Pages

Thursday, April 25, 2019

చూపుల చురకత్తులని నాపైకి వదలకు

చూపుల చురకత్తులని నాపైకి వదలకు
****************


అయ్యో ఆది మానవుడా ! అలా చూడకు
చూపుల చురకత్తులని నాపైకి వదలకు
కొండ గుహలలో కోతుల సరసన దాగిన నీవు
నగ్నంగా నలుదిశల సంచరించి పొట్ట నింపుకున్న నీవు


నీకు నాకు మధ్యన ఎన్ని వేల వేల ఏండ్లు
నా స్వప్న లోకంలోకొచ్చి వికటాట్టహాసం చేయకు
మేము అనాగారికులమని పదే పదే వాదించకు
చూపుల చురకత్తులని నాపైకి వదలకు

పైవాడి మురికి నీరు, మురుగు నీరు వడకట్టి త్రాగుతాం
ప్రతిగా మా మురికి దిగువ వాడికి సరఫరా చేస్తాం
నీరు జీవులకు ప్రాణా ధారమని మాకు తెలుసు
కర్మా గార విసర్జిత వ్యర్ధము హాని కరమని తెలుసు

ఓజోను పొర లెగిరి పోయి ఉష్ణ తాపం పెరుగుతోంది
మాకు భయపడి ఆక్సిజన్ అడవుల్లోకి పారిపోయింది
అయిన మా పరుగు ఆగదు, మా వేగం తగ్గదు
పచ్చి మాంసం తిని బతికినోడా! నీవా మము పరిహసించేది ?

మంచి చెప్పేవారంటే మాకు మహా చెడ్డ చిరాకు
యేసునే సిలువ వేసిన మము చూసి సింహాలు దడుస్తాయి
నల్లమల పారి పోయిన నాగుల నడుగు మా సంగతి
రాలి పోతున్న రాబందుల నడుగు, ఎక్కడయినా కనపడితే పిచుక నడుగు

అయినా నమ్మకం కుదరక పోతే మా కన్న బిడ్డల నడుగు
నాలుగేళ్ళకే నడుము వంగేలా పుస్తకాలు మోయిస్తాం
వాళ్ళ చూపులు మసక బారేలా చదివిస్తాం
వాళ్ళు చచ్చి గీపెట్టినా వయసులో పెళ్ళిళ్ళు చేయం

అయినా నీకు నమ్మకం కుదరక పోతే ఆఖరుగా
నా దేహం లోని విడి భాగాలనడుగు నా సంగతి
ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేక నిర్జీవంగా పడియున్న
పాంక్రియాస్ నడుగు, సగం చచ్చిన కిడ్నీ నడుగు

కీళ్ళ నడుగు, మోకాలి చిప్పలనడుగు, మెడ నొప్పి నడుగు
పెరిగి పోతున్న నా వంటి బరువు నడుగు
తరిగి పోతున్న శ్రుంగార కోరికలనడుగు
చూపుల చురకత్తులని నాపైకి వదలకు

గుండెలో పోటుపుడుతున్నా కనికరం చూపని జాతి నాది
సంపాదనే మా లక్ష్యం , మా గమ్యం , మా నాగరికత.

అయ్యో ఆది మానవుడా ! అలా చూడకు
చూపుల చురకత్తులని నాపైకి వదలకు

No comments:

Post a Comment