Wednesday, January 14, 2015

యోగా.. ఇప్పుడు అందరికీ ఓ ఆరోగ్యసూచిక

ఇంటర్నెట్ పుణ్యమాని ఇంట్లో కూర్చుని ఒక్క ‘క్లిక్’ కొడితే చాలు.. కిరాణా దుకాణం, బట్టల కొట్టు, ఎలక్ట్రానిక్ గృహోపకరణాల షాపు అన్నీ మన కళ్లెదుట ప్రత్యక్షం.. ‘ఆన్‌లైన్ షాపింగ్’ అందుబాటులోకి రావడంతో మనం కాలు కదపకుండానే అన్నీ నేరుగా ఇంటికే వచ్చేస్తాయి.. ఆఫీసుకెళితే సమయం తెలియకుండా పనిలో పడిపోవడం.. ఇంటికెళ్లాక కాలక్షేపం పేరుతో గంటలకొద్దీ టీవీకి అతుక్కుపోవడం.. శరీరానికీ, మనసుకూ ఏ మాత్రం పని లేకుండా అంతా యాంత్రికంగా గడిచిపోవడం...
***
ఉదయం లేవగానే తప్పదు కనుక- కొన్ని పనుల్ని మొక్కుబడిగా ముగించడం.. బైకో, కారో ఉంటో ‘స్టార్ట్’ చేసి ఎక్కేయడం.. ‘లిఫ్ట్’లో పనిచేసే చోటకు చేరుకోవడం.. నడకను కూడా దూరం చేసుకోవడం.. అనేకానేక అనారోగ్యాలకు దగ్గర కావడం.. వినూత్న జీవనశైలితో రాజీపడిపోవడం.. ఒత్తిడి పెరిగిపోయిందని అనుక్షణం విసుగెత్తిపోవడం...
మార్కులు, ర్యాంకుల ధ్యాసలో పిల్లలు, ఇంటి బాధ్యతలతో గృహిణులు, ఆఫీసు వ్యవహారాల్లో ఉద్యోగులు.. నేటి నవ నాగరిక కాలంలో అందరిదీ ఉరుకులు,పరుగుల జీవనమే.. ఒత్తిళ్లు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక బాధలు నిత్య జీవితంలో అంతర్భాగమయ్యాయి.. ధనిక, పేద తేడా లేదు.. చిన్నా పెద్దా వ్యత్యాసం లేదు.. ఎవరిని కదిపినా కష్టాలు, కలతలే.. సాంకేతిక విజ్ఞానం విస్తరించినా, ఆధునిక సౌకర్యాలు ఎంతగా సమకూరినా అన్నీ సజావుగా సాగుతాయన్న నమ్మకం లేకుండా పోయింది... పరిపూర్ణ శారీరక, మానసిక ఆరోగ్యం ప్రశ్నార్థకం కావడంతో అనేక దుష్ఫలితాలను చవిచూడక తప్పడం లేదు.. అధిక రక్తపోటు, ఊబకాయం, మధుమేహం, మనోవైకల్యం వంటివి సర్వసాధారణమై పోయాయి..

.. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో శారీరక, మానసిక ఉత్తేజానికి ‘యోగా’ ఓ ఆశాకిరణమైంది. వ్యక్తిత్వ దీపాన్ని వెలిగించుకోవడానికి, జీవన రథాన్ని ముందుకు నడిపించడానికి, అనుబంధాలను పెంచుకుంటూ నిత్యం ఆనందం పొందడానికి ‘యోగా’ దోహద పడుతోంది. మానసికంగా సర్వోన్నత స్థితికి చేరేందుకు ‘ఆధ్యాత్మికత’ ఓ మార్గమైతే.. ఆ దారిలో గ మ్యాన్ని చేరుకోవడానికి ‘యోగా’ కూడా అవసరమే. ‘ఆధ్యాత్మిక ప్రజ్ఞ’ సాధించేందుకు సత్యసంధత, నీతి, నిజాయితీ, ఇంద్రియ నిగ్రహంతో పాటు యోగా, ధ్యానం, ప్రార్థన వంటివి ఎంతగానో సహకరిస్తాయి. వ్యాపారం, ఉద్యోగం, చదువు.. ఎందులో రాణించాలన్నా- చేసే పనిమీదే మనసంతా కేంద్రీకృతం కావాలి. ఏకాగ్రతతో విజయపథంలో పయనించాలంటే యోగా ఓ దిక్సూచిలా పనిచేస్తుంది. అందుకే- ఒత్తిళ్లను జయించే సాధనంగా నేడు దేశవిదేశాల్లో చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. యాంత్రిక జీవనంలో యోగా ఓ దివ్యౌషధంలా పనిచేస్తుందని అనేక అధ్యయనాల్లో తేలడంతో ఇపుడు అందరి దృష్టి దీనిపైనే పడింది.
‘యోగా’ చరిత్ర...
ప్రపంచానికి ‘యోగా’ను పరిచయం చేసిన ఘనత మన దేశానిదే. వేద కాలానికి పూర్వమే ‘యోగా’ భారతీయ సంస్కృతిలో అంతర్భాగమైంది. వేల సంవత్సరాల క్రితం ఇది మన దేశంలో పుట్టి అనతికాలంలోనే విశ్వవ్యాప్తమైంది. సంస్కృత పదమైన ‘యోగా’కు ‘విజ్ఞానం’ అనే అర్థం ఉందని విజ్ఞులు చెబుతారు. నాలుగు వేదాల్లో ఒకటైన రుగ్వేదంలో యోగాకు సంబంధించిన అంశాలెన్నో కనిపిస్తాయి. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన ‘్భగవద్గీత’లోనూ దీని ప్రస్తావన ఉంది. ‘యోగా’ను ఆచరించిన వాడే- కోర్కెలపై మమకారం లేకుండా కర్మలపై దృష్టి కేంద్రీకరించగలడన్నది ‘గీతా’ సారాంశం. ‘యోగా’ అన్నది మతసంబంధమైన అంశం కాదు. శారీరక, మానసిక సమస్యలను జయించి ‘ఆధ్యాత్మిక ప్రజ్ఞ’ సాధించేందుకు ఇది ఓ అద్భుత సాధనం. ఈ స్థితికి చేరుకునేందుకు యోగాలో అనేక పద్ధతులను త్రికరణ శుద్ధిగా ఆచరించాలి. వ్యాయామం, ధ్యానం, ఆసనాలు, ప్రాణాయామం వంటివి ఇందులో ప్రధానాంశాలు. మూడు రకాల ఆరోగ్యాలను చేకూర్చే శక్తి ఉన్నందునే దీనికి ఇంతటి ప్రాధాన్యం ఏర్పడింది. వ్యాయామం, ఆసనాలతో శారీరక ఆరోగ్యం, ప్రాణాయామంతో మానసిక ఆరోగ్యం, ఏకాగ్రత, ధ్యానంతో ఆధ్యాత్మిక ఆరోగ్యం సిద్ధిస్తాయి. యోగాలో కనిపించే ‘శిక్షణ, క్రమశిక్షణ’ ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటాయి.
ఎల్లలు లేనిది..
