Thursday, October 31, 2019

ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్‌ కొత్త నియమం లో ఇబ్బందులు


ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్‌ కొత్త నియమం లో ఇబ్బందులు

ఇటీవల, సెక్షన్ 9 (1) కింద సరఫరాదారు అప్‌లోడ్ చేసిన ఇన్వాయిస్‌ల ఆధారంగా ఇన్పుట్ టాక్స్ క్రెడిట్‌ను అర్హత కలిగిన ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్‌లో 120% కి పరిమితం చేస్తూ , అక్టోబర్ 9, 2019 న నోటిఫికేషన్ నెంబర్ 49/2019-సెంట్రల్ టాక్స్ వచ్చింది.
ఈ నోటిఫికేషన్ లో వివరాలు విశ్లేషిస్తే, క్రింద సమస్యలు కనిపించాయి.
కొత్త నియమం:
పొందవలసిన ఇన్పుట్ టాక్స్ క్రెడిట్,కింద సరఫరాదారులు అప్‌లోడ్ చేయని వివరాలు 20 % మించకూడదు.
అమలు విధానం:
GSTR-2A లో భాగాలను కలిగి ఉంది: A. అందుబాటులో ఉన్న ఇన్వాయిస్‌ల ఐటిసిB. గ్రహీతతో సంబంధం లేని ఇన్వాయిస్‌ల ఐటిసి అనగా తప్పు జిఎస్‌టిఎన్ కింద సరఫరాదారు అప్‌లోడ్ చేసిన ఇన్వాయిస్లు .గ్రహీతకు అందుబాటులో ఉండవు కానీ ఆ ఐటిసి ఉంటుంది.C. గ్రహీతకు చెందిన వే కానీ ఇన్వాయిస్లు ఉండవు ఐటిసి ఉంటుంది ఉదా. వైమానిక ఇన్వాయిస్లు, బ్యాంక్ ఛార్జీలు (లేదా అవి తరువాత స్వీకరించబడినట్లు).D .సెక్షన్ 17 (5) ప్రకారం నిరోధించడిన ఐటిసి.E. ITC రివర్స్
* సరఫరాదారులు అందరూ అన్ని ఇన్వాయిస్లు అదే నెలలో అప్‌లోడ్ చేసారని భావిస్తే. ఐటిసి సంతృప్తి గా ఉంటుంది: ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ను తన వద్ద వున్న ఇన్వాయిస్లు ప్రకారం అంతా క్లెయిమ్ చేయడానికి అర్హత వుంటుంది:
ఇబ్బందులు
1. కవర్ చేసిన పన్ను కాలం పేర్కొనబడలేదు:
సరఫరాదారు ఆర్థిక సంవత్సరానికి ఇన్వాయిస్‌లను అప్‌లోడ్ చేయవచ్చు లేదా సవరించవచ్చు, ఆర్థిక సంవత్సరం ముగిసిన తరువాత సెప్టెంబర్ లేదా వార్షిక రిటర్న్ దాఖలు చేసిన తేదీ వరకు అందువల్ల, సరఫరాదారు ఇన్వాయిస్ను తరువాతి నెల రిటర్న్లో అప్లోడ్ చేస్తే చిక్కులు ఏమిటి? నోటిఫికేషన్ కవర్ చేయవలసిన కాలాన్ని పేర్కొనలేదు. 20% నిబంధన నెలవారీ లేదా త్రైమాసిక లేదా ఏటా వర్తించాలా అనేది అస్పష్టంగా ఉందా? లేదు. అందువల్ల, వడ్డీ కూడా ప్రశ్నార్థకం.
2. అమలు తేదీపై స్పష్టత లేదు:
ఈ నిబంధన అక్టోబర్ 9, 2019 నుండి అమలులోకి వస్తుందని నోటిఫికేషన్ నిర్దేశిస్తుంది. ఇప్పుడు ఒక్ ప్రశ్న తలెత్తుతుంది, పన్ను చెల్లింపుదారుడు ఈ నిబంధనను సెప్టెంబర్ 2019 రిటర్న్ కోసం కూడా పరిగణించాలా లేదా అది అక్టోబర్ 2019 నుండా?
