండదు.

* అన్ని సంస్థల పాలసీలనూ ఒకే చోట పోల్చుకునేందుకు ప్రస్తుతం అనేక వెబ్‌సైట్లు అందుబాటులో ఉన్నాయి. వీటి ఆధారంగా మంచి పాలసీ ఏదన్నది నిర్ణయించుకునేందుకు అవకాశముంది.

* చెల్లించిన ప్రీమియానికి ఆదాయపు పన్ను చట్టం సెక్షన్‌ 80సీ కింద పన్ను మినహాయింపు పొందేందుకు వీలుంది.

బీమా.. ఎంత మొత్తానికి?

ఒక వ్యక్తి ఎంత బీమా తీసుకోవాలి అనేది ఎప్పుడూ చిక్కు ప్రశ్నే. తనకు ఏదైనా జరిగినప్పుడు తనపై ఆధారపడిన వారికి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందీ రాకుండా ఉండాలి. అందుకే, బీమా మొత్తాన్ని నిర్ణయించుకునేప్పుడు కొన్ని అంశాలను పరిగణనలోనికి తీసుకోవాలి.

* ఎంత ఆదాయం అవసరం?: ప్రస్తుతం మీ కుటుంబానికి నెలకు ఎంత ఖర్చు అవుతోంది. భవిష్యత్తులో ఇది ఎంత మేరకు పెరుగుతుంది? అనే విషయాల్లో ముందుగా స్పష్టత ఉండాలి. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్నీ దృష్టిలో ఉంచుకోవాలి. దాన్నిబట్టే బీమా మొత్తాన్ని ఎంచుకోవాలి.

* అప్పులు ఉన్నాయా?: ప్రస్తుతం గృహరుణం, వాహన రుణం తీసుకోవడం సాధారణం అయ్యింది. బీమా మొత్తాన్ని గణించేప్పుడు ఆదాయ అవసరాలతో పాటు, ఉన్న అప్పులనూ లెక్కలోకి తీసుకోవాలి.

* భవిష్యత్తు లక్ష్యాలు: నెలవారీ ఖర్చులు, అప్పులు చూశాక.. భవిష్యత్తులో ఉన్న బాధ్యతలేమిటి అనేది కీలకం. పిల్లల చదువులు, వారి వివాహాలు ఇతర ఖర్చులనూ మర్చిపోకూడదు. ఇవన్నీ కలిపితే వచ్చేదే మీరు ప్రాథమికంగా ఎంత బీమా తీసుకోవాలో తెలుస్తుంది.

* ఆస్తులు ఉన్నాయా?: బీమా మొత్తం గణించేప్పుడు ఖర్చులు, బాధ్యతలు, అప్పులే కాదు… వెంటనే నగదుగా మార్చుకునేందుకు అవకాశం ఉన్న ఆస్తులు, పెట్టుబడులనూ పరిగణనలోనికి తీసుకోవాలి. ముందుగా వచ్చిన బీమా మొత్తం నుంచి వీటి విలువను తీసేస్తే తప్పకుండా తీసుకోవాల్సిన బీమా ఎంత అనేది స్పష్టత వస్తుంది.

030915siri1e

ఎందుకు తీసుకోవాలి?

ప్రమాదాలు, అనారోగ్య కారణాలు.. ఇలా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని అనిశ్చిత పరిస్థితి. ఈ నేపథ్యంలో కేవలం మనం దాచుకున్న డబ్బుతోనే మన కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పించడం అంత తేలికేమీ కాదు. అందుకే, తప్పనిసరిగా జీవిత బీమా ఉండాల్సిందే. ఇది టర్మ్‌ పాలసీల రూపంలో ఉంటే మరీ మంచిది.