నిజానికి యోగా ఓ మహా సముద్రం లాంటిది. లోతుకు వెళ్లేకొద్దీ ఇందులో అన్నీ అద్భుతాలే. నేర్చుకున్నకొద్దీ ఇంకా ఎంతో మిగిలే ఉంటుంది. సాధకుడి శరీరంపై, మనసుపై ఇది ఎంతో ప్రభావం చూపుతుంది. యోగ శాస్త్రంలో నిగూఢమైన అంశాలను అవగతం చేసుకుంటే - ఆధునిక జీవితంలో అనేక సమస్యలకు, సవాళ్లకు సమాధానాలు లభిస్తాయి. యోగాకు సంబంధించిన ప్రతి ఫలితాన్ని శాస్ర్తియ దృక్పథంతో విశే్లషించుకుంటే దీనిపై తప్పకుండా నమ్మకం ఏర్పడుతుంది. యోగాను ఆచరిస్తే మనం ఆలోచించే పద్ధతుల్లోనే కాదు, జీవన విధానంలోనూ మార్పును గమనించవచ్చు. మానసిక రుగ్మతలతో పాటు అనేక శారీరక సమస్యలను అధిగమించేందుకు యోగా తోడ్పడుతుందని అనేక అధ్యయనాల్లో తేలింది. వెన్నునొప్పి, ఆస్తమా, కీళ్ల సమస్యలు, ఒత్తిళ్లు, జ్ఞాపకశక్తి మందగించడం వంటి అనేక సమస్యల
నుంచి విముక్తి ప్రసాదించే దివ్యశక్తి యోగాలో ఉందని ఇప్పటికే పలు పరిశోధనలు ఘోషిస్తున్నాయి.
‘ఎనిమిది మెట్ల’తో ఎంతో ఉన్నతికి..
‘యోగా’ అంటే శరీరాన్ని విల్లులా వంచడం, ముద్దలా చేసి మెలికలు తిప్పడం కాదు. ఇలాంటి విద్యలన్నీ సాధారణ వ్యాయామం కింద వస్తాయి. ‘యోగా’కు ఉన్న అర్థం ఎంతో విస్తృతమైనది. యోగా సాధనలో ఎనిమిది సోపానాలు అధిగమిస్తే శారీరక, మానసిక వికాసం పొందవచ్చు. ‘యమ’ ( అహింస, సత్యసంధత, ఇంద్రియ నిగ్రహం వంటివి), ‘నియమ’ ( తపస్సు, దైవ చింతన), ఆసన ( పలు రకాల ఆసనాలు), ప్రాణాయామం (శ్వాసను నియంత్రించడం), ధ్యానం ( ఒక లక్ష్యం మీద మనసు కేంద్రీకరించడం), ప్రత్యాహారం ( బాహ్య సంబంధ విషయాల నుంచి మనసును తప్పించడం), ధారణ ( ఒకే విషయంపై మనసు పెట్టి ఏకాగ్రతతో పనిచేయడం), సమాధి ( సాధనలో అత్యున్నత స్థితి ఇది. దీన్ని చేరాలంటే మిగతా ఏడు మెట్లనూ ఎక్కి రావాలి) ..అనే 8 సోపానాలు యోగాలో కీలకాంశాలుగా పేర్కొంటారు.
యోగా యోధులు..
ప్రపంచ ప్రఖ్యాత యోగా గురువులు ఎవరంటే మనదేశానికి చెందిన ఇద్దరి పేర్లు చెబుతారు ఎవరైనా. ఆ ఇద్దరూ కర్నాటకకు చెందినవారే. మొదటి స్థానం బికెఎస్ అయ్యంగార్‌కే దక్కింది. పతంజలి చెప్పిన యోగాకు ప్రాచుర్యం కల్పించి, తన ఆలోచనల మేరకు చిన్నచిన్న మార్పులు చేసి అందరికీ నేర్పించారు. ప్రత్యేక శిక్షణ సంస్థను నెలకొల్పారు. ప్రపంచవ్యాప్తంగా పర్యటనలు చేశారు. మైసూరు సమీపంలోని బెల్లూరులో పుట్టి చిన్నతనంలోనే తన బావ సూచనతో యోగా నేర్చుకున్నారు. జిడ్డు కృష్ణమూర్తివంటి వారితో కలిసి బోధనలు చేశారు. ఈయన చెప్పే యోగాకు ‘అయ్యంగార్ యోగా’గా కీర్తి దక్కింది. 1991లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2014లో పద్మవిభూషణ్ అవార్డులతో భారత ప్ర భుత్వం సత్కరించింది. ఆయన రాసిన పుస్తకాలు ‘లైట్ ఆన్ యోగా’, ‘లైట్ ఆన్ ప్రాణాయామ’, ‘లైట్ ఆన్ ది యోగసూత్ర ఆఫ్ పతంజలి’ వంటివి జనాదరణ పొందాయి. 90 ఏళ్ల వయసులోనూ రోజూ 3 గంటలపాటు యోగా, ఒక గంటపాటు ప్రాణాయామం చేసిన ఆయన 95 ఏళ్ల వయసులో, ఈ ఏడాది ఆగస్టు 20న పరమపదించారు. ప్రఖ్యాత యోగా గురువు రామ్‌దేవ్ బాబా యోగాశైలిని ఆయన విభేదించారు.