ఈ కొత్త చట్టం 30 సెప్టెంబర్, 2019 న ఉనికిలో లేదు , తద్వారా ఈ పరిస్థితి 30 సెప్టెంబర్, 2019 వరకు వచ్చే కాలానికి ఇది వర్తించదని. 1 అక్టోబర్ 2019 న లేదా తరువాత నమోదు చేసిన సరఫరా కోసం వర్తించబడుతుంది. అని నేను నమ్ముతున్నాను
3. పన్ను చెల్లింపుదారుపై ద్వంద్వ కష్టాలు :
రూల్ 42 ప్రకారం చేసిన రివర్సల్‌ను మినహాయించటానికి సంబంధించి ఎటువంటి స్పష్టత ఇవ్వబడలేదు & ఇది డబుల్ రివర్సల్ ద్వారా పన్ను చెల్లింపుదారుపై ద్వంద్వ కష్టాలకు దారితీయవచ్చు.
నా అభిప్రాయం ప్రకారం, రూల్ 42 మరియు రూల్ 43 లో సవరణలు లేనందున ప్రస్తుతం రూ .50 తొ రివర్సల్ చేయబడుతుంది. అయితే తార్కికంగా చూస్తే రివర్సల్ రూ. 36 గా ఉండాలి, ఎందుకంటే అసెస్సీ ఇప్పటికే పన్ను క్రెడిట్ యొక్క దామాషా రివర్సల్ చేసాడు , లేకుంటే అది రెట్టింపు అవుతుంది
4. ఇన్వాయిస్ సవరణ తర్వాత:
తదుపరి నెలలో సరఫరాదారు చేసిన ఇన్వాయిస్ లో సవరణను , గ్రహీత ఇప్పటికే అసలు వివరాలు ఆధారంగా ఇన్పుట్ పన్ను క్రెడిట్ వాడుకున్నారు . ఈ ఇన్వాయిస్ తర్వాత నెలలొ అదనపు క్రెడిట్ గా క్లెయిమ్ చేయబడింది .ఒకే. కానీ ఇది GSTR-2A ప్రకారం తప్పు-సరిపోలికను సృష్టిస్తుంది మరియు గ్రహీత పొందినది వాస్తవ క్రెడిట్. ఏమి చేయాలి?
5. భవిష్యత్తులో పరిశీలన యొక్క చిక్కులు :
తరువాతి సంవత్సరాల్లో పరిశీలనలో క్రెడిట్ అర్హత లేదని తేలితే, అనర్హమైన క్రెడిట్‌ను రివర్స్ చేయమని విభాగం కోరవచ్చు. ఇంకా, డిపార్టుమెంటు ప్రకారం చేయవలసిన రివర్సల్ మొత్తం అనర్హమైన క్రెడిట్ అవుతుంది. ఇది మరింత రివర్సల్ మరియు వడ్డీ కు దారితీయవచ్చు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే అదనపు ఐటిసి క్లెయిమ్ చేయడం మరియు రివర్స్ చేయడం.ఎలా?
ఇది పన్ను చెల్లింపుదారు మరియు పన్ను అధికారుల మధ్య చట్టపరమైన గొడవలకు దారితీస్తుందని మేము నమ్ముతున్నాము.
6. సమయ వ్యవధిలో ఆడిట్ కనుగొనే ప్రభావం:
డిపార్ట్‌మెంట్ ఆడిట్ సమయంలో, వారికి ఇన్పుట్ టాక్స్ క్రెడిట్‌ను నిరాకరించి రివర్స్ చెయటం అవసరం కావచ్చు, దీనివల్ల 20% అంతర్గత నిష్పత్తి మారుతుంది, తద్వారా అదనపు పన్ను రివర్సల్‌కు దారితీస్తుంది.
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్

