క్రైస్తవులకు చివరి గ్రంధం అయిన బుక్ ఆఫ్ రివలెషన్ (ప్రకటనల గ్రంధం) లో యుగాంతం
గురించి చెప్పబడి ఉంటుంది. ఇందులో “యుగాంతపు నాలుగు గుర్రపు రౌతుల” గురించిన వివరణ ఉంటుంది. ఈ నాలుగు గుర్రాల రాక యుగాంతాన్ని సూచిస్తుందని
క్రైస్తవుల నమ్మిక. ఆ నాలుగు గుర్రాలు: విజయం (Conquest), యుద్ధం (War), కరువు (Famine), చావు (Death). ఈ నాలుగింటిని యుగాంతపు నాలుగు
గుర్రపు రౌతులు (ద ఫోర్ హార్స్ మెన్ ఆఫ్ అపోకలిప్స్) అంటారు.
మానవ ప్రపంచానికి ఈ నలుగురు / నాలుగు అంశాలు యుగాంతాన్ని సూచించినట్లే
భారత ఆర్ధిక వ్యవస్ధ వృద్ధికి వచ్చే ఆర్ధిక
సంవత్సరంలో నాలుగు ప్రధాన గండాలు యుగాంతం తరహా పరిస్ధితిని
చవి చూపుతాయని ప్రధాన ఆర్ధిక సలహాదారు తన తాజా ఎకనమిక్ సర్వే లో హెచ్చరించారు.
ఏటా బడ్జెట్ ప్రకటనకు ముందు విడుదలయ్యే ఎకనమిక్ సర్వే భారత ఆర్ధిక వ్యవస్ధ
వృద్ధికి (జిడిపి గ్రోత్ కి) నాలుగు పెద్ద
గండాలు ఉన్నాయని హెచ్చరించింది. భారత దేశానికి ప్రధాన ఆర్ధిక సలహాదారు (చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్) రచించిన
ఎకనమిక్ సర్వే, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోడి చెప్పుకుంటున్న
ఆర్ధిక గొప్పలను పరిహాసం చేసినంత పని చేసింది.
గండాలు ఉన్నాయని ఓ పక్క చెబుతూనే వచ్చే యేడు భారత ఆర్ధిక వ్యవస్ధ ఈ సంవత్సరం కంటే ఎక్కువగా 7% నుండి 7.5% వరకు వృద్ధి
నమోదు చేస్తుందని సర్వే అంచనా వెయ్యడం గమనార్హం. ఆర్ధిక విశ్లేషణ ఒకింత వాస్తవ పంధాలో సాగినా ఫలితాన్ని మాత్రం మోడి-జైట్లీ గొప్పలకు భిన్నంగా పోయే సాహసం చేయలేకపోయింది. అది సలహాదారుకు ఉండే
పరిమితి అని సరిపెట్టుకోవాలి కాబోలు!
ఎకనమిక్ సర్వే సూచించిన నాలుగు
గండాలు ఇవి:
- గ్లోబలైజేషన్ కు వ్యతిరేకంగా తగులుతున్న ఎదురుదెబ్బల వల్ల ఎగుమతి అవకాశాలు తగ్గిపోవడం
- వనరులను తక్కువ ఉత్పాదకత నుండి అధిక ఉత్పాదకత వైపు తరలించడమ్ లో ఎదురయ్యే ఇబ్బందులు
- టెక్నాలజీ-తీవ్రత , ఆ రంగం డిమాండ్లకు అనుగుణంగా మానవ పెట్టుబడిని ఉన్నతీకరించడంలో ఎదురయ్యే సవాళ్ళు
- వాతావరణ మార్పు వల్ల కలిగే వ్యవసాయ ఒత్తిడిని ఎదుర్కోవలసి రావడం
ఈ నాలుగు అంశాలు భారత జిడిపి వృద్ధిని దిగదోస్తాయని ఆర్ధిక సర్వే అంచనా. ఇవి సర్వే కొత్తగా కనిపెట్టినవేమీ కాదు. గత కొంత
కాలంగా జరుగుతున్న పరిణామాలను గమనించిన
వారికి ఇవి స్పష్టంగా కనిపించినవే. స్పష్టంగా కనిపించిన వాటిని సర్వే ఆర్ధిక పరిభాష వెనుక నర్మగర్భంగా దాచిపెట్టి ఉంచాడు. తద్వారా ప్రమాదాన్ని తేలిక చేసేందుకు విఫల
యత్నం జరిగినట్లు కనిపిస్తోంది.
మరోసారి వీలు దొరికినప్పుడు ఈ నాలుగింటిని
కాస్త వివరంగా చూద్దాం.
------------ ధరణికోట సురేష్
కుమార్,ఆడిటర్,పొన్నూరు@9441503681
కుమార్,ఆడిటర్,పొన్నూరు@9441503681