పట్ట్భా జాయిస్
ప్రపంచ ప్రఖ్యాత యోగా గురువుల్లో రెండోస్థానం కె.పట్ట్భా జోయిస్‌దే. సంప్రదాయ యోగాకు భిన్నంగా కొన్ని మార్పులు చేసి, జిమ్నాస్టిక్స్ తరహాలో అష్టాంగ విన్యాస యోగను ఆయన సృష్టించి బోధించారు. ఈ రంగంలో పరిశోధన, శిక్షణ కోసం కె.పట్ట్భా జోయిస్ అష్టాంగ యోగా ఇనిస్టిట్యూట్‌ను ప్రారంభించారు. మైసూరు మహారాజు కృష్ణ రాజేంద్ర వడయారు తీవ్ర అస్వస్థతకు గురైనపుడు ఎవరి చికిత్సా పనిచేయనప్పుడు తన యోగావిద్యతో ఆయనకు సంపూర్ణ ఆరోగ్యవంతునిగా చేయడంతో ఇక జోయిస్‌కు తిరుగులేకుండాపోయింది. 1916లో పుట్టిన ఆయన 93 ఏళ్ల వయసులో సహజ మరణం పొందారు. ఆయన రాసిన ‘యోగమాల‘ పుస్తకం అత్యంత ప్రజాదరణ పొందింది.
రామ్‌దేవ్ ప్రచారం..
బాబా రామ్‌దేవ్ ‘యోగా’ సృషికర్త కానప్పటికీ- ఆ విద్యకు నేడు బహుళ ప్రచారం తెచ్చిన వ్యక్తిగా ప్రఖ్యాతి పొందారు. వేల ఏళ్లకు పూర్వమే పతంజలి మహర్షి యోగా సూత్రాలను సంకలనం చేసి అనేక విషయాలను సూత్రీరించారు. ఆ తర్వాతి కాలంలోనూ ఎంతోమంది యోగులు, రుషులు యోగాను జనబాహుళ్యంలోకి తెచ్చారు. జీవనశైలి, దృక్పథం, ప్రవర్తన వంటివి శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయన్నది కాదనలేని వాస్తవం. యోగాను జనం భాషలో బోధించడం, ఆరోగ్యానికి అనుసంధానించడంలో బాబా రామ్‌దేవ్ ఇపుడు విభిన్న శైలిలో కృషి చేస్తున్నారు. ఆధునిక జీవితంలో మృగ్యమైపోతున్న ఆరోగ్య భాగ్యాన్ని తిరిగి అందించేందుకు యోగా ఓ అద్భుత సాధనమని ఆయన విస్తృత ప్రచారం చేస్తున్నారు. ప్రాణాయామంలో కొన్ని మార్పులు ప్రవేశపెట్టిన రామ్‌దేవ్ యోగాకు సంబంధించిన అనేక అంశాలపై లోతుగా అధ్యయనం చేశారు. జనం మధ్యకు వెళ్లడమే కాదు, ఆధునిక ప్రసార మాధ్యమాలను ఆయన విస్తృతంగా వినియోగించుకుంటూ దేశవిదేశాల్లో యోగాకు ఒక ‘క్రేజ్’ సంపాదించిపెట్టారు. యోగాకు సంబంధించిన అనేక పుస్తకాలు, వీడియో సీడీలే కాదు, అంతర్జాలాన్ని, టీవీ చానళ్లను ఆయన
సమర్థవంతంగా వాడుకుంటున్నారు. యోగాతో పాటు ఆయుర్వేద వైద్యానికి ఆయన విస్తృత ప్రచారం చేస్తున్నారు.
