Saturday, March 29, 2014

నల్లడబ్బు చిద్విలాసాలు

నల్లడబ్బు చిద్విలాసాలపై అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహించడం అన్ని విధాల సమర్థనీయం. పన్నుల ఎగవేత, అక్రమ మార్గాల్లో సంపాదన, అప్పణంగా కొట్టేయడం, తప్పుడు లెక్కలు చూపించడం తదితర అనేక రూపాల్లో మేటలు వేసిన ఈ పాపిష్టి సొమ్ము వాస్తవానికి దేశ ప్రజలకు అందులోనూ పేద ప్రజానీకానికి చెందవలసింది. దీని పరిమాణం ఎంత అనేదానిపైనా పలు విధాల లెక్కలున్నాయి. కనీసం 25లక్షల కోట్లు వుంటుందనేది ఒక లెక్క కాగా విదేశీ బ్యాంకుల్లోనే 70 లక్షల కోట్లు వుందనేది మరో లెక్క. లెక్కలకు అందకుండా దాచిపెట్టిన సొమ్ము గురించి ఖచ్చితమైన లెక్కలు ఎలాగూ ఆశించలేము. దాని నిగ్గు తేల్చాలని సుప్రీం కోర్టు 2011లోనే ఆదేశించినా మూడేళ్ల అనంతరం ఇప్పటికి కూడా దాన్ని ప్రభుత్వాలు స్పందించడం లేదు. ఇది నిర్లక్ష్యం కాదు. యాదృచ్చికం అంతకన్నా కాదు. అసలు ఈ అక్రమ ధనం అనకొండలా పెరిగిపోవడానికి కారణమే ప్రభుత్వ విధానాలు. పాలక పక్షాలన్నీ కాంగ్రెస్‌ బిజెపి తెలుగుదేశం ఏదైనా సరే హద్దూపద్దూ లేని ఎన్నికల ఖర్చు కోసం ఇతర ఆర్భాటాలూ అట్టహాసాల కోసం ఈ అక్రమ ధన రాశులపైన కార్పొరేట్‌ సంస్థల చేయూత పైనా అధారపడతాయనేది అందరికీ తెలుసు. ఇందులో పైకి కనిపించేదే వందల కోట్లు కాగా అగుపించనిది అందుకు అనేక రెట్లు వుంటుందనేది వాస్తవం. అంతెందుకు? ఈ వారంలోనే న్యాయస్థానం ముందుకు వచ్చిన కేసులు చూస్తే చాలు ధన ప్రభావం తెలుస్తుంది. సహారాధినేత సుబ్రతో ముఖర్జీ వేల కోట్ల బకాయిల ఎగవేత కేసులో జైలుకు వెళ్లడం.. ఐపిఎల్‌ అవినీతి సామ్రాట్‌ శ్రీనివాసన్‌ను బిసిసిఐ అధ్యక్షుడుగా ఎందుకు కొనసాగిస్తున్నారని అక్షింతలు వేయడం, బొగ్గు కుంభకోణంలో మరో రెండు ఛార్జిషీట్లు దాఖలు కావడం అన్నీ ఆ కోవలోవే. అంతెందుకు? విదేశీ బ్యాంకుల్లోని రహస్య ఖాతాల్లో గుట్టలు గుట్టలుగా దొంగ సొమ్ము దాచుకున్నవారిలో అత్యధికులు భారతీయ ప్రముఖులేనని వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు జూలియస్‌ అసాంజే కూడా ప్రకటించడం తెలిసిన విషయమే. తమను కోరితే ఆ ఖాతాల వివరాలు వెల్లడిస్తామని ఆ దేశాలు చెప్పినా మన ప్రభుత్వం ముందుకు రాకపోవడం అనుమానాలు ధృవీకరించింది. హసన్‌ అలీ అనే భారతీయ వ్యాపారికి సంబంధించిన 36 వేల కోట్ల అక్రమ ధనం బయటపడిన తర్వాత డొంక కదిలిస్తే మరెన్ని పాములు బయటకు వస్తాయోనన్న భయం అక్రమాధిపతులను ఆవరించింది. ఈ కారణంగానే అత్యున్నత న్యాయస్థానం ఆదేశించినా పెడచెవిన పెట్టింది.
అవినీతి పద్ధతుల్లో సంపాదించిన సొమ్మును తమ ధనాన్ని తప్పుడు మార్గాల్లో విదేశాలకు పంపించడం, మళ్లీ తప్పుడు కంపెనీల పేర్లతో రప్పించి పెట్టుబడి రాయితీలు కూడా పొందడం సర్వసాధారణంగా మారింది. భారత్‌తో ఒప్పందాల కారణంగా పన్నులు వేయకుండా విదేశీ ధన ప్రవాహాలను అనుమతించే వాటిలో మారిషస్‌ ముఖ్యమైంది గనకే మారిషస్‌ మార్గమని దీనికి పేరొచ్చింది. సరళీకరణ విధానాల తర్వాత ఈ తరహా తరలింపులు అయిదు రెట్లు పెరిగినట్టు లెక్కలు చెబుతున్నాయి. ఇక