Pages

Thursday, December 06, 2018

498ఏ నిజంగా దుర్వినియోగం అవుతుందా?




నాలుగు గోడల మధ్య స్త్రీల మీద హింస అనేది ఒక కఠిన వాస్తవం. భారత దేశంలో వరకట్న వేధింపులు ఈ హింసకు ఒక ప్రధాన కారణం. దానిని నివారించటానికి రూపకల్పన చేసిన చట్టం 498 ఏ. వరకట్నపు ప్రసక్తి లేని గృహహింసకు కూడా ఈ సెక్షను వర్తిస్తుంది. ఎన్నో ఏళ్ళుగా గృహహింస అనుభవిస్తున్న మహిళలు 498ఏలో మొదటి భాగాన్ని ఉపయోగించుకొని కేసు పెట్టుకోవచ్చు. కానీ 498ఏ ప్రస్థానం వరకట్న వ్యతిరేక ఉద్యమాలనుండి ప్రారంభం అవటం వలన కోర్టులు కానీ పోలీసులు కానీ వరకట్న ఆరోపణలు లేకుడా ఈ కేసులను ముట్టుకోవటం లేదని సీనియర్ న్యాయవాదులు అంటున్నారు. గతి లేని పరిస్థితుల్లో వరకట్నానికి సంబంధించిన కొన్ని వాక్యాలైనా జత పరచాల్సి వస్తుంది. అయితే ఈ తప్పు కంప్లైంట్ చేసిన వారిదా? లేక తప్పుడు సూచనలు, సలహాలు ఇస్తున్న పోలీసులు, లాయర్లదా? లేదా చట్టం స్వభావంలోనే లోపం ఉందా? అనే విషయం తరచి చూడాలి. అవినీతి, తప్పుడు విచారణలు, కేసు పడిన భర్త మీద సానుభూతి .. ఇవన్నీ యాంత్రిక తీర్పులకు దారి తీస్తున్నాయి. వరకట్న చట్టాలు దుర్వినియోగమవుతున్నాయిఅనే వ్యంగ్య పూరిత ప్రచారం వెనుక ఈ చట్టాన్ని పటిష్ట పరిచి పకడ్బందీగా అమలు పరచాలనే కర్తవ్యం మరుగున పడుతుంది.

భర్త నుండి డబ్బు గుంజటానికే ఈ కేసులు పెడుతున్నారని ఈ సెక్షను మీద ఇంకో ఆరోపణ. ఎందుకంటే ఎక్కువ కేసులు డబ్బు తీసుకొని సెటిల్ అవుతున్నాయి కాబట్టి. మెజారిటీ 498 కేసులు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకొని రాజీ పడుతున్నపుడు అది న్యాయమే అవుతుంది. ఆ డబ్బుతో ఆమె కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చు. కోర్టులు కూడా ఎప్పటి కప్పుడు ఈ విషయంలో నిర్దేశిక సూత్రాలు చెబుతూ ఆ సౌకర్యం కలిగిస్తున్నాయి. హింసాయుతమైన వైవాహిక జీవితంలో చిక్కుకొన్న యువతికి భర్తకు శిక్ష పడటం ఉపశమనం కలిగించదు. కొంత డబ్బు భద్రతతో గౌరవనీయమైన నిష్క్రమణ ఆమెకు అవసరం. ఈ రాజీల వలన వచ్చే డబ్బు ఆమె అప్పటికే దావా వేసిన మనోవర్తికి బదులుగా (ఇంకా చెప్పాలంటే చాలా తక్కువగా) ఇస్తున్నారని అర్ధం చేసుకోవాలి.


ఈ చట్టం చదువుకొన్న, ధనిక, మధ్య తరగతి, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన మహిళలకు మాత్రమే ఉపయోగపడుతుందని, వారు ఈ చట్టాన్ని దుర్వినియోగ పరుస్తున్నారని ఇంకొందరు అంటున్నారు. ఏక్తా గ్రూపు సర్వే ప్రకారం ఈ కేసుల కోసం పోలీసు స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నవారు భర్తల మీద ఆధారపడి పడిన నిర్భాగ్యులయిన స్త్రీలు. చదువుకొన్న,ధనిక స్త్రీలు పరిహారం కోసం నేరుగా కోర్టులను ఆశ్రయిస్తున్నారు.

ఏటా ఐదు కోట్ల మహిళలు గృహహింస పాలు అవుతుంటే రెండు లక్షల కేసులు మాత్రమే ఈ సెక్షను క్రింద్ర నమోదు అవుతున్నాయి. యాభైవేల అరెస్టులు మాత్రమే జరుగుతున్నాయి. పదిహేను శాతం కేసుల్లోనే శిక్షలు ఖరారు అవుతున్నాయి. తక్కువ శిక్షలు పడటానికి కారణం దొంగ కేసులు నమోదు అవటమేనని కోర్టులు అంటుంటే , స్త్రీలకు కోర్టుల్లో న్యాయం జరగటం లేదని మహిళాసంఘాలు ఆరోపిస్తున్నాయి.

------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

No comments:

Post a Comment