Friday, August 21, 2015

రిట్రాస్పెక్టివ్ టాక్స్ అంటే?

రిట్రాస్పెక్టివ్ అంటే ఈ సందర్భంలో అర్ధం, గత కాలానికి కూడా వర్తించేది అని. ప్రభుత్వాలు చట్టాలు చేసేటప్పుడు ఆ చట్టం యొక్క స్వభావాన్ని బట్టి ఎప్పటి నుండి వర్తించేది కూడా చట్టంలో పొందుపరుస్తారు. వెంటనే అమలులోకి వచ్చేటట్లయితే ‘with immediate effect’ అంటారు. గతంలో నిర్దిష్ట తేదీ నుండి వర్తింపజేయాలని భావిస్తే ఆ తేదీని చట్టంలో పొందుపరుస్తారు. ఇలా గతించిన కాలానికి కూడా వర్తించే విధంగా చేయడాన్ని ‘రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్’ అంటారు.

వోడా ఫోన్ పన్ను ఎగవేత సందర్భంగా ప్రణబ్ ముఖర్జీ GAAR అనే చట్టాన్ని తయారు చేసారు. పార్లమెంటు ఈ చట్టాన్ని ఆమోదించింది కూడా. General Anti-Avoidance Rules పేరుతో చేసిన చట్టం ఆదాయ పన్ను చట్టానికి అనుబంధంగా అమలు చేయాలని తలపెట్టారు. చట్టం అయితే చేశారు గానీ దానిని అమలు చేసే దమ్ము గత, ఇప్పటి ప్రభుత్వాలకు లేకపోయింది. ప్రణబ్ ను రాష్ట్రపతిగా పంపించిన తర్వాత ఆర్ధిక మంత్రిత్వ శాఖ పగ్గాలు చేపట్టిన చిదంబరం చట్టం అమలును 5 సం.లు వాయిదా వేశారు.

ఈ చట్టానికి వ్యతిరేకంగా బి.జె.పి ఎన్నికల్లో ప్రచారం చేసింది కూడా. కానీ చట్టాన్ని నేరుగా ప్రస్తావించకుండా ‘విదేశీ పెట్టుబడులను బెదరగొట్టే విధానాలను అనుసరించం’ అనీ, ‘పెట్టుబడులకు అనుకూల వాతావరణం సృష్టిస్తాం’ అనీ, ‘అంచనా వేయదగిన పన్నుల విధానాన్ని (predictable tax policy) తెస్తాము’ అనీ బి.జె.పి ప్రచారం చేసింది. అధికారం చేపట్టిన తర్వాత GAAR ను రద్దు చేస్తారా అని అడిగితే ఆర్ధిక మంత్రి, బి.జె.పి నేతలు నేరుగా సమాధానం చెప్పకుండా తప్పించుకుంటున్నారు. ఈ చట్టాన్ని అమలు చేసే ఉద్దేశ్యం తమకు లేదని బడ్జెట్ లో పరోక్షంగా సూచించడం తప్ప నేరుగా చెప్పలేదు. నేరుగా చెబితే విమర్శలు వస్తాయని భయం. అలాగని ధైర్యం చేసి రద్దు చేస్తే ప్రజల్లో పలచన అవుతామని మరో భయం.



ఆదాయ పన్ను చట్టం అమలులోకి వచ్చిన నాటి నుండి, అనగా గత 50 యేళ్ళ నాటి నుండి GAAR అమలులోకి వచ్చేలా తయారు చేశారు. ఈ చట్టం అమలు చేస్తే లక్షల కోట్ల ఆదాయం భారత ఖజానాకు సమకూరుతుంది. కనీసం గత 5 సం.ల నుండి అమలు చేసినా అధమం లక్ష కోట్లు వసూలు అవుతుందని ఒక అంచనా.

స్వదేశీ, విదేశీ ప్రైవేటు కంపెనీలు పన్నులు ఎగవేయడానికి వందల కొద్దీ పేపర్ కంపెనీలను స్ధాపిస్తాయి. ఈ పేపర్ కంపెనీలు పన్నులు తక్కువగా ఉండే చిన్న చిన్న దేశాల్లో స్ధాపిస్తారు. వాస్తవంగా వ్యాపారం ఏమో ఇండియా లాంటి


దేశాల్లో చేస్తారు. అలా వచ్చే లాభాలను తీసుకెళ్ళి పేపర్ కంపెనీల్లో జమ చేస్తారు. తద్వారా వ్యాపారం చేసే దేశాల్లో అమ్మకపు పన్ను, కేపిటల్ గెయిన్స్ పన్ను ఎగవేస్తారు. ఈ విధంగా పన్నులు ఎగవేయడంలో యాపిల్ కంపెనీ అగ్రభాగాన ఉండగా దాదాపు బహుళజాతి కంపెనీలన్నీ ఈ పద్ధతిలో లాభాలు మూట గడుతున్నాయి.

హచిసన్స్ కంపెనీ ఇండియా వ్యాపారాన్ని కొనుగోలు చేసిన వోడా ఫోన్ కంపెనీ లక్ష కోట్ల కేపిటల్ గెయిన్స్ లాభం పొందింది. కానీ కొనుగోలు చేసిన కంపెనీ మాల్దీవులలో ఉన్నట్లుగా చూపింది. దానితో ఇండియాకు రావలసిన 10,000 కోట్ల రూపాయల పన్ను రాకుండా పోయింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో ఆదాయ పన్ను శాఖ టాక్స్ డిమాండ్ ను వోడా ఫోన్ కంపెనీ ముందు ఉంచింది. కంపెనీ కోర్టుకు వెళ్లింది. వివిధ దశలు దాటి సుప్రీం కోర్టు వరకు కేసు వెళ్లింది. సుప్రీం కోర్టు కంపెనీకి అనుకూలంగా తీర్పు చెప్పింది. తదనుగుణమైన చట్టం లేనందున పన్ను చెల్లించనవసరం లేదని కోర్టు నిర్ధారించింది. దానితో ప్రణబ్ ముఖర్జీ GAAR పేరుతో సవరణలకు పూనుకున్నారు.


GAAR లాంటి చట్టాలు తేవడం ఇండియా వరకే పరిమితం కాదు. వివిధ రూపాల్లో అమెరికా, ఐరోపా దేశాలు కూడా ఇటువంటి సౌకర్యాలను తమ చట్టాల్లో చేసుకున్నాయి. కెనడా, తైవార్ లాంటి దేశాలు GAAR లాంటి చట్టాలనే చేసుకున్నాయి.


మరీ ముఖ్యంగా 2007-08 నాటి ప్రపంచ ఆర్ధిక సంక్షోభం అనంతరం పన్నుల ఎగవేతకు స్వర్గధామాలుగా మారిన దేశాలపై ఒత్తిడి తెచ్చి కంపెనీల వివరాలను సంపాదించాలని జి20 గ్రూపు సమావేశాల్లోనే నిర్ణయం జరిగింది. ఆ మేరకు స్విట్జర్లాండ్ లాంటి దేశాలపైన అమెరికా తీవ్ర ఒత్తిడి తెచ్చి తగిన మార్పులు చేయించుకుంది. అదే పని ఇండియా లాంటి దేశాలు చేయబోతే వ్యాపార వ్యతిరేకం అంటూ గగ్గోలు పెట్టడం అమెరికా, ఐరోపాలకు పరిపాటి అయింది. పశ్చిమ దేశాల ఆర్ధిక, వాణిజ్య ఆధిపత్యం ఈ విధంగా మన పన్నుల చట్టాలను సైతం తమకు అనుకూలంగా మార్చుకునేలా చేయగలుగుతోంది.

No comments:

Post a Comment

Address for Communication

Address card