Pages

Saturday, February 25, 2017

సద్గ్రంధాలకు బదులు మనకు మిగిలేది దుర్గంధాలే




                        స్వచ్ఛమైన పాలు ఒక పాత్రలో వున్నాయనుకొందాము. ఒకడు ఆ పాలను చూస్తూనే అన్నీ త్రాగేయాలనుకొన్నాడు.అంతలో ఎవరో పిలిస్తే అటు వెళ్లి కాసేపు గడిపినాడు. వచ్చి త్రాగుదామనుకొంటే అంతలో అతని అర్ధాంగి పిలిచి పెరటిలోని కరివేపాకు వెంటనే కోసి ఇవ్వమనింది. ఇచ్చి వచ్చేసరికి కాస్త ఆలస్యమైనది. అంతలో ఇంటికి ఎవరో అతి ముఖ్యమైన అతిథులు వచ్చినారు. వారితో కూర్చొని మాట్లాడకుంటే బాగుండదని కూర్చున్నాడు. ఆటంకాలన్నీతొలగించుకొని వచ్చి చూస్తే దానిలో ఈగ పడి వుంది. దానిని తీసివేసి కాచమన్నాడు భార్యను. ఆమె కాచితే అవి విరిగి పోయినాయి.

                             ఇది ఇప్పటి మన తెలుగు పరిస్థితి. పాలు తెలుగైతే ఈగ ఇంగ్లీషు. ఆ వ్యక్తి మన తండ్రి తరము వారికి ప్రతీక అని ఉహించుకొంటే వివిధములైన ఆలస్యములు వారి జీవితములో ఏర్పడిన అడ్డంకులు. ఆ తరములో కొన్ని అత్యంత అవసరాలకు కూడా సరిపడ డబ్బు వుండేది కాదు. కావున ఉద్యోగమ కొరకు చదువుకొన వలసి వచ్చింది. చదువు ముగియగానే ఉద్యోగము. ఉద్యోగమూ పెద్దదైతే పదవీ వ్యామోహము చిన్నదైతే అలవి మాలిన శ్రమ. ఇక ఇంటికివస్తే మనకు ఇష్టమైనవి చదివే తీరుబాటేదీ. ఇంతలో నవలలు ఒకప్రక్క, డిటెక్టివ్ నవలు ఇంకొకప్రక్క ,శృంగార సాహిత్యమనుపేరుతో అసభ్య అసహ్య అశ్లీల అవాంఛిత నవలలు, మాసపత్రికలొకప్రక్క, ప్రొద్దు పుచ్చుటకు సినిమాలొకప్రక్క, ఇక గ్రంథములు చదువుటకు వేసలుబాటేదీ!
                            ఒక అదృష్టమేమిటియంటే ఉత్సాహమున్న వారికి చెప్పేవారు ఆ కాలములో దొరికేవారు. ఇప్పుడు చెప్పేవారూ వినే వారూ కూడా కను మరుగే.

ప్రతి వూరిలో సాయంకాలము 8 గంటల తరువాత హరికథో పురాణ పఠణమో అవధానమో (అవధానము,కవి సమ్మెళనము సా. 5 గం. లకు మొదలయ్యేది.) కవి సమ్మేళనమో ఉండేవి. వినేవారు కూడా అందులోని మధురిమలను ఆస్వాదించే వారు. ఈప్పుడు వారూ లేరు వీరూ లేరు. అన్నింటికీ మించి ధన పిశాచి మన నెత్తిపై తాండవమాడుతూవుంది. పిల్లల వద్ద వుండేది ఆయా (లేక పనిమనిషి). వారిలో సంస్కారము మాయ. ఇవి ‘స్పీకింగ్లీష్’ ‘వాకింగ్లీష్’ ‘ఈటింగ్లీష్’  రోజులాయె. దీనికి తోడు పిల్లలకు ‘వెబ్బు’ లో దొరికే ‘గబ్బు’ మీద మోజెక్కు వాయె. ఆ కాలము వారి సంతానమునకే తెలుగు భాష అంతంత. ఇక వారి పిల్లల కెంతెంత.

                    ఇదికాక కొందరు మహా పండితులమనుకొన్నవారు మన మానాన మననుండనీక వ్యావహారిక భాష అంటూ ఇప్పుడు మనము వాడే తెలుగును ప్రభుత్వమును ఒప్పించి పుస్తకములలో జొప్పించి మనల నొప్పించు చున్నారు.

భాష వుంటే గ్రంధాలుంటాయి. గ్రంధాలుంటే సంస్కృతి నిలుస్తుంది. సంస్కృతి నిలిస్తే మనకు తెలుగు వారిగా గుర్తింపు వుంటుంది.

లేకుంటే సద్గ్రంధాలకు బదులు మనకు మిగిలేది దుర్గంధాలే !
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

No comments:

Post a Comment