* ప్రణీత్‌ వయసు 30 ఏళ్లు. అతను 30 ఏళ్ల వ్యవధికి రూ.కోటి పాలసీ తీసుకోవాలని అనుకున్నాడనుకుందాం. దీనికోసం అతను వార్షిక ప్రీమియం రూ.10,069 చెల్లిస్తున్నాడనుకుందాం. 30 ఏళ్లలో అతను చెల్లించే మొత్తం దాదాపు రూ.3,02,070. ఏటా చెల్లిస్తున్న ప్రీమియానికి కనీసం 8శాతం వార్షిక వడ్డీ వేసుకున్నా రూ.3,74,567 అవుతుంది అంటే.. నెలకు రూ.839 కంటే తక్కువే. ఏ ఇతర పథకమూ కూడా ఇంత తక్కువ మొత్తానికి అంత రక్షణ కల్పించదు.

* ఒక వ్యక్తి భౌతికంగా దూరం అయితే.. అతని కుటుంబ సభ్యులకు ఏర్పడే మానసిక కష్టాన్ని తీర్చడం ఎవరివల్లా కాదు. అయితే, ‘నేను లేకపోతే నా కుటుంబం ఎంత కష్టపడుతుందో’ అనే ఆలోచన కన్నా.. ‘నేను లేకపోయినా నా కుటుంబానికి ఎలాంటి ఆర్థిక కష్టం ఉండదు’ అనే భావన ఎంతో సంతృప్తిని ఇస్తుంది. ఆర్జించే వ్యక్తిగా కుటుంబానికి తగిన ఆర్థిక భరోసా కల్పించినప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. అవునంటారా?కాదంటారా?

చిన్న వయసులో…

ఆన్‌లైన్‌ టర్మ్‌ పాలసీలకు ఇతర పాలసీలతో పోలిస్తే ప్రీమియం తక్కువగానే ఉంటుంది. అయితే, చిన్న వయసులో పాలసీ తీసుకోవడం వల్ల ఇది మరింత తక్కువ. వయసు పెరుగుతున్న కొద్దీ ప్రీమియం కూడా పెరుగుతుంది. ఇలాంటప్పుడు టర్మ్‌ పాలసీలు తీసుకోవడం కొద్దిగా భారంగా అనిపిస్తుంది. బీమా మొత్తం? వ్యవధి ఈ రెండూ పాలసీ ఎంపికలో కీలకం. మీరు ఎంత కాలంపాటు ఆదాయాన్ని ఆర్జిస్తారో అంత వ్యవధికి పాలసీని తీసుకోవడం మేలు.

మర్చిపోకండి: బీమా పాలసీలు ఏవైనా సరే.. వాటికి సకాలంలో ప్రీమియం చెల్లించడం ఎప్పుడూ మర్చిపోవద్దు. ముఖ్యంగా టర్మ్‌ పాలసీల విషయంలో. ప్రీమియం గడువు ముగిసిన తర్వాత 30 రోజుల పాటు అదనపు వ్యవధి ఉంటుంది. ఈ సమయంలో ఏదైనా జరిగానా పాలసీదారుడికి పరిహారం ఇవ్వాల్సిన బాధ్యత బీమా సంస్థపై ఉంటుంది. ఆ సమయంలో చెల్లించాల్సిన ప్రీమియాన్ని మినహాయించుకొని, మిగతా మొత్తాన్ని నామినీకి ఇస్తారు. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ గడువులోగా ప్రీమియాన్ని చెల్లించడం మనకే మంచిది.

ఎంపిక ఎలా?

ఆన్‌లైన్‌ టర్మ్‌ పాలసీని తీసుకునేప్పుడు కొన్ని విషయాలు పరిశీలించాలి. కేవలం తక్కువ ప్రీమియం ఉందనే కారణంతో పాలసీని ఎంపిక చేసుకుంటే.. తర్వాత మన మీద ఆధారపడిన వారు ఇబ్బంది పడాల్సి వస్తుంది.

