Saturday, October 19, 2019

ఓటేసే రోజు ఇయన్నీ గుర్తురావు మరి



“శ్రీ కైవల్య పదంబు చేరుటకునకునై చితించెదన్,” భాగవతం తీస్తే మొదటి పద్యం కనపడింది. ఆహా! పోతన గారు అదృష్టవంతులు. ముందుకెళితే “సత్కవుల్ హాలికులైన నేమి (ఆల్కహాలికులు కాదు, పాపం ఆయనకి తెలీదు లెండి) గహనాంతరసీమల కందమూల కౌద్దాలికులైన నేమి నిజదార సుతోదర పోషణార్ధమై” అని బతికినవారు, చరిత్ర లో నిలిచిపోయారు.
పోతన గారికి వందనాలు. భాగవతంలో ఈ పద్యాలు చదువుకుంటూ ఉంటే మా మిత్రుడు ఒకడొచ్చాడు. వస్తూనే “ఏంటండీ ఈ బతుకులు అర్ధంకావటం లేదు, బతుకు భయంగాఉంద”న్నాడు. అదేంటీ ఏమయిందీ అన్నా. “ఏం చెప్పమంటారు. బతకటం కష్టమైపోయిందండి” అన్నాడు. “మన బతుకు కష్టమై పోయిందని, ఇలా చెప్పుకొచ్చాడు.
తెల్లారి లేస్తే ముందు కాఫీ చుక్క నోట్లో పడాలికదా, దానికి ముందు, పళ్ళు తోమాలి కదా.వేప చెట్టే కనపడటం లేదు. ఒక వేళ తెచ్చుకున్నా వేప పుల్లతో పళ్ళుతోముకునే అలవాటు ఎప్పుడో పోయింది కదా. పేస్టు ఖరీదు పెరిగిపోయింది, పాలు, పంచదార, కాఫీ పొడి ఖరీదు పెరిగిపోయాయి. చద్దెన్నం తినడం ఇప్పుడు ఫేషన్ కాదు కదా. గెడ్డం గీసుకునే బ్లేడ్ల కట్ట, ఇప్పుడు ముఫై అయి ఊరుకుంది. నాలుగురోజులకి ఒకసారయినా గెడ్డం గీసుకోవాలి కదా. స్నానానికి, తాగడానికి, ఇతర అవసరాలకి, నీళ్ళు ఇప్పుడు నలభై రూపాయలు చేసేరు, సబ్బుల ధరలు ఆకాశంలో ఉన్నాయి, సున్నిపిండితో, కుంకుడుకాయతో స్నానం చేయడం మరిచిపోయాం కదా. పది రూపాయల ఖర్చుతో ఉదయం టిఫిన్ అయ్యేది అందరికి, ఇప్పుడు అందరికి టిఫిన్ కి రెండు వందలవుతోంది. కూరలు చెప్పక్కరలేదు. కిలో నలభై రూపాయల లోపు కూర లేదు. నీచు కూరలు మేమూ మానేస్తున్నాము, ఎందుకంటే, వాటి ఖరీదుతో పాటు, అందులో వేసే సరుకుల ఖరీదులు మరీ ఎక్కువైపోయాయి. కొత్తిమీర కట్ట పదిహేను రూపాయలంటున్నాడు. నిమ్మకాయ మూడు రూపాయలయ్యింది. జామ కాయ యాపిల్ రెటు ఒకటె అయ్యింది.బట్టలు ఇస్త్రీ చేయించుకోవాలంటే జతకి ఇరవై రూపాయలడుగుతున్నారు, అదీ మనం ఉతుకు కున్నవి. పోనీ మనమే చేసుకుందామంటే కరంటు ఉండదు, అదీగాక కరంటు వారు అన్ని రేట్లు పెంచేసేరు.ఫేన్ వేసుకుందామంటే బిల్లు షాక్ కొడుతుందేమోననీ భయం వేస్తూ ఉంది. బియ్యం కేజీ నలభై పైమాటే. నాలుగు కర్రబద్దలు ఆరడుగుల పొడుగువి, మూడు కేజిల బరువుండనివి, రిక్షాలో ఒక కిలో మీటర్ దూరానికి వంద రూపాయలు తీసుకున్నాడు. పెట్రోలు, డీజిలు రేట్లు పాపం పెరిగినట్లు పెరుగుతున్నాయి. వంట గేస్ ధర పెరిగిపోయింది..
మార్కెట్లో ప్రతి వస్తువు ధరా పెరిగిపోయింది. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. వినోదానికి సినిమా టిక్కట్లు ధరలు పెరిగిపోయాయి. కేబుల్ టి.వీ వాళ్ళు రేటు పెంచేశారు.మందులు, పిల్లల పాల డబ్బాలు, ఒకటేమిటి, అన్నీ పెరిగిపోయాయి. నిజం, ఆదాయం ఏమీ పెరగటం లేదుకానీండి జుట్టు పెరుతోందండి, అయ్యా! దీనికి కూడా రోజుకి మూడున్నర రూపాయి ఖర్చండి, అదేనండి నెలకి వంద రూపాయలండి. పెళ్ళిళ్ళ సీజనొచ్చేస్తోందండి, ప్రయాణాలకి, ఖర్చులికీ… అమ్మో, శలవులిచ్చేశారండి ప్రయాణ ఖర్చులు, మళ్ళీ బళ్ళు తీసిన తరవాత, డొనేషన్లు, ఫీజులు,యూనిఫారాలు, పుస్తకాలు, హాస్టలు ఛార్జీలు అమ్మ బాబోయ్! తలుచుకుంటేనే వణుకొచ్చేస్తోందండి.
ప్రతి దాని మీదా సర్వీసు టాక్స్ వేసేస్తున్నారు. పోనీ మన ఆదాయం పెరుగుతుందేమో అనుకుంటే, అది వట్టి మాట, నీటి మూటని తేలిపోయింది.బేరీజు వేస్తే పాతికేళ్ళకి ఇప్పటికి, ప్రతి వస్తువు ధరా ఐదు రెట్లు పెరిగింది. కాని సంపాదన అలా పెరగటం లేదు, మనకి పెరిగిన రేటు అప్పటి ధరకి ఇప్పటికి రెండు రెట్లు అయిందేమో. ఎలా బతకాలో అర్ధం కావటం లేదు అన్నాడు.
“తప్పు మనలోనూ ఉందనుకుంటానయ్యా, అలా పరిపాలించే వారిని ఎన్నుకోడంలో” అన్నా.
“ఏమోనండి ఓటేసే రోజు ఇయన్నీ గుర్తురావు మరి”అను కుంటూ వెళ్ళిపోయాడు.

No comments:

Post a Comment

Address for Communication

Address card