Saturday, December 15, 2018

తుఫాన్లకు పేర్లు ఎలా పెడతారు...ఏయే దేశాలు పెడతాయి:




               వాస్తవానికి ఇలా తుపాన్లకు పేరు పెట్టే సంప్రదాయం అట్లాంటిక్ సముద్ర తీర ప్రాంతాల్లో 1953 నుంచే ఉంది. ఐరాసకు చెందిన వరల్డ్ మెట్రొలాజికల్ ఆర్గనైజేషన్ ఈ పని చేస్తుంది. కానీ, దక్షిణాసియాలో, మధ్య ప్రాచ్యంలో తుఫాన్లకు పేర్లు పెట్టడం ఇటీవలే మొదలైంది.
              గతంలో చాలా ఏళ్ల పాటు హిందూ మహాసముద్రంలో పుట్టిన ఎన్నో తుపాన్లు ఏ పేరూ లేకుండా అనామకంగానే మిగిలిపోయాయి.
           తుఫాన్లకు పేర్లు లేకపోతే వాటి గురించి వివరించడం, విశ్లేషించడం, చర్చించడం కాస్త గందరగోళంగా ఉంటుందని వాతావరణ నిపుణులు భావించారు. అలాగే ప్రచార మాధ్యమాల్లో ప్రసారం చేసేందుకు, ప్రజలను అప్రమత్తం చేసేందుకు వీలుగా వాటికి పేర్లు పెట్టడం సమంజసమని నిర్ణయించారు.
               తుఫాన్లకు పేర్లను పెట్టే ప్రక్రియను 19వ శతాబ్దం చివర ఆస్ట్రేలియా వాతావరణ శాస్త్రజ్ఞురాలు క్లెమెంట్ లిండ్లీ రాగ్ ప్రారంభించారు. ప్రజలు ఏ రాజకీయ నాయుకులనైతే ఇష్టపడరో, అలాంటి వారి పేర్లను ఆమె పెట్టడం ప్రారంభించారు అయితే అది ఎక్కువ రోజులు కొనసాగలేదు
            అందుకే 2004లో ప్రపంచ వాతావరణ సంస్థ ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేసి ఈ పేర్లపై సమావేశాన్ని నిర్వహించారు..
          భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మాల్దీవులు, మయన్మార్, ఓమన్, శ్రీలంక, థాయిలాండ్ ఈ ఎనిమిది దేశాలు ఆ సమావేశంలో పాల్గొన్నాయి. ఇందులో అన్ని దేశాలకూ సమ ప్రాధాన్యం లభించింది. ప్రతి దేశం 8 పేర్లను కమిటీకి సమర్పించింది. అలా మొత్తంగా 64పేర్లతో ఓ జాబితా సిద్ధమైంది. ఆ పేర్లను భవిష్యత్తులో హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం, అరేబియా సముద్ర తీరాల పరిధిలో రాబోయే తుఫాన్లకు పెట్టాలని ఆ సమావేశంలో నిర్ణయించారు.
          ఏ తుపానుకు ఏ పేరు ఎప్పుడు పెట్టాలనే దానిపైన కూడా కమిటీ ఓ పద్ధతిని రూపొందించింది. దీని కోసం ఇంగ్లిష్ అక్షరక్రమం ఆధారంగా దేశాల పేర్లను ఒక క్రమంలో పొందుపరిచారు. ఇంగ్లిష్ అక్షరం బితో మొదలయ్యే బంగ్లాదేశ్‌ ఆ జాబితాలో మొదటి స్థానంలో టి అనే అక్షరంతో మొదలయ్యే థాయిలాండ్ ఆ జాబితాలో చివరి స్థానంలో ఉన్నాయి.
          2004లో ఈ సమావేశం అనంతరం అక్టోబరులో హిందూ మహాసముద్రంలో సంభవించిన తుపానుకు ఒనిల్ అనే పేరును పెట్టారు. ఈ పేరును జాబితాలో మొదటి స్థానంలో ఉన్న బంగ్లాదేశ్ సూచించింది. అదే ఏడాది నవంబరులో అరేబియా సముద్రంలో సంభవించిన తుపానుకు అగ్ని అనే పేరు పెట్టారు. ఆ పేరును జాబితాలో రెండో స్థానంలో ఉన్న భారత్ సూచించింది.
                  అలా ఇప్పటివరకు జాబితాలో ఉన్న దేశాలు వరసగా సూచించిన పేర్లనే ఒక్కో తుపానుకు పెడుతూ వచ్చారు. గతంలో భారత్‌ను వణికించిన హుద్‌హుద్ తుఫాను పేరును ఒమన్,  ఫైలిన్ తుఫాన్ పేరును థాయిలాండ్, వర్ధ నర్గిస్ పేర్లను పాకిస్తాన్ సూచించాయి.
                  ఎనిమిది దేశాలూ సూచించిన 64పేర్లలో ఇప్పటిదాకా 57 పేర్లను వాడేశారు.
                   2004లో జరిగిన సమావేశంలో భారత్ తన వంతుగా 8 పేర్లను ప్రపంచ వాతావరణ సంస్థకు సూచించింది. అవి అగ్ని, ఆకాశ్,బిజ్లి, జల్, లెహర్, మేఘ్, సాగర్, వాయు. ఈ ఎనిమిది పేర్లలో ఇప్పటి వరకు ఏడు పేర్లను ఉపయోగించగా వాయు పేరును మాత్రమే వాడాల్సి ఉంది. తుఫాన్లు సంభవించినప్పుడు ఢిల్లీలోని వాతావరణ విభాగం అధికారికంగా ఈ పేర్లను ప్రకటిస్తుంది.

------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

No comments:

Post a Comment

Address for Communication

Address card