నియంత్రణ, చట్టబద్ధత ఏదీ..?
ఏ వస్తువుకైనా డిమాండ్ పెరిగితే దానికి మార్కెట్ మరింతగా విస్తరిస్తుందనే ఆర్థిక సూత్రం ‘యోగా’కు కూడా వర్తిస్తుంది. అన్ని వర్గాల వారిలో ఆసక్తి రానురానూ పెరగడంతో ‘యోగా’లో మెళకువలు నేర్పేందుకు ఎన్నో సంస్థలు తామరతంపరగా వెలుస్తున్నాయి. యోగా శిక్షకులూ అందుబాటులో ఉంటున్నారు. యోగా తరగతులు నిర్వహిస్తామంటూ ప్రసార మాధ్యమాల్లో ప్రకటనలతో హోరెత్తిస్తున్నారు. రోజూ ఉదయానే్న టీవీ చా నళ్లలో యోగా క్లాసులు ప్రసారం కావడంతో వాటిని చూసేవారే కాదు, నేర్చుకోవాలనుకునే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. మరో వైపు- తగినంత అనుభవం, అర్హతలు లేని వారు సైతం ‘యోగా టీచర్ల’ అవతారం ఎత్తుతూ దీన్ని వ్యాపార మయం చేస్తున్నారు. ‘్ఫన్ చేస్తే చాలు.. మీ ఇంటి ముంగిటకు వచ్చి ఆసనాలు, వ్యాయామం నేర్పుతాం..’ అంటూ ప్రచారం చేసుకునేవారూ రంగ ప్రవేశం చేశారు. అయితే, మిగతా చదువులకు ఉన్నట్లు యోగ విద్యకు సంబంధించి ప్రభుత్వం ఆమోదించిన సిలబస్ గానీ, ధ్రువీకరణ పత్రాలు గానీ లేకపోవడంతో మిడిమిడి జ్ఞానంతో ప్రమాదకరమైన ఆసనాలను నేర్పేవారూ పుట్టుకొస్తున్నారు. సరైన రీతిలో యోగాను అభ్యసిస్తే- ఆ పాఠాలు, క్రమశిక్షణ, ఏకాగ్రత, ఉన్నత విలువలు వంటివి జీవితంలో ఎదగడానికి తోడ్పడతాయి. యోగాకు ఉన్న డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని- ఇదో మంచి ఆదాయ మార్గంగా భావించేవారి పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి. విలువైన కాలాన్ని, ధనాన్ని వృథా చేసుకోకుండా సరైన శిక్షకుడి వద్ద తమకు అనువైన పద్ధతుల్లో దీన్ని నేర్చుకోవాలి. శిక్షకులపై అవగాహనతో పాటు ఆచితూచి నిర్ణయం తీసుకుంటేనే ఇది సాధ్యమవుతుంది. అనుభవజ్ఞులను ఆశ్రయిస్తే మనకు అవసరమైన యోగా పద్ధతులను నేర్చుకుని మంచి ఫలితాలను సాధించవచ్చు.
‘పేటెంట్’ దక్కేలా...