Tuesday, October 29, 2019

ది ఫౌంటెన్ హెడ్ బై ఆయన్ రాండ్... మనసులో పదిలం



"నేను నీ కోసం చావగలను. కానీ, నేను నీ కోసం బ్రతకను. బ్రతకలేను."~ వైనాండ్ తో రోర్క్- ఫౌంటెన్ హెడ్ నుండి..  
            Charles Dickens , Milton , Jane Austen ,Mills & Boon, Jeffrey Archer, Sir Arthur Conan Doyle  (Sherlock Holmes రచయత) రాజ్యం చేస్తున్న కాలంలోఇంగిలీషు పుస్తకాలు సరదా కోసమే చదివేవాళ్ళము. కాలక్షేపం బఠాణీల్లాగా. ఎందుకంటే అందులోభావోద్వేగాలు అర్ధమయ్యేవికావు. (ఇంగ్లిషు పూర్తిగా రాక ,ఇది నా అభిప్రాయం మాత్రమే).
                కాలక్షేపం పుస్తకాలు కాక ఇంకొంచం అలోచింపచేసే దశగా ఉన్న పుస్తకాలు చూసే నేనెరగని ప్రపంచం అది.అలాంటి రొజుల్లొ  (దాదాపు పాతికేళ్ళ క్రిందట ).ఇంగిలీషు లొ The Fountainhead చదవాను
                    రాండ్ పుస్తకాలు ఆవిడ అలోచనా తీరు నాకు పరిచయమైందాకా నా చుట్టూ ఉన్నవి అర్ధం పర్ధం లేని పోచికోలు కబుర్లే. నాకు అప్పట్లో విపరీతంగా నచ్చింది కనుక అందరికీ నచ్చాలని రూలేమి లేదు. ఎందుకూ? ఏమిటీ ఆవిడ గొప్ప?  అంటే నా దగ్గర జవాబూ లేదు. ఎపుడైనా ఎవరైనా యండమూరి , శ్రీ శ్రీ గురుంచి ఆవేశపడితే కుతూహలంగా చూడటం తప్ప.
               నేను కొత్తగా ఇంగిలీషు నవలలు చదవాలీ అని అనుకున్నప్పుడు నా ముందు రూట్స్, ఫౌంటెన్‍హెడ్ గుర్తుకొచ్చాయి. ఎందుకోతెలియదు నా చెయ్యి రూట్స్ మీద ఆగింది నేనురూట్స్ చదివేనాటికే నా ద్రిష్టిలో హీరో అర్ధం మారిపోయింది. కన్వెన్షనల్ హీరోలు జోకర్స్ అనిపించడం మొదలు పెట్టారు.
           ఆ తరువాత 5 సంవత్సరాలకు "Howard Roark " నాకు పరిచయమయ్యాడు.
అప్పుడు నాకు దొరికిందే The Fountainhead. ఐతే కల్పనే ఐనప్పటికీ, ఇంతగా ఈ పుస్తకం నచ్చడానికి కారణం నాకూ అంతు బట్టలేదు. ఈ పరంపరలో నేను We the Living, Atlas Shrugged కూడా చదివెసాను ఆమె చెప్పిన ఫిలాసఫీ వెలిబుచ్చిన భావాల మీద, సిద్దాంతాల మీద నాకు చాలా అస్పస్టతలు (సరిగా అర్ధం గాక,) వదిలేసి కధతో సంతోష పడ్డాను.
                అప్పట్లో ఆ పాత్ర అంతగా నచ్చడానికి కారణం నచ్చినట్లు తన అలోచన ప్రకారం రాజీ లేకుండా బ్రతకడం కష్టం. కానీ అదే చేసి చూపిన హీరో కాబట్టి అంతగా నచ్చాడు” అని నేను అనుకుంటున్నాను. కానీ అలాంటి  కధలు చాలా వున్నాయి.ఈ పుస్తకం మాత్రమే ఇంతగా పాపులర్ అవటానికి కారణం ఆమె చెప్పిన ఫిలాసఫీ అని తర్వాత అర్ధమయింది. ఇన్ని సంవత్సరాల తర్వాత అదే నవల తెలుగు లొ డా. రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు గారి అనువాదం లొ  చదువుతుంటే ...సుదూరంగా కొన్ని సంవత్సరాలు ముందుకు చూడగలిగిన ఆ దార్శినికతకు నేను " ఫిదా" (ఇది హిందీమాట) ఐపోయాను.
ముగింపు మాట:
శ్రీ  వడ్డెర చండిదాస్‌ అనుక్షణికం “   శ్రీ యండమూరి  “అంతర్ముఖం”   అయాన్ రాండ్ ఫౌంటెన్‌హెడ్‌తో పోల్చదగ్గ తెలుగు రచనలు అని నా స్వంత అభిప్రాయం
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్,పొన్నూరు@9441503681
 


