Thursday, November 01, 2018

మ‌ళ్లీ వాడే వ‌చ్చాడు



మొద‌ట వాడు
భ‌జ‌నప‌రుడి కోసం వ‌చ్చాడు
నేనా భ‌జ‌న‌బృందంలో లేను

త‌ర్వాత వాడు
చాడీలు చెప్పేవాడి కోసం చూశాడు
చాడీలు చెప్ప‌డం నాకు చేత‌కాదు

అనంత‌రం వాడు
త‌న‌ ప్రాంతంవాడిని వెతికాడు
నాదా ప్రాంతం కాదు

మ‌రోసారి వాడు
త‌న కుల‌పోడిని అన్వేషించాడు
నేనా కులం వాడిని కాను

ప‌ట్టువ‌ద‌ల‌ని వాడు
త‌న మ‌తం వాడి కోసం నిరీక్షించాడు
నాదా కుత్సిత మ‌తం కాదు

చివ‌రిగా వాడు
మ‌నిషి కోసం వ‌చ్చాడు
నేను మ‌నిషినే అంటే న‌మ్మ‌లేదు
భ‌జ‌న చేయ‌లేవు..
చాడీలు చేత‌కావు..
ప్రాంతం, కులం, మ‌త‌మూ
ఏదీ క‌ల‌వ‌న‌ప్పుడు
నువ్వు మ‌నిషివంటే నేనెలా
న‌మ్మాల‌ని ప్ర‌శ్నించాడు?

 (జర్మన్‌ కవి ఫాస్టర్‌ మిల్లర్‌కు క్ష‌మాప‌ణ‌ల‌తో)

No comments:

Post a Comment

Address for Communication

Address card