యోగా విద్య ఇపుడు మంచి ‘కెరీర్’గానూ రూపొందుతోంది. గనుక ప్రభుత్వమే తగినన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ విద్యాసంస్థల్లో దీన్ని ఒక కోర్సుగా ప్రవేశ పెట్టేందుకు, నిష్ణాతులైన వారిచే తగిన సిలబస్ రూపొందించేందుకు ప్రయత్నాలు జరగాలి. ఏవో కొన్ని ఆసనాలను నేర్పిన వారు యోగా గురువులు కాలేరు. సుశిక్షితులైన యోగా నిపుణులను తీర్చిదిద్దడానికి పటిష్టమైన వ్యవస్థ ఏర్పడాలి. గుర్తింపు పొందిన శిక్షకులు మాత్రమే యోగా నేర్పేలా ప్రభుత్వ నియంత్రణ, పర్యవేక్షణ ఉండాలి. అపుడు ఈ రంగంలోనూ ఉపాధి అవకాశాలు మరింతగా పెరుగుతాయి. ఈ విద్య మన దేశానికే చెందినందున అంతర్జాతీయ స్థాయిలో ‘యోగా’పై మనకు ‘పేటెంట్’ దక్కేలా కేంద్ర ప్రభుత్వం కృషి చేయాల్సి ఉంది. యోగాకు విశ్వవ్యాప్త గుర్తింపు, ఆదరణ లభించడం హర్షణీయమే అయినప్పటికీ.. ఈ విద్యపై చట్టపరంగా సర్వహక్కులూ మన దేశానికే ఉండాలి.

ఆద్యుడు పతంజలి
ఇప్పుడు అందరూ ఆరాధిస్తున్న యోగాకు ఆది గురువు పతంజలి. యోగా భారతదేశంలో పుట్టింది. యోగాను కనుగొన్నది, శాస్తబ్రద్ధం చేసినది ఆయనే. క్రీ.పూ. 200 సంవత్సరంలో ఆయన జీవించారని, శ్రీకృష్ణుని కాలానికి అటూఇటూగా జీవించారని చెబుతున్నప్పటికీ 5వేల ఏళ్లనాటికే పతంజలి యోగాను బోధించాడని అందరూ అంగీకరిస్తున్నమాట. యోగశాస్త్రం, యోగా సూత్రాలను ఆయన రచించారు. పాణిని రాసిన అష్ట్ధ్యాయికి పతంజలి భాష్యం రాశారు.
మనిషి శరీరంలో ఉండే ప్రాణశక్తికి ఉత్తేజం కలిగించడం ద్వారా కుండలినీ శక్తి ఉద్భవిస్తుందని, దానివల్ల మానసిక, శారీరక ఆరోగ్యం, బుద్ధి వికాసం కలుగుతాయని ఆయన భావించారు. అది సాధించడానికి యోగా ఉపకరిస్తుందని సూత్రీకరించారు. 195 యోగా సూత్రాలతో ఓ గ్రంథాన్ని వెలువరించారు. ఈ శాస్త్రాన్ని నాలుగు పాదాలు (సమాధి, సాధన, విభూతి, కైవల్య)గా వర్గీకరిస్తూ 26 తత్వాలు రాశారు. మొత్తంమీద యోగ శాస్త్రాన్ని 8 అంగాలుగా (యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి) వర్గీకరించారు.
ఆహారపు అలవాట్లు, శరీరస్థితి, మానసిక స్థితి, ఏకాగ్రత సాధన, భక్తి, చక్కటి శ్వాస, స్థిరచిత్తం వంటివి సాధించడం ద్వారా అలౌకిక స్థితికి చేర్చేది యోగా. దీనివల్ల నాడీవ్యవస్థ చేతనమై మానసిక, శారీరక, ఆధ్యాత్మికంగా శక్తిసంపన్నులై ఒత్తిడిని తట్టుకోగలిగి, ఆరోగ్యంగా ఉండగలిగేలా మనిషి తీర్చిదిద్దబడతాడని యోగా నిరూపించింది. మనసు, స్పృహ, చైతన్యం యోగాకు కీలకం. పతంజలి చెప్పిన సూత్రాలలో రాజయోగ, హఠయోగ విశ్వవ్యాప్తంగా ఆదరణ పొందుతున్నాయి.