Sunday, October 27, 2019

గుండెల్లో దీపావళి

నరక చతుర్దశినాటి రాత్రికి ‘కాలరాత్రి’ అని పేరు. కాలుడంటే యముడు. కాలరాత్రిని దీపరాత్రిగా మలచుకోవడంలోనే భారతీయ జ్ఞానసంపద ఇమిడి ఉంది. ‘నింగి లోతును చూడగోరితె- నీటిచుక్కను కలుసుకో... మనిషి మూలం చూడగోరితె మట్టిబెడ్డను కలుసుకో’ అన్నారు సినారె. అంతరార్థాలను అన్వేషిస్తేనే పండుగ పరమార్థాలు పరిచయం అవుతాయి. నరకాసుర వధకు, దీపావళి కథకు ఎలాంటి బంధుత్వం లేదు. ఆశ్వయుజ బహుళ చతుర్దశిని దీపరాత్రిగా జరుపుకోవడం ద్వాపరానికి ముందే ఉంది. దరిమిలా అదేరోజు నరకాసుర సంహారం జరగడంతో అది నరక చతుర్దశిగా ప్రసిద్ధికెక్కింది. నిజానికి వాడు చనిపోలేదు. ‘నరకుడనువాడు ఎక్కడో నక్కి లేడు, మనసులో చిమ్మచీకటి మసలు చోట వానికున్నది- ఉనికి’ అన్నారు కవులు. ఆ కటిక చీకటికి జ్ఞానజ్యోతి ఒక్కటే విరుగుడు. దీపావళి పేరుతో మనం వెలిగించే దీపాలన్నీ దానికి ప్రతీకలు. ‘నరకాన్నుంచి మన పితృదేవతలు స్వర్గానికి పోయేదారిలో వెలుగులు పంచే దివిటీలే ఈ దీపాలు’ అంది వామనపురాణం. దీపావళి చుట్టూ ఇలా ఎన్నో ఆలోచనలు, మనోభావాలు అల్లుకుని ఉన్నాయి కనుకనే ‘కొన్ని దైవత శుభ కరుణోన్నతములు, రక్తసంబంధ వాత్సల్య ప్రభలు కొన్ని... కలిసి దివ్వెలై మా యింట కొలువుదీరె’ అన్నారు బులుసు వేంకటేశ్వర్లు కవి. పిల్లలకు, పెద్దలకు తలోరకంగా దగ్గరై ‘శీతనగము నుండి సేతు పర్యంతము’ అందరికీ దీపావళి ఇష్టమైన పండుగగా స్థిరపడింది. ‘ఒక్కరాత్రి ఉబుకు ఉత్సవమ్ము’గా సంబరాలకు నోచుకుంటోంది. సాయంసంధ్యలో చక్కగా దీపాలు పెడుతూ ఒక్కక్షణం ‘ధ్వనికాలుష్యం మనిషి గుండెలో మంటలు రేపితె పండగా? విషపూరితమౌ రసాయనాలతో గగనం నిండితె పండగా?’ అని ఆలోచించగలిగితే- ఆ దీపకాంతులు మన లోపలికీ ప్రసరిస్తాయి!
(27.10.2019 ఈనాడు సంపాదకీయం లొ కొంత భాగం)
 

Friday, October 25, 2019

దీపావళి సందర్భంగా ఖాతాల పుస్తకాల ప్రాముఖ్యత ఏమిటి


దీపావళి సందర్భంగా ఖాతాల పుస్తకాల ప్రాముఖ్యత ఏమిటి మరియు దీని నుండి ఏమి నేర్చుకోవాలి
దీపావళి పండుగ వస్తోంది. గృహిణులు (గ్రుహ లక్ష్మి) ఇళ్లను శుభ్రపరచడంలో మరియు అలంకరించడంలో బిజీగా ఉన్నారు. తద్వారా వ్యాపార స్థలాలను శుభ్రపరచడం జరుగుతుంది వ్యాపారవేత్తలు కూడా మార్కెట్లో బిజీగా ఉన్నారు.

