Sunday, August 17, 2014

అది అలనాటి ద్వారకే

నల్లనివాడు.. పద్మనయనమ్ములవాడు.. కృపారసంబు పైజల్లెడువాడు.. మౌళి పరిసర్పిత పింఛమువాడు.. నవ్వు రాజిల్లెడు మోమువాడు.. అని పోతన కమనీయంగా వర్ణించిన కృష్ణుడు.. నిజంగా ఉన్నాడా? అదిగో ద్వారక.. ఆలమందలవిగో.. అని అద్భుతంగా వర్ణించిన ద్వారక ఒకప్పుడు నిజంగా వర్ధిల్లిందా? పురావస్తు శాస్త్రం.. ఖగోళ శాస్త్రం.. ఈ ప్రశ్నలకు ఔననే సమాధానమిస్తున్నాయి. కృష్ణుడి గాథలు ఒట్టి పుక్కిటి పురాణాలు కావని.. ఆ నల్లనయ్య చారిత్రక పురుషుడేనని ఽద్రువీకరిస్తున్నాయి.
‘‘జోరుగా విరుచుకుపడుతున్న సముద్ర కెరటాలు చెలియలికట్ట దాటాయి! సాగరజలాలు పోటెత్తి నగరంలో ప్రవేశించాయి. సుందరమైన ఆ ద్వారకాపురి వీధులగుండా పరవళ్లు తొక్కాయి. అడ్డొచ్చిన ప్రతి కట్ట డాన్నీ ముంచెత్తాయి. ద్వారకను సముద్రుడు కబళిస్తున్న ఆ దృశ్యాల్ని అర్జునుడు నిర్వికారంగా చూస్తున్నాడు. తనకు అత్యంత ఆప్తుడైన శ్రీకృష్ణుడు నివసించిన భవనాన్ని ఆఖరుసారిగా చూశాడు. ఇంతలోనే సముద్రపు నీరు ఆ భవనాన్నీ తనలో కలిపేసుకుంది. ద్వారక సాగర గర్భంలో మునిగిపోయింది. శ్రీకృష్ణుడు ఏలిన ఆ మహానగరపు ఆనవాళ్లు కనిపించకుండాపోయాయి. అది ఇప్పుడో పేరు... ఓ జ్ఞాపకం మాత్రమే.’’
..మహాభారతంలోని మౌసల పర్వంలో ద్వారకాపురి జలమయమైన దృశ్యాలను కళ్లకుకట్టే ఘట్టమిది. ఇదంతా నిజంగా జరిగిందా? ఈ ప్రశ్నకు సమాధానాన్ని 1980ల్లో చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీ (గోవా)కు చెందిన మెరైన్‌ఆర్కియాలజీ విభాగం శాస్త్రవేత్త డాక్టర్‌ ఎస్‌.ఆర్‌.రావు నేతృత్వంలోని పురావస్తు శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. సముద్రగర్భంలో ఒక మహానగరం అవశేషాలను గుర్తించారు. గుజరాత్‌లోని లోథాల్‌ రేవు పట్టణాన్ని, పలు హరప్పన్‌ నాగరికత ప్రాంతాలనూ కనుగొన్న ఘనత ఆయనది. 1999లో విడుదలైన ఆయన పుస్తకం ‘ద లాస్ట్‌ సిటీ ఆఫ్‌ ద్వారక’లో తాము కనుగొన్నది ఆ నల్లనయ్య ఏలిన ద్వారకనేనని విస్పష్టంగా పేర్కొన్నారాయన. ‘‘భారతదేశ చరిత్రలో ఆ ఆవిష్కారం అత్యంత కీలక మైలురాయి. మహాభారతం, ద్వారక నగరాల చారిత్రకత పై చరిత్రకారుల అనేక సందేహాలను తీర్చేసిందది’’ అని పేర్కొన్నారు. 1983 నుంచి 1990 నడుమ 12సార్లు వారు జరిపిన అన్వేషణలో సముద్రగర్భాన రెండు జనావాసాల అవశేషాలు వెలుగుచూశాయి. అందులో ఒకటి నేటి ద్వారక సమీపంలో కనిపించగా.. మరొకటి సముద్రం మధ్యలోగల నేటి బేట్‌ ద్వారకకు దగ్గరగా ఉంది. వారు కనుగొన్న అవశేషాల్లో అత్యంత కీలకమైనది.. ద్వారకానగరవాసులు అప్పట్లో ఎప్పుడూ తమవద్ద తప్పనిసరిగా ఉంచుకునేవారని చెప్పే ముద్ర (ఐడెంటిటీకార్డు లాంటిది) ఒకటి. మూడుతలల జీవి చిత్రం ఉండే ఆ ముద్ర లేని వ్యక్తులు ద్వారకలోఅడుగుపెట్టకూడదని కృష్ణుడు శాసించి నట్లు ‘హరివంశం’ చెబుతోంది. అలాంటి ముద్ర కలిగిన రాయి ఒకటి ఎస్‌.ఆర్‌.రావు బృందం అన్వేషణలో బయల్పడింది. ఇక నాసా మాజీ శాస్త్రవేత్త, గణితశాస్త్ర నిపుణుడు అయిన ఎన్‌.ఎస్‌.రాజారామ్‌ తన ‘సెర్చ్‌ ఫర్‌ ద హిస్టారికల్‌ కృష్ణ’ పుస్తకంలో.. హరప్పా నాగరికతకు చెందిన కొన్ని ముద్రలపై శ్రీకృష్ణుడి సమకాలికుల పేర్లు ఉన్నట్టు పేర్కొన్నారు. ఆయా ముద్రల్లో పైల (వేదవ్యాసుడి విద్యార్థి), అక్రూర (కృష్ణుడి స్నేహితుడు), యదు, శ్రీతీర్థ (ద్వారక ప్రాచీన నామం) వంటి పేర్లు ఉన్నట్టు.. ఆయన వివరించారు.
సముద్రం ఇచ్చిన భూమే..
పదేపదే దాడులు చేస్తున్న శత్రువుల నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు శ్రీకృష్ణుడు తన రాజధానిని మధుర నుంచి మరొక నగరానికి మార్చుకోదల్చాడు. శత్రుదుర్భేద్యమైన నగరాన్ని నిర్మించి ఇవ్వాల్సిందిగా విశ్వకర్మను కోరాడు. దానికి ఆయన 12 యోజనాల భూమి ఇస్తే నగరాన్ని నిర్మిస్తానన్నాడు. అప్పుడు సముద్రుడు ద్వారక ఉన్న ప్రాంతంలో 12 యోజనాల మేర వెనక్కి తగ్గి భూమిని ఇచ్చాడని.. మళ్లీ కొన్నేళ్ల తర్వాత శాపవశాన యాదవులందరూ అంతమైపోయినప్పుడు సముద్రుడు అంతకు ముందు తానిచ్చిన 12 యోజనాల మేర భూమినీ ఆక్రమించాడని పురాణ ప్రతీతి. ఇందుకు నిదర్శనమా అన్నట్టు.. ఎస్‌.ఆర్‌.రావు బృందం సముద్ర గర్భాన కనుగొన్న అవశేషాల తాలూకు కట్టడాల గోడలు.. సముద్రపుటొడ్డున ఉండే గండశిలలపై నిర్మించినట్టు వారి అన్వేషణలో తేలింది.

