Pages

Saturday, January 21, 2017

ఎన్నికల నాటకంలో నిలబడగలిగేది ఎవరు ? గెలిచేది ఎవరు? పాలకులెవ్వరు,పాలితులెవ్వరు?



ఎన్నికల నాటకంలో నిలబడగలిగేది ఎవరు ? గెలిచేది ఎవరు? పాలకులెవ్వరు,పాలితులెవ్వరు?
(ఇంతకుముందు పోస్టుకి కొనసాగింపు---2)

                అలాగే గతంలో ఒక పద్ధతిగా ఎన్నికలు జరిగేవి అని ఎవరన్నా చెబితే అవి బూర్జువా(ధనిక) నీతికి లోబడి జరిగినవే తప్ప ప్రజా నీతికి లోబడి జరిగినవి కాదు. అనగా ప్రజలకు అచ్చంగా (absolute) మేలు చేసే ఎన్నికలు ఈ దేశంలోనే కాదు, మరే దేశంలోనూ జరగలేదు, జరగవు కూడా. ఎందుకని? ఎందుకంటే ప్రజాప్రాతినిధ్య ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని అమలు చేయడానికి అనడమే ఒక మోసం. ఎన్నికల గురించి మన చట్టాల్లోనూ, రాజ్యాంగంలోనూ రాసుకున్నవి ఏవీ అమలులో లేవు. ఎవన్నా అమలులో ఉంటే అవన్నీ ధనిక వర్గాలకు మేలు చేసేవే తప్ప ప్రజలకు మేలు చేసేవి కావు. గత సమాజాలైన భూస్వామ్య, రాచరిక సమాజాలలో ఎవరైతే రాజ్యాలు ఏలేరో, ఎవరైతే భూముల్ని తమ గుత్త స్వామ్యంలో ఉంచుకున్నారో వారే నేడు ఎన్నికల వ్యవస్ధను నిర్వహించే నాయకులు. గతంలో వారిని రాజులు, సేనాధిపతులు, ఆస్ధాన పండితులు, భూస్వాములు, జమీందారులు, జాగీర్దారులుఇత్యాది పేర్లతో పిలిచాము. ఇప్పుడు వారిని ఎం.ఎల్.ఏ, ఎం.ఎల్.సి, ఎం.పి, మంత్రులు, కార్పొరేషన్ ఛైర్మన్, మేయర్ఇత్యాది పేర్లతో పిలుస్తున్నాము. పేర్లు మారాయి, రూపాలు మారాయి, కానీ పెత్తనమూ, దోపిడీలు అలాగే కొనసాగుతున్నాయి.
 
                     గతంలో ఎన్నికలు అనే నాటకం లేకుండా అచ్చమైన పెత్తనం చెలాయిస్తే ఇప్పుడు ఎన్నికల నాటకాన్ని ప్రవేశపెట్టారు. ఈ ఒక్క నాటకమే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామన్న భ్రమల్ని కలుగజేస్తోంది. ఈ ఎన్నికల నాటకంలో నిలబడగలిగేది ఎవరు? ఎవరన్నా ఆసక్తి ఉన్న ఒక కింది తరగతి వ్యక్తి చదువుకుని, విజ్ఞానం సంపాదించి ఎన్నికల్లో పోటీ చేయాలంటే చేయగలడా? ఎన్నాకల్లో పోటీకి ఎంతో డబ్బు కావాలి. ఆ డబ్బు ధనికుల వద్ద పేరుకుపోయి ఉంది. కాబట్టి ఆ వ్యక్తి ధనిక స్పాన్సరర్లను వెతుక్కోవాలి. అనగా కార్పొరేట్ కంపెనీలనో, వ్యాపార వర్గాలనో మద్దతు పెట్టుకుని వారి డబ్బుతో ఎన్నికల్లో గెలవాలి. అలా గెలిచాక ఆ వ్యక్తి తనను స్పాన్సర్ చేసిన ధనిక వర్గాల ప్రయోజనాలకు భిన్నంగా, ప్రజలకు అనుకూలంగా వ్యవహరించగలడా?
                  ఒకవేళ ఒకరూ ఇద్దరూ పొరబాటున గెలిస్తే ఏమవుతుందో ఢిల్లీ ఎన్నికలు చూపాయి. పార్టీకి నిధులు ఇస్తున్నది కూడా కార్పొరేట్ కంపెనీలే. తాము ఆశ్రిత పెట్టుబడికి వ్యతిరేకమే గానీ పెట్టుబడికి వ్యతిరేకం కాదని స్వయంగా అరవింద్ కేజ్రీవాలే ప్రకటించిన సంగతి మరువరాదు.
                 కాబట్టి మనం చూస్తున్న ఈ సో కాల్డ్ ప్రజాస్వామిక ఎన్నికల్లో నిజానికి ప్రజాస్వామ్యం లేనే లేదు. దేశంలోని ప్రతి ఒక్క సహజ సంపదా ప్రతి ఒక్క పౌరుడు వినియోగించుకునేలా  అందుబాటులోకి రావడమే నిజమైన ప్రజాస్వామ్యం. అలాంటి ప్రజాస్వామ్యాన్ని ఈ ఎన్నికలు ఇవ్వలేవు.

                  ఎన్నికల వల్ల రాచరిక, భూస్వామ్య వ్యవస్ధలలో లేని స్వేచ్ఛ ఒకటి వచ్చిందన్నది నిజమే. గతంలో ఒక రాజవంశమే, ఒక జమీందారీ వంశమే పెత్తనం చేసేది. ఇప్పుడు జనానికి సదరు రాజుల్ని మార్చుకునే స్వేచ్ఛ వచ్చింది తప్ప అసలు రాజులే కేకుండా చేసుకోగల స్వేచ్చ రాలేదు. అనగా ఒక రెడ్డి రాజుగారు ఓడిపోతే మరో చౌదరి రాజుగారు పెత్తనంలోకి వస్తారు. చౌదరి, రెడ్డి రాజులు కాకపోతే మరో దళిత రాజుగారు (ఉత్తర ప్రదేశ్) పరిపాలన చేస్తారు. ఎన్నిసార్లు ఎన్నికలు జరిపినా ఆ ధనికుల పెత్తనానికే. ప్రజలు తమపైన తామే పెత్తనం చేయగల అవకాశం ఈ ఎన్నికల వ్యవస్ధలో లేదు.
(ఇంకావుంది.....పని వత్తిడి వల్ల, పోస్ట్ నిడివి వల్ల మొత్తం ఒక్క సారే వ్రాయలేకపోతున్నాను. ఇంట్రస్టు వుంటే తర్వాత పోస్టు కోసం చూడండి) ------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

No comments:

Post a Comment