దీని ప్రకారం, వివిధ చట్టాల క్రింద ఖాతాల పుస్తకాల యొక్క పాత రికార్డులు ఏమి చేయాలి,.
దీపావళిలో మనం పాత విషయాలను విస్మరించి కొత్త విషయాలను స్వాగతించాలి. అలాగే లక్ష్మీ దేవి పరిశుభ్రత గా వున్న చోట చాలా సంతోషంగా ,ఎక్కువ కాలం ఉంటుంది.
వ్యాపారంలో, అనేక పన్ను చట్టాలు వర్తిస్తాయి. ప్రతి చట్టం లో ఖాతాల పుస్తకాలు మరియు సంబంధిత రికార్డులను నిర్వహించడానికి నిబంధనలను నిర్దేసించ బడ్దాయి. కాబట్టి చట్టంలోని నిబంధనల ప్రకారం పాత పుస్తకాలను భద్రపరచాలి

ఖాతాల పుస్తకాలను నిర్వహించడానికి ఆదాయపు పన్ను చట్టం కింద ఉన్న నిబంధనలు ఏమిటి?

**ఆదాయపు పన్ను  చట్టం ప్రకారం,

ఎ) వ్యాపారం లేదా వృత్తి నుండి అమ్మకం / టర్నోవర్ / స్థూల రాబడి రూ. 25,00,000 లేదా అంతకు మించి
బి) వ్యాపారం లేదా వృత్తి ద్వారా వచ్చే ఆదాయం రూ. మునుపటి 3 సంవత్సరాల్లో 2,50,000 రూపాయలు అంతకు మించి
వుంటే నగదు పుస్తకం, జర్నల్, లెడ్జర్స్ మొదలైన ఖాతాల పుస్తకాలను 6 సంవత్సరాల పాటు నిర్వహించాలి
అంతేకాకుండా, వ్యక్తి ఊహాజనిత ప్రాతిపదికన ( u / s 44 AD, టర్నోవర్ యొక్క 8% లేదా రవాణా వ్యాపారం ఉన్న u / s 44AE ) ఆదాయాన్ని చూపించినట్లయితే, ఖాతాల పుస్తకాలు ఉంచాల్సిన అవసరం లేదు, ఖాతాల పుస్తకాలు మరియు ఇతర పత్రాలను అవసరమైన విధంగా నిర్వహించకపోతే, ఆదాయపు పన్ను శాఖ రూ .25,000 / - జరిమానా విధించవచ్చు. అదనంగా ఖాతాల పుస్తకాలు సరిగా నిర్వహించకపోతే ఆదాయపు పన్ను విభాగం అంచనా ప్రాతిపదికన ఆదాయాన్ని లెక్కించవచ్చు.

**జీఎస్టీ చట్టం ప్రకారం ఎంతకాలం ఖాతాల పుస్తకాలను నిర్వహించాలి?

ప్రతి నమోదిత వ్యక్తి ఆ సంవత్సరానికి వార్షిక రిటర్న్ దాఖలు చేసిన చివరి తేదీ నుండి(వార్షిక రిటర్న్ లేక పొతే ఆర్థిక సంవత్సరం ముగింపా అనేది వివరంగా లేదు ) 6 సంవత్సరాల కన్నా తక్కువ కాకుండా వ్యాపార ప్రధాన స్థలంలో జిఎస్టి రికార్డులను నిర్వహించాలి.
ఒకవేళ అలాంటి ఖాతాల పుస్తకాలను నిర్వహించడంలో విఫలమైతే, అప్పుడు పదివేల రూపాయల జరిమానా లేదా ఎగవేసిన పన్నుకు సమానమైన మొత్తాన్ని జరిమనా గా చెల్లించాల్సిన బాధ్యత ఉంటుంది.

**వ్యాట్, సేవా పన్ను కింద పుస్తకాలను ఎంతకాలం నిర్వహించాలి?

వ్యాట్ నిబంధన ప్రకారం, సంబంధిత తేదీ నుండి 8 సంవత్సరాల కాలానికి ఖాతాల పుస్తకాలను నిర్వహించాలి. అయితే, సేవా పన్ను కింద 5 సంవత్సరాలు రికార్డులు నిర్వహించాలి. వ్యాట్ మరియు సేవా పన్ను పాత చట్టాలు కాబట్టి, వాటి కోసం ఖాతాల పుస్తకాలను విస్మరించవచ్చు. కానీ, ఒకరికి అప్పీల్ మరియు అసెస్‌మెంట్ పెండింగ్‌లో ఉంటే లేదా ట్రాన్స్ క్రెడిట్‌కు సంబంధించిన సమస్యలు ఉంటే, తదనుగుణంగా ఖాతాల పుస్తకాలను నిర్వహించాలి.

**కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌లో నిర్వహించబడుతున్న ఖాతాల పుస్తకాల గురించి ఏమిటి?

కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌లో ఖాతాల పుస్తకాలు నిర్వహించబడుతున్నప్పటికీ, వాటిని ప్రింట్ అవుట్ చేయాలి. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం కంప్యూటర్ లేదా పెన్ డ్రైవ్ లేదా సిడి మొదలైన వాటిలో నిల్వ చేసిన డేటాను ఖాతాల పుస్తకాలుగా కూడా పరిగణిస్తారు.

       అధికారులు ఈ పరికరాలను కూడా పరిసీలించవచ్చు. కాబట్టి ఎల్లప్పుడూ బాహ్య పరికరాల్లో సేవ్ చేసిన డేటాను క్రమం తప్పకుండా తనిఖీ చేయండి. పాత రోజుల్లో, ఖాతాల పుస్తకాలు మానవీయంగా నిర్వహించబడుతున్నందున మార్పులు కష్టమయ్యాయి. అయితే ఇప్పుడు కంప్యూటరీకరించిన డేటా ను ఎవరయినా మార్చడం చాలా సులభం, కాబట్టి దాని గురించి జాగ్రత్త వహించండి.

దీపావళి సందర్భంగా ఖాతాల పుస్తకాల ప్రాముఖ్యత ఏమిటి మరియు దీని నుండి ఏమి నేర్చుకోవాలి?

ప్రతి దీపావళిలో ప్రజలు “ధంతేరాస్” అని డబ్బును పూజిస్తారు, “లక్ష్మీ పూజ లో ” ఖాతాల పుస్తకాలు కూడా వుంచటం అలవాటు. ఆర్థిక చట్టాల ప్రకారం కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుండి ప్రారంభమై మార్చి 31 తో ముగుస్తుంది మరియు తదనుగుణంగా పుస్తకాలు నిర్వహించబడతాయి. హిందూ సాంప్రదాయం ప్రకారం నూతన సంవత్సరం “ఉగాది” సమయంలో మొదలవుతుంది దాని ప్రకారం ఈ నూతన సంవత్సరం “విక్రమ్ సంవత్సరం 2076.” లక్ష్మి దేవత (డబ్బు) ఉత్సాహంగా ఉంటుంది, డబ్బు సంపాదించడానికి మంచి ఆలోచనలు, మంచి ప్రవర్తన, నిజాయితీ మొదలైనవి ఆర్థిక లావాదేవీల్లో చాలా ముఖ్యమైనది

ఇది ప్రస్తుతం నాకున్న పరిజ్నానం అనుసరించి మాత్రమె. ప్రతీ వారు చట్టాన్ని మీకు అందుబాటులో వున్న నిపుణులు,అధికారుల సలహా తో లేదా స్వంత పరిసీలన, పరిసోధన తొ ఆచరించండి

