Pages

Sunday, October 27, 2019

గుండెల్లో దీపావళి

నరక చతుర్దశినాటి రాత్రికి ‘కాలరాత్రి’ అని పేరు. కాలుడంటే యముడు. కాలరాత్రిని దీపరాత్రిగా మలచుకోవడంలోనే భారతీయ జ్ఞానసంపద ఇమిడి ఉంది. ‘నింగి లోతును చూడగోరితె- నీటిచుక్కను కలుసుకో... మనిషి మూలం చూడగోరితె మట్టిబెడ్డను కలుసుకో’ అన్నారు సినారె. అంతరార్థాలను అన్వేషిస్తేనే పండుగ పరమార్థాలు పరిచయం అవుతాయి. నరకాసుర వధకు, దీపావళి కథకు ఎలాంటి బంధుత్వం లేదు. ఆశ్వయుజ బహుళ చతుర్దశిని దీపరాత్రిగా జరుపుకోవడం ద్వాపరానికి ముందే ఉంది. దరిమిలా అదేరోజు నరకాసుర సంహారం జరగడంతో అది నరక చతుర్దశిగా ప్రసిద్ధికెక్కింది. నిజానికి వాడు చనిపోలేదు. ‘నరకుడనువాడు ఎక్కడో నక్కి లేడు, మనసులో చిమ్మచీకటి మసలు చోట వానికున్నది- ఉనికి’ అన్నారు కవులు. ఆ కటిక చీకటికి జ్ఞానజ్యోతి ఒక్కటే విరుగుడు. దీపావళి పేరుతో మనం వెలిగించే దీపాలన్నీ దానికి ప్రతీకలు. ‘నరకాన్నుంచి మన పితృదేవతలు స్వర్గానికి పోయేదారిలో వెలుగులు పంచే దివిటీలే ఈ దీపాలు’ అంది వామనపురాణం. దీపావళి చుట్టూ ఇలా ఎన్నో ఆలోచనలు, మనోభావాలు అల్లుకుని ఉన్నాయి కనుకనే ‘కొన్ని దైవత శుభ కరుణోన్నతములు, రక్తసంబంధ వాత్సల్య ప్రభలు కొన్ని... కలిసి దివ్వెలై మా యింట కొలువుదీరె’ అన్నారు బులుసు వేంకటేశ్వర్లు కవి. పిల్లలకు, పెద్దలకు తలోరకంగా దగ్గరై ‘శీతనగము నుండి సేతు పర్యంతము’ అందరికీ దీపావళి ఇష్టమైన పండుగగా స్థిరపడింది. ‘ఒక్కరాత్రి ఉబుకు ఉత్సవమ్ము’గా సంబరాలకు నోచుకుంటోంది. సాయంసంధ్యలో చక్కగా దీపాలు పెడుతూ ఒక్కక్షణం ‘ధ్వనికాలుష్యం మనిషి గుండెలో మంటలు రేపితె పండగా? విషపూరితమౌ రసాయనాలతో గగనం నిండితె పండగా?’ అని ఆలోచించగలిగితే- ఆ దీపకాంతులు మన లోపలికీ ప్రసరిస్తాయి!
(27.10.2019 ఈనాడు సంపాదకీయం లొ కొంత భాగం)
 

No comments:

Post a Comment