ఒకనాడు సాయంత్రం
ఆరింటికల్లా అమ్మాయి ఇంట్లో లేకపోతే సైకిలేసుకుని వెతకడానికి బయల్దేరే తండ్రి ఇవాళ
హాయిగా హైదరాబాద్ పంపించి మా అమ్మాయి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చేస్తోంది అని
చెప్పుకోగలుతున్నాడు. ఈ రెండు దశాబ్దాల్లో వచ్చిన మంచి మార్పు ఇది.
డిగ్రీ చదివి ఊర్లో వీధి అరుగుల మీద ప్రభుత్వం ఏం చేయట్లేదు.
ఉద్యోగాలివ్వడం లేదు అని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే ఆవారా యువబృందాలు ఇపుడు
కనిపించడం లేదు. ప్రభుత్వమే ఏకైక దిక్కు అనే భావనను బద్దలు చేయడం వల్ల వచ్చిన
పాజిటివ్ చేంజ్ ఇది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిరుద్యోగం ఇరవై యేళ్ల
క్రితం ఉన్నట్టుగా ఇపుడు కనిపించడం లేదు.
ఎమోషనల్ బాండేజ్‌కి ఫిజికల్ బాండేజ్‌కి ఉన్న
తేడాను అర్థం చేసుకోలేకనో మానవసంబంధాలపై స్పష్టత లేకనో కొందరి జీవితాలు
బుగ్గిపాలవుతున్న విషయం వాస్తవమే అయినా అది సంధిదశలో అనివార్యమైన
విషాదంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువభాగం విషాదాలు మగవాళ్లు ఇంకా
పాత మైండ్ సెట్ నుంచి రాకపోవడం వల్ల మేల్ పిగ్ ఇగో వల్ల
జరుగుతున్నవి. అందుకోసం మొత్తం పరిణామాన్ని నిందించనక్కర్లేదు.
ఇవాల్టి పట్టణ సమాజం ముసుగు అంతగా అవసరం
లేనిది. ఇన్‌ఫార్మల్‌గా ఉండే గ్రామీణ సమాజంలో మనిషిని
గుర్తించేది కులంతో డబ్బుతోనే. పట్టణాల్లో చేసే పనిని బట్టే
గుర్తింపు. పట్టణాల్లో అన్నీ ప్రదర్శన వస్తువులే. ఇల్లూ ఒళ్లూ అన్నీ.
వేసుకునే చొక్కా, నడిపే వాహనం, ఉండే ఇళ్లు, తినే హోటల్, ఆరాధించే దేవత అన్నీ ప్రదర్శనకు పెట్టుకోవాల్సిందే. ఈ ఇరవై యేళ్లలో ఇది
విపరీతంగా పెరిగింది. సమానత్వంలో సంతృప్తిని పొందే స్థితి సమాజంలో లేదు కాబట్టి
ఆధిక్యంలో సంతృప్తిని పొందడానికి అందరూ ప్రయత్నిస్తారు. అందుకు మనిషి
నిరంతరం పరుగు పెడుతూనే ఉంటాడు. ఇరవై యేళ్లలో ఈ పోటీ విపరీతంగా పెరిగింది.
మనిషి స్థానాన్ని వినియోగదారుడు ఆక్రమించినట్టుగానే మనిషి కోసం మనిషి అనే
ఆలోచనను పూర్తిగా పోగొట్టి మనిషి కి మనిషి పోటీ అనే వాతావరణాన్ని పెంచింది.
చదువుల్లో కెరీర్లో స్పష్టంగా కనిపిస్తున్న ధోరణి ఇది. ఎక్కువ జీతం పొందడమే
చదువు ఏకైక లక్ష్యంగా మారిపోవడం వల్ల మానవశాస్ర్తాలు అనాధల్లాగా
మారిన విషాదాన్ని కూడా చూస్తున్నాం. ఈ ధోరణులపై అసంతృప్తితో వచ్చిన
దిల్ చాహ్ తా హై, త్రీ ఇడియట్స్, జిందగీ దుబారా నహీ మిలేగీ వంటి
సినిమాలు సూపర్ హిట్ కావడం మన అంతరాల్లో ఉన్న కోరికలకు వాస్తవ స్థితికి మధ్య
ఉన్న తేడాను చూపిస్తుందనుకోవచ్చు. బహుశా ఇది సంధి దశ.
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
No comments:
Post a Comment