అందరికీ దీపావళి శుభాకామనలు

Saturday, October 19, 2019

ఓటేసే రోజు ఇయన్నీ గుర్తురావు మరి



“శ్రీ కైవల్య పదంబు చేరుటకునకునై చితించెదన్,” భాగవతం తీస్తే మొదటి పద్యం కనపడింది. ఆహా! పోతన గారు అదృష్టవంతులు. ముందుకెళితే “సత్కవుల్ హాలికులైన నేమి (ఆల్కహాలికులు కాదు, పాపం ఆయనకి తెలీదు లెండి) గహనాంతరసీమల కందమూల కౌద్దాలికులైన నేమి నిజదార సుతోదర పోషణార్ధమై” అని బతికినవారు, చరిత్ర లో నిలిచిపోయారు.
పోతన గారికి వందనాలు. భాగవతంలో ఈ పద్యాలు చదువుకుంటూ ఉంటే మా మిత్రుడు ఒకడొచ్చాడు. వస్తూనే “ఏంటండీ ఈ బతుకులు అర్ధంకావటం లేదు, బతుకు భయంగాఉంద”న్నాడు. అదేంటీ ఏమయిందీ అన్నా. “ఏం చెప్పమంటారు. బతకటం కష్టమైపోయిందండి” అన్నాడు. “మన బతుకు కష్టమై పోయిందని, ఇలా చెప్పుకొచ్చాడు.
తెల్లారి లేస్తే ముందు కాఫీ చుక్క నోట్లో పడాలికదా, దానికి ముందు, పళ్ళు తోమాలి కదా.వేప చెట్టే కనపడటం లేదు. ఒక వేళ తెచ్చుకున్నా వేప పుల్లతో పళ్ళుతోముకునే అలవాటు ఎప్పుడో పోయింది కదా. పేస్టు ఖరీదు పెరిగిపోయింది, పాలు, పంచదార, కాఫీ పొడి ఖరీదు పెరిగిపోయాయి. చద్దెన్నం తినడం ఇప్పుడు ఫేషన్ కాదు కదా. గెడ్డం గీసుకునే బ్లేడ్ల కట్ట, ఇప్పుడు ముఫై అయి ఊరుకుంది. నాలుగురోజులకి ఒకసారయినా గెడ్డం గీసుకోవాలి కదా. స్నానానికి, తాగడానికి, ఇతర అవసరాలకి, నీళ్ళు ఇప్పుడు నలభై రూపాయలు చేసేరు, సబ్బుల ధరలు ఆకాశంలో ఉన్నాయి, సున్నిపిండితో, కుంకుడుకాయతో స్నానం చేయడం మరిచిపోయాం కదా. పది రూపాయల ఖర్చుతో ఉదయం టిఫిన్ అయ్యేది అందరికి, ఇప్పుడు అందరికి టిఫిన్ కి రెండు వందలవుతోంది. కూరలు చెప్పక్కరలేదు. కిలో నలభై రూపాయల లోపు కూర లేదు. నీచు కూరలు మేమూ మానేస్తున్నాము, ఎందుకంటే, వాటి ఖరీదుతో పాటు, అందులో వేసే సరుకుల ఖరీదులు మరీ ఎక్కువైపోయాయి. కొత్తిమీర కట్ట పదిహేను రూపాయలంటున్నాడు. నిమ్మకాయ మూడు రూపాయలయ్యింది. జామ కాయ యాపిల్ రెటు ఒకటె అయ్యింది.బట్టలు ఇస్త్రీ చేయించుకోవాలంటే జతకి ఇరవై రూపాయలడుగుతున్నారు, అదీ మనం ఉతుకు కున్నవి. పోనీ మనమే చేసుకుందామంటే కరంటు ఉండదు, అదీగాక కరంటు వారు అన్ని రేట్లు పెంచేసేరు.ఫేన్ వేసుకుందామంటే బిల్లు షాక్ కొడుతుందేమోననీ భయం వేస్తూ ఉంది. బియ్యం కేజీ నలభై పైమాటే. నాలుగు కర్రబద్దలు ఆరడుగుల పొడుగువి, మూడు కేజిల బరువుండనివి, రిక్షాలో ఒక కిలో మీటర్ దూరానికి వంద రూపాయలు తీసుకున్నాడు. పెట్రోలు, డీజిలు రేట్లు పాపం పెరిగినట్లు పెరుగుతున్నాయి. వంట గేస్ ధర పెరిగిపోయింది..
మార్కెట్లో ప్రతి వస్తువు ధరా పెరిగిపోయింది. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. వినోదానికి సినిమా టిక్కట్లు ధరలు పెరిగిపోయాయి. కేబుల్ టి.వీ వాళ్ళు రేటు పెంచేశారు.మందులు, పిల్లల పాల డబ్బాలు, ఒకటేమిటి, అన్నీ పెరిగిపోయాయి. నిజం, ఆదాయం ఏమీ పెరగటం లేదుకానీండి జుట్టు పెరుతోందండి, అయ్యా! దీనికి కూడా రోజుకి మూడున్నర రూపాయి ఖర్చండి, అదేనండి నెలకి వంద రూపాయలండి. పెళ్ళిళ్ళ సీజనొచ్చేస్తోందండి, ప్రయాణాలకి, ఖర్చులికీ… అమ్మో, శలవులిచ్చేశారండి ప్రయాణ ఖర్చులు, మళ్ళీ బళ్ళు తీసిన తరవాత, డొనేషన్లు, ఫీజులు,యూనిఫారాలు, పుస్తకాలు, హాస్టలు ఛార్జీలు అమ్మ బాబోయ్! తలుచుకుంటేనే వణుకొచ్చేస్తోందండి.
ప్రతి దాని మీదా సర్వీసు టాక్స్ వేసేస్తున్నారు. పోనీ మన ఆదాయం పెరుగుతుందేమో అనుకుంటే, అది వట్టి మాట, నీటి మూటని తేలిపోయింది.బేరీజు వేస్తే పాతికేళ్ళకి ఇప్పటికి, ప్రతి వస్తువు ధరా ఐదు రెట్లు పెరిగింది. కాని సంపాదన అలా పెరగటం లేదు, మనకి పెరిగిన రేటు అప్పటి ధరకి ఇప్పటికి రెండు రెట్లు అయిందేమో. ఎలా బతకాలో అర్ధం కావటం లేదు అన్నాడు.
“తప్పు మనలోనూ ఉందనుకుంటానయ్యా, అలా పరిపాలించే వారిని ఎన్నుకోడంలో” అన్నా.
“ఏమోనండి ఓటేసే రోజు ఇయన్నీ గుర్తురావు మరి”అను కుంటూ వెళ్ళిపోయాడు.