* పాలసీలని తీసుకునేప్పుడు అన్నింటికన్నా ముందుగా గమనించాల్సింది.. పరిహారం చెల్లింపుల చరిత్ర. 2014-15 సంవత్సరంలో ఐఆర్‌డీఏ నివేదికను పరిశీలిస్తే.. ఎల్‌ఐసీ 1.86%, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ 5.9%, మ్యాక్స్‌ లైఫ్‌ 6.14%, స్టార్‌ యూనియన్‌ 7.14%, బజాజ్‌ అలియాంజ్‌ లైఫ్‌ 8.71%, కొటక్‌ మహీంద్రా 9.31%, ఐడీబీఐ ఫెడరల్‌ 9.66%, మెట్‌ లైఫ్‌ 9.76%, టాటా ఏఐఏ 10.32%, భారతీ యాక్సా 11.87%, బిర్లా సన్‌ లైఫ్‌ 18.03%, రిలయన్స్‌ లైఫ్‌ 18.03%, ఏగాన్‌ రెలిగేర్‌ 19.0%, ఇండియా ఫస్ట్‌ 26.87% క్లెయింలను తిరస్కరించాయి.

* క్లెయిం చేసుకున్నాక ఎంత తక్కువ సమయంలో బీమా పాలసీని పరిష్కరించాయి అనేదీ కీలకమే. పరిహారం ఇవ్వడానికి ఆలస్యం చేస్తోందంటే అది ఆ సంస్థ సేవాలోపం లేదా ఆర్థిక పరిస్థితిని తెలియజేస్తుంది. ఐఆర్‌డీఏ నిబంధనల మేరకు క్లెయిం చేసుకున్న ఆరునెలల్లోపు నామినీకి పరిహారం అందాలి. గత ఆరు నెలల కాలంలో ఒక బీమా సంస్థ తన వద్ద ఎన్ని పాలసీలను పరిష్కరించకుండా అట్టిపెట్టుకుందో కూడా చూసుకోవాలి.

* ప్రస్తతం బీమా సంస్థలు గరిష్ఠంగా 35 నుంచి 40 ఏళ్ల వ్యవధికి పాలసీలను అందిస్తున్నాయి. వ్యక్తుల సగటు ఆయుః ప్రమాణం పెరుగుతున్న నేపథ్యంలో.. సాధ్యమైనంత గరిష్ఠ వ్యవధికి పాలసీని తీసుకోవడం ఉత్తమం. తక్కువ వ్యవధికి పాలసీ తీసుకోవడం.. అది ముగిసిన తర్వాత మళ్లీ కొత్త పాలసీ తీసుకోవాలంటే.. వయసు పెరుగుతుంది కాబట్టి, అధిక ప్రీమియం భారమవుతుంది.

* ప్రీమియం, చెల్లింపుల చరిత్ర, వ్యవధితోపాటు.. సంస్థ పేరు ప్రతిష్ఠలు, ఆర్థిక పరిస్థితి, పాలసీ తీసుకునేప్పుడు, తీసుకున్న తర్వాత అందించే సేవలనూ చూడాలి.

ప్రతికూలతలూ ఉన్నాయి

చాలామంది టర్మ్‌ పాలసీలపై ఆసక్తి చూపించకపోవడానికి కారణం.. ఈ పాలసీలకు చెల్లించిన ప్రీమియం వెనక్కి రాకపోవడమే.

* ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. బీమా పాలసీ అంటే పెట్టుబడి కాదు. కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే టర్మ్‌ పాలసీల ప్రధాన లక్ష్యం.

* ఈ పాలసీలపై ఎలాంటి రుణాలూ కూడా ఇవ్వరు. మధ్యలో మీరు ప్రీమియం చెల్లించడం ఆపేసినా పాలసీ రద్దవుతుంది.

* ఆన్‌లైన్‌ టర్మ్‌ పాలసీలు తీసుకునేప్పుడు మూడేళ్ల ఆదాయపు పన్ను రిటర్నులు చూపించాల్సి ఉంటుంది. వ్యాపారం నిర్వహించే వారు ఆదాయానికి సంబంధించిన ఆధారాలు చెప్పాలి. అప్పుడే పాలసీ అందుతుంది.

* కొన్ని పాలసీల్లో వైద్య పరీక్షలనూ అడగొచ్చు. రూ.కోటి కన్నా ఎక్కువ పాలసీలన్నింటికీ తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాల్సిందే.


సౌజన్యం: ఈనాడు (04-9-2015)- ప్రొ|| డి.చెన్నప్ప, కామర్స్‌ డిపార్ట్‌మెంట్‌,ఉస్మానియా విశ్వవిద్యాలయం