యోగా డే...ప్రత్యేకత
జూన్ 21 తేదీని ‘అంతర్జాతీయ యోగా డే’గా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ వినతికి స్పందించి ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఆ తేదీనే ఎందుకు ‘యోగా డే’గా గుర్తించారో తెలుసా..? సూర్యుడి గమనం ఆధారంగా సంవత్సరంలో అత్యంత సుదీర్ఘమైన పగలు జూన్ 21నే ఉంటుంది. ఆ రోజునే యోగా డేగా గుర్తించాలని మోదీ కోరారు. సెప్టెంబర్‌లో జరిగిన ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో మోదీ ఈ ప్రతిపాదన చేశారు. ఆ తరువాత కేవలం మూడు నెలల్లో అది అమల్లోకి వచ్చింది. ఐక్యరాజ్య సమితిలో ఇంతవరకు మరే ప్రతిపాదనా ఇంత తక్కువ వ్యవధిలో కార్యరూపంలోకి రాలేదు. అలాగే ఐక్యరాజ్య సమితి ఏర్పడిన తరువాత మరే తీర్మానానికి యోగా డే తీర్మానానికి దక్కినంత మద్దతు లభించలేదు. ఈ సమితిలో 195 దేశాలుంటే ఇప్పటివరకు 177 దేశాలు యోగా డేను సమర్థించాయి. భద్రతామండలిలోని ఐదు దేశాలూ దీనికి మద్దతు తెలిపాయి. ఐక్యరాజ్య సమితి గుర్తించినందువల్ల ఏటా జూన్ 21న ఆయా దేశాల్లో యోగాపై అవగాహన సదస్సులు, ప్రచార కార్యక్రమాలు, వినూత్న కార్యక్రమాలు, పోటీలు సాధికారికంగా నిర్వహిస్తారు.
కరీనా...శిల్పా.. యోగా
శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వ్యాయామంగా యోగాను చెప్పుకోవాలి. మనిషి ఒత్తిడిని తట్టుకుని, శరీరాకృతిని మెరుగుపరుచుకుని, సంయమనంతో ప్రశాంతంగా జీవించడానికి యోగా ఉపయోగపడుతుంది. భారతదేశంలో పుట్టి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న యోగా ఇటీవలి కాలంలో జనబాహుళ్యంలోకి చొచ్చుకుపోవడానికి సినీతారలు, ఇతర సెలబ్రిటీలు, ప్రసార మాధ్యమాలు కారణం. జనంలో వచ్చిన చైతన్యమూ అందుకు తోడవుతోంది. పతంజలి మహర్షి చెప్పిన యో గాను ఆధునిక యుగానికి తగ్గట్లు మార్పులు చేర్పులు చేసుకుని ఎవరికివారు ప్రత్యేకతలతోకూడిన యోగాను అనుసరిస్తున్నారు. ప్రాణాయామం, యోగాను రోజువారీ కార్యక్రమంగా, క్రమం తప్పకుండా చేస్తూ ఈ రంగంలోనూ రాణించిన సినీతారలు ఎందరో ఉన్నారు.
బాలీవుడ్ తార కరీనాకపూర్‌కు యోగా అంటే ప్రాణం. టీవీ,సినీ వ్యాపార ప్రకటనల్లో తళుక్కున మెరిసే ఈ తార తన సౌందర్య రహస్యమంతా యోగాయే అంటోంది. ఆ మధ్య ఒళ్లు బాగా పెరిగిపోయినప్పుడు జీరోసైజ్ రావడానికి యోగాను ఆమె ఆశ్రయించి సత్ఫలితం సాధించారు. అయితే, సంప్రదాయ యోగాకు బదులు ఆమె ‘పవర్ యోగా’ను పాటిస్తారు. అంటే- ఓ గదిలో 105 డిగ్రీల ఫారన్‌హీట్ వేడి, 40 శాతం తేమతోకూడిన వాతావరణంలో ఆమె రోజూ గంటన్నర పాటు యోగా చేస్తారు. ప్రాణాయామం అందులో భాగమే. ఆరారా ఆహారం, వేడిచేసి చల్లార్చిన మంచినీళ్లు తరచూ తాగడం ఆమె హాబీలు. కరీనా యోగాపై వచ్చిన పుస్తకం ‘ఫ్రమ్ ఎక్సెల్ టు ఎక్సెస్’ మార్కెట్లో హాట్‌కేకుల్లా అమ్ముడుపోయింది.