షేర్‌ మార్కెట్లలోనూ ఇతర స్పెక్యులేటివ్‌ మార్గాలలోనూ అపార లాభాలు పొందినా దీర్ఘకాల పెట్టుబడి ఆదాయం కింద అలాగే సెక్యూరిటీ లావాదేవీల లాభాల కింద పన్నులు దాదాపు ఉండవు. దేశంలో కేవలం అరవై మందిగా ఉన్న సహస్ర కోటీశ్వరులపై లేదా సూపర్‌ రిచ్‌పై అదనపు పన్నుల మాటే వుండదు. అది కొత్త సంపదలు పెంచేస్తుంటుంది. కార్పొరేట్‌ లాభాల పైన, విదేశాలకు వాటాల తరలింపు పైన పన్నుల వేధింపు చాలా నామమాత్రం. ఇలాటి చాలా చాలా మార్గాలలో సంపదలు పోగుపోసుకున్న వారు నెమ్మదిగా వాటిని విదేశాలకు తరలించడం మొదలు పెడతారు. ఇక రాజకీయ నేతలు తప్పుడు పద్ధతులలో మూటలు కట్టుకున్నా వాటిని రహస్యంగా దాచివుంచడం తప్ప బహిరంగంగా ప్రదర్శించలేరు. ఇలాటి వాటన్నిటి కారణంగానే నల్లడబ్బు, అందులోనూ విదేశీ బ్యాంకుల్లో దాచుకున్న అక్రమ డబ్బు అంతూపంతూ లేకుండా పెరిగిపోతున్నది. చాలా కాలం తమ దగ్గర రహస్య ఖాతాలలో దాచిన సొమ్ము వివరాలు చెప్పడానికి నిరాకరించే స్విడ్జర్లాండ్‌ వైఖరి మారి అధికారికంగా అడిగితే ఇవ్వడానికి ముందుకొస్తున్నది. ప్రజాస్వామ్యం పారదర్శకత వంటి విలువలను నిజంగా విశ్వసించే ప్రభుత్వమైతే ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఆ చిట్టాలన్నీ తెప్పించి వుండేది. కాని జరిగింది అందుకు పూర్తి భిన్నం. పార్లమెంటులో అనేక సార్లు నిలదీసినా దాటవేత తప్ప సూటి సమాధానం పూజ్యమైంది. అత్యున్నత న్యాయస్థానం చెప్పినా అంతేనని ఇప్పుడు అదే ఆగ్రహించడాన్నిబట్టి అర్థమైపోయింది. కొంతమంది చెబుతున్నట్టు పన్నులు తగ్గించే అర్థక్రాంతి ఫార్ములాలు ఆచరణలో దాన్ని మరింత పెంచడానికే పనికి వస్తాయి. అయినా లెక్కలోనే చూపని వాటిపై పన్ను వేయడం వేయకపోవడం అన్న ప్రశ్నకు ఆస్కారం ఎక్కడీ
రేపు రాబోయే ప్రభుత్వాలైనా ఈ నల్లడబ్బు విశృంఖల విన్యాసాలను ఆపాలంటే పైన చెప్పిన ఖచ్చితమైన చర్యలు తీసుకోవలసి వుంటుంది. దాంతో పాటు అసలు ఎన్నికల రంగంలో ధన ప్రభావాన్ని అరికట్టడం మరింత ముఖ్యం. కార్పొరేట్‌ విరాళాల కోసం ఎగబడే పార్టీలు అక్రమార్జన అండదండలతో అధికారానికి వచ్చే పార్టీలు వాటిని అదుపు చేస్తాయనుకోవడం అవివేకం. ఉదాహరణకు అధికారికంగానే కాంగ్రెస్‌కు 193 కోట్లు, బిజెపికి 172 కోట్లు విరాళాలు ఇలాటి వారినుంచి అందినట్టు నమోదైంది. 92 శాతం కరోడ్‌పతులు కాంగ్రెస్‌కు, 85 శాతం మంది బిజెపికి ధనం సమకూర్చినట్టు వెల్లడైంది. ఈ ఏడాది కూడా 14 కార్పొరేట్‌ కంపెనీలు ఈ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకై ట్రస్టులు ఏర్పాటు చేశారన్నది సమాచారం. ఇలా విరాళాలిచ్చిన వారిలో 300 దాతలు తమ ఆదాయపన్ను పాన్‌ నెంబరు ఇవ్వడానికి నిరాకరించారంటే సంగతి అర్థమవుతుంది. గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలు ఏరిన చందంగా ఇలాటి పార్టీలు నల్లడబ్బును అరికడతాయనుకోవడం భ్రమ. ప్రజా ఉద్యమాల ఒత్తిడి పెరిగి ప్రభుత్వాల స్వభావాన్నే మార్చగలిగితే తప్ప ఆ పాపపు కొండలు కదలవు, కరగవు.

No comments:

Post a Comment

Address for Communication

Address card