Tuesday, October 15, 2019

ఓ చందమామ!



ఏడుస్తోందని ఎత్తుకుని
చందమామను చూపించాను
రెట్టింపు ఏడుపుతో ఆ చందమామ కావాలంది
అమ్మకిచ్చేసాను
అమ్మ ఒడిలో ఓ చందమామ!

పాలు తాగుతూ పడుకుంటోందని
ఎత్తుకుని లాలించాను
మత్తు నిద్రతో గురక పెడుతోంది
వెచ్చగా పడుకోబెట్టాను
ఉయ్యాలలో ఓ చందమామ

తప్పటడుగుల్తో బోర్లాపడితే
చేయి పట్టుకుని నడిపించాను
అలుపెరగని నడకతో ఇల్లంతా తిరుగుతోంది
నీరసంగా కూలబడ్డాను
నట్టింట్లో ఓ చందమామ

ప్రక్కింట్లో చూసి సైకిలు కావాలంది
చిన్న సైకిలు కొనిచ్చా
రెట్టించిన ఉత్సాహంతో తొక్కేస్తోంది
వీధిలో చూస్తున్నాను
వీధి వీధంతా ఓ చందమామ

స్కూల్లో పాఠాలు అర్ధం కాలేదంది
దగ్గిర కూర్చుని నేర్పిస్తే
సరే రోజూ ఇలాగే హోం వర్క్ చేయించమంది
ఓపిగ్గా చేయించాను
రాత్రంతా ఓ చందమామ

కాలేజీలో జేరాక మాట విననంది
ఎందుకని అడిగితే
తిండి తినకుండా తలుపేసుకుపడుకుంది
బయటనుంచే బ్రతిమాలాను
ఒంటరిగా ఓ చందమామ

పెళ్ళి సంబంధాలు చూస్తే
నాకొద్దు పొమ్మని
నాయంతెత్తు పెరిగిన నా కూతురు
పెళ్ళయ్యాక
అత్తవారింట్లో ఓ చందమామ

ఇంకో ఆర్నెల్లకి
పుట్టింటికి తీసుకొస్తే
పుల్ల మామిడికాయ కావాలంది
ఇంకో ఆర్నెల్లకి
చందమామ ఒడిలో ఓ బుల్లి చందమామ

ఇంత చిన్ని ఆకాశంలో ఎన్ని చందమామలో
ఇంత చిన్ని బ్రతుకులోఎన్ని అందమామలో.
పగటి పూట జాబిల్లిని వెతికే ఎంత మంది వెర్రి నాన్నలో
ఇంకో వెర్రి నాన్న.

Address for Communication

Address card