భారతీయ సెలబ్రిటీల్లో శిలాశెట్టి కూడా యోగాలో ట్రెండ్ సెట్టరే. మెడనొప్పి, స్పాండిలైటిస్, వెన్ను సంబంధిత సమస్యలతో ఆమె ఇబ్బందిపడ్డప్పుడు యోగాను ఆశ్రయించారు. అద్భుతమైన ఫలితాలు సాధించారు. చూడముచ్చటైన శరీరాకృతి, మేని సౌందర్యం ఆమె సొంతమయ్యాయి. ఆమె విడుదల చేసిన ‘శిల్పాస్ యోగా’ అనే పుస్తకం సరికొత్త ట్రెండ్ సృష్టించింది. ప్రతీరోజు కనీసం గంటపాటు ఆమె యోగా చేస్తారు.
ఇక ప్రముఖ నటీమణులు సోనమ్‌కపూర్, లారాదత్తా కూడా యోగా అంటే ఇష్టపడేవారే. వారు చేసిన యోగాకు సంబంధించి డివిడిలు మార్కెట్లో లభిస్తున్నాయ. పిల్లల్ని కన్న తరువాత శరీరం కొన్ని మార్పులకు లోనవుతుందని, వాటినుంచి తేరుకుని మళ్లీ నాజూకుగా తయారవడానికి యోగా తోడ్పడుతుందని అంటారు లారాదత్తా. తొలికాన్పు తరువాత యోగాతో మళ్లీ నాజూకుగా తయారయ్యాయని చెబుతున్నారు. అయితే సోనమ్‌కపూర్ మాత్రం బిక్రమ్ యోగాను అనుసరిస్తారు. ఇక ప్రపంచ ప్రఖ్యాత పాప్ గాయని మడోన్నా అష్టాంగ, హఠ యోగ చేయడంలో దిట్ట. తీవ్రమైన మానసిక ఒత్తిడి నుంచి యోగాతో ఉపశమనం పొందుతున్నట్లు ఆమె చెబుతారు. హాలీవుడ్ ప్రముఖులు మెగారియాన్, జెన్నిఫర్ అనిస్టిన్ సహా లెక్కలేనంతమంది తారలు ఇప్పుడు యోగాకు దాసులయ్యారు.
..................................
‘అనారోగ్యం, పేదరికం..
ఇవే మన దేశంలో
ప్రధాన సమస్యలు. యోగాతో
అనారోగ్యాన్ని, నల్లడబ్బు
వెలికితీతతో పేదరికాన్ని
దూరం చేయవచ్చు.’
- బాబా రామ్‌దేవ్
.................................
మార్చిలో ప్రపంచ యోగా వీక్

ఉత్తరాఖండ్‌లోని రిషీకేష్‌లో ఏటా అంతర్జాతీయ యోగా వారోత్సవాలు నిర్వహిస్తారు. వేలాదిమంది యోగా అభ్యాసకులు, బోధకులు అక్కడికి వస్తారు. వచ్చే ఏడాది మార్చి 1నుండి 7వరకు ఈ వారోత్సవాలను నిర్వహించేందుకు ఇప్పటికే రంగం సిద్ధమైంది. యోగాశిక్షణ, ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు, గంగాహారతితో వేడుకలు ముగుస్తాయి. గంగానదీతీరంలో ఉండే ఏకైక యోగా శిక్షణ కేంద్రం ఇక్కడ ఉంది. దీనిని రిషీకేష్ యోగా పీఠ్ నిర్వహిస్తోంది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ వారోత్సవాలకు సహకరిస్తోంది.

No comments:

Post a Comment

Address for Communication

Address card