ఖగోళ శాస్త్రంలో..
అమెరికాలోని టెన్నిసీ రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్‌ మెంఫిస్‌కు చెందిన భౌతిక శాస్త్ర ఆచార్యుడు డాక్టర్‌ నరహరి ఆచార్‌ 2004-05లో.. అప్పటి గ్రహగతుల ఆధారంగా కాలంలో వెనక్కి లెక్కలు కట్టి మహాభారత యుద్ధం జరిగిన తేదీని లెక్కగట్టారు. ఆయన లెక్క ప్రకారం మహాభారత యుద్ధం జరిగింది క్రీస్తు పూర్వం 3067లో. అదే సాఫ్ట్‌వేర్‌ ఆధారంగా ఆయన శ్రీకృష్ణుడి జనన సంవత్సరాన్ని క్రీ.పూ.3112గా తేల్చారు. యూకేకు చెందిన న్యూక్లియర్‌ మెడిసిన్‌ ఫిజీషియన్‌ డాక్టర్‌ మనీష్‌ పండిట్‌.. ఖగోళ, పురావస్తు ఆధారాలను పరిశీలించి డాక్టర్‌ ఆచార్‌ చెప్పిన లెక్కలు సరైనవేనని ఆయనతో ఏకీభవించారు. మహాభారతంలో వేద వ్యాసుడు పలు సందర్భాల్లో అప్పటి గ్రహగతులకు సంబంధించిన సమాచారాన్ని 140సార్లు ప్రస్తావించారని మనీష్‌ పండిట్‌ చెబుతారు. జ్యోతిష్కుడు కూడా అయినా డాక్టర్‌ పండిట్‌.. ఈ సమాచారం ఆధారంగా కృష్ణుడి చారిత్రకతను నిర్ధారిస్తూ పలు పుస్తకాలు రచించారు. ‘కృష్ణ: హిస్టరీ ఆర్‌ మిత్‌?’ అనే డాక్యుమెంటరీ తీశారు. అయితే.. పలువురు చరిత్రకారులు మాత్రం కృష్ణుడి చారిత్రకతను కొట్టిపారేస్తారు. మధుర ప్రాంతంలో క్రీ.పూ 200 నుంచి క్రీ.శ.300 మధ్యకాలం నాటివిగా భావిస్తున్న పలు శాసనాలు, శిల్పాల అవశేషాలు దొరికాయని, వాటిలో ఏ ఒక్కదాంట్లోనూ కృష్ణుడి ప్రస్తావన లేదు కాబట్టి కృష్ణుడు పురాణ పురుషుడు తప్ప చారిత్రక పురుషుడు కాదని వాదిస్తున్నారు. ఎవరి వాదనలు ఎలా ఉన్నా... భక్తులకు మాత్రం కృష్ణుడు ఇలపై నడయాడిన దేవుడు... అంతే!!

No comments:

Post a Comment

Address for Communication

Address card