Pages

Friday, July 28, 2017

నేరం, నల్లధనం నీడగా వెంటాడుతున్న ఈ ‘అవ్యవస్థను’ ఇంకా ఎంతకాలం భరించాలని



 

          'తీసుకురాదలచిన మార్పు అవసరమైనదీ, సమంజసమైనదీ అయినప్పుడు దాన్ని ఆచరణ సాధ్యం చేసేందుకు రాజకీయ మద్దతు కూడగట్టుకోవడం తప్పనిసరి' అన్నది కార్ల్‌ మార్క్స్‌ వ్యాఖ్య.

               వ్యవస్థలు పట్టుతప్పి, అసమానతలే ప్రబలంగా మారిన భారతీయ సమాజంలో మార్పు అనివార్యంగా కనిపిస్తోంది. దేశ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చి, ప్రజల జీవితాల్లో సానుకూల విప్లవం తీసుకురాగల 'అర్థక్రాంతి' ఆలోచన ఈ అనివార్యతలనుంచే ఆవిర్భవించింది. పన్ను చెల్లింపుదారులు జారిపోతున్నారని బాధపడటంకన్నా- ఆదాయం వెల్లడించడానికి సిద్ధపడని వర్గం ఎందుకింతలా పెరుగుతోందన్న దానిపై ప్రభుత్వం దృష్టిపెట్టడం సరైన పని.
                         అధిక విలువగల కరెన్సీ నోట్ల ప్రవాహానికి అడ్డుకట్టవేసి లావాదేవీలన్నింటినీ బ్యాంకుల ద్వారానే నిర్వహించాలన్నది ఈ సిద్ధాంతంలోని మూల సూత్రం. తమ బ్యాంకు ఖాతాల్లో డబ్బు స్వీకరించే ప్రతి ఒక్కరినుంచీ, ప్రతి లావాదేవీకీ రెండు శాతం చొప్పున బ్యాంకు లావాదేవీల పన్ను(బీటీటీ) వసూలు చేయడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. లెక్కకు మిక్కిలి పన్నులు, మేధావులకు తప్ప అంతుపట్టని నిబంధనల స్థానే ఎలాంటి గందరగోళమూ లేని ఈ విధానాన్ని అమల్లోకి తీసుకువస్తే దేశ ఆర్థిక వ్యవస్థ స్వరూప స్వభావాలు ఆసాంతం మారిపోయే అవకాశాలు పుష్కలం. దేశంలో ప్రస్తుతం 20శాతం ప్రజలు మాత్రమే బ్యాంకుల ద్వారా కార్యకలాపాలు సాగిస్తున్నారు. వారి ద్వారా జరుగుతున్న లావాదేవీల మొత్తం విలువ రోజుకు రూ.2.7లక్షల కోట్లు. సెలవు దినాలను మినహాయించి బ్యాంకులు సగటున ఏడాదికి 300రోజులు పనిచేస్తాయనుకుంటే- సంవత్సరానికి 800లక్షల కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయన్నమాట. ఆ ప్రాతిపదికన ప్రతి లావాదేవీపైనా రెండు శాతం బీటీటీ విధిస్తే ఏడాదికి ప్రభుత్వానికి సమకూరే మొత్తం రూ.15లక్షల కోట్లకు పైమాటే ఉంటుంది. సవాలక్ష పన్నులతో సామాన్యుల నడ్డివిరుస్తూ సర్కారు ఏడాది కాలంలో సమకూర్చుకుంటున్న సుమారు రూ.11.5లక్షల కోట్ల ఆదాయంతో పోలిస్తే అర్థక్రాంతి విధానం ద్వారా ప్రభుత్వ ఖజానాకు జమపడే మొత్తం ఎక్కువే. దేశంలోని మారుమూల ప్రాంతాలకూ బ్యాంకింగ్‌ సేవలను విస్తరించి మిగిలిన 80శాతం ప్రజలనూ బ్యాంకు లావాదేవీల పరిధిలోకి తీసుకువస్తే- బీటీటీ రూపంలో ఏటా రూ.40లక్షల కోట్లు సమకూరుతుందని స్వయంగా భాజపా అగ్ర నాయకత్వమే ప్రకటిస్తోంది. అయినదానికీ కానిదానికీ పన్నులు చెల్లించే ఈ దురవస్థను పరిమార్చడంతోపాటు; నల్లధనాన్నీ, అవినీతినీ చావుదెబ్బకొట్టే 'అర్థక్రాంతి' ప్రతిపాదన దేశానికి దివ్య ఔషధం వంటిది.
                        ------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

No